[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-26: బెల్లడోనా (Belladonna)
బెల్లడోనా అనగా ఇటలీ భాషలో అందమైన స్త్రీ అని అర్థం. ఎట్రోపా కుటుంబానికి చెందిన మొక్క కనుక దీన్ని ఎట్రోపా అని కూడా అంటారు. ఇది విషతుల్యమైన మొక్క అయినప్పటికీ ప్రాచీన కాలం నుంచీ గడ్డలు, పుళ్ళు మానడానికి ఉపయోగిస్తున్నారు. దీన్నే డెడ్లీ నైట్ షేడ్ అని అంటారు. పుష్పించే మొక్క మొత్తాన్ని గుజ్జుగా చేసి డా॥ హానిమన్ పొటెన్సీగా తయారుచేశారు.
స్థానాలు:
ఈ మందుకి రక్తం, గుండె, మెదడు, నాడీ మండలం, శ్వాసావయవాలపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది తరుణ వ్యాధులు, రక్తనాళాలు, నరాలు, తల, ముక్కు వ్యాధులకు ఉపయోగపడుతుంది.
సహచరి మందులు:
కాల్కేరియా కార్బ్, సల్ఫర్, చైనా, కామొమిల్లా, హెపార్, లేకసిస్, స్ట్రమోనియం దీనికి సహచర మందులు.
విరుగుళ్ళు:
కాంఫర్, కాఫీ, ఓపియం, హయాస్యామస్, ఎకోనైట్, హెపార్ సల్ఫ్ దీనికి విరుగుళ్ళుగా పనిచేస్తాయి.
కారణాలు:
ఎండ వేడిమి వల్ల, గాలికెదురుగా నడవడం వల్లా, తల వెంట్రుకలు కత్తిరింపు తర్వాత, తల తడిసిన తర్వాత, నిల్వ చేసిన మాంసాహారం తిన్నా, వాతావరణం మార్పుల వల్ల, చర్మవ్యాధులు అణిచిపెట్టడం వల్ల, చెమట పట్టునపుడు చలిగాలి తగిలితే వచ్చే వ్యాధులకు ఉపయోగపడుతంది.
పర్సనాలిటీ:
వీరు బొద్దుగా చలాకీగా, రక్తాధిక్యత, కండరపుష్టి గల తెలివైన స్త్రీలు.
పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఉల్లాసంగా ఉండి, చిన్న అనారోగ్యానికే క్షోభకు గురై తలక్రిందులయ్యే స్వభావం ఉంటుంది. వీరు నాడీమండలోద్రేకత గల క్షయరోగులు.
ఉద్రేకం:
వీరికి సాయంత్రం, తాకుడు, ధ్వనులు, కదలిక, పడుకున్న, వేసవి, అర్ధరాత్రి, ఒత్తిడి, సాయంత్రం 3 గంటల తర్వాత వెలుతురుకి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి భోజనం చేసినా, వెచ్చని గది, విశ్రాంతి, నిల్చుండుట వల్ల ఉపశమనం ఉంటుంది.
తత్త్వం:
వీరిది నాడీమండలోద్రేకత గల క్షయ తత్త్వం.
మయాజిమ్:
వీరిది సోరా, ట్యూబర్‌క్యులార్ తత్త్వం.
కాల పరిమితి:
1 – 7 రోజులు.
మోతాదు:
6-30, 200 పొటెన్సీలో వాడవచ్చు.
ఉపయోగకారి:
ఇది కుడివైపు పనిచేయు మందు. ఇది పిల్లలు, స్త్రీలకు ఉపయోగపడుతుంది.
మానసిక లక్షణాలు:
వీరు కోపం, ఆందోళనలతో ఎక్కువగా ఉమ్మివేస్తుంటారు. పళ్ళు పట పట కొరకడం ఉంటుంది. వెలుతురు, శబ్దాలు భరించలేక చీకటిలో ఒంటరిగా వుండాలనుకుంటారు. మానసిక లక్షణాలు జ్వరాలందు, ఉన్మాదం, సంధిలో ఎక్కువవుతాయి. దయ్యాలు, భూతాలు, నల్లని జంతువులు కన్పించి భయంతో కేకలు వేయడం, ఉలిక్కి పడడం, దొర్లడం వుంటుంది.
