[భారతదేశపు ఈశాన్యరాష్ట్రాలలో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు శ్రీ షేక్ అమీర్ బాష.]
ఏప్రిల్ నెల గ్రీష్మ తాపానికి దూరంగా చల్లటి ప్రకృతి ఒడిలో సేదతీరాలని అందానికి ఆలవాలమైన ఈశాన్య రాష్ట్రాలకు పయనమైనాము.
ఈశాన్య భారతదేశం ప్రకృతి అందాలకే కాక సంస్కృతుల సవ్వడి కలిసిన అద్భుత ప్రపంచం. ఆ ప్రపంచంలో మా ప్రయాణం – అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో సాగింది. అద్భుతమైన ఒక కలలాంటి ఆ అనుభూతులను ఈ ప్రయాణ కథనంలో మీతో పంచుకుంటున్నాను.
వీణా వరల్డ్ (Veena World) అనే పర్యాటక సంస్థ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కొరకు నిర్వహించిన 12 రోజుల పర్యటన ఇది. టూర్ ప్యాకేజ్ ఒక్కొక్కరికి విమాన చార్జీలతో కలిపి 1,07,000 రూపాయలు.
నాలుగవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గౌహతి విమానాశ్రయంలో దిగిన మాకు పర్యటన నిర్వాహకులు శ్రీయుతులు అమె నాగ్వేకర్ (Amay Nagvekar), అధర్వ కట్కర్ (Atharv Katkar) స్వాగతం పలికారు. గౌహతి విమానాశ్రయం నుంచి 170 కిలోమీటర్లు కారులో ప్రయాణం చేసి మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ చేరుకున్నాము. నీలి మేఘాలు, పచ్చటి కొండ వరుసలు, దట్టమైన అడవులు, పాలధారలా కొండలపై నుంచి జాలువారే జలపాతాలు, బ్రహ్మపుత్రా నది తీరాలు, వీటి గుండా చల్లటి వాతావరణంలో మా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది.
కొండల మధ్య ఉన్న ఈ నగరాన్ని ‘ఈశాన్య భారతదేశపు స్కాట్లాండ్’ అంటారు. షిల్లాంగ్ సమీపంలోని ఉమియం సరస్సు (Umiam Lake) సూర్యకిరణాల్లో వెండి తళుకులు మెరిపించింది. నగరం నడిబొడ్డున ఉన్న పోలో టవర్స్ హోటల్లో మా బస ఏర్పాటు చేశారు.
మరుసటి రోజు ‘మావ్లిన్నాంగ్’ గ్రామంలో పర్యటించాము. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం షిల్లాంగ్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో భారత–బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉంది. ‘God’s Own Garden’ అని పిలువబడే ఈ గ్రామం ప్రకృతి సౌందర్యం, ఖాసీ తెగ సంస్కృతి, సహజ వంతెనలతో ప్రత్యేకతను సంతరించుకున్నది.
ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్లతో ఏర్పడిన సహజ వంతెన ‘Nohwet Living Root Bridge’ ప్రకృతి–మానవ సహకారానికి అద్భుత ఉదాహరణ. వింతైన ఈ వంతెన మీద నడవడం ఓ ప్రత్యేక అనుభూతి. ఈ గ్రామంలో ఉన్న ‘బ్యాలెన్సింగ్ రాక్’ ప్రత్యేక భౌగోళిక అద్భుతం. అన్నిటికీ మించి అందీ అందనట్టు పయనించే నీలి మేఘాలు, సొగసైన జలపాతాలు, రంగురంగుల పూ తోటలు, చల్లటి గాలి స్వర్గాన్ని తలపిస్తాయి.
గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రమైన అత్యంత పురాతనమైన ‘Church of the Epiphany’ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
పర్యావరణానికి అనుకూలంగా, శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే గ్రామ ప్రజలు పర్యాటకులను ఆత్మీయంగా ఆహ్వానిస్తారు. మావ్లిన్నాంగ్ గ్రామం సందర్శకులకు శుభ్రత, ప్రకృతి పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై ఒక ప్రేరణత్మక పాఠం నేర్పుతుంది.
