[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-20: ఆరం ట్రిఫిల్లం (Arum Triphyllum)
వృక్ష జాతికి చెందిన ఈ మొక్క నుండి డా॥ హానిమన్ ఔషధ గుణాల్ని రాబట్టారు.
స్థానాలు:
ఈ మందు ముక్కు, నోరు, గొంతు, శ్వాసావయవాలు, మూత్రావయవాలు, చర్మం, రక్తంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధులు:
ఇది జ్వరం, ముక్కు, శ్వాసావయవాలకు ఉపయోగపడుతుంది.
సరిపడనివి:
కెలేడియం సెగ్.
పోలికలు:
సినా, ఎమ్మోనియం కార్బ్, కాష్టికం, ఏలియం సెపా మందులతో దీన్ని పోల్చవచ్చు.
విరుగుళ్ళు:
పల్సటిల్లా, మజ్జిగ, లేక్టిక్ ఆసిడ్, ఎసెటిక్ ఆసిడ్ దీనికి విరుగుళ్ళు.
ఉద్రేకం:
వీరు ఉదయాన పడుకున్నప్పుడు, వేడి, చలి, తేమ గాలుల వల్ల, ఎక్కువగా మాట్లాడినా, పాడినా ఎక్కువ అవుతుంది.
ఉపశమనం:
వీరికి నిద్ర నుండి లేచిన వెంటనే ఉపశమనముంటుంది.
కారణాలు:
మూత్రం అణిచిపెట్టబడటం, వేడిమి వల్ల వ్యాధులు వస్తాయి.
మోతాదు:
దీన్ని చిన్న పొటెన్సీల్లో తరుచుగా వాడరాదు, హెచ్చు పొటెన్సీలో వాడిన గుణం ఉంటుంది. ఇది ఎడమవైపు పనిచేయు మందు.
కాల పరిమితి:
2-3 వారాలు ఉంటుంది.
మానసిక లక్షణాలు:
వీరికి మానసిక ఆందోళన, అస్థిమితం ఉండి, పరాకుగా మాటలాడతారు. బుద్ధిమాంద్యం ఉంటుంది.
శారీరక లక్షణాలు:
తల:
వేడి కాఫీ త్రాగడం వల్ల, వేడిని కలుగచేసే దుస్తులు ధరించడం వల్ల తలనొప్పి ఎక్కువవుతుంది.
ముక్కు:
వీరికి ముక్కు దిబ్బడ, పడిశం, తుమ్ములు వచ్చి రాత్రి యందెక్కువగుట, దురద, మంటతో ఎడతెగని నీళ్ళవంటి స్రావం వల్ల నాసికారంధ్రాలు, పైపెదవి, ఒరుసుకొని పోతాయి. రక్తం వచ్చే వరకు ముక్కును నలుపుకోవడం, గిల్లుకోవడం వుంటుంది. ముక్కు రంద్రంలోనికి వ్రేలిని దోపుకోవడం వుంటుంది.
ముక్కు, పెదవులు రక్తం కారేవరకు గిల్లుకోవడం వల్ల, నోటి మూలలు పుండు వలె ఉంటాయి. పెదవులు పగిలి రక్తం కారడం వుంటుంది. వ్రేళ్ళు రక్తం కారే వరకు గోళ్ళను కొరుక్కోవడం వుంటుంది. నొప్పితో బిగ్గరగా కేకలు వేస్తున్నప్పటికి వ్రేళ్ళను దోపుకునే వుంటారు.
గొంతు:
గొంతు బొంగురుపోవడం, మాట్లాడుటవల్ల, చదువుట వల్ల, పాడుట వల్ల ఎక్కువవుతుంది. లాలాజలం విస్తారంగా, మంట, ఒరుపు కల్గించడం, గొంతు, నొప్పిగా పుండు వలె ఉండడంతో గుటక వేయడం కష్టంగా ఉండడంతో, ఆహార పానీయాలు తీసుకోలేక పోవడం, నిద్ర పట్టకపోవడం ఉంటుంది. నాలుక నోరు లోపలి వైపు పచ్చగా ఉండి రక్తం స్రవిస్తుంది.
చల్లగాలి వల్ల, పాడుట వల్ల స్వరం పోతుంది. గొంతు బొంగురు పోవడం, గొంతు, నోరు, ముక్కు లోపల, డిఫ్తీరియా, స్కార్లటినా వల్ల నొప్పిగా ఉంటుంది. ఇది ఉపన్యాసకులు, గాయకులు, నటుల్లో ఎక్కువ.
శ్వాసావయవాలు:
ఎడమ శ్వాసకోశంలొ పుండు వలె నొప్పిగా, బాధగా ఉంటుంది. కంఠనాళంలో ఎక్కువగా కఫం చేరుతుంది. దగ్గు ఉంటుంది. క్షయ రోగలక్షణాలకిది ఉపయోగపడుతుంది.
మూత్రావయవాలు:
మూత్రం తక్కువగా రావడం లేదా అణచిపెట్టబడడం మరియు పాలిపోయినట్టుండే వారికి దీన్ని వాడిన యడల వెంటనే మూత్రం విస్తారంగా పడుతుంది.
టైఫాయిడ్ జ్వరంలో శరీరం వేడిగా ఉండి మూత్రం రాక బంధింపబడి ఉంటుంది. ప్రక్క గుడ్డల్ని పీకివేయడం లేదా ప్రోగు చేస్తుండడం చేస్తూంటారు.
చర్మంపై ఎర్రని దద్దుర్లు రావడం దురదగా ఉండి పుండ్లు పడి రక్తం కారుతుంది.
ఇలాంటి లక్షణాలున్నవారికిది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
