[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘ప్రకృతే పరమాత్మ’. రచన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు.]
అదో మునివాటిక. దాని ముందు వివిధ పక్షుల గుంపులు, జింకలు, నెమళ్లు, కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. వాటికే భయము లేదు. ఆ ప్రాంగణంలో దొరికిన గింజల్ని ఏరుకొని సంతోషంగా తింటున్నాయి.
కుటీరం ముందు చిత్రవర్ణములతో రంగవల్లులు అతి చక్కగా తీర్చబడివున్నాయి. అందులో దేవతామూర్తుల రూపాలు కూడా ప్రతిబింబిస్తున్నాయి. లేత సూర్యుని కాంతి కిరణాలు సోకిన ఆ ముగ్గులు మరింత శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. చూచిన వారందరికి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
వేకువనే నదీస్నానానికి వెళ్లిన సుమంతుడు, స్నాన సంధ్యావందనాదులను, నిత్యానుష్ఠానాలైన జపాదులను ముగించుకొని తోటి ఋషిగణంతో కూడి పర్ణశాలకు వచ్చాడు.
ఆశ్రమం ముందు తీర్చిన రంగవల్లికలను చూచిన మునివరులు మహాదానందం పొంది “సుమంతా! నీ జన్మ సార్థకమైనదయా!! ఎంతటి గొప్ప కళాత్మకమైన, శోభాయమైన, నిండారు భక్తి తత్పరతతో దేవతా స్వరూపాలను చిత్రించిన నీ కుమార్తె గొప్ప దైవభక్తి గలగిన మహానీయురాలు. కుటీర గోడలపైన, గడపల మీద, దేవతల చిత్రాలను ఎంత గొప్పగా ఆధ్యాత్మిక దృష్టితో చిత్రించిందో చూడు. ఇట్టి బిడ్డను పొందడం నీ పూర్వ పుణ్య విశేషమే కదా! ఈమె ఎవరింటి కోడలవుతుందో వారలదృష్టవంతులు సుమా!” అన్నాడు ఓ బ్రహ్మజ్ఞాని.
“మునీశ్వరా! ఎంత నోముకంత ఫలితమన్నట్లు నాకు దక్కిన ఫలము నా ఈ కుమార్తె శీల. యుక్తవయసు వచ్చునంతవరకు నా భార్య దీక్షాదేవి తన పుత్రికను అతి గారాబంగా పెంచి పెద్దచేసింది. దైవభక్తిని పెంపొందించింది. కంటికి రెప్పలా కాపాడింది. ఆ దీక్షాదేవి భృగుమహర్షి పుత్రికయని మీరెఱుగుదురు కదా! జన్మతః అబ్బిన సుగుణాలెన్నో- అట్టి మహనీయురాలు తాపజ్వర పీడితురాలై దివికేగడం నా దురదృష్టం కాక మరేమి?” అని కంటతడి పెట్టుకొన్నాడు సుమంతుడు.
“చింతించవలదు సుమంత. నీకెన్ని కష్టము లెదురైనా సరే! శీలను యోగ్యున కిచ్చి వివాహమొనర్చుము. అంత కంటే మనకు కావలసిన దేమున్నది? అమ్మాయి సంతోషమే – మన సంతోషం కదా!” అన్నాడు బ్రహ్మజ్ఞాని.
“తోడును కోల్పోయిన సుమంతుడు వైదికకర్మ లోప భయముతో కృంగినవాడై, మరొక కన్యను వివాహమాడినాడు స్వామి! ఆమె ఇప్పుడింట కాపురమున్నది. ఆమె పేరే కర్కశ” అన్నాడు మరో మునీంద్రుడు.
ఇంతలో కుటీరపు తలుపులు తెరవబడ్డాయి. శీల వెలుపలికి విచ్చేసి, మునీశ్వరులకు వందన మొనర్చి, అందరిని లోనికి రండని, ఆహ్వానించింది. కొందరు మాత్రమే ముందుకు నడిచారు. మరికొందరు శెలవు తీసుకొని తమ తమ వాటికలకు వెళ్లారు.
శీల విచ్చేసిన మునివరులందరికి ఆసనాలు పరచి, అర్ఘ్యపాద్యాదులిచ్చింది. అప్పుడే పూజ ముగించి శ్రీమన్నారాయణునకు నివేదించిన పాలు, పండ్లు తెచ్చి వారి ముందుంచి స్వీకరించ వేడుకొన్నది. ఇంతలో కర్మశ పూజా మందిరం నుండి వచ్చి మునులను జూచి, “అయ్యా! ఈ ఫలాలు మాత్రమే చాలా? ఇంకా ఏవైనా పంచభక్ష్యాలు, పరమాన్నాలు వండి పెట్టాలా? చాలిక లేవండి” అని గదమాయించింది. సుమంతుడు, శీల ఆ దురుసు మాటలకు ఎదురు చెప్పలేక పోయారు.
మౌనం దాల్చిన సుమంతుని దీనస్థితిని గమనించిన మునులు లేచి, “సుమంత! నీ వన్నది నిజం. ఎంత నోముకంత ఫలం. బాధపడవద్దు. అతి త్వరలోనే నీకు బంధ విముక్తి కలుగుతుంది. శ్రీమన్నారాయణ ధ్యానమే దీనికి తరుణోపాయం. కోపాన్ని నిగ్రహించు, ఆవేశాన్ని అదుపులో పెట్టుకో, మౌన ధ్యానం పాటించు. నీకు మంచి అల్లుడు దొరుకుతాడు. చింత పడవద్దు” అని బ్రహ్మజ్ఞాని సుమంతుడిని సమాధాన పరచాడు. మునులందరూ సుమంతుణ్ణి ఓదార్చి బయుడికి నడిచారు.
