Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతికి కోపం వచ్చింది

[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ గారి ‘ప్రకృతికి కోపం వచ్చింది’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రకృతికి కోపం వచ్చింది.

అవును తీవ్ర రూపం దాల్చింది.

ఆకాశం, భూమి, గాలి, నీరు కలిసి అగ్నిదేవుణ్ణి నాయకత్వంలో మానవుని మీద దాడిచేయమని పంపేరు.

2026 సంవత్సరం, జూన్ నెల, మృగశిర కార్తె ప్రవేశం. మనం సంబరాలు చేసుకొన్నాము. వానలు కురుస్తాయి. ఏరువాక పున్నమికి రైతన్న నాగలి చేత పూని, పొలాలన్నీ సిద్ధం చేస్తాడు. విత్తనాలు చల్లుతారు.

ఏదీ – అన్నీ ఎదురు చూపులే – వానలు లేవు.

గ్రీష్మ ఋతువు వెనక పడి వర్ష ఋతువు వచ్చింది. శ్రావణం ఇంకా కొద్దీ రోజుల్లో సరి – వాన జాడ లేదు. వరుణ జపాలు చేసేరు. దేవతలు మన మొర వినలేదు. మానవునికి మొండి చెయ్యి!

చరిత్ర పుటల్లోకి వెళ్తే ప్రకృతికి కోపం వచ్చినప్పుడల్లా మనకు బుధ్ధి చెప్తోంది. అయినా ఫలితం శూన్యం. మనతో పాటు నోరులేని పశువులు, పక్షులు, నీటి కోసం ఏడుస్తున్నాయి. వృక్షాలు, చెట్లు ఎండిపోతున్నాయి.

వాతావరణ శాఖ ఈ మధ్య ఒక హెచ్చరిక చేసింది. 2027 ఫిబ్రవరి నెల వరకూ ఇంతే – వానలు పడవు.

పూర్వం పెద్దలు చెప్పినట్లు “మనిషి పక్షిలా ఎగరడం నేర్చేడు. చేపలా ఈదడం నేర్చెడు. కానీ మనిషిలా భూమిపై అడుగులు వెయ్యలేక పోతున్నాడు.”

ఈసారి ఈ కరువు మనం చేతులారా చేసికొన్నదేనండి. మనిషి దురాశకి అంతూ, దరి లేదు.

భూమి పైనున్న జల వనరులే కాక, భూగర్భ జలాలు తోడి పారేస్తున్నాడు. గుంతలు పది పోతున్నాయి. బోరులు ఎండిపోతూంటే ఇంకా కిందకు దింపుతున్నాడు.

ప్లాస్టిక్ పెనుభూతాన్ని విపరీతంగా వాడుతున్నాడు. చేతులు ఊగించుకుంటూ బజారు వెళ్తాడు. ప్లాస్టిక్ సంచీల్లో సరుకులు, కూరగాయలు తెస్తాడు. వాటిని అలా వీధిలో పడేస్తాడు. వీధుల్లో, మురుగు కాలువల్లో అవి పేరుకొంటున్నాయి. ప్లాస్టిక్ సంచుల్లోని కూర, అన్నంకు ఆశపడి తినిన పశువుల గర్భంలోంచి కిలోల కొద్దీ ప్లాస్టిక్ పదార్థాలు బయట పడుతున్నాయి.

పంట కాలువలు, నదులు, సముద్రాలు – అన్నింటా ప్లాస్టిక్ మహమ్మారీలా వ్యాపించి కాలుష్యం చేస్తున్నాయి,

ఫలితం ఏమిటి?

ఈలోగా వాతావరణ   కాలుష్యం. A/cలు వాడిన కర్బనం గాలిలో మెండుకొంది. మొక్కలకు  ఇది ప్రాణాంతకం.

చిన్న ఇల్లు కట్టుకొని బ్రతుకుట లేదు. అపార్టుమెంట్లు కడుతున్నారు. ప్రతి ఫ్లాట్ వారికి బోరింగ్ నీరు అందివ్వాలి. దానికి నెలకు సొమ్ములు వసూలు చేస్తారు కదా! అందుకోసం ఇంకా ఇష్టానుసారంగా నీళ్లు వాడేస్తున్నారు. కుళాయి కట్టరు. వాషింగ్ మిషన్లు! అవి జోరు.

పరిస్థితికి విరుగుడు వుందా!

మనమే – సామూహికంగా – తలచుకొని – కొన్ని నిర్ణయాలు తీసికోవాలి.

  1. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి – గుడ్డ సంచీలు వాడాలి.
  2. వాషింగ్ మిషన్లు ఆపి మామూలుగా బట్టలు ఉతకాలి – నీటి ఖర్చు తగ్గుతుంది.
  3. ప్రతి ఇంటికి మీటరు పెట్టి నీటి వాడకానికి తగిన పన్ను వసూలు చెయ్యాలి.
  4. దగ్గరలో వున్న పార్కుకు నడచి వెళ్ళాలి. స్వచ్ఛమైన గాలితో పాటు వ్యాయామం!
  5. ప్రతి నీటి బొట్టూ వడిసి పట్టాలి. బట్టలు తడిపిన నీరు, కూరగాయలు కడిగిన నీరు, A/c లోంచి వచ్చిన నీరు – అన్నీ జాగ్రత్తగా మొక్కలలో పొయ్యాలి.
  6. మొక్కలు పెంచాలి. కుండీలలో అయినా సరే – పెంచాలి.
  7. గాలి, వెలుతురు ఇంట్లోకి ప్రవేశించేలాగ కిటికీలు, తలుపులు తెరవాలి. సూర్యరశ్మికి క్రిములు నశించి ఆరోగ్యముగా ఉంటాము.
  8. కుటుంబంలోని సభ్యులందరూ ఈ విషయం చర్చించుకొని చర్యలు తీసికొనాలి.
  9. వీధిలో ఎదురుపడిన వారితో కూడా అవసరమైతే చర్చించాలి – పర్యావరణ సంరక్షణ ఒక జన ఆందోళనగా మారాలి.

ఇది ఒక అత్యవసర పరిస్థితి – మానవా – మేలుకో!!

Exit mobile version