[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]
అనగ అనగ రాగం..:
విద్యార్థులందరినీ ఆ రోజు ఉదయమే పిక్‌నిక్‌కి బయలుదేరదీసింది సంధ్యా టీచర్.
అంతకు ముందు రోజే పిక్‌నిక్ గురించి చెప్పడంతో పిల్లలంతా ఉత్సాహంతో ఉన్నారు. “పిక్‌నిక్ పిక్‌నిక్” అంటూ అందరూ ఎగిరి గంతులేస్తున్నారు.
సంధ్య తన క్లాసు పిల్లల పిక్‌నిక్ కోసం ప్రధానోపాధ్యాయుడిని అనుమతి అడగ్గానే అనుమతిస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్పాడాయన. అటెండర్ రవిని, ఉపాధ్యాయులు రమేష్‌కుమార్, రోజారమణిలను కూడా వెంట తీసుకెళ్ళమని సూచించాడు.
పిల్లలందరినీ బారులుతీరి నిలబడమని చెప్పింది సంధ్య. రోడ్డుమీద పరుగెత్తవద్దనీ, అంతా నెమ్మదిగా నడవాలని చెప్పింది. పిల్లలంతా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఏది చెప్పినా తలలూపుతున్నారు.
“రంగు పెన్సిళ్ళూ, తెల్లకాగితాల నోటుబుక్కులూ వెంట తెస్తున్నారా?” అని సంధ్య అడగంగానే, “తెస్తున్నాం టీచర్! ఇదిగో టీచర్” అంటూ అంతా చేతులెత్తి తమ దగ్గరున్న కాపీలూ, పెన్సిళ్ళూ చూపించారు.
“సరే సరే. పదండి. రవీ” అంటూ అటెండర్‌ను పిలిచి కొన్ని ఆట వస్తువులూ, తినుబండారాలూ, మంచినీళ్ళకు గ్లాసులూ తీసుకురమ్మని చెప్పి బయలుదేరింది సంధ్య.
చుట్టూ చూస్తూ ఊరవతల పరుచుకున్న పచ్చిక మైదానానికి చేరారంతా.
విశాలంగా ఉన్న ఆ మైదానాన్ని, చుట్టూ గుబురుగా పెరిగిన పొదలనీ, ఏపుగా ఎదిగిన చెట్లనీ, సుదూరంగా కనిపిస్తున్న ఊరినీ, మరోపక్క ఉన్న కాలేజీ బంగళానీ చూసి పిల్లలంతా కేరింతలు కొట్టారు.
అంతవరకూ ఎక్కడ దాక్కుందో వీళ్ళు రాగానే గాలి చల్లగా, హాయిగా వీచసాగింది.
గాలికి రెపరెపలాడే కొత్త కాగితాల్లా పిల్లలంతా ఉత్సాహాన్ని ఊపిరి చేసుకున్నారు. మైదానంలో తలా ఒక దిక్కు పరుగెత్తసాగారు.
నీలి ఆకాశంలో మెరుస్తూ పరుచుకున్న తారల్లా వాళ్ళంతా ఆ పచ్చికలో మెరుస్తున్నారు.
“అదేమిటి టీచర్? వాళ్ళలా ఎగురుతున్నారు. ఇక్కడ వచ్చి బుద్ధిగా కూర్చోమనండి” అన్నాడు రమేష్‌కుమార్.
“లేదు.. లేదు వాళ్ళిక్కడికి వచ్చింది మళ్ళీ ఒక చోట కూర్చుని నన్నూ, మిమ్మల్నీ చూడ్డానికి కాదు. ఈ విశాల విశ్వాన్నీ, సుందర ప్రకృతినీ చూడ్డానికి. ఇప్పుడైనా వాళ్ళని వాళ్ళ ప్రపంచంలో ఉండనిద్దాం. చూడండి. అదిగో ఒక్కొక్కరూ ఒక్కో చైతన్య కెరటంలా ఎలా ఎగురుతున్నారో” అంటూ తనూ పరుగెత్తుకెళ్ళి వాళ్ళని కలిసింది సంధ్య.
పిల్లలు తాము చూసిన దృశ్యాల్ని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
“అదిగో దూరంగా గొట్టంలోంచి నల్లటి పొగ వస్తోంది”
“అవును. అది గుప్పు గుప్పుమని వస్తోంది కదూ”
“అదిగో అటుపక్క చూడు. పొడవు చెట్లు గాలికి ఎలా ఊగుతున్నాయో”
“భలే భలే! అదిగో దూరంగా బస్సు ఎంత చిన్నగా పోతూందో”
“ఏదీ.. ఏదీ?”
“ఆ..అదింకా ఉంటుందా? వెళ్ళిపోయింది’
ఇంతలో అటెండర్ రవి టెన్నికాయిట్ రింగులూ, వాలీబాల్ బంతీ, ఆహార పదార్థాలు తీసుకొచ్చాడు.
పిల్లలంతా బిలబిలమంటూ అటువైపు పరుగెత్తారు.
