Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-8

[‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ అనే శీర్షికతో బాలల కథల అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.]

ఎప్పటి పని అప్పుడే..:

ప్రార్థన ముగించుకుని పిల్లలంతా ఎవరి తరగతుల్లోకి వాళ్లు వెళుతున్నారు. ఆటల సారు చూసినంతసేపూ మిలటరీ నడక నడిచినట్టుగా వాళ్లంతా ఆ తరువాత ఎవరి క్లాసుల్లోకి వాళ్లు నడుస్తూ చేరుకుంటున్నారు.

గోలగోలగా క్లాసులు చేరగానే ఎవరి స్థలంలోకి వాళ్లు చేరుకుని పుస్తకాలు సర్దుకుంటూ, పరాచికాలాడుకుంటూ సరదాల సిరుల్లా ఉన్నారు.

క్లాసు బెల్‌ అవడంతో సంధ్యా టీచర్‌ తన క్లాసుకేసి బయలుదేరింది. క్లాసు వద్దకు చేరగానే లోపల విద్యార్థులు చేస్తున్న అల్లరి ఆమెను తలుపు దగ్గరే నిలిపేసింది.

లోపల రాజేష్‌, రాకేష్‌ డస్టర్‌తో వాలీబాల్‌ ఆడుతున్నారు. విజయ్‌, అభిలాష్‌ కుస్తీ పడుతున్నారు. ఆదిత్య బ్రేక్‌ డాన్స్‌ తరహాలో బెంచీమీదెక్కి ఎగురుతున్నాడు. అమల, సుజాత ఒకరి పుస్తకాలు ఒకరు లాక్కుంటూ సరదా పడుతున్నారు.

ఒక క్షణం తలుపు దగ్గర నిలబడి క్లాసంతా కలియజూసి లోపలికి నడిచింది సంధ్య.

టీచర్‌ను చూడగానే ఎక్కడివాళ్లక్కడ ఆగిపోయారు. ఎగరెసిన డస్టర్‌ను టీచర్‌ అందుకుంది.

“నమస్కారం టీచర్‌” అన్నారు అంతా తత్తరపాటుగా.

“అరే! తప్పిపోయి వచ్చానే! ఇది మీ ఆటల పీరియడ్‌ అనుకుంటాను. మళ్లీ నా తెలుగు పీరియడ్‌లో వస్తాను” అంటూ తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమైంది సంధ్య.

“టీచర్‌! ఇది మీ పీరియడ్‌. మా ఆటల పీరియడ్‌ సాయంత్రం” అంది చొరవగలిగిన వెంకటరమణి.

“ఓహో! అలాగా! అయితే ఇది ఆటల పీరియడ్‌ కాదు, తెలుగు పీరియడ్‌ అన్న సంగతి ఒకరికి గుర్తుందన్నమాట. ఇంకెవరికి గుర్తుంది? చెప్పండి”

అందరూ బిక్కమొహాలు వేసుకుని చూస్తూ నిలుచున్నారు. ఎవరి నోటా మాట పెగల్లేదు. అందరి కళ్లలో భయం రెపరెపలాడింది. టీచర్‌తో దెబ్బలు తప్పవన్న సంగతి అర్థమవుతూ అంతా బిగదీసుకుని నిలుచున్నారు. అందరి ముఖాలూ కలియజూసి

“కూర్చోండి” అంది సంధ్య. అంతవరకూ నిలబడి ఉన్న పిల్లలంతా కూర్చున్నారు. తమ పుస్తకాలు తీయడంలో మునిగిపోయారు. అది చూసి

“ఆగండి. మిమ్మల్ని పుస్తకాలు ఎవరు తీయమన్నారు? ఇది ఆటల పీరియడా, తెలుగు పీరియడా తేలాలి ముందు” అంది సంధ్య గంభీరంగా. క్లాసంతా నిశ్శబ్దం ఆవరించింది.

“ఇది తెలుగు పీరియడే టీచర్‌” అంటూ టైమ్‌టేబుల్‌ చూపించే ప్రయత్నం చేసింది పద్మ.

“సరే.. మరైతే మీరంతా ఆడుతున్నారుగా” అంతా ముఖాలు దించుకున్నారు.

“ఏడుపు ముఖాలెందుకు పెడతారు? చేసింది చాలదా? చదివే పరిస్థితి మీకు ఎలాగూ లేదు. బుద్ధిగా కూర్చోండి. కథ చెబుతా వినండి.” బలమైన దెబ్బలు తప్పవనుకున్న వాళ్లంతా టీచర్‌ అలా అనేసరికి సంతోషంతో ఆసక్తిగా ముందుకు జరిగారు.

“ఒక ఊళ్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులుండేవాళ్లు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఒక రోజు రామాపురంలో జరిగే జాతరకు వెళ్లి సరుకులు అమ్ముకుని రావాలని ఇద్దరూ అనుకున్నారు. ఆ ఊరు వెళ్లాలంటే అడవి దాటి వెళ్లాలి. కనుక జాతర జరిగే రోజుకు ముందురోజే బయలుదేరి, రాత్రికి ఆ ఊరి సత్రంలో పడుకుని, మర్నాడు జాతరలో సరుకులు అమ్మాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే సామాను మూట కట్టుకుని జాతరకు ముందు రోజు ఉదయాన్నే బయలుదేరారు రామయ్య, సోమయ్య. ముచ్చట్లు చెప్పుకుంటూ, పద్యాలు పాడుకుంటూ నడుస్తున్నారు ఇద్దరూ. అడవిలో సగం దూరం నడిచేసరికి ఆకలేసింది. ఓ చెట్టు కింద తమ మూటలు దించి కూర్చుని, తాము తెచ్చుకున్న తిండి మూటలు విప్పి భోజనం చేశారు. దగ్గరే ఉన్న ఏటిలో నీళ్లు తాగి, కొంచెంసేపు అలసట తీరడం కోసం చెట్ల కింద పడుకున్నారు. కొద్దిసేపటికి రామయ్య లేచి ‘సోమయ్యా! లే. మనం ఇంకా సగం దూరం వెళ్లాలి. త్వరగా బయలుదేరుదాం’ అన్నాడు.

