[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-25: బాప్టీషియా (Baptisia)
ఇది అమెరికా, కెనడాలో కొండ ప్రాంతాల్లో పిచ్చిమొక్కలాగా పెరిగే నీలిమందు మొక్క. దీన్ని వైల్డ్ ఇండిగో అని అంటారు. పెద్ద గాయాలు చీము పట్టకుండా, జ్వరం రాకుండా ఈ చెట్ల ఆకులతో కట్లు కట్టేవారు. 1857లో డా॥ థాంప్సన్ ఈ మొక్కల వేర్లు, బెరడు నుంచి ఈ మందుని తయారు చేశాడు. ఇది తరుణ వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది.
స్థానాలు:
ఈ మందుకి రక్తం, నరాలు, చర్మం, గ్రంథులు, జీర్ణాశయంపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది నరాల వ్యాధులు, జ్వరాలకి (టైఫాయిడ్, విషజ్వరాలు) ఉపయోగపడుతుంది.
కారణాలు:
మురికి గాలులు పీల్చడం, అనారోగ్య ప్రాంతాల్లో నివశించడం వల్ల, చెడు వార్తలు వినడం వల్ల, ఉపవాసాలుండడం వల్ల, మానసికంగా క్రుంగిపోవడం వల్ల కలిగే వ్యాధులకు ఉపయోగ పడుతుంది.
పోలికలు:
దీన్ని రూస్టాక్స్, ఆర్స్ ఆల్బ్, పైరోజిన్, జెల్సీమియం, ఆర్నికా మందులతో పోల్చవచ్చు.
సహచరులు:
క్రొటాలస్, నైట్రిక్ ఆసిడ్, పైరోజిన్ దీనికి సహచరులు.
ఉద్రేకం:
వీరికి బాధల్ని తల్చుకున్నా, వేసవి, కదలిక, చలిగాలి, ఆవిరి, కుడివైపు, వంగిన, నీరు త్రాగితే, మెలకువ వస్తే, పొగమంచు, పడుకున్న వైపు లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి విశ్రాంతి వల్ల, బహిరంగమైన గాలికి రిలీఫ్ ఉంటుంది.
పర్సనాలిటీ:
వీరి ముఖం, కండ్లు బరువుగా, ఎర్రగా పొంగరించి త్రాగుబోతుల ముఖం వలె వుంటాయి. వీరి పెదాలు నీలిరంగులో ఉండి పగుళ్ళుంటాయి.
మయాజమ్:
వీరిది సోరా మయాజమ్.
ఇది ఎడమవైపు పనిచేయు మందు. ఇది పిల్లలు, ముసలివారికి ఉపయోగపడుతుంది.
కాలపరిమితి:
7 రోజులుంటుంది.
మోతాదు:
3-200 M పొటెన్సీలో వాడవచ్చు.
మానసిక లక్షణాలు:
ఆలోచనా శక్తి తగ్గడం వల్ల మనస్సులో ఆందోళనగా ఉంటుంది. వీరు అస్థిమితంగా ఉండి, భయంకరమైన కలలతో నిద్ర పట్టక దొర్లుతుంటారు. భ్రమలుంటాయి. పనిమీద మనస్సు నిలబెట్టలేరు. కల్లు త్రాగినట్లుగా మనస్సు గందరగోళంగా ఉండి, గొణుగుతూ ఉంటారు. శరీరావయవాలు దేనికవి విడి పోయినట్లు, వాటిని దగ్గరగా చేర్చవలెననుకోవడం, మగత ఉంటుంది. మానసిక పరిశ్రమ ఎడల అయిష్టత ఉండి, ఆలోచించుటకు ఇష్టముండదు. నిర్లక్ష్యంతో పనిపై శ్రద్ధలేక మనస్సుని నిలబెట్టలేరు.