శారీరక లక్షణాలు:
తల:
స్రావాల్ని ఆపుట వల్ల, రక్తదోషం వల్ల, చల్లగాలికి, మెట్లెక్కుట వల్ల, త్వరగా నడుచుట వల్ల, నరాల వీక్‌నెస్ వల్ల వచ్చే తలనొప్పులకు ఇది మంచి మందు.
నుదురు, తలమీద బరువు పెట్టినట్లు, నొక్కినట్లు నొప్పిగా ఉండడం, ఒక కణతలో నుండి రెండవ కణతలోకి వచ్చు నొప్పి బాధగా ఉండడం, తల త్రిప్పు ఎక్కువగా ఉండి వెనుకకు తూలడం, దృష్టి సరిగా ఆనకపోవడం వుంటుంది. తలను, తలగడలోనికి దోపుకుంటారు. తలత్రిప్పు పొజిషన్ మారినపుడు, ముందుకు వంగినపుడు, ముందుకు లేచినపుడు ఎక్కువవుతుంది.
కళ్ళు:
కండ్లు పొడిగా బిర్ర బిగిసి ఉండడంతో మంటని, వెలుతుర్ని చూడలేకపోవడం ఉంటుంది. వస్తువులు తలక్రిందులుగా, ఒక వస్తువు రెండు వస్తువులుగా కనపడడం, కండ్ల వాపు, కండ్లు అంటుకోవడం, నీరు కారడం వుంటుంది.
చెవి:
చెవుల్లో హోరు, పోటు ఉండి, ధ్వనుల్ని భరింపలేక పోవడం, స్రావం కారడం, చెవి ప్రక్క మాంస గ్రంధులు ఎర్రబడి మంటగా ఉంటుంది.
ముక్కు:
ముక్కు నుండి రక్తం కారడం వల్ల, ముక్కు ఆర్చుకొని పోయి శ్వాస కష్టంగా ఉంటుంది.
ముఖం:
ముఖం ఉబ్బి ఎర్రగా వెచ్చగా ఉండడం, పై పెదవి వాచడం, నోరు బిగపట్టుట వల్ల దౌడలు వాయడం, ముఖం మీద కండరాలు కదలడం జరుగుతుంది.
నోరు:
నోరు ఆర్చుకునిపోయి పొడిగా, దాహంగా ఉండడం, నోటి నుండి నీళ్ళూరడం, ఎంత నీరు త్రాగినా నోటియందు తేమ ఉండదు. స్ట్రాబెర్రీలాగా ఎర్రటి నాలుక ఉంటుంది.
పిల్లలు:
పళ్ళు వచ్చేటప్పుడు, భయపడినా, దండించినా, చల్లగాలికి, వేసవిలో వచ్చే పొర్లు, అంటువ్యాధులు, జ్వరాలు, విరేచనాలు, టాన్సిల్స్, గవదబిళ్ళలవాపుకి ఇది మంచి మందు, నిద్రలో కలవరింతలుండటం; ప్రక్క తడపడం, పళ్ళు నూరడం, కడుపునొప్పి ఉంటుంది. వీరి గొంతు లోపల ముడుచుకొని పోయినట్లుండడం వల్ల మ్రింగడం కష్టంగా ఉంటుంది.
జీర్ణకోశ లక్షణాలు:
ఆహార పానీయాలు తీసుకున్న తర్వాత కడుపులో త్రిప్పినట్లుండుట, కడుపులో నొక్కుచున్నట్లు మంట, శూల ఉండి, భోజనానంతరం నోటిలో క్రుళ్ళిన వాసన, పైత్యం వాంతులుంటాయి.
పొత్తి కడుపు దిగువకు నొక్కుచున్నట్లు బాధగా ఉండి ఉబ్బరించి ఉంటుంది. వీరు వేడి, మంట, బాధ వల్ల తాకుడు భరించలేరు.
మలం పల్చగా, ఆకుపచ్చని ఆమ్లంతో, రక్తంతో జిగురు మట్టిరంగులో ఉండి అప్రయత్నంగా విరేచనమవుట వల్ల మలాశయం వెలుపలికి రావడం, రక్తంతో మొలలు, జిగట విరేచనాలుంటాయి.
