Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రజ్వలన ఫలం

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘ప్రజ్వలన ఫలం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మానావమానాల పరిగణనమూ
కష్ట సుఖాల మననమూ
దగ్ధమైన వేళ దక్కే ఫలితాలు
స్థిత ప్రజ్ఞత స్థితి భూతీ,
స్థిర అభ్యున్నతి దశా ప్రాప్తీ!

అజ్ఞాన తిమిర రాశి రాకాసి
ఉపశమిల్లని ఆత్మ జ్ఞానాగ్నిచే
దగ్ధమైన వేళ
దరి చేరే సంపత్తులు
జన్మ పరమార్థ సాధక యుక్తీ,
యుక్త మార్గాచరణ శక్తీ!

అనంతమైన
అద్వితీయ ధిషణాగ్ని కుండమై
దివ్యోష్ణ ప్రభా భాండమై
దివాకరుని అంతరంగం
దగ్ధమౌతున్న వేళ
సమకూరే సంపదలు
ప్రాణి జగతి ఉపస్థితికి
ఊపిరులూదే గతి ఉత్పత్తీ,
చక్కని, చల్లని
చందమామను చూపే
ద్యుతి ఉద్గతీ!

చింతల చీకట్ల చిక్కులను తొలగిస్తూ
ఆశా దీపాలను వెలిగిస్తూ
భోగి మంటల సామాగ్రి
దగ్ధమౌతూ ప్రసాదించే ప్రయోజనాలు
పర్వ దినావిర్భూతికి వేదిక,
వేయి వేడుకల వెల్లిక!

శిష్ట రక్షణ నిమిత్తమూ,
దుష్ట శిక్షణార్థమూ
ధర్మ నేత్రం గర్భ క్షేత్రం
దగ్ధమౌతున్న వేళ దక్కే హితాలు-
‘హోళిక’వినాశమూ,
‘హోలీ’వర్ణ వసంత వికాసమూ!

కొన్ని దహనాలు
శుభాల జననాలకు కారణాలు!
సుఖాల ఆగమనాలకు
కారకాలూ, ప్రేరకాలూ!

Exit mobile version