జరిగిన దుస్సంఘటనకు తండ్రి, పుత్రికలిద్దరూ బాధపడుతూ- “శ్రీమన్నారాయణా! మా సంకటములు బాపు శక్తి నీకొక్కడికే వుంది! మాకు శరణు నీవే! వేరెవ్వరు లేరు తండ్రీ, నీవే మాకు రక్ష” అంటూ చేతులెత్తి భగవంతునికి మొక్కుకొన్నారు.
***
తెలతెల్లవారుతున్న వేళ, పక్షుల కిలకిలారావాలతో ఆ వనవాటిక శోభిల్లుతూ వుంది. నది గట్టున గల ఆ మునివాటికల లోని ఋషిపుంగవులందరూ నది స్నానాలు చేస్తూ, లేత సూర్యునికి అర్ఘ్యాన్ని వదులుతూ, సూర్యస్తోత్రం చేస్తున్నారు. స్నానం ముగించిన కొందరు గట్టుపై ఇసుక తిన్నెలపై కూర్చొని నిత్యానుష్ఠానం చేస్తున్నారు. కొందరు తమ తమ ధౌత వస్త్రాలను ఉతికి ఆరవేస్తున్నారు. నది గట్టు పూర్తిగా మునిగణంతో విరాజిల్లుతూంది.
ఇంతలో ఎద్దుల మెడకు గట్టిన గంటల శబ్దంతో ఓ బండి అటుగా వచ్చి ఆగడం గమనించారు మునులు. ‘ఎవరై వుంటారా?’ అని అందరూ ఆతురతగా చూడసాగారు, బంతికి గట్టిన తెరను తీసి లోన కూర్చొన్న మహనీయుడు దిగడానికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసాడు బండివాడు. తేజోవంతుడైన ఓ స్ఫురద్రూపి దిగడం చూచారందరు. చిరుగడ్డంతో, ముడి వేసుకొన్నా సిగతో, మెడలో రుద్రాక్షమాలతో నొసలు విభూతి రేఖలతో, చెవులకు కుండలాలతో, కొయ్య పాదుకలతో అపర దత్తాత్రేయుడిలా వెలిగిపోతున్న ఆ నవయునకుడిని చూచి ఆశ్చర్య పోయారు అందరూ – ‘ఎవరా?’ అని.
బండి దిగి తన దండ, కమండలాలను చేతిలో, కృష్ణాజీనాదులను చంకలో ధరించి ముందుకొచ్చాడు అతడు. అక్కడి మునిగణమునకు ప్రణమిల్లి, తన ప్రవరాన్ని వినిపించాడు. వెంటనే ఋషిగణం సంతోషచిత్తులై అతనికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, “రండి, మేమిప్పుడే, మా అనుష్ఠానాన్ని ముగించాము. తమరు మీ నిత్యకృత్యములను ముగించి మా ఆశ్రమానికి విచ్చేసి, మా ఆతిథ్యం స్వీకరించండి” అని మనవి చేసుకొంటూ, ప్రేమగా స్వాగతం పలికారు.
అతడిని ‘కౌండిన్య మహాముని’గా తెలుసుకొని చాలా సంతోషించారు. తను ఋషివాటిక ధన్యమైనదని తలంచారు. సుమంతుడు అతనికి సాష్టాంగ మొనర్చి తన ప్రవరాన్ని తెలిపాడు.
అతను ‘శుభం భూయాత్!’ అని ఆశీర్వదించాడు.
అందరు ఋషివాటికలు చేరారు. కౌండిన్యుడికి ఒక ప్రత్యేకమైన వాటికను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసారు. అతని కవసరమైన వస్తు సామాగ్రిని, నిత్యపూజాదిక కార్యక్రమ నిర్వహణకు అనువైన ఫలపుష్పాదులను అందించారు. అతనికే లోటు రాకుండా సకల వసతులు ఒనగూర్చారు. ఆ రోజు విశ్రాంతి తీసుకొని, మరుసటి రోజు కౌండిన్యుడు బ్రాహ్మీముహూర్త కాలానికే లేచి, నదికి వెళ్లి స్నాన సంధ్యావందనాదులు ముగించి తన కుటీరం చేరాడు. ఆ కుటీరం ముందు అతనికి చక్కని వర్ణశోభితములైన రంగవల్లులు తీర్చివుండడం గమనించి ఆశ్చర్యపోయాడు.
“ఇంత పొద్దుననే లేచి, ఇంత సుందరమైన రంగు రంగుల ముగ్గులు దేవతామూర్తులతో తీర్చిదిద్దిన దెవరా?” అని ఆశ్చర్యం పొందుతూ, ‘ఎక్కడెక్కడ ఏ ఏ రంగులు ఎలా అద్దాలో తెలిసిన నెరజాణలు ఎవరబ్బా!?’ అని విస్మయం చెందుతూ, ఆ కళాత్మకమైన చిత్రాలలో దైవత్వం ఉట్టి పడడం అతనికి గోచరించి, ‘ఇంతటి నేర్పు మానవ కాంతలకు కలదా! ఏ దేవతో దిగివచ్చి ముంగిట ముగ్గులు పరిచిందా? ఈ మునివాటిక స్త్రీ లెంత నేర్పరులో? ఎవరో తెలుసుకోవాలి’ అని తన మనసులో కౌండిన్యుడు తలపోస్తు కుటీరంలోనికి అడుగుపెట్టాడు. ఇంతలో కొందరు తాపసులు కౌండిన్యుని దరిజేరి ప్రణమిల్లి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజన సదుపాయం చేయనారంభిస్తూ, “ఆర్యా! మీ రాక వల్ల ముని ప్రాంగణం పావనమైంది. మహిత వాక్కులు కొన్ని మాకు వినిపించి మమ్ములను పావనం చేయరాదా! మీరెఱిగిన విషయాలను మాకు శ్రవణం చేయనీయండి. మా జన్మలు సార్థకమవుతాయి.” అని ప్రార్థించగా..