“పిల్లలూ! ఆగండి. అటు వెళ్ళకండి. ఇప్పుడే ఇట్రండి. ఆటలు తరువాత కానీ, ముందు మనమంతా బొమ్మలు వేద్దాం” అంటూ పిలిచింది సంధ్య.
“అవునూ. అందరి దగ్గరా పెన్సిళ్ళూ, కాగితాలూ ఉన్నాయిగా” అడిగింది.
“ఉన్నాయి టీచర్” అన్నారు అంతా.
“టీచర్! టీచర్! రాకేష్ బొమ్మలు గీయడంట” ప్రదీప్ చెప్పాడు.
“ఏదీ రాకేష్! ఇలారా. ఏమైంది చెప్పు. ఎందుకు గీయవు?”
“నాకు బొమ్మ మంచిగా గీయరాదు టీచర్!’ అంటూ తల దించుకున్నాడు రాకేష్.
“ఏమిటి గీయరాదా? ఎందుకు అనుకుంటున్నావు అట్లా? నీకు గీయ వస్తుంది. ఎట్లా వస్తే అట్లా వేయి. రాదనకూడదు” అంది సంధ్య.
“మనమంతా ఇక్కడికి వచ్చింది ఆడటానికీ, పాడటానికీ, బొమ్మలు వేయడానికీ కదా! అందుకే పదండి పదండి బొమ్మలు వేద్దురుగాని. రాకేష్ కూడా వేస్తాడు. అవునూ, ఇంతకూ ఏం గీస్తారు” అడిగింది.
“మీరు ఏది గీయమంటే అదే గీస్తాం టీచర్!” అంది ప్రతిమ.
“నో నో. నేనేమీ చెప్పను. చుట్టూ చూడండి. విశాల ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తోందో! అదిగో అక్కడ పూలు నవ్వుతున్నాయి. ఇక్కడ పొడవైన చెట్ల నీడలు గాలికి నృత్యం చేస్తున్నాయి. అటు చూడండి కాలేజీ బంగళా పీట వేసి కూర్చుంది. అలా చుట్టూ చూడండి. మీకు ఏది ఇష్టమైతే అదే, మీకు ఏది గీయాలనిపిస్తే అదే గీయండి. వెళ్ళండి. దూరంగా కూర్చోండి. ఒకరిదాంట్లో ఒకరు చూడకండి. పదండి” అంటూ అందర్నీ బయలుదేరదీసింది.
విసిరేసినట్టుగా అంతా తలా ఓవైపు పరుగెత్తారు. ఎవరి కిష్టమైన చోట వాళ్ళు కూర్చుని కాగితాలూ, పెన్సిళ్ళూ తీశారు.
దూరంగా కనిపిస్తున్న గుడిసెల గుంపుని దీర్ఘంగా చూస్తూ కాగితంమీద గీసే ప్రయత్నం చేస్తున్నాడు మనీష్.
కిలకిలా నవ్వుతున్న గులాబీని ఎర్ర పెన్సిల్‌తో దిద్దేస్తున్నాడు ప్రదీప్. మొత్తం కాలేజీ బంగళాన్నీ కాగితంమీద వేసే ప్రయత్నం చేస్తున్నాడు రాకేష్. దూరంగా ఉన్న పొగ గొట్టాన్నీ, పొగనూ దిద్దుతున్నాడు ప్రదీప్.
కిషన్ ఇద్దరు మనుమల్ని దిద్దుతుంటే, ప్రతిమ ఊగుతున్న పొడవైన చెట్లను, ఆ చెట్ల చాటున కనిపిస్తున్న సూర్యుణ్ణి దిద్దుతోంది. ఒకడు పర్వతాలనీ, ఒకడు నదినీ, ఇంకొకడు పడవల్నీ దిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
అక్కడంతా పెయింటింగ్ పోటీ జరుగుతున్న వాతావరణం ఏర్పడింది. ఎవరూ మాట్లాడడం లేదు. అందరి ముఖాలూ వెలిగిపోతున్నాయి. సాగర తరంగాల్లా ఉత్సాహంగా ఉన్నారు.
అంతవరకూ బొమ్మలంటే తెలియని ఆ విద్యార్థులు రంగురంగుల పెన్సిళ్ళతో తమ ఊహల్ని కాగితాల మీద పేర్చుతున్నారు. అరగంట గడిచింది. సంధ్య అందరి మధ్యా తిరుగుతూ అందర్నీ పరీక్షగా చూస్తోంది. ఎవరికీ ఏమీ చెప్పడం లేదు. మిగతా అందరూ నిశ్శబ్దంగా రాకేష్‌నీ, టీచర్‌నీ చూస్తున్నారు.
తామేదో గీయగలుగుతున్నామనే ఊహ వాళ్ళని ఆగనీయడం లేదు.
ఎవరో అడిగారు సంధ్యని, “టీచర్! టీచర్! నువ్వు ఇలాగే ఉంటావా?”
“ఏం, నీకు కనిపించలేదా? నీకెలా కనిపిస్తే అంతే. అలాగే వేయి” అని బదులిచ్చింది.
అక్కడ ఆకాశంలోని చుక్కల్ని వేస్తోంది హారిక. అది చూసి సంధ్య అడిగింది
“ఇదేమిటి ఇప్పుడు చుక్కలు లేవుగా ఆకాశంలో?”