శారీరక లక్షణాలు:
తల:
బరువుగా దిమ్ముగా ఉండి పైకిలేస్తే కండ్లు బైర్లు కమ్మడం, తలని నొక్కి వేసినట్లుండడం ఉంటుంది. నడినెత్తిన నొప్పి, తల పెద్దదైనట్లుండడం ఉండి, తలపై భాగం పైకెగిరిపోవుననుకోవడం ఉంటుంది, తల కదలించిన మెదడులో నొప్పిగా ఉండడం వుంటుంది.
కళ్లు:
కండ్లకలక ఉండి, కళ్ళు ఎర్రబడి బాధ, వాపు, మంటతో, వెలుతుర్ని చూడలేక పోవడం వుంటుంది.
చెవులు:
వీరికి టైఫాయిడ్ జ్వరం వల్ల చెవుడు ఉంటుంది.
ముక్కు:
వీరికి తుమ్ములు, చిక్కని స్రావంతో రొంప ఉండి, నల్లని రక్తం స్రవించడం ఉంటుంది.
ముఖం:
వీరి ముఖాలు వేడిగా, ఎర్రగా, మొద్దుబారి, కందినట్లుండి, దౌడలు పచ్చగా పాలిపోయి ఉంటాయి.
నోరు:
బాధలేనట్టి గొంతునొప్పి, టాన్సిల్స్ వాపు ఉండి, కొండ నాలుక పెద్దదై దగ్గు రావడం, క్రుళ్ళిన దుర్వాసనగల స్రావంతో నోరు దుర్వాసన ఉంటుంది. నాలుక ఆర్చుకొనిపోయి దాహంగా ఉండి గట్టి ఆహారం మ్రింగలేక పోవడం, గొంతులో పుండ్లు పడి ముడుచుకొని పోయినట్లుంటుంది. వీరు ఘనపదార్థాలు మ్రింగేటప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతారు.
జీర్ణకోశం:
ఆహారనాళం, కండరాలు ముడుచుకొని పోవడం వల్ల ద్రవపదార్థాల్ని మాత్రమే మ్రింగగలరు. ఆకలి లేకపోవడం, పొట్ట ఉబ్బరం వల్ల, గుడ గుడ శబ్దాలుండడం, కడుపులో మంట, బరువుగా ఉంటుంది.
అలవాట్లు:
వీరికి బీరు, పాలు పడవు. నీరు ఇష్టం. ఆహారం అంటే అయిష్టం.
పొత్తి కడుపులో, కాలేయంలో బాధలుండి, నడుచుట వల్ల, మెట్లెక్కుట వల్ల ఎక్కువగుట ఉంటుంది. బొడ్డు దగ్గర పోటు. ముసలివారిలో, చంటి పిల్లల్లో మలం పల్చగా, ముదురు రంగుగా, దుర్వాసనతో ఉంటుంది. జిగట విరేచనాలు అవుతాయి, ఆసనంలో తీపు, బాధతో నొప్పి ఉంటుంది.
జననేంద్రియ లక్షణాలు:
పురుషుల్లో వృషణాల వాపు, బాధతో గట్టిగా ఉంటాయి.
స్త్రీలలో బహిష్టులు చాలా త్వరగా వచ్చి స్రావమెక్కువగా కావడం, టైఫాయిడ్, ఎల్లో ఫీవర్ వల్ల అబార్షన్ కావడం, బాలింత జ్వరం, ప్రసవానంతర స్రావం దుర్వాసనగా కావడం వుంటుంది. హిస్టీరియా వల్ల ఎప్పుడు చేతులు నలుపుకుంటారు.
చర్మవ్యాధులు:
చర్మం పొడిగా మంటగా ఉండి, దద్దుర్లు రావడం ఉంటుంది. పుండ్లు దుర్వాసనతో ఉండి కుళ్ళిపోవడం జరుగుతుంది. మశూచి పొక్కులు, పడక రాపిడి వల్ల పుండ్లు ఏర్పడతాయి.