“ఓ ముని శ్రేష్ఠులారా! నేను వయసున మీకన్నా చిన్నవాడిని. బ్రహ్మచారిని. నా ఈ పిన్నవయసులో నే తెలుసుకొన్నది ఆల్పము. మీరు జ్ఞాన వృద్ధులు. వయోవృద్ధులు. అనుభవజ్ఞులు. ఈ అల్పుని కడ మీరు తెలుసు కొనగోరినన్ని విషయాలేవున్నాయో – నాకెఱుకపడడంలేదు” అని సవినయంగా మనవి చేసుకొన్నాడు కౌండిన్యుడు. అప్పుడు ఒక ముని లేచి “ఎంతవాడికైనా ఏదో ఒక గొప్ప విద్య అబ్బి వుంటుంది. మీరు భగవంతుని వరప్రసాదంగా అవతరించిన ఋషీశ్వరులు. అత్రిమహాముని మానస పుత్రులని, లోకానికే విదితమైన విషయం కదా! మానవుల ఈతి బాధలను కఱువు కాటకాలను, రోగాలను నివారించడానికే మిమ్ములను సృజించారు. ఆ అత్రిమహాముని భూమిపై అనేక ఔషదులను సృష్టించి వాటిని వైద్యంలో ఎలా ఉపయోగించుకోవాలో బోధించి పంపారు. ఆ విషయాలను మాకు సవిస్తరంగా తెలియజేసి పుణ్యం గట్టుకొనుడు” అని వేడగా, కౌండిన్యుడు సంతసించి వరుసగా ఏడు దినములు ఆ విషయాలను పూస పుచ్చినట్లుగా బోధించాడు. వారందరు ఆ విషయాలను తమ తమ తాళపత్రాలలో నిక్షిప్తం చేసుకొని భవిష్యత్తుకు అందించే కృషి చేసారు.
***
నిత్యము నదీ స్నానము ముగించుకొని వచ్చే వేళకు ముందే తన పర్ణశాల ముందు సుందర రంగవల్లులుండడం చూచి సంతోషపడ్డాడు కౌండిన్యుడు. కుటీరంలోనికెళ్లగానే దేవతార్చనకు అవసరమైన వస్తు సామాగ్రి సమస్తము సిద్ధం చేసివున్నాయి. ఎవరీ ఏర్పాట్లన్నీ చేస్తున్నారో? తెలుసుకోవాలనుకున్నాడు.
ఓ వేకువజామున పర్ణశాల వెనుక దాగి జరగబోయేదేవిటో కనిపెట్టాలనుకొన్నాడు. మయూరంలా నడచి వచ్చిన ఓ యువ వయ్యారి చేతిలో వివిధ వర్ణములు గలిగిన పాత్రలను పట్టుకొని పర్ణశాల ముందు కొచ్చింది. ఆమె ఓ అప్సరసలా వుంది. ఏ అలంకార భూషణాలు లేకపోయినా, ఎంతో అందంగా వుంది. ఆ మిటారి కన్నులు మీనాలను మరిపిస్తున్నాయి. ఆమె చేతి గాజులు, కాలికున్న గజ్జెలు ఆమె నడకకు తాళం వేస్తున్నాయి. ఆ చేతులు వయ్యారంగా త్రిప్పుతూ అతి చాకచక్యంగా ముగ్గు వేస్తూ వుంది. ఆ హస్తలాఘవం, ఆ నైపుణ్యం, ఆ ఏకాగ్రత ఏ చిత్రకారునికి లేదనే చెప్పవచ్చు. ఆమె నోట మధురంగా కోకిల గీతం శ్రావ్యంగా వినీ వినపించనట్లు వినిపిస్తూ వుంది. ఆమె వయ్యారంగా నడుము త్రిప్పుతూ వంగి ముగ్గుల్లో రంగులు నింపుతూ వుంటే కౌండిన్యుడికి తన మనసును ఎవరో సంతోషంతో నింపుతున్నట్లనిపించింది. విప్పారిన కళ్లతో తదేకంగా ఆమెనే చూస్తున్నాడు.
తదుపరి కుటీరంలోని కెళ్లి పూజా సామాగ్రినంతా చక్కగా సర్దింది. పూజా పుష్పాలు కోయడం కోసం పర్ణశాల చుట్టు వున్న పూల మొక్కల దగ్గరికి పూల సజ్జతో నడిచింది. ఇంతలో కౌండిన్యుడు తానెక్కడ దొరికిపోతానోనని మెల్లమెల్లగా మరుగయ్యాడు. ఆమె ఆ వేళ తాను చేయవలసిన కార్యాలన్నీ ముగించి ఇల్లు చేరింది.
మరుసటిరోజు నదిలో మునివరులందరు స్నానాలు చేస్తున్నారు. గట్టున వున్న కౌండిన్యుడు ఏదో ఆలోచిస్తున్నాడు. ‘ఈ వేళ తన పర్ణశాల ముందు ఆ వనిత ఏ రంగులతో రంగవల్లులు తీర్చివుంటుందో కదా!’ అని ఆలోచిస్తు వున్నాడు. ‘ఆ లావణ్యవతి ఎవరో? ఎవరి కూతురో? వివరాలు తెలుసుకోవడంలో తప్పు లేదు కదా?’ అని తనలో తానే వితర్కించుకొన్నాడు కౌండిన్యుడు.
ఇంతలో నది గట్టున కిలకిలారావాలు. అవి పక్షుల రవళులు కావు. కోమలుల కోకిల గీతాలు, వినసొంపుగా వున్నాయి. కడవలలో నీళ్లు నింపుకొని చంకనెత్తుకొని వస్తున్నారు మహిళలు. వారు ఏదేవో చిలిపిగా మాట్లాడుకొంటూ వినోదంగా ఒకరినొకరు ఎగతాళి చేసుకొంటూ వస్తున్నారు. అందరి ముఖాల్లోను చిరుసిగ్గుతో కూడిన దరహాసం కొట్టొచ్చినట్లు కనబడుతూంది.
