Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-26

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-28: బ్రయోనియా (Bryonia)

బ్రయోