Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-6

[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]

రంగుల ప్రపంచం:

ఆ రోజు ఆదివారం ఉదయం. మూడో తరగతిలోకి కొత్తగా అడుగుపెట్టిన ప్రద్యుమ్నకు ఆ రోజు చాలా ఆనందంగా ఉంది. అమ్మ రేణు, నాన్న మాధవ్ అతన్ని గండిపేట్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

“గండిపేట్‌లో ఏముంటుంది నాన్నా?” అని అడిగాడు ప్రద్యుమ్న.

“పెద్ద నీటి చెరువు ఉంటుంది. చుట్టూ అందమైన పచ్చని ప్రదేశాలు, పార్కులు కూడా ఉంటాయి” అన్నాడు మాధవ్

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ముగ్గురూ బయలుదేరారు.

అప్పుడే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని వానచినుకులు కూడా పడ్డాయి.

“అమ్మా.. పెద్ద వాన పడితే మన ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందా?” అని కాస్త దిగులుగా అడిగాడు ప్రద్యుమ్న.

“చూద్దాం రా. వాన ఏం చేస్తుందో, ఎలా ఉంటుందో!” అంటూ నవ్వింది రేణు.

అదృష్టవశాత్తూ వాన పెద్దగా పడలేదు. కొన్ని చినుకులు పడి ఆగిపోయాయి. గాలి చల్లగా వీచింది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా మారింది.

గండిపేట్ చేరగానే పెద్ద నీటి చెరువు కనిపించింది. పార్కులో పిల్లలు పరుగులు తీస్తున్నారు. కొందరు ఆటలు ఆడుతున్నారు. కొందరు సైకిళ్లు తొక్కుతున్నారు. ప్రద్యుమ్న ఆనందానికి అవధులు లేకపోయాయి.

“అమ్మా! నేను కూడా వాళ్లతో ఆడుకుంటాను” అని చెప్పి, రేణు సమాధానం చెప్పేలోపే పిల్లల మధ్యకు పరుగెత్తాడు.

కొంతసేపటికి..

“ప్రద్యుమ్నా! ఇటు రా” అని మాధవ్ గట్టిగా పిలిచాడు.

“ఏమిటి నాన్నా?” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చాడు ప్రద్యుమ్న.

“ఆటలు కాసేపు ఆపు. అటు ఆకాశం వైపు చూడు”

ప్రద్యుమ్న తల పైకెత్తి చూసాడు.

అతని కళ్లలో ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలు.

“అబ్బా! ఎంత బాగుంది”

ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనుస్సు మెరిసిపోతోంది.

“దాన్నే హరివిల్లు అంటారు. ఇంద్రధనుస్సు అని కూడా అంటారు” అంది రేణు.

“నాకు తెలుసు అమ్మా! మా పుస్తకంలో చూశాను. ఇంగ్లీషులో Rainbow అంటారు. కానీ.. పుస్తకంలో చూసినదానికంటే ఆకాశంలో చూస్తుంటే ఇంకా బాగుంది”

“ఎన్ని రంగులు కనిపిస్తున్నాయి?” అని అడిగింది అమ్మ.

ప్రద్యుమ్న కొద్దిసేపు ఆలోచించాడు.

“నువ్వే చెప్పమ్మా”

రేణు మెల్లగా చెప్పింది.“ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నీలిమ, ఊదా”

“అంటే ఏడు రంగులన్నమాట” అన్నాడు ప్రద్యుమ్న.

“అవును. ఈ ఏడు రంగుల మొదటి అక్షరాలతో VIBGYOR అని కూడా అంటారు” అంది రేణు.

ప్రద్యుమ్న ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు.

“ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది” అన్నాడు ప్రద్యుమ్న.

మాధవ్ నవ్వాడు.

“అలా ఉండదు నాన్నా. వాన పడిన తర్వాత గాలిలో ఉండే నీటి బిందువుల మీద సూర్యకాంతి పడినప్పుడు ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. కొంతసేపటికి అది మాయమైపోతుంది”

“అంటే సూర్యకాంతిలో ఇన్ని రంగులు దాగి ఉంటాయా?” అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రద్యుమ్న.

“అవును” అంది రేణు.

“మరి అన్నీ కలిస్తే?”

“తెల్లని కాంతి” అన్నారు అమ్మా నాన్నా ఇద్దరూ ఒకేసారి.

ప్రద్యుమ్న నవ్వాడు.

“అంటే తెలుపులో ఇన్ని రంగులు దొంగతనంగా దాక్కుని ఉంటాయన్నమాట”

“అదే ప్రకృతి అందం” అన్నాడు మాధవ్. ప్రద్యుమ్న కాసేపు ఆలోచించాడు.

“రేపు స్కూల్లో మా డ్రాయింగ్ టీచర్‌కు చెబుతాను. నా దగ్గర కలర్ పెన్సిల్స్ ఉన్నాయి కదా! ఆకాశం దించి, అందులో ఇంద్రధనుస్సు కూడా వేస్తాను”

“చాలా బాగుంటుంది” అంది రేణు.

“అమ్మా, ఇంకా ఈ రంగులు ఎక్కడెక్కడ కనిపిస్తాయి?”

“నువ్వే చెప్పు” అన్నాడు మాధవ్.

“పూలలో! రంగురంగుల పూలు ఉంటాయి. బట్టల్లో ఉంటాయి. బొమ్మల్లో ఉంటాయి. మన పుస్తకాల్లో ఉంటాయి.. ఇంకా చాలా చోట్ల” అతను ఒక్కసారిగా ఆగిపోయాడు.

“అమ్మా.. నాన్నా.. మనుషుల్లో కూడా రంగులు ఉన్నాయి”

రేణు, మాధవ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

“ఎక్కడ?” అని ఆసక్తిగా అడిగారు.

“మహేష్ అంకుల్ తెల్ల కోటు వేసుకుంటారు. ఆయన డాక్టర్ కదా”

“స్వామి మామ నల్ల కోటు వేసుకుంటారు. ఆయన అడ్వకేట్ కదా”

“మన సుధాకర్ రెడ్డి అంకుల్ ఖాకీ డ్రెస్ వేసుకుంటారు. ఆయన పోలీస్ కదా”

అంతే! రేణు, మాధవ్ ఇద్దరూ పెద్దగా నవ్వారు.

“అంతే కాదు” అంది రేణు. “నీ స్కూల్ యూనిఫాం కూడా ఒక రంగులో ఉంటుంది. ఒక్కో స్కూలుకు ఒక్కో రంగు యూనిఫాం ఉంటుంది”

“అవునమ్మా”

ప్రద్యుమ్న మళ్లీ ఇంద్రధనుస్సు వైపు చూశాడు. అది అప్పటికే కాస్త మసకబారుతోంది.

అతనికి ఏదో కొత్త ఆలోచన వచ్చింది.

“అమ్మా.. ఆకాశంలో ఇన్ని రంగులు కలిసి ఇంత అందంగా ఉంటే, మనుషులందరూ కూడా కలిసిమెలిసి ఉంటే ప్రపంచం ఇంకా అందంగా ఉంటుంది కదా?”

రేణు అతని తల నిమిరింది.

“అదే నిజం రా” మాధవ్ కూడా చిరునవ్వుతో అన్నాడు. “రంగులు వేరైనా ఇంద్రధనుస్సు ఒక్కటే. మనుషులు వేరైనా మానవత్వం ఒక్కటే”

ప్రద్యుమ్న మళ్లీ ఆకాశం వైపు చూశాడు.

ఇంద్రధనుస్సు పూర్తిగా మాయమైపోయింది. కానీ దాని రంగులు మాత్రం అతని మనసులో మిగిలిపోయాయి.

“పదండి అమ్మా.. ఇంటికి వెళ్దాం. రేపు స్కూల్లో నా రంగుల ప్రపంచం గీయాలి”

చీకటి మెల్లగా కమ్ముకుంటోంది. రహదారిపై వాహనాలు పెరుగుతున్నాయి.

ముగ్గురూ ఇంటి దారి పట్టారు. ప్రద్యుమ్న మాత్రం మనసులో ఒక అందమైన ఇంద్రధనుస్సు మెదుల్తూనే ఉంది.

(వచ్చే వారం మరో కథతో కలుద్దాం)

Exit mobile version