“మన చెలి శీలకు తగిన వరుడింకా దొరకలేదేమో? అందుకే తండ్రి సుమంతుల వారి ప్రయత్నసాగడం లేదు.” అంది ఓ చెలి.
“పాపం! ఆయనేం చేస్తాడు. యుక్తవయసొచ్చిన అమ్మాయిని ఎన్నాళ్లని ఇంట్లో కూర్చోపెట్టుకొంటాడు. తగిన వరుని కోసం వెదుకుతూనే వున్నాడు. ఆ పినతల్లి కర్కశ పడనిస్తే కదా!” అంది మరో పెద్దావిడ.
“నిజమేనే! ఆ మారుతల్లి పేరుకు తగిందేలే. తన తమ్ముడికి చేయాలని వుంది. అతడు రాజుగారి దండులో అశ్వశాలాధిపతిగా వున్నాడట.” అంది మరో చెలియ, తనకు తెలిసిన విషయం తెలియపరచింది.
“అశ్వశాలాధిపతా, అశ్వశాల పరిశుభ్రతాధిపతా!” అంటూ ఓ వనిత చమత్కరించగానే అందరూ గొల్లుమన్నారు.
ఆ మాటలు విన్న శీల కోపంతో తన చంకనున్న కడవలోని నీళ్లు తీసి వాళ్ల ముఖాన కొట్టి కోపగించుకొంది.
“నేను అలాంటి సంబంధాలు చేసుకోనే చేసుకోను తెలిసిందా!” అంది కోపంగా శీల.
“అయితే, ఏలాంటి వాడిని చేసుకొంటావమ్మా? నీ రంగు హంగు మెచ్చేవాడినేనా?” అంది మరో వనిత.
“ఇదిగో! ఇలా వదిరితే – మీ జతే వదలించుకొంటాను” అంటూ రుసరుసలాడింది శీల. అందరు కిలకిలా నవ్వుకొంటు పర్ణశాల బాటపట్టారు. ఈ మాటలన్నీ నది గట్టు నున్న కౌండిన్యుడికి వినిపించాయి. ఓ తీయని వార్త వినిపించిన ఆ ముగ్ధ ఎవరాయని చూచాడు. ఆమె ఎవరో కాదు, తన పర్ణశాల ముందు ముగ్గులు తీర్చిన ముద్దరాలేనని తెలుసుకొన్నాడు. వెంటనే నదిలోకి దూకి బుడబుడమని నాల్గు మునకలు వేసి సూర్యుడికి అర్ఘ్యం వదలి చకచక కుటీరం చేరాడు.
***
“సుమంతా! నీ అదృష్టమే అదృష్టమయ్యా! నీవు వెదకబోయిన తీగ కాలికి తగిలిందయ్యా! ఇంకేలాంటి ఆలోచనలు చేయకుండా త్వరగా పని ముగించు” అన్నాడొక మునిశ్రేష్ఠుడు.
“అయ్యా! మీ మాటలు నాకు బోధపడడం లేదు. పని ముగించమంటున్నారు. ఏ పని?” అంటూ అడిగాడు సుమంతుడు ఆశ్చర్యంగా.
“చేత వెన్ననిడుకుని నేతికోసం వెదికినట్లుంది కదా! నీ వ్యవహారం. ఇంట వయసొచ్చిన పిల్లను ఎన్నాళ్లని వుంచుకొంటావు?”
“స్వామి! నాకూ అమ్మాయిని ఒకింటిదాన్ని చేయాలనే వుంది. ఏ అయ్య అయినా దొరకాలి కదా!” అన్నాడు సుమంతుడు.
“దొరకడమేమిటయ్యా! దొరికిపోయి వుంటేను” అన్నాడతడు.
“నాకేం బోధపడలేదయ్యా! వివరంగా చెప్పండి” అన్నాడు సుమంతుడు.
“నిన్నటి ప్రవచన సమయంలో కౌండిన్యులవారు శీల వైపు తదేకంగా పలుసార్లు చూచారయ్యా!! శీల కూడా కన్నులు కలిపింది. అంతేకాదు ఆయన పలువురి ముందు మీ అమ్మాయి ప్రస్తావన తెస్తూ, ‘కుదిరితే వివాహమాడతాను’ అని కూడా అన్నాడట. ఇంకేం నీ రొట్టి ముక్క విరిగి నేతిలో పడిందనుకో!” అన్నాడు అతడు.
“అంత అదృష్టమా మహానుభావా! ఇంతకంటే మరో సంతోషం ఏముంటుంది? నాకు సంపూర్ణంగా ఇష్టమే! ‘శుభశ్య శీఘ్రం’“ అన్నాడు నిండు మనసుతో సుమంతుడు.
సుమంతుడు ఈ వార్తను తన భార్య చెవిలో వేసాడు. ఆమె బుస్సుమని లేచింది. “ఏమిటి! ముక్కు మూసుకొని ఎప్పుడు తపస్సు చేసుకొనే ఆ గడ్డపు స్వామికా నా కూతురునిచ్చేది. నేనొప్పుకోను. అదేం సుఖపడుతుంది? కానికి కొరగాని వానికిచ్చి దాని గొంతుకోస్తావా?” అంటూ అరిచింది.
“ఇప్పుడు మాత్రం అమ్మాయి ఏం సుఖపడుతూ వుంది? ఇంతకంటే యోగ్యుడైన వరుణ్ణి నీవు తేగలవా? జ్ఞాని, తపస్సంపన్నుడు. భగవంతున్ని సాక్షాత్కరింప జేసుకొనగలిగిన సమర్థుడతడు” అన్నాడు సుమంతుడు.
“జోగి జోగి రాచుకొంటే బూడిద గాక మరేం రాలుతుంది. రాజు గారి కొలువులో వున్న వరుణ్ణి వదలి అడవులు దిరిగేవాడు మీకు మంచి వరుడా! నాకే మాత్రం ఇష్టం లేదు. పొండి – మీరు మీ కూతురు ఏ చావన్నా చావండి” అంటూ మండిపడింది కర్కశ.
ఎంతమంది ఎన్నివిధాలా నచ్చజెప్పినా ఆ కర్కశ తన మనసును మార్చుకోలేదు. అందరు సుమంతుడికి ధైర్యం చెప్పి ఓ శుభ ముహూర్తాన మునివాటికల నడుమ, మునులు అందరి సమక్షంలో శీల వివాహం కౌండిన్యుడితో జరిపించాడు.
వివాహానంతరం భార్య శీలతో కౌండిన్యుడు ప్రయాణమయ్యాడు. అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వడంలో కూడా తన అసహాయతను చాటుకోవడం ఇష్టం లేక ఇంటికి వెళ్లి – అల్లుడికేదైనా బహుమానమిచ్చి అమ్మాయిని సాగనంపుదాం, రమ్మని భార్యను కోరాడు. అందుకు “ఇక్కడేమీ మూటగట్టుకొని పెట్టుకోలేదు, ఇవ్వడానికి, ఏమి లేదు, పొండి” అంటూ తలుపులు దబాలున మూసింది కర్మశ. విషణ్ణవదనుడై వచ్చి, పెండ్లికి చేసి మిగిలిన పేలపిండిని దారి భత్యముగా అల్లుడికిచ్చి కంటతడి పెట్టుకొన్నాడు సుమంతుడు. శీల తండ్రిని కౌగిలించుకొని ఏడ్చింది. మునివాటికలోని తోటి వారందరు దుఃఖాక్రాంతులయ్యారు. మునిదంపతులు నూత్న దంపతులను ఆశీర్వదించారు. కౌ౦డిన్యుడు అందరికి ప్రణమిల్లి, శెలవు తీసుకున్నాడు. మునిపత్నులు ఆ దంపతులకు హారతులిచ్చి వీడ్కోలు చెప్పారు. నూత్న దంపతులతో ఆ బండి మరో కొత్తబాటలో నడిచింది. బండి ప్రయాణం సాగిపోతూ వుంది. అనేక మునివాటికలు, జనపదాలు, నదులు, కొండలు, అడవులు దాటిపోతున్నాయి. అక్కడక్కడ విశ్రాంతి కోసం ఆగుతూ వుంది బండి. వీలున్న చోట్ల ఒకటి రెండు రోజులుండి బండి కదులుతూ వుంది.
ఒక రోజు వేకువజామున బండి సాగిపోతు ఓ నది గట్టున ఆగిపోయింది. దంపతులిద్దరు దిగి ఓ వృక్షచ్ఛాయలో కూర్చొన్నారు. బండివాడు బురదలో చిక్కుకొన్న బండి చక్రాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కౌండిన్యుడు నది గట్టున పచార్లు చేస్తున్నాడు, ఎవరైనా సహాయకులు కనబడతారేమోనని. ఎవ్వరూ తారసపడలేదు. దగ్గరి పల్లెలో వున్న మనుషులను తీసుకొని రావడానికి కౌండిన్యుడు వెళ్లాడు. శీల అలా నది గట్టున నడుస్తూ ప్రకృతిని తిలకిస్తూ వుంది. ఒక ప్రదేశానికి రాగానే అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు గుంపులుగా కనిపించాయి ఆవిడకు. ఆ చెట్ల నీడన అప్పటికే చాలా మంది స్త్రీలు చేరివున్నారు. వారంతా నదీస్నానం ముగించి ఎఱ్ఱని వస్త్రాలు కట్టుకొని ఏదో పూజకు సిద్ధమవుతున్నారు. ఎఱ్ఱని పూలను, గంధాక్షతలను, ఎఱ్ఱని తోరాలను సిద్ధం చేసుకొని ఏదో వ్రతం చేయడానికి పూనుకొంటున్నారు. అక్కడికి చేరిన శీల వారందరిని చూచి, “అక్కలారా! మీరే దేవుణ్ణి పూజించడానికి సిద్ధపడుతున్నారు! ఆ దేవుడెవరు?” అని అడిగింది. అందుకు ఓ వనిత,
“సోదరీ! మేమీ నదిగట్టున ప్రతి సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభస్వామి వ్రతమును ఆచరించి, పదునాలుగు ముడులుగల ఎఱ్ఱని తోరమును కట్టుకొందుము. ఇది స్త్రీలకేకాక పురుషులకు కూడా సౌభాగ్యమును కలిగిస్తుంది” అని ఓ పండు ముత్తైదువు చెప్పగా, శీల “ఓ తల్లీ! నేను సహితము ఈ వత్రమును ఆచరింపదలచితిని, నాకున్న అవకాశము కలిగింతురా?” అని వేడెను.
“అభ్యంతరము లేదు. నదీస్నాన మాచరించి శుచివై రమ్ము” అని ఆవిడ తెలపగానే శీల వ్రతమాచరించడానికి సిద్ధమైంది.
పురోహితులవారు దర్భతో అనంతపద్మనాభస్వామిని సప్త ఫణీంద్రుడిగా ఓనర్చి కలశమునందుంచి,
శ్లో.:
కృత్వాదర్భ మయం దేవం। శ్వేతద్వీపే స్థితం హరిం।
సమన్వితం సప్తపణైః। పింగళాక్షం చతుర్భజం।
అను శ్లోకము చెప్పి ఆవాహన మొనర్చి, కల్పోక్త ప్రకారంగా షోడశోపచార పూజలు చేయించాడు. తదుపరి పదునాలుగు ముడులు గల ఎఱ్ఱ తోరములను గట్టుకొనుడని పురోహితుడు చెప్పగా అందరు స్త్రీలు తోరములను తమ మెడలో ధరించి స్వామికి నమస్కరించి, బ్రాహ్మణులకు వాయన దానములు ఇచ్చిరి. శీల తాను దారి భత్యమునకై తెచ్చిన పేలపిండిని బ్రాహ్మణున కిచ్చి భక్తితో నమస్కరించి, తోరమును మెడలో ధరించి, తమ దాంపత్య జీవితము చక్కగా కొనసాగించమని ప్రార్థించింది.
పురోహితుడు అనంత వ్రతకథను వారికి వినిపించి పదునాలుగు వత్సరాలు విడువక ఈ వ్రతమును ఆచరించిన వారు దైవసాన్నిధ్యము, పుణ్యలోక ప్రాప్తిని పొందుదురని వ్రతఫల శ్రుతిని వినిపించెను. వనితలందరూ వ్రతమును సంపూర్ణము గావించి తమ తమ గృహలకు వెళ్లిరి. శీల కూడ వ్రతానంతరం భర్తను చేరెను. కొందరు గ్రామస్థుల సహాయంతో బండి బురద గుంత నుండి లేచింది. వారందరికి క్రతజ్ఞతలు తెలుపుతూ కౌ౦డిన్యుడు వారికి ఒక మొక్కనిచ్చి,
“దీనిని పెంచి వ్యాప్తి చేయుడు. దీనినుండి ప్రవించు ద్రవము అమృతము. సేవించి ఆరోగ్యవంతులు కండి. ఇది మీ పాలిట కల్పవృక్షము. ఈ ద్రవాన్ని నిలువ వుంచకండి. ‘ఆలస్యం అమృతం విషం’, కాన నా బోధన విని అభివృద్ధి కండి” అని ఆశీర్వదించాడు. వారా ఈత మొక్కను కళ్లకద్దుకొని “ఇది మా ఇంటి పెరటి చెట్టు స్వామి! దైవంగా పూజిస్తాం” అని చేతులెత్తి మ్రొక్కి సంతోషంగా వెళ్లారు.
***
బండి మరో రెండు రోజులు ప్రయాణానంతరం ఒక పెద్ద మునివాటిక దరి చేరింది. కౌండిన్యుడు బండి దిగి ఆ ప్రదేశాన్ని పరిశీలించాడు. ఆ వాతావరణం తనకు తగినదిగా వుందని భావించి అక్కడ వాసం ఏర్పాటు చేసుకొన్నాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు కౌండిన్యుడు తన భార్య మెడలో వేలాడుతున్న ఎర్రని దారాన్ని చూసి, అనుమానించి, “శీల! నీవా ఎరుపు దారాన్ని ధరించావెందుకు? నన్ను కాదని మరొకరిని వశపరచుకోవడానికా?” అని హేళన చేసాడు.
“ఎంత పొరబాటు పడ్డారండి! అది సర్వాంతర్యామిగా వ్యాపించివున్న ఆ అనంతుణ్ణి ధరించి వున్నాను. అతడు కాలస్వరూపుడు.” అంది శీల.
“కాలస్వరూపుడా, అకాలపురుషుడా, పరపురుషుడా? ఎవడు వాడు?” అంటూ అకారణంగా మండిపడ్డాడు కౌండిన్యుడు.
“అపచారం, అపచారం, పాపం శమించుగాక! ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. మన కష్టాలను తొలగించే ఆపద్భాందవుడు” అంటూ ఆ తోరాన్ని కళ్లకద్దుకొంది శీల.
“అనంతుడనేవాడు దైవంగా గణింపబడడం నేనెక్కడా వినలేదు. ఏ పురాణాలలోను లేదు. అతన్ని పూజించినవాడు లేడు. ఏ లోకంలోను కాన రాలేదు. అతడొక దేవుడు – దాన్ని నేను నమ్మితీరాలి. నీ అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వం నాకు నవ్వు తెప్పిస్తూ వుంది శీల! ముందా ఎర్రని సూత్రాన్ని తెంచు, లేదా నేనే ఆ పని చేసి తీరుతాను. తెలిసిందా!” అని ముందుకొచ్చాడు కోపంగా.
“వద్దండి! పాపం మూట గట్టుకోకండి. మీ పాదాలకు నమస్కరిస్తాను.” అని ఎంతగానో రోదించినా, కౌండిన్యుడు వినక దరిజేరి ఆమె మెడ లోని ఆ అనంత దారాన్ని తెంచి హోమగుండంలోకి వేసాడు.
“అయ్యో! ఎంత పని చేసారండి.” అంటూ ఆమె ఆ గుండంలో పడిన తోరాన్ని వెంటనే తీసి పాలలో తడిపి పెట్టింది.
“జాగ్రత్త! ఆ ఎర్రదారం నీ మెడలో కనిపించిందో, నాకు పిచ్చికోపం వచ్చేస్తుంది, నేను నీకు దూరమవుతాను” అంటూ కోపంగా శీలపై మండిపడ్డాడు కౌండిన్యుడు.
తన భర్తలో దైవం పైన ఈ ద్వేషం రావడానికి ఏమి కారణమో! అర్థంకాలేదు శీలకు. దుఃఖముతో వెక్కివెక్కి ఏడ్చింది.
కాలచక్రం గుర్రున తిరుగుతూ వుంది. ఆ కాలం తెచ్చే మార్పుల్ని ఎవరు ఆపలేరు. ఆ మార్పు మంచిదయినా, చెడుదయినా ఆహ్వానించవలసిందే! శీల ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించసాగింది. అందరి రోగాలను మాన్పగలిగిన కౌండిన్యుడు తన భార్య ఆరోగ్యాన్ని కాపాడలేకపోయాడు. ఎన్ని రకాలైన మూలికలు దెచ్చి కొత్త కొత్తగా మందులు తయారు చేసి ఇచ్చినా రోగం నయం కావడం లేదు.