ఈ గ్రామం నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి ‘దావుకి’ (Dawki) నదిలో పడవ ప్రయాణానికి వెళ్ళాము. ఇది మేఘాలయలోని ఇండియా-బాంగ్లాదేశ్ సరిహద్దు దగ్గరగా ఉన్న ఓ అద్భుతమైన నది. ఈ నది తన పారదర్శకమైన నీటితో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ నదిలో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండటం వల్ల, పడవలు నీటి మీద కాకుండా గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తాయి. నదిలో అడుగుభాగం స్పష్టంగా కనిపించడం ఒక విశేషం.
మూడవరోజు ‘చెర్రపుంజి’ చేరాము. ఈ ప్రదేశాన్ని’సోహరా’ అని కూడా పిలుస్తారు.
చెర్రపుంజి ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ సంవత్సరమంతా వర్షాలు పడుతుంటాయి. చల్లటి వర్షపు చినుకులు మనసును గిలిగింతలు పెట్టాయి. చినుకులతోపాటు పొగమంచు రూపంలో దట్టమైన మేఘాలు మమ్మల్ని కమ్ముకుని పరవశపరిచాయి.
చెర్రాపుంజిలో అనేక అందమైన జలపాతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఎలిఫెంట్ ఫాల్స్, సెవెన్ సిస్టర్స్ ఫాల్స్, నోకాలికై ఫాల్స్.
నొకాలికై ఫాల్స్ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఇది సుమారు 340 మీటర్ల (1,115 అడుగులు) ఎత్తు నుండి పడే ‘ప్లంజ్’ (నేరుగా పడే) జలపాతం. అంటే నీరు మధ్యలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా కిందకు పడుతుంది. ఇది ఖాసీ కొండల నుండి ప్రవహిస్తుంది.
ఇక్కడ ‘మోస్మై’ అనే సహజ సిద్ధమైన గుహలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. చిరపుంజి ప్రకృతి అందాలను చూసి రాత్రికి షిల్లాంగ్ చేరుకున్నాము.
మేఘాలయ రాష్ట్రం అత్యంత ప్రత్యేకమైన సాంస్కృతిక సంపద కలిగిన ప్రాంతము. ఇక్కడ ప్రధానంగా మూడు తెగలు నివసిస్తాయి – ఖాసీ (Khasi), జయింటియా (Jaintia), గారో (Garo). వీరి సంస్కృతి, సంప్రదాయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
వీరు మాతృస్వామ్య వ్యవస్థ (Matrilineal System) పాటిస్తారు. ఆస్తి తల్లి నుంచి కూతురికి వారసత్వంగా వస్తుంది. పెళ్లి తర్వాత భర్త భార్య ఇంట్లోనే నివసిస్తాడు. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం. ప్రకృతి పట్ల గౌరవం, సామూహిక జీవనం, సంప్రదాయాలకు కట్టుబాటు మేఘాలయ తెగల ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. వీరు ప్రకృతితో మమేకమైన జీవన విధానాన్ని పాటిస్తారు.
నాలుగవ రోజు షిల్లాంగ్ నుంచి ఖాజీరంగాకు ప్రయాణంలోనే సాగింది. దారిలో రెండు ముఖ్యమైన ప్రదేశాలు చూసాము. 1913లో నిర్మించిన పురాతన కేథలిక్ చర్చి. ఇది ఓ అందమైన ఆధ్యాత్మిక కేంద్రము. అనంతరం అస్సాం రాష్ట్రంలో ప్రవేశించిన తరువాత ఇక్కడి తేయాకు తోటల్లో కొద్ది సమయం గడిపాము.
మరుసటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మా పర్యటన చాలా ఉత్తేజభరితంగా సాగింది. ముందుగా ఖాజీరంగా నేషనల్ పార్క్‌కు జీప్ సఫారీలో వెళ్ళాము. ఎలాంటి కంచెలు లేకుండా అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఒంటికొమ్ము ఖడ్గమృగాలను, అడవి ఏనుగులను, జింకలను దగ్గర నుంచి చూడడం ఓ అపురూప అనుభవం. ఇవేకాక అడవి దున్నలు, ఉడుములు, పాములు కూడా మాకు తారసపడ్డాయి.
తరువాత ‘ఖాజిరంగా నేషనల్ ఆర్చిడ్ పార్కు’ సందర్శించాము. వింత గొలిపే అరుదైన పూల చెట్లను చూసాము. రంగురంగుల పూల ద్వారా కీటకాలను ఆకర్షించి వాటిని తిని బ్రతికే మాంసాహార చెట్లు, 26 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే చెట్లు, కేవలం కాలిన బొగ్గుపై మొలచి జీవించే పూల చెట్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. రకరకాల ఔషధ మొక్కలను,70 రకాల వెదురు చెట్లను ఇక్కడ చూడవచ్చు. ప్రపంచంలోనే అత్యంత చిన్న అందమైన పూలు పూచే చెట్లను కూడా ఈ పార్కులో పెంచుతున్నారు.
అస్సాము వాసుల సాంప్రదాయపు జీవనశైలిని ప్రతిబింబించే ప్రదర్శనశాల కూడా ఈ పార్కులో ఉంది.
ఈ పూతోటలో ఆరు బయట కూర్చుని అస్సామీ సాంప్రదాయ వంటకాల రుచి చూడటం మధురమైన అనుభూతి. ఈశాన్య రాష్ట్రాలలో ప్రజలు, ప్రకృతిలో సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు, ఆహార పదార్థాలనే వాడుతారు. మాకు 22 రకాల కూరలతో భోజనం వడ్డించారు.
రాత్రికి హోటల్లో ప్రత్యేకంగా మా కోసం అస్సామీ ‘బిహు’ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ రోజు పర్యటన ద్వారా ప్రకృతితో సహజీవనం, సంగీత నృత్యాల సమ్మేళనం మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయనే అవగాహన కలిగింది.
ఆరవ రోజు కాజీరంగా నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని ‘తవాంగ్’ నగరానికి బయలుదేరాము. కొండల కోనల ద్వారా ఘాట్ రోడ్లో పదమూడు గంటలు ప్రయాణించడం కష్టతరం అవుతుందని ‘దిరాంగ్’ లో ఒక రాత్రి బస చేసి ఏడవ రోజు ‘తవాంగ్’ చేరుకున్నాము.
భారతదేశంలో మొదట సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అందుకే దీన్ని ‘ఉదయించే సూర్యుని భూమి’గా పిలుస్తారు. భౌగోళికంగా అరుణాచల్ ప్రదేశ్‌కు ఉత్తరంగా చైనా, పశ్చిమాన భూటాన్, తూర్పున మయన్మార్ మరియు దక్షిణంగా అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇది ప్రకృతి సౌందర్యంతో నిండిన అద్భుతమైన ప్రదేశం. హిమాలయ పర్వతాలు ఈ ప్రాంత అందానికి మరింత శోభనిస్తాయి.
దారిలో తేజ్‌పూర్ కాలభైరవ అలయాన్ని, ‘జంరి’లో నాగాలయాన్ని సందర్శించి రాత్రికి ‘దీరాంగ్’ లో బస చేసాము.
ఏడవ రోజు ఉదయం ‘తవాంగ్’ నగరానికి బయలుదేరాము. మా ప్రయాణం తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల్లో సాగింది. చుట్టూ దట్టమైన అడవులు, ప్రవహించే నదులు, జలపాతాలు, మంచుతో కప్పబడిన పర్వతశిఖరాలు స్వర్గాన్ని తలపింపజేశాయి.
ముందుగా సేలాపాస్, సేలా సరస్సు సందర్శించాము.