“నిన్న రాత్రి చూశాను టీచర్! అది వేస్తున్నా” అంది హారిక.
సంధ్యకు ఆనందం కలిగింది. పిల్లల్లో ఎంత సృజనాత్మకత! నిన్న చూసిన దృశ్యం ఇప్పటికీ మనసులో పదిలం చేసుకుని ఇప్పుడు కాగితంమీదికి తెస్తోంది.
ఇంకొంచెం సేపటికి అంతా బొమ్మలు వేయడం ముగించుకుని సంధ్య దగ్గరకు పరుగెత్తుకొచ్చారు.
“టీచర్! టీచర్! నా బొమ్మ చూడండి”
“నాది చూడండి” అంటూ అంతా సంధ్యని చుట్టుముట్టారు.
“ఆగండి. ఓపిక పట్టండి. అందరివీ చూస్తాను” అంది సంధ్య. రాకేష్ మాత్రం ముఖం వాడిపోయి ఉండడం గమనించింది.
“రాకేష్! ఇలారా. నీ బొమ్మ చూపించు” అని పిలిచింది.
“నాకు బొమ్మ మంచిగా గీయరాలేదు టీచర్” అంటూ ఏడ్చాడు రాకేష్.
“ఏదీ బొమ్మ? ఇలా ఇవ్వు” అని బొమ్మ తీసుకుని చూసి “బాగానే ఉందిగా! కాలేజీ బంగళా కదూ నువ్వు గీసింది! బాగానే ఉంది. రంగులు ఇంకొంచెం శుభ్రంగా వేస్తే ఇంకా బావుండేది. ఈ మాత్రానికే రాదని, రాలేదని ఏడవాలా? ఊరుకో” అంటూ ఓదార్చింది సంధ్య.
“అంతా కూర్చోండి. మీ బొమ్మలు తరువాత చూస్తాను. కానీ ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నువ్వు కూడా రాకేష్!” అంటూ
“మీరు తప్పుల్లేకుండా తెలుగు చదవగలరా?”
“చదువుతాం టీచర్”
“నువ్వు రాకేష్?”
“చదువుతాను”
“మీరు తప్పుల్లేకుండా తెలుగు రాయగలరా?”
“రాయగలం టీచర్”
“నువ్వూ రాకేష్?”
“రాస్తాను”
టీచర్ ఈ ప్రశ్నలెందుకు అడుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాకేష్ కూడా ఏడుపు మాని టీచర్‌నే చూస్తున్నాడు.
“మీరు బడికి వచ్చిన మొదటి రోజే ఇవన్నీ వచ్చాయా కదూ?” అంది సంధ్య.
“లేదు టీచర్! వచ్చిన రోజు రాలేదు. తరువాత తరువాత వచ్చినాయి ఇవన్నీ” అంది ప్రతిమ.
“నీకూ అంతేనా రాకేష్?”
“అవును టీచర్”
“మొదట ఏం నేర్చుకున్నారు బడిలో?”
“అ, అలు దిద్దాం టీచర్” ప్రతిమే సమాధానం చెప్పింది.
“తరువాత?”
“గుణింతం”
“ఆ తరువాత?”
“ఒత్తులు నేర్చుకున్నాం”
“ఆ తరువాత ఏమొచ్చింది?”
“చదవడం, రాయడం వచ్చింది టీచర్”
“అవునా రాకేష్?”
“అవును టీచర్!” ఉత్సాహంగా బదులిచ్చాడు రాకేష్.
“ఊ. తెలుగులాగే బొమ్మలు కూడా ముందే పూర్తిగా వేయడం రాదు. కొంచెం కొంచెం వేయడం ప్రాక్టీస్ చేస్తూ పోతే బొమ్మలు అందంగా, చక్కగా వేయడం వస్తుంది. అంతేగాని మొదటిరోజే రాదు. రాదని బాధపడొద్దు. ఏడవ వద్దు. మీకెలాగైతే బడికి వచ్చిన ఇన్ని రోజులకు చదవడం, రాయడం వచ్చాయో, అలాగే పోనూ పోనూ బొమ్మలు స్పష్టంగా వేయడం వస్తుంది. కాని రోజూ ఎదో ఒకటి వేయాలి. రకరకాలైనవి వేయాలి. మనసు పెట్టి వేయాలి. చదువూ, బొమ్మలే కాదు, ఏదైనా రోజూ చేస్తేనే శ్రద్ధగా చేస్తేనే పూర్తిగా వస్తుంది. గొప్పగా వస్తుంది. ఎలాగంటే..”
“అనగననగ రాగమతి శయిల్లుచుండు..” అని సంధ్య అనగానే పిల్లలంతా ఒక్కసారిగా –
“తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు
ధరలో విశ్వదాభిరామ వినురవేమ” అని పూర్తి చేశారు.
“ఏదీ, ఇలా తేండి. మీ బొమ్మలు చూస్తాను” అని సంధ్య అందరి బొమ్మలూ చూడసాగింది..
(వచ్చే వారం మరో కథతో కలుద్దాం)
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