ఇంతలోనే ఓ గోపాలుడు కుటీరం దగ్గరికొచ్చి, “అయ్యా! అడవిలో మేస్తున్న మన గోవుల్ని దొంగలు తోలుకెళ్లి నారయ్యా! ఆ దొంగల గుంపు నన్ను చావగొట్టిందయ్యా!” అంటూ ఏడ్చాడు వాడు.
“ఏమీ వింత? ఒకటి కాదు రెండు కాదు. నా వంద గోవుల సంపద దొంగల పాలైందా?” అంటూ వాపోయాడు కౌండిన్యుడు.
మరో రోజు ఒక పెద్ద గుంపు పర్ణశాల ముందు నిలబడి, పెద్దగా కేకలు పెట్టసాగింది. కౌండిన్యుడు బయటకొచ్చి “ఏమిరా విషయం” అని అడగగానే, “అయ్యా! మీరిచ్చిన మందు వికటించింది. రోగంతో బాటు పిల్లల ప్రాణాలు కూడా పోయాయి. మీ వైద్యం కొంపముంచింది. మీరు చేస్తున్నది వైద్యమా? ప్రాణాంతక వైద్యమా?” అని అతన్ని చుట్టుముట్టి కొట్టబోయారు. ఇంతలో అక్కడున్న మునిగణం అడ్డుపడి వారిని సమాధానపరచి, కౌండిన్యుని వారి బారి నుండి కాపాడారు. కౌండిన్యుడు తలపట్టుకొని కూర్చొన్నాడు ‘ఏమీ అపవాదు?’ అని.
మరో వారం ఇంట దొంగలు పడి దాచుకొన్న సొమ్మును, ధాన్యాన్ని దోచుకపోయారు. మరో వారం ఉన్నదున్నట్లుగానే తన పర్ణశాల అగ్నికి ఆహుతైంది. కౌండిన్యుడు భార్యతో ఎట్లో బయటపడ్డాడు. ఆలోచించి ఆలోచించి పిచ్చివాడయ్యాడు. ఏమీ వైపరీత్యము? ఎందుకీ బాధలు? ఎందుకీ చేటు? ఎందుకీ అపవాదులు? ఈ ప్రశ్నలన్నీ విస్మయం కలిగిస్తున్నాయి అతనికి. ఆ వెర్రి ఆలోచనలతో అడవిదారి పడ్డాడు.
“అనంతుడెవరు? అతని ఎడ నే చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకోవాలి. ఆయనెక్కడున్నాడు? ఎలావుంటాడు?” అంటూ తీవ్రమైన అన్వేషణలో అడవులు తిరగడం ప్రారంభించాడు కౌండిన్యుడు.
అన్నపానాదులు వదిలాడు. నిద్రకు దూరమయ్యాడు. కాలినడకతో సుదూర ప్రాంతాలు చేరుకొంటున్నాడు. నీరసించిన కళ్లు బైర్లుకమ్మాయి, అలాగే తన ప్రయాణాన్ని సాగిస్తూనే వున్నాడు. శరీరం శుష్కించింది. గడ్డం పెరిగి పోయింది. జుట్టు మాసింది. కట్టుకొన్న వస్త్రాలు జీర్ణమయ్యాయి. “అనంతా! అనంతా ఎవరయ్యా నీవు? ఎక్కడుంటావయ్యా! నీ యెడ నే చేసిన పాపానికి నాకింతగా శిక్షా? కనిపించవేమయ్యా! నీ గురించి నేనెవరినడగను? నిన్నెప్పుడు దర్శించగలను? నీవే తప్ప నాకింకెవరు దిక్కు?” అంటూ పలువిధాలుగా ఆవేదన చెందుతూ, విలపిస్తూ నడిచిపోతున్న కౌండిన్యుడికి ఎదురు పడిన ప్రతి ప్రాణిని, చెట్టును, పుట్టను, కొలనును పశుపక్ష్యాదులను “మీరు అనంతుని చూచితిరా?” అని అడుగుతూ, వారు “ఆ అనంతుడెవరో మాకు తెలియదు” అని చెప్పగానే చింతాక్రాంతుడై త్రోవలో ఒకచోట మూర్ఛపోయాడు.
అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కౌండిన్యుని కడకు చేరి, “ఓ విప్రోత్తమా! లే!” అంటూ అతన్ని తాకి, మూర్ఛ నుండి లేపాడు. ఆ దివ్య స్పర్శతో కౌండిన్యునికి వేయి ఏనుగుల బలం వచ్చింది. ఆ ముసలివాడిని చూచి విస్మయమొందాడు. ఆ ముదుసలి..
“నాయనా! నా వెంట రమ్ము” అని అతన్ని తన గృహానికి తోడ్కోని పోయెను. ఆ గృహము నవరత్న మణిగణ ఖచితముగా నిర్మింపబడి వుంది. కౌండిన్యుడిని ఒక రత్నాఖచిత సింహాసనముపై కూర్చొండబెట్టి, పరిచర్యలు చేసి భోజ్య పదార్థాలనిచ్చి సేదదీర్చాడు ఆ వృద్ధుడు. అతని సేవలకు ముగ్ధుడైన కౌండిన్యుడు,
“ఓ వృద్ధ మహానుభావా! మీరెవరు?” అని ప్రశ్నించగా.
“నిన్నాదుకొన్న మనిషిని” అన్నాడతడు..
“అయ్యా! నన్నెందుకు ఆదుకొన్నారు? నేనొక పాపిని. అనంతుడను స్వామికి ద్రోహము తలపెట్టిన వాడిని. ఆ అనంత పరమాత్ముణ్ణి అన్వేషించి, క్షమాపణ కోరు ప్రయత్నంలో వున్నవాడిని” అన్నాడు కౌండిన్యుడు.