మూత్రం బంధించబడి చుక్కలు చుక్కలుగా రావడం; తరుచు మూత్రానుమానంతో కొద్దిగా అప్రయత్నంగా పోవడం వుంటుంది. మూత్రకోశంలో బంతి అటు ఇటు తిరుగుచున్నట్లు నొప్పి ఉంటుంది.
జననేంద్రియ లక్షణాలు:
పురుషుల్లో:
కుడివైపు వృషణం వాచి బాధగా ఉండడం, బీజాలు గట్టిపడి పైకి బిగపట్టి లాగినట్లుండుట, సంభోగేచ్ఛ లేకపోయినా స్వప్న స్ఖలనాలు ఎక్కువగా ఉంటాయి.
స్త్రీలలో:
బహిష్టులు త్వరగా, ఎక్కువగా, గడ్డలు గడ్డలుగా దుర్వాసనతో పోవడం ఉంటుంది. నడుంనొప్పి, కడుపునొప్పికి కాళ్ళు ముడుచుకొని పడుకోవడం ఉంటుంది. బహిష్టుకు ముందు బాధలెక్కువ. బాలింతల్లో స్తనాల్లో బాధలు ఉంటయి. ప్రసవానంతరం రక్తస్రావం కావడం, గర్భకోశం దిగజారినట్లుంటుంది. ఇది సర్విక్స్ కేన్సర్, సర్వెకల్ ఎర్రోజన్‌కి మంచి మందు.
శ్వాసకోశ లక్షణాలు:
పొడి దగ్గుతో గొంతు బొంగురు పోవడం, పిల్లికూతలుండడం, ఛాతీలో కఫమెక్కువగా చేరడం వల్ల శ్వాస చాలా కష్టంగా ఉండడం, స్వరపేటికలో వాపు, నొప్పి ఉండడం జరుగుతుంది. రొంప, దగ్గు వల్ల నిద్రరాక పోవడం, గొంతు నొప్పికి ఎప్పుడూ గుటక వేయాలని ఉండడం, గొంతులో ఇరిటేషన్ ఉండి, చలిగాలికి లింఫ్ గ్రంథులు వాయడం వుంటుంది.
చర్మవ్యాధులు:
వీరికి ముక్కు, బుగ్గల మీద కురుపులు లేచి చీము పట్టడం, సెగ్గెడ్డలుండటం, చర్మం ఆర్చుకొని పోయి వెచ్చగా ఉండి పాలిపోయి ఉంటుంది. పొంగువలె ఎర్రని దద్దుర్లు వేడికి రావడం, కామెర్లరోగి వలె చర్మం పచ్చబడి వుంటుంది.
జ్వరాలు:
శరీరం వెచ్చగా ఉన్నా చెమట పట్టకపోవడం. ఒకప్పుడు చలిగా, ఒకప్పుడు వెచ్చగా ఉంటుంది. జ్వరం మధ్యాహ్నం రావడం, ముఖం ఎర్రబడి ఉండడం, శరీరం కాలిపోతున్నట్లు వేడిగా ఉండడం, తలకు మాత్రమే చెమట పడుతుంది. నిద్రలో మూలగడం, మాట్లాడడం, రక్త ప్రసరణాధిక్యత వల్ల ధనారింపు, ఈడ్పులుంటాయి.
ఇతరాలు:
బాధలు ఎంత అకస్మాత్తుగా తీవ్రతతో వస్తాయో అంత త్వరగా తగ్గిపోతాయి. ఇది పైనుంచి క్రిందికి వచ్చే బాధలకుపయోగపడుతుంది.
ఇన్ఫెక్షన్‌కి గురైన భాగాలు వేగంగా వాచి రక్తం కూడుకొని ఎర్రగా కంది అదురుతున్నట్లుంది. తాకితే సహించలేరు. జిగురు పొరలు పొడిగా వుంటాయి. తలలోని రక్తనాళాలు పగిలి స్పృహ లేకపోవడం, పొర్లు, వడదెబ్బకు, మెదడు వ్యాధులకి మంచి మందు ఇది. ఇలాంటి వారికి సూచించదగ్గ మందు ఇది.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