సేలా పాస్ (Sela Pass) సముద్ర మట్టానికి సుమారు 13,700 అడుగుల ఎత్తులో భారతదేశం-చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఒక అద్భుతమైన పర్వత మార్గం. ఈ ప్రాంతం సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మా బృందం అంతా తమ వయసును మరిచి మంచు వర్షంలో తడుస్తూ ఆనందించాము.
సేలా పాస్ సమీపంలోనే ఉన్నసేలా సరస్సు (Sela Lake) స్వచ్ఛమైన చల్లని నీరు మంచుతో కప్పబడి అద్భుతంగా కనిపిస్తుంది. చలికాలంలో సరస్సు పూర్తిగా గడ్డకట్టిపోతుంది.
సేలా పాస్ మరియు సేలా సరస్సు ప్రకృతి అందాలకి ప్రతీకలు. మంచు పర్వతాలు, నీలి ఆకాశం, నిశ్శబ్దమైన వాతావరణం – ఈ ప్రదేశాన్ని మళ్లీ మళ్లీ సందర్శించాలని అనుభూతి కలుగుతుంది.
అనంతరం ‘తవాంగ్’ వెళ్లే దారిలో ఉన్న ‘జస్వంత్‌గఢ్ వార్ మెమోరియల్’ చూసాము. ఇది 1962 లో జరిగిన ఇండియా చైనా యుద్ధ సమయంలో, మూడు రోజులు చైనా సైనికులతో ఒంటరిగా పోరాడి వీరమరణం పొందిన భారత సైనికుడు జస్వంత్ సింగ్ రావత్ గారి జ్ఞాపకార్థంగా నిర్మించబడింది. ఇది భారత సైనికుల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఒక గొప్ప చారిత్రక స్మారకం. సాయంత్రానికి ‘తవాంగ్’ చేరాము. సముద్ర మట్టానికి 11000 అడుగుల ఎత్తులో ఉన్న తవాంగ్ అత్యంత సుందరమైన నగరమేకాక ముఖ్యమైన భారత సైనిక స్థావరం. సాయంత్రం 6 గంటలకు భారత సైనిక దళం వారు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమం చూసే అవకాశం మాకు కలిగింది. స్థానిక కళాకారులు చేసిన ప్రత్యేక సాంప్రదాయ యాక్ డాన్స్, స్నో లయన్ డాన్స్, మోంపా డాన్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమం తర్వాత బౌద్ధ వాస్తు కళతో నిర్మించిన ‘తవాంగ్ వార్ మెమోరియల్’ సందర్శించి మా బసకు చేరుకున్నాము.
ఎనిమిదవ రోజు మా పర్యటన చాలా ఆనందంగా ఉత్కంఠ భరితంగా సాగింది. ఉదయాన్నే ‘బుమ్ లా పాస్’కు వెళ్ళాము. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ దగ్గర సముద్ర మట్టానికి 15,200 అడుగుల ఎత్తులో భారత–చైనా సరిహద్దులో ఉన్న ఒక ప్రముఖ పర్వత మార్గం ఇది. 1962 లో ఇక్కడ భారత్- చైనా యుద్ధం జరిగింది.
భారత సైన్యం నియంత్రణలో ఉండే ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అంతేకాదు అనుభవజ్ఞులైన స్థానిక డ్రైవర్లు నడిపే కారులోనే వెళ్లాలి.
తవాంగ్ నగరం నుండి దాదాపు 50 కిలోమీటర్లు మంచు కొండల మధ్య, ఇరుకైన ప్రమాద భరితమైన కొండ రోడ్లపై ప్రయాణం. దారంతా దట్టమైన పొగ మంచుతో నిండి ఉంటుంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ ప్రయాణ అనుభవం మాటల్లో వర్ణించలేనిది. ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం కలగడం మా అదృష్టం.
అనంతరం ‘పెంగ్ టెంగ్ త్సో’ సరస్సు సందర్శించాము. ఇది హైఅల్టిట్యూడ్ లో ఉన్న మంచుతో కప్పబడిన ఒక అందమైన సరస్సు. ఇది శీతాకాలంలో పూర్తిగా గడ్డకట్టిపోతుంది.
