Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-11

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-10: ఎలట్రిస్‌ ఫెరినోసా (Aletris Farinosa)

ఇది యునైటెడ్‌ దేశాల్లో పెరిగే స్టార్‌ గ్రాస్‌, బ్లాజింగ్‌ గ్రాస్‌, కోలిక్‌ రూట్‌, యూనికార్న్‌ రూట్‌గా పిలవబడే మూలికా సంబంధమైన మొక్క నుండి తీసిన అతి చేదు రసంతో ఔషధ గుణాల్ని రాబట్టిన మందు.

స్థానాలు:

జీర్ణకోశం, స్త్రీ జననేంద్రియాలు, మలాశయం, ప్రేవులు.

వ్యాధులు:

తరచూ అబార్షన్స్‌ కావడం, తెల్లమైల, గర్భాశయ రక్తస్రావం, రక్త హీనత, జీర్ణకోశ వ్యాధులు.

పోలికలు:

హెలోనియస్‌, హైడ్రాస్టిస్‌, చైనా.

స్వభావం:

శరీర పోషకత్వం లేకపోవడం వల్ల కల్గు దీర్ఘవ్యాధులు.

ఉద్రేకం:

ముందుకు వంగడం, నడక, మాట్లాడడం, గీరడం వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

తినడం, వెనక్కి వంగడం, అపాన వాయువు పోవడం, కాఫీ, భోజనం తర్వాత స్త్రీలకు ఉపయోగపడే మందు. గర్భిణీలు, యుక్త వయస్కు బాలికలకు ఇది మంచి మందు.

తత్త్వం:

నీరసంతో, రక్తహీనతతో, దీర్ఘ వ్యాధులతో కృశించి పోయి ఉంటారు.

మోతాదు:

30-200 పొటెన్సీ. ఎడమవైపు పనిచేయు మందు.

మానసిక లక్షణాలు:

మనసు, శరీరం అలసట చెందడం, నిలకడ లేకుండుట, కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. ఏకాగ్రత ఉండదు.

శారీరక లక్షణాలు:

తల వెనుక భాగంలో బరువుగా ఉండి, తల వెనుకకు లాగినట్లు, నొక్కుచున్నట్లుంటుంది. తల త్రిప్పుతే నిద్రమత్తు, వాంతులు, విరేచనాలు ఉంటాయి. మగత, తల పట్టేసినట్లుంటుంది. కళ్ళు మసకగా, నొప్పిగా ఉంటాయి.

ఎడమ చెవి సరిగా వినిపించదు. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల ఆకలి సరిగా ఉండదు. కొద్ది ఆహారం తీసుకున్నా పొట్ట ఉబ్బరం, తిన్న ఆహారం రుచితో త్రేన్పులు రావడం వుంటుంది. పొత్తి కడుపులో పీకుచున్నట్లు నొప్పి.

హిస్టీరియాలో లేదా అపస్మార సంబంధమైన శూలలో అపానవాయువు వెడలిన  నొప్పి తగ్గుతుంది. అబ్డామినల్‌ క్రాంప్స్‌ ముందుకు వంగిన ఎక్కువవుతుంది. ఫెయింట్‌ అయి పడిపోతారు.

మలవిసర్జన కండరాలకు శక్తి లేకపోవడం వల్ల మలబద్దకం. మలవిసర్జనా నంతరం అమితంగా బాధగా ఉంటుంది. మొలలు వల్ల మాటి మాటికి మలవిసర్జన చేయాలనిపిస్తుంది. మూత్రం కొద్దిగా, ఫాస్ఫేట్స్‌తో పోవడం. త్వరగా నడవడం, తుమ్మడం వల్ల ఎక్కువవుతుంది.

స్త్రీలలో:

శరీర పోషకత్వం లేకపోవుటచే కల్గు దీర్ఘవ్యాధులకిది ఉపయోగ పడుతుంది. బహిష్టులాగిపోవడం, త్వరగా చిక్కని నల్లని ముద్దవలె విస్తారమైన స్రావం ఋతుశూలతో కావడం, తరచు అబార్షన్స్‌ కావడం వల్ల కలిగే వంధ్యత్వం. ఇది అబార్షన్‌  కాకుండా  ఆపుతుంది.  గర్భాశయ  రక్తస్రావాలు.  గర్భసంచిలో బరువుగా  ఉండి గర్భాశయం దిగజారడం. గర్భధారణ కలగక పోవడం వల్ల గర్భాశయం నందు బరువుగా ఉంటుంది.

గర్భవతుల్లో వేవిళ్ళు, కండరాల నొప్పులు, దొంగ నొప్పులు, లాలాజలం ఎక్కువగా కారడం, రక్తహీనత, క్లోరోసిస్‌ వల్ల యుక్తవయస్సు బాలికలు పాలిపోయి ఉంటారు. బహిష్టుకు ముందు దగ్గు రావడం. ప్రసవ నొప్పులులాగా పోట్లు వస్తాయి. వికారం, స్త్రీలు ఎప్పుడూ నీరసంతో ఉంటారు. నడుంనొప్పితో నడిచినప్పుడు తెల్లమైల అధికంగా అవుతుంది. చిన్న వయస్సులోనే రజస్వల అయి ఓవర్‌ బ్లీడిరగ్‌తో బాధపడుతుంటారు.

ఛాతీలో ఎడమ ప్రక్క నుండి వీపులోకి కత్తితో పొడిచినట్లు నొప్పి ఉండి పల్స్‌ ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. ఉదయాన పొడిదగ్గు ఉండి మాట్లాడిన ఎక్కువవుతుంది. కోరింత దగ్గు వల్ల మూత్రానుమానం వుంటుంది.

నడుం, మెడ మధ్య నొప్పి, ఎడమ భుజంలోకి పొడిచినట్లుంటుంది. నడుం విరగ కొట్టినట్లు నొప్పి, కూర్చున్నప్పుడు మోకాళ్ళలో నొప్పి, కుడికాలు మొద్దుబారి చచ్చుగా ఉండి ఏమాత్రం బరువుని భరించలేదు.

ఛాతీ, వీపులో దురదతో పొక్కులు రావడం, రుద్దడం వల్ల ఉపశమనం. జ్వరంలో చలి ముఖం పొంగరింపు, కాళ్ళు చేతులు చల్లగా, తల ముఖం వెచ్చగా ఉండేవారికిది మంచి మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version