[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-12: ఏలియం సేపా (Allium Cepa)
ఇది సెపాగా పిలవబడే ఎర్రగడ్డ నుండి, జూలై, ఆగష్టు నెలలలో ఎర్రగడ్డ మొక్క నుండి తీసిన రసంతో తయరయిన మందు. దీని ఔషధ గుణాల్ని డా॥ హెరింగ్ నిరూపించాడు.
స్థానాలు:
ముక్కు, తల, నోరు, స్వరపేటిక, కళ్ళు, నరాలు, జిగురు పొరలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధులు:
జలుబు, హేఫీవర్, ఇన్‌ఫ్లుయెంజా, న్యూమోనియా, కోరింత దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులు, ట్రమాటిక్ న్యూరైటిస్, న్యూరాల్జియా వ్యాధుల్ని నయం చేస్తుంది.
కారణాలు:
చల్లని, తడి వాతావరణం, సర్జికల్ ఆపరేషన్, దెబ్బలు, పాదాలు తడిసిన, చెడిపోయిన చేపల కూర తినడం, చల్లని ఈదురు గాలులు, ఉల్లిపాయలు, సలాడ్స్, కీర తినడం వల్ల కలిగే వ్యాధులకి ఇది మంచి మందు.
పోలికలు:
ఎకోనైట్, కాలీ అయోడ్, ఇపెకాక్, యుఫ్రేషియా, జెల్సీమియం, లిలియంటిగ్ వంటి మందులతో పోల్చవచ్చు.
సహచరులు:
ఫాస్పరస్, పల్సటిల్లా, తూజా, సర్సపరిల్లా మందుల్ని దీని తర్వాత వాడవచ్చు.
విరుగుళ్ళు:
ఆర్నికా, కేమోమిల్లా, నక్స్, విరేట్రం ఆల్బం వంటివి ఈ మందుకు విరుగుళ్ళుగా పనిచేస్తాయి.
దీనికి పిమ్మట వాడరానివి:
స్కిల్లా, ఎలోస్, ఎలీయం సెటైవా.
ఇది ఎడమవైపు పనిచేయు మందు. లక్షణాలు ఎడమ నుండి కుడివైపుకు వస్తాయి.
మయాజమ్:
సోరా.
ఉద్రేకం:
విశ్రాంతి, చల్లని తేమగాలి, సాయంకాలం, వేడిగది, పడుకున్న, మధ్యాహ్నం వ్యాధి లక్షణాలు వ్యాపిస్తాయి.
ఉపశమనం:
కదలిక, అటు ఇటు తిరగడం, చల్లగా ఉండే గది. అటు ఇటు తిరగడం, బైటగాలిలో. ఇది అక్యూట్ డ్రగ్, అంటే తరుణ వ్యాధులకు ఉపయోగపడే మందు.
మానసిక లక్షణాలు:
జలుబు వల్ల ఆందోళనగా ఉండడం, నొప్పులకు భయపడడం, డల్‌గా ఉండడం వుంటుంది.
శారీరక లక్షణాలు:
తల:
జలుబు వల్ల ఎడమవైపు తలనొప్పి, నుదురు, తలవెనుక భాగం నుండి మెడలోకి వ్యాపించడం, వెచ్చని గదిలో, సాయంకాలం ఎక్కువై ధారాళమైన గాలిలో ఉపశమిస్తుంది.
కళ్ళు:
కళ్ళు మంటగా, దురదగా, నీరు కారుతూ వుండడం, కళ్ళు వాచి ఎర్రగా వుండి వెలుతుర్ని చూడలేకపోవడం, అక్షరాలు చిన్నగా కన్పించడం, ఆవలింతలతో, దగ్గర వస్తువులు దూరంగా కన్పిస్తాయి.
చెవి:
చిన్నపిల్లల్లో చెవినొప్పి, చెవి నుండి స్రావం కారడం, చెవుడు ఉంటుంది.
ముక్కు:
ముక్కు దురద, ఆగని తుమ్ములు, ఒరుపుతో నీరు వంటి స్రావం చుక్కలుగా కారడం, ముక్కు దిబ్బడ, తలభారం, దగ్గు, గొంతు బొంగురు, ముక్కులో కల్గే కాయల వల్ల దుర్వాసన ఉంటుంది.
హేఫీవర్, ప్రతి సంవత్సరం ఆగష్టులో రావడం, ప్రక్క నుండి లేవగానే తుమ్ములు, పూల వాసన, ఘాటైన వాసనలు భరించలేరు. తేమతో కూడిన ఈశాన్యగాలులు అనంతరం వసంత కాలంలో వచ్చే జలుబు, లారింజైటిస్‌కి ఇది మంచి మందు.
ఎడమవైపు ముఖానికి పక్షవాతం రావడం (బెల్స్‌పాల్సీ) – ఉండేవారికి ఇది మంచి మందు.
నోరు:
పంటినొప్పి చల్లగాలి వల్ల, చన్నీటి వల్ల రిలీఫ్ ఉంటుంది. పెదవులు ఎండిపోతాయి. గొంతులో కఫం వుండలాగా రావడంతో ఎప్పుడు ఖాండ్రించడం, దగ్గినప్పుడు కంఠం పట్టుకోవడం, నోటి నుండి దుర్వాసన రావడం వుంటుంది. దగ్గినప్పుడు కండ్ల నుండి నీరు కారడం, దగ్గు గురకతో రాత్రి పడుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. కోరింత దగ్గుతో అజీర్ణం, వాంతులు, కడుపుబ్బరం ఉంటుంది. దగ్గు చల్లగాలి వల్ల, వెచ్చని గదియందు ఎక్కువవుతుంది.
వీరికి పచ్చి ఎర్రగడ్డ అంటే ఇష్టం. జీర్ణకోశంలో బాధ, తీరని ఆకలి, దాహం, అజీర్ణం వల్ల పుల్ల త్రేన్పులు రావడం, పొత్తికడుపు, కడుపులో గుడగుడలు, దుర్వాసనగల అపాన వాయువులు పోవడం, కడుపుబ్బరంతో శూల, బొడ్డుచుట్టూ కుట్టుచున్నట్లు బాధ, ఆసనంలో పురుగులవల్ల దురద, రెక్టమ్‌లో సూదితో గ్రుచ్చినట్లు నొప్పి, మొలలు వల్ల ఆసనంలో నొప్పి, రక్తం కారడం వుంటుంది. అర్ధరాత్రి తర్వాత ఉదయం విరేచనాలవుతాయి.
కాలేయ ప్రాంతంలో శూల బయలుదేరి పొత్తికడుపు అంతా వ్యాపిస్తుంది. రోగికి పచ్చి ఉల్లిపాయలంటే యిష్టం. ఉల్లిపాయలు తినడం వల్ల గ్యాస్‌ట్రబుల్, ఉల్లిపాయలు తినుటచే కల్గు విరేచనాలకు, అపానవాయువులకు తూజా విరుగుడుగా పనిచేస్తుంది.
రొంపతోపాటు మూత్రమెక్కువగా పోవడం, మూత్రం ఎర్రగా, మంట, నొప్పితో తరుచుగా పోవడం, మూత్రద్వారం వద్ద మంట, బాధ, వృద్ధుల్లో మూత్రం అప్రయత్నంగా పోతుంది.
మెడనొప్పి, రాత్రిళ్ళు వెన్నులో చలిగా ఉన్నట్లుండి తరచు మూత్రానుమానంతో వెచ్చగా, దప్పిక వుంటుంది.
గాయాలు తగలడం వల్ల, కాలు లేదా చేయిని శస్త్ర చికిత్స తర్వాత తీసివేసిన నరాలు వాచి భరించలేని బాధ మంటగా, సూదితో కుట్టినట్లు ఉంటుంది. గోరుచుట్టు వల్ల చేతి నరాలు ఎక్కువగా లాగడం, శరీరంలో వివిధావయవాల్లో నరాల పొడవున లాగినట్లుంటుంది. కాళ్ళు, చేతులు నీళ్ళలో నానడం వల్ల నరాల నొప్పులు, నడుచుట వల్ల కాళ్ళు పచ్చి పుండ్లవలె ఉంటాయి.
ఆవలింతలతో మత్తుగా ఉంటుంది. పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తిన్న నిద్రలేమిని పోగొడుతుంది. కలల వల్ల అర్ధరాత్రి మెలకువ వస్తుంది.
చర్మం:
పొంగు, స్కార్లటిక్ జ్వరంలో ఎర్రటి పొక్కులు, దద్దుర్లు, మంట వల్ల దారంతో లాగినట్లు, న్యూరాల్జియా వుంటుంది. సూదితో గ్రుచ్చినట్లు, నరాలు లాగినట్లు నొప్పులుంటాయి. జిగురు పొరల వాపు, స్రావాలుంటాయి. ముసలివారిలో గాంగ్రీన్, ట్రమాటిక్ న్యూరైటిస్, శరీరమంతట లాగినట్లు నొప్పులతో రోగి నీరసించి పడుకోవడం సాయంత్రం పూట ఎక్కువవుతుంది.
దగ్గు, జలుబు, జీర్ణకోశ సమస్యలతో, దప్పికతో జ్వరం రావడం, అధికంగా చెమటలు పట్టేవారికి మేలైన మందు.
బాలింతల్లో వచ్చే ఫ్లైబైటిస్‌కి, న్యూరైటిస్ వల్ల చేయి సలుపు, నిరాశకి ఇది మంచి మందు.
స్త్రీలలో ప్రసవానంతరం, ముఖ్యంగా (ఫోర్‌సెప్స్ డెలివరీ తర్వాత) సిరలు వాచుట. గోరుచుట్టు, చేతి వరకు ఎర్రని చారలేర్పడి, నొప్పులుంటాయి. బహిష్టు సమయంలో తలనొప్పి తగ్గి, స్రావం ఆగిపోయిన తర్వాత తలనొప్పి తిరిగి మొదలవుతుంది. ఇలాంటి వారికి ఏలియం సెపా మంచి మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
