Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-20

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

 

హోమియో మందులు-19: ఎసాఫీటిడా  (Asafoetida)

ఇది పర్షియా దేశంలో విస్తారంగా పెరిగే మొక్క. ఇంగువ చెట్టు నుండి ఇంగువతో హోమియో మందుగా మలచినవారు డా॥ ఫ్రాన్జీ, హానిమన్‌.

స్థానాలు:

ఈ మందు నరాలు, మనస్సు, కంఠనాళం, జీర్ణకోశం పై ప్రభావం చూపుతుంది.

వ్యాధులు:

ఇది తల, కళ్ళు, పొత్తికడుపు, ముఖం, నోరు, చర్మ సంబంధమైన వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, వెన్నెముక వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకి మంచిది. ఇది ఎడమవైపు పని చేయు మందు.

కారణాలు:

చర్మ వ్యాధుల్ని అణిచిపెట్టడం వల్ల, స్రావాలు (చెమట, విరేచనాలు) అణగారినా వచ్చే వ్యాధులకు ఉపయోగపడుతుంది.

మోతాదు:

6-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.

కాల పరితిమితి:

5-10 రోజులు ఉంటుంది.

ఉద్రేకం:

వీరికి రాత్రి తాకుట, విశ్రాంతి, ఉష్ణోపచారాలు చేసినా, తినుచుండినా, పాదరసం వల్ల, ధ్వని, కూర్చున్నా, వెచ్చని దుప్పట్ల వల్ల ఎక్కువ అవుతుంది.

ఉపశమనం:

వీరికి చల్లగాలిలో, కదలిక, ఒళ్ళు నొక్కుట వల్ల రిలీఫ్ ఉంటుంది.

విరుగుళ్ళు:

చైనా, మెర్క్‌సాల్‌, పల్సటిల్లా, కాంఫర్‌, కాష్ఠికం మందులు దీనికి విరుగుళ్ళు.

మయాజమ్‌:

సిఫిలిస్‌, సైకోసిస్‌ మయాజమ్స్‌తో పనిచేసే మందు.

స్వభావం:

వీరు కండర పుష్టి కల్గి ముఖం రక్తపూరితమై హిస్టీరియా తత్త్వంతో ఉంటారు. ఇతరులకి జాలి కల్గే విధంగా మేడిపండులాగా పై సౌష్టవమే కాని లోపల చాలా బాధలు కల్గి ఉంటారు. వీరు బాగా సున్నితత్వం గలవారు.

మానసిక లక్షణాలు:

మనస్సులోని తన బాధల్ని గురించి ఎప్పుడు చెప్పడం, అపస్మార సంబంధమైన అస్థిమితంతో ఉండి, ఆత్రత, చిర చిరలాడడం, మందులు తీసుకోనట్లు తల్చుకుంటేనే మూర్ఛ వస్తుంది. బాధలు లోపల నుండి పైకి వస్తాయి. స్పర్శ, శబ్దం భరించలేరు. నరాల వ్యాధుల వల్ల అపస్మారం, హిస్టీరియా వస్తుంది.

శారీరక లక్షణాలు:

తల:

నుదుటిలో లోపలి నుండి వెలుపల వైపుకు మేకుతో కొట్టినట్లు ఉంటుంది, నొక్కుచున్నట్లు బాధ. వీరికి ఎడమ కణతలో బాధతో పార్శ్వపు నొప్పి ఉండి, రాత్రిళ్ళు ఎక్కువై, విశ్రాంతి వల్ల, చలిగాలి వల్ల, నొక్కుట వల్ల ఉపశమిస్తుంది. వీరిది సిఫిలిస్‌ తత్త్వం.

కళ్ళు:

కంటి  రెప్పల  మీద  పుండుపడి  ఆర్చుకొని  పోయినట్లుండి  మంటగా  ఉంటుంది. కన్ను తిమ్మిరిగా ఉండి కంటి గ్రుడ్డు నందు, కంటి ఎముక కూడా సలుపుగా, నొప్పిగా ఉంటుంది. స్రావాలు రక్తంతో దుర్వాసనగా ఉండి స్రవించినచో పుండు పడతాయి. చెవులు వినపడవు.