నిద్రనుంచి పూర్తిగా లేవకుండానే ‘నేను ఇంకొంచెంసేపు పడుకుంటాను’ అన్నాడు సోమయ్య.

‘సోమయ్యా! ఇది పడుకునే సమయం కాదు. మనం ఇంకా దూరం పోవాలి. చీకటి పడేలోగా రామాపురం చేరితే సత్రంలో హాయిగా పడుకోవచ్చు. లేకుంటే అడవిలో కష్టం అవుతుంది. ‘లే’ అన్నాడు రామయ్య.’ రామయ్య అంత చెప్పినా సోమయ్య లేచి కోపంగా ‘చూడు రామయ్యా, నా బంగారం లాంటి నిద్ర పాడుచేశావు. నువ్వు వెళ్లేదుంటే వెళ్లు. నేను ఇంకొంచెంసేపు పడుకుంటాను. మెలకువ వచ్చాక బయలుదేరుతాను’ అని తిరిగి నిద్రలోకి జారుకున్నాడు.

ఇక అతనితో లాభం లేదని రామయ్య తన మూటను నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. అలా వెళ్లిన రామయ్య సాయంత్రం వరకు రామాపురం చేరి, సత్రంలో బస చేసి హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు.

అక్కడ అడవిలో పడుకున్న సోమయ్యకు చీకటి పడే వేళ మెలకువ వచ్చింది. తొందరతొందరగా లేచి మూట నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కానీ కొంచెం దూరం వెళ్లేసరికి చీకటి పడింది. చిమ్మచీకటి. పైగా అడవి. గాలికి చెట్లు కదులుతూ వింతవింత శబ్దాలు చేస్తున్నాయి. ఎక్కడినుంచో నక్క ఊళ వినిపించింది. సోమయ్య పై ప్రాణాలు పైనే పోయాయి. భయంతో కాళ్లు కదపలేకపోతున్నాడు. నెత్తిమీది మూట బరువు ఎక్కువ అవుతున్నట్లనిపించింది సోమయ్యకి.

అంతే! మూట కింద పడేసి పరుగు లంకించుకున్నాడు. పరుగెత్తి పరుగెత్తి ఆ ఊరు చేరుకునేసరికి అక్కడ సత్రంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న రామయ్య కనిపించాడు.

వణికిపోతున్న సోమయ్యను చూసి రామయ్య ‘ఏమైందయ్యా?’ అని అడిగాడు.

సోమయ్య భోరున ఏడ్చేశాడు. అడవిలో భయానికి మూట పడేసి పరుగెత్తుకొచ్చానని చెప్పాడు. ‘అప్పుడే నాతో పగటివేళ వచ్చి ఉంటే ఇంత కష్టమొచ్చేది కాదుగా! చీకట్లో బయలుదేరి నష్టపోయావు. సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు బాధపడి లాభమేముంది? రేపు ఉదయమే వెళ్లి అడవిలో వెతికితే నీ మూట దొరకవచ్చు’ అని సముదాయించాడు రామయ్య.”

“అదీ కథ” అంటూ ముగించింది సంధ్య.

“తెల్లారి మూట దొరికిందా టీచర్‌?” అడిగాడు ఎవరో ఒక విద్యార్థి.

“మూట దొరికిందా లేదా అన్నది కాదు. రామయ్య పగటివేళ వెలుతురులో బయలుదేరి అడవి దాటి క్షేమంగా రామాపురం చేరాడు. అవునా? మరి సోమయ్య పరిస్థితి ఏమైంది? పగలు పడుకుని చీకట్లో బయలుదేరి కష్టాల్లో పడ్డాడు కదా! అంటే ప్రయాణం చేయాల్సిన సమయంలో రామయ్య ప్రయాణం చేశాడు. అదే సోమయ్య ఆ సమయంలో పడుకుని, కాని సమయంలో ప్రయాణం చేసి కష్టాలపాలయ్యాడు. అందుకే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే విజయం లభిస్తుంది. మనిష్టమొచ్చినప్పుడు చేస్తామంటే కథలో సోమయ్యలాగా కష్టాలపాలవుతారు. అర్థమైందా?

అట్లాగే చదివేటప్పుడు చదవాలి. ఆడేటప్పుడు ఆడాలి. కాని చదవాల్సిన సమయంలో ఆడడం, ఆటల సమయంలో చదవడం మంచిది కాదు. అవునా?” అంది సంధ్య.

“అవును టీచర్‌. తప్పయింది టీచర్‌. ఇంకెప్పుడూ ఇప్పటిలాగా చేయం. చదివే టైంలో చదువుతాం. ఆడే టైంలో ఆడతాం” అన్నారు అంతా ఒక్కసారిగా.

“వెరీ గుడ్‌! మరి నిన్నటి పద్యానికి అర్థం ఎవరు రాసుకొచ్చారు? చెప్పండి” అంటూ పాఠం మొదలుపెట్టింది సంధ్యా టీచర్‌.

(వచ్చే వారం మరో కథతో కలుద్దాం)

Exit mobile version