[శ్రీ మాచుపల్లె గంగిరెడ్డి రచించిన ‘ప్రకృతి మనసు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
☘️అవును నేను నిదానమే కానీ నా ప్రతి అడుగులో
ఆత్మీయత అనే మొక్కకు నీరు పోస్తుంటానే తప్ప
అనురాగం ఆత్మీయత లేని సమాజం నాకు వద్దంటుంది
నా మనసు (ప్రకృతి).
☘️అవును నేను నిదానమే కానీ నా ప్రతి మలుపులో ఎన్నో
జీవిత అనుభవాలు
నన్ను పలకరిస్తూనే ఉంటాయి
అనవసరమైన మలుపులు తీసుకొని హడావిడి
గాబరా పడే ప్రపంచంలోకి వెళ్లొద్దు అంటుంది నా మనసు..
☘️అవును నేను నిదానమే కానీ నా మనసు ఎప్పుడూ
మనుషుల మధ్య ఉండాలని
కాసేపైనా మనసు విప్పి మాట్లాడాలనే
చిగురుటాకు లాంటి ఆశ
ఎదురు చూస్తూనే ఉంటుంది
ఆ దిశగా ఎదుగుతూనే ఉంటుంది..
☘️అవును నేను నిదానమే కానీ
నాలో ఎప్పుడో స్వార్థం అనే కుంపటి కానరాదు
ఎందుకంటే అది కానరానంత
కటిక చీకటి ఉన్న సముద్రపు లోతుల్లో
పాతిపెట్టి ఉంటుందని దానికి తెలుసు.
☘️అవును నేను నిదానమే కానీ
నా ప్రతి ఆలోచనలలో
నా వల్ల ఎవరూ బాధపడకూడదు అని
నష్టపోకూడదని కష్టాలు పడరాదనే ఆలోచన దీపం
ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది
☘️అవును నేను నిదానమే కానీ
కల్లాకపటం లేకుండా
గాలిపటంలా స్వేచ్ఛగా
ప్రకృతి సన్నిధిలో పరవశించాలని
పరితపిస్తుంటుంది నా మనసు.
☘️అవును నేను నిదానమే కానీ
కుట్రలు కుతంత్రాలు లేని ప్రకృతి
ప్రపంచం నాది..
కలుషితం కల్మషం లేని పారదర్శక
ప్రపంచం నాది..
☘️అవును నేను నిదానమే కానీ
అంతులేని సంపద కన్నా
ఆధ్యాత్మిక ప్రపంచం వైపే
నా గమనం నా గమ్యం అంటుంది నా మనసు.
☘️అవును నేను నిదానమే
కానీ గ్రూపు రాజకీయాలతో
వెన్న పూసిన కత్తుల లాంటి
మాటలతో పని లేకుండా
పద ముందుకి అంటుంది నా ప్రతి అడుగు
☘️అవును నేను నిదానమే కానీ
కులం, వర్గం, మతం లాంటి
మత్తు మందుకు దూరంగా ఉంటూ
స్వచ్ఛమైన ప్రపంచానికే నా పరుగు అంటుంది నా మనసు..
☘️అవును నేను నిదానమే కానీ
వేగవంతమైన జనరేషన్ లాగా పరుగులు తీయలేను .
ఎందుకంటే ఏదైనా నిర్మూలించడం సులభము
కాని నిర్మించడం చాలా కష్టమనీ నా మనసుకు తెలుసు.
అందుకే నా పయనం ఎప్పుడు నిదానం వైపే
నా మనసు ఎప్పుడూ ఆధ్యాత్మిక వైపే
ఎందుకంటే నా పుట్టినిల్లు ప్రకృతి గనుక
అందుకేనా గమ్యం ఎప్పుడు నా (ప్రకృతి) వైపే..