ముక్కు:

వీరి ముక్కులోని ఎముకలు వాచి పుండ్లు ఏర్పడడం, ఎముకలు పుచ్చిపోవడం, దుర్వాసనతో కూడిన ఆకుపచ్చని స్రావం రావడం ఉంటుంది. సిఫిలిస్‌ వ్యాధి వల్ల కల్గినపుడు ఇది మంచి మందు.

ముఖం:

వీరి ముఖంలో, ఎముకలో తిమ్మిరిగా ఉండడం, బిగపట్టినట్లుండడం, క్రింది పెదవి వాపు ఉంటుంది.

నోరు:

నోరు మంటగా ఉండి ఆర్చుకొని పోవడం, నాలుక వాచి తెల్లగా ఉండి మంట పుట్టడం, మాట స్వచ్ఛంగా రాకపోవడం వుంటుంది.

జీర్ణకోశ లక్షణాలు:

పొట్ట ఉబ్బరం వల్ల జీర్ణకోశంలో కోయుచున్నట్లు, మంటగా, భరించలేనంత బాధగా ఉండి, ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చి కడుపులో గుడ గుడ మ్రోతలుంటాయి. త్రేన్పులు వచ్చినా గుడ గుడలు కొంత తగ్గుతాయి. త్రేన్పులు దుర్వాసనగా, అసహ్యంగా, వెల్లుల్లి వాసనగా ఉంటాయి. వీరి జీర్ణకోశం నుండి గొంతు లోనికి బంతిగాని, ఏదైన పదార్థంకాని వచ్చినట్లుండడంతో రోగి గుటక వేస్తుంటాడు. ఉదయం 11 గంటలకు జీర్ణకోశమందు శూన్యంగా ఉంటుంది. ఏమాత్రం అజీర్ణ వస్తువులు తిన్నా దుర్వాసనగల విరేచనాలు అవుతాయి. పానీయాలు నోటిలోకి వస్తుంటాయి. వీరి ఉదర కుహరం వేడిగా ఉంటుంది.

జననేంద్రియ లక్షణాలు:

స్త్రీలు గర్భాశయంనందు పుండు, కేన్సర్‌ వున్నప్పుడు దుర్వాసన గల స్రావాల వల్ల జననేంద్రియంలో బరువుగా ఉండి దిగజారినట్లుండి బాధగా ఉంటుంది. పెళ్ళికాని వారిలో స్తనాల్లో పాలు పడతాయి. గర్భస్రావాలు, జననేంద్రియాల నుండి రక్తస్రావం కావడం వుంటుంది. ప్రసవానంతరం గర్భాశయం చాలా నొప్పిగా వుంటుంది. నాడీ మండల నిస్త్రాణ వల్ల సంభోగానంతరం శోషిల్లడం ఉండి, ఊపిరాడక బాధ పడుతుంటారు.

శ్వాసకోశ లక్షణాలు:

ఆయాసం ఉండి ఏమాత్రం అలసినా, భోజనం తర్వాత, సంభోగానంతరం, ప్రతిరోజు ఒకసారైనా వస్తుంటుంది. దగ్గు రాత్రి చాలా ఎక్కువగా ఉండి గుండె ప్రాంతంలో సూదితో గ్రుచ్చినట్లుంటుంది.

చర్మవ్యాధులు:

శరీరంలో ఆకస్మికంగా వాపులు బయలుదేరి రక్తస్రావం కల్గడం, పుండు పడి అది శరీరం మీద వ్యాపించడం, పల్చని దుర్వాసన గల చీము కారడం, ఎముకలు వాచి శరీరానికి నీరు పట్టడం ఉంటుంది. ఇలాంటి వారికి ఇది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version