తిరుగు ప్రయాణంలో ‘శుంగాస్టర్ సరస్సు’ (మాధురి సరస్సు అని కూడా పిలుస్తారు) కూడా చూసాము. ఇది 1950లో భూకంపం వల్ల ఏర్పడిన సరస్సు. హిందీ చిత్రం ‘కొఇలా’ షూటింగ్ ఇక్కడ జరిగిన తర్వాత, ఇది ‘మాధురి లేక్’గా ప్రసిద్ధి చెందింది. సరస్సులో నీటి మధ్యలో కనిపించే ఎండిన చెట్లు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ.
మరుసటి రోజు ఉదయం తవాంగ్ బౌద్ధ మఠాన్ని(Tawang Monastery) సందర్శించాము. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బౌద్ధ మఠం. ఇది 1681లో ఐదవ దలైలామా పర్యవేక్షణలో అత్యంత అందంగా నిర్మించబడింది. ఎనిమిది మీటర్ల ఎత్తైన గౌతమ బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఈ మఠంలో దాపు 500 మంది బౌద్ధ బిక్షువులు నివసిస్తారు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రము.
ఇక్కడ పాత గ్రంథాలు, పుస్తకాలు సేకరించి నిక్షిప్తం చేసిన పెద్ద గ్రంథాలయం ఉంది. అంతేకాక అపురూపమైన టిబిటియన్ కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి.
మనసుకు హత్తుకునే తవాంగ్ నగర అందాలను సందర్శించి, మరో సుందర నగరం ‘బొండిల్లా’కు బయలుదేరాము.
‘తవాంగ్’ నుండి ‘బొండిల్లా’కు మా ప్రయాణం చాలా ఎక్సైటింగ్‌గా సాగింది. జీవితంలో ఊహించని, కలలో కూడా చూడని మరో ప్రపంచంలో ప్రయాణించాము. మంచు కప్పిన పర్వత శ్రేణులు, పచ్చటి వృక్షాలు, మెల్లగా కురిసే మంచు వర్షం, మేఘాలలో నుంచి అప్పుడప్పుడు తొంగి చూసే సూర్యకిరణాలు, అకస్మాత్తుగా దారిని కప్పివేసే పొగ మంచు, పర్వతాల పైనుంచి మెల్లగా ప్రయాణించే నల్లటి మేఘాలు ఓవైపు, మరోవైపు లోతైన లోయల అంచుల్లో వేసిన ఇరుకైన రోడ్లు, శ్వాసక్రియకు అందని ఆక్సిజన్, ఎముకలు కొరికే చలి కొంచెం భయపెట్టాయి.
దారిలో 100 మీటర్ల ఎత్తు నుండి పాలధారగా పడే ‘ను రాంగ్’ జలపాత అందాలను ఆస్వాదించాము.
హై ఆల్టిట్యూడ్ లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన జంటదారుల సొరంగ మార్గం సేలా టన్నెల్ (Sela Tunnel) గుండా ప్రయాణించడం మరో విశేషం. ఇది సముద్ర మట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉంది. భారత సైన్యానికి, వేగంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం కలిగించాలనే సంకల్పంతో ‘బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్’ ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంటుంది.
సాయంత్రం 6గంటలకు ‘బొండిల్లా’ చేరి రాత్రికి విశ్రమించాము. ఇక్కడ తాపమానము ఆరు డిగ్రీలు.
మా టూరు పదవరోజు ‘తేజ్‌పూర్’ చేరుకున్నాము. బ్రహ్మపుత్రనది తీరాన ఉన్న ఈ పట్టణాన్ని ‘శాశ్వత శృంగార పట్టణం’ (సిటీ ఆఫ్ ఎటర్నల్ రొమాన్స్) అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుని మనవడు అనిరుద్, బాణాసురుని కుమార్తె ఉషకు మధ్య జరిగిన ప్రేమ కథ ఈ పేరు రావడానికి మూలమట. మహాభారత కాలంలో బాణాసురుడు ఉషను ‘అగ్నిగఢ్’లో బంధిస్తాడు. అనిరుద్ధుడిని రక్షించడానికి శ్రీకృష్ణుడు బాణాసురుడితో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం వల్ల ఆ ప్రదేశమంతా రక్తంతో నిండిపోవడంతో, దానికి ’శోణితపురం’ అని పేరు వచ్చింది. శోణిత అంటే రక్తం (Tezpur = City of Blood: Tez=Blood, Pur=city).