రుమాటిజమ్:
నడుం కొయ్యబారి కాళ్ళు, చేతులు లాగుచున్నట్లు, పొడుచు చున్నట్లు బాధలు, తిమ్మిర్లు, పోట్లు ఉంటాయి. ఇవి ఒకచోట నుండి మరొక చోటికి మారడం వల్ల, నిద్రలో అవయవాలు నొప్పిగా, గుచ్చినట్లు బాధగా ఉంటుంది.
పిల్లల్లో నీళ్ళ విరేచనాలు, అమీబియాసిస్, దుర్వాసన గల స్రావాల వల్ల, నిస్త్రాణ ఉంటుంది. చంటిపిల్లల్లో నోటిపూత, పుండ్లు పడి చిక్కని తీగవలె లాలాజలం కారుతూ తలగడ అంతా తడిసిపోతుంది. వీరు టాన్సిలైటిస్తో బాధపడుతూంటారు. పండ్లు గారపట్టి చిగుళ్ళ నుండి రక్తం కారడం, వాంతులు, నోరు దుర్వాసన ఉంటుంది.
జ్వరాలు:
చలితో కూడిన జ్వరాలుంటాయి. నిద్రలేమితో, శరీరమంతట అలసట, అప్రయత్నంగా మలమూత్ర విసర్జన కావడం, మూత్రం బంధింపబడడం ఉంటుంది. మగతగా ఉండి, పరాకు మాటలు మాట్లాడుచూ నిద్రపోవడం, శ్వాస కష్టంగా ఉండడం, మనస్సు కంగారుగా, తెలివి తప్పినట్లుండడం ఉంటుంది. టైఫాయిడ్లో గోధుమ వర్ణ జిగట విరేచనాలుంటాయి. ఇది సెప్టిక్ ఫీవర్స్, స్కార్లటినా, డిఫ్తీరియా, పొంగు, మశూచికం, టైఫాయిడ్, ఎల్లో ఫీవర్, మలేరియా జ్వరాలకు మంచి మందు. దుర్వాసన గల చెమటతో జ్వరం తగ్గుతుంది. పడుకున్నప్పుడు తలకాని, శరీరంకాని విడిపోయి దూరంగా ఉన్నట్లుండి, తనను తాను దగ్గరికి తీసుకొనజాలలేక నిద్రపోలేరు. ప్రక్కలో దొర్లుతుంటారు. తాను ముగ్గురు వ్యక్తులని వారిని కప్పి ఉండలేనని తలస్తుంటారు. రోగి ఏవిధంగా పడుకున్న రోగి ఆని పరున్న భాగాలు పుండు వలె, కముకు దెబ్బ తగిలినట్లుగా ఉండడం వల్ల పరుపు గట్టిగా ఉంటుంది. సన్నిపాత జ్వరాలందు కల్గు పుండ్లకిది మంచి మందు. నరాల ఉద్రేకంతో నిస్త్రాణత, నడుం, కాళ్ళు చేతుల్లో నొప్పులుంటాయి. తీవ్రజ్వరంతో ఇలియో సీకల్ భాగంలో నొప్పిగా ఉండి పసుపు పచ్చని దుర్వాసన గల విరేచనాలుంటాయి. పండ్లపై నల్లని మచ్చలుండి, నాలుక మధ్య పొడవుగా గోధుమ రంగు పూత ఉంటుంది. అంచులు మాత్రం ఎర్రగా ఉంటాయి. తనను మంచానికి గొలుసులతో కట్టివేసినట్లు, కాలువలో ఈదుచున్నట్లు, కలలతో కూడిన నిద్ర, నిద్రలో గుండె బరువయ్యే స్థితి ఉండేవారికి ఇది మంచి మందు. రోగి మిక్కిలి నిస్త్రాణగా ఉండటం వల్ల పడుకోవాలని ఉంటుంది.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