“నీ అన్వేషణ ముగిసిందా? నీ సందేహం తీరిందా?”
“తీరలేదు స్వామి! అనంతుడెవరో తెలియదన్నారు. అతన్ని చూడలేదన్నారు.” అన్నాడు కౌండిన్యుడు.
“నీవు ప్రశ్నించిన జీవరాశులన్నీ ప్రకృతిలో భాగాలే కదా”
“అవును స్వామి!”
“ఈ ప్రకృతినంతా ఎవరు సృష్టించారు?”
“భగవంతుడు.”
“ఆ భగవంతుడు ప్రకృతిలో లేడా?”
“ఉన్నాడు స్వామి!”
“ఉంటే, మరెందుకు వాటిని ప్రశ్నించావు?”
“అంటే ఆ జంతు, వృక్షజాలములన్నీ భగవంతుని రూపాలేనా?”
“కాక మరేమనుకొన్నావు, అజ్ఞాని! నీవు ప్రజల రోగాలను బాపడానికి మందులిస్తున్నావు కదా! ఆ మూలికలన్నీ ప్రకృతిలోనివి కాదా? ఆ ప్రకృతే పరమాత్మగా భావించలేక పోయావు కదా!”
“అవునయ్యా! నేనెంతటి మూర్ఖుడనో ఇప్పుడర్థమైంది. నేనా తత్త్వాన్ని మరచాను.”
“అది నీ అహంభావం. అవివేకం. ఏ పని చేసినా చెల్లుతుంది లే అన్న పొగరు. భగవన్నామ స్మరణతో చేయాలనే నమ్మకం లేనివాడివి నీవు. ‘శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే, ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః’ అనే మంత్రాన్ని నీవెప్పుడైనా స్మరించావా? స్మరించి వైద్యం చేసావా? లేదు కదా!”
“అవును స్వామి! నిజం. అన్ని విధాలా నేను పాపం చేసినవాడిని, నాకు ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి. మీరు నా కళ్ళు తెరిపించారు. మీ మాటలతో నాలోని గాఢ అజ్ఞానాంధకారము పటాపంచలైంది. శరణు, శరణు మహాత్మ – శరణు శరణు. ఈ అనంత విశ్వంలో సృజింపబడినవన్నీ పరమాత్మ స్వరూపాలేనని గ్రహించాను. కానీ నే ప్రశ్నించిన జీవజాలమేమి సరైన సమాధాన మివ్వలేక పోయాయి. కారణమేమి స్వామి!్” అన్నాడు కౌండిన్యుడు.
“ఓ అజ్ఞానీ! చెబుతున్నాను. తెలుసుకో. సకల విధులు తెలిసిన పండితుడొకడు గర్వంతో ఎవ్వరికినీ తన విధులు నేర్పకపోవడంతో అతడు ఎవరికీ ఉపయోగపడని మామిడి చెట్టుగాను, అన్నదానం చేయని వాడు పశువుగాను, చవిటి భూమిని దానం చేసిన రాజు వృషభంగాను, ఆ రెండు కొలనులు ధర్మ, అధర్మములకు ప్రతీకలుగాను, ఆ గాడిదగా పుట్టినవాడు సర్వదా సర్వులను దూషించినవాడును, ఆ ఏనుగుగా పుట్టినవాడు తమ పెద్దలు చేసిన దానధర్మాలను తానే విక్రయించి ధనాన్ని వెనకేసుకొన్నవాడును. అందుకే వారికి అనంతుడెవడో తెలియదు. వారు చూడలేదు. వారు పాపాత్ములు. తదుపరి వృద్ధ బ్రాహ్మణరూపంలో వచ్చి నిన్నాదుకొన్నవాడే ఈ ‘అనంతుడు’.” అని చెప్పగానే ఆనందబాష్పాలు రాలుస్తూ సాగిలబడగానే, ఆ వృద్దుడు శంఖు చక్రగదాధారుడై పీతాంబరధారియై, రత్నఖచిత వైడూర్య మరకత మాణిక్య శోభిత కిరీటధారియై ప్రత్ర్యక్షము కాగానే. కౌండిన్యుడు
“నమో నమస్తే! వైకుంఠ, శ్రీవత్స శుభలాంచన
త్వన్నామం స్మరణాత్పాపమశేషం నః ప్రణశ్యతి
నమో నమస్తే! గోవిందా నారాయణణా జనార్దనా!”
అని అనేక విధాలుగా స్తోత్రం చేసి “నా దారిద్ర్యమును బాపి అంత్యకాలమున విష్ణులోక ప్రాప్తి జేయుమయ్యా! అనంతా!!” అని చేతులెత్తి నమస్కరించాడు.
“కౌండిన్యా, నీవు కారణజన్ముడవు. నీ వల్ల లోకోపకారం జరగవలసివున్నది. నీవు భార్యాబిడ్డలతో ఇహలోక సుఖములంది, పదునాలుగు సంవత్సరములు వరుసగా ఈ అనంతవ్రతమును నిర్వహించి కైవల్యపదమును పొందుము. నీ ఈ కథే అనంత వ్రత కథగా భూలోకంలో వ్యాప్తి చెందగలదు.” అని ఆశీర్వదించి అనంత పద్మనాభస్వామి అంతర్ధానమయ్యాడు.
కౌండిన్యుడు ఇల్లు చేరగానే, శీల ఆరోగ్యవంతురాలై – భర్తను ఎదుర్కొని సంతోష భరితురాలైంది. ఆనాటి నుండి సకల సంపదలు కౌండిన్యునికి చేకూరినాయి. తదుపరి కౌండిన్యుడు ‘ప్రకృతే పరమాత్మ’గా ధ్యానించండని బోధిస్తూ, దైవసాన్నిధ్యం చేరేంతవరకు అనంతవ్రతం చేస్తూ ఆదర్శప్రాయుడయ్యాడు.