ఈ కథకు ప్రతీకగా కట్టిన ‘అగ్నిగఢ్’ అనే పర్యాటక స్థలాన్ని సందర్శించాము. ఇక్కడి నుంచి బ్రహ్మపుత్ర నదిని, పూర్తి నగరాన్ని వీక్షించవచ్చు.
తేజ్‌పూర్ దగ్గరలో ఉన్న మహామృత్యుంజయ ఆలయాన్ని సందర్శించాము. 129 అడుగుల ఎత్తున శివలింగ ఆకారంలో నిర్మించిన ఆలయం ఇది.
11వ రోజు సాయంత్రానికి గౌహతి చేరుకున్నాము. గౌహతి – ఉత్తర గౌహతిలను కలుపుతూ బ్రహ్మపుత్ర నది మీదుగా నిర్మించిన రోప్ వే లో వెళుతూ నది అందాలను తిలకించాము. ‘వీణా వరల్డ్’ వారు మా కోసం ముందుగానే బ్రహ్మపుత్రానది క్రూయిజ్ (Brahmaputra River Cruise) లో సీట్లు బుక్ చేశారు.
సాయంత్రం సమయంలో నదిపై క్రూయిజ్ చేస్తూ విశాలమైన నదీజలాలపై ప్రతిబింబించే సంధ్య వెలుగులను చూస్తూ పరవశించాము.
మరుసటి రోజు ఉదయం కామాఖ్య దేవాలయం సందర్శించాము. ఈ దేవాలయం నీలాచల్ కొండపై ఉంది. ఇది శక్తి పీఠాలలో ఒకటి. భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలం.
మా పర్యటన చివరి రోజు పర్యటన నిర్వాహకులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని అందరిని అస్సాం సాంప్రదాయక అంగవస్త్రం ‘గముస’తో సత్కరించారు.
మా 12 రోజుల పర్యటన ముగిసి మరచిపోలేని జ్ఞాపకాలతో ఇంటి ముఖం పట్టాము.
ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల అందాల గురించే కాక ఇక్కడి ప్రజల జీవన విధానం గురించి కూడా చెప్పుకోవాలి.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ సంప్రదాయాలను, సంస్కృతిని ఎంతో గౌరవిస్తారు. గౌరవంగా పాటిస్తారు. ఇక్కడ ఎన్నో గిరిజన తెగలు ఉన్నాయి. ప్రతి తెగకు (Tribe) ప్రత్యేకమైన సంస్కృతి, ఆచారాలు ఉంటాయి. పండుగలు ఎక్కువగా ప్రకృతి ఆధారంగా ఉంటాయి. సాంప్రదాయ నృత్యాలు, పాటలు వారి జీవితంలో ముఖ్య భాగం.
ఈశాన్య రాష్ట్రాల ఆహారం సాధారణంగా సాదాగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సహజ సిద్ధంగా పండిన కూరగాయలను, పండ్లను తింటారు. ముఖ్యమైన ఆహారము బియ్యము.
ఇక్కడి ప్రజలు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. ప్రకృతి ఆరాధన ప్రకృతి పరిరక్షణ వీరి జీవితంలో ఓ ముఖ్య భాగము. మహిళలను గౌరవిస్తారు. కొన్ని తెగలలో మహిళలే కుటుంబ పెద్దలు. స్నేహశీలత, చిరునవ్వు నవ్వు, అతిథి సత్కారము వీరికి వెన్నతో పెట్టిన విద్య.
ఇన్ని విశిష్టతలతో కూడిన ప్రాంతాలను సందర్శించడం అదృష్టంగా భావించి మా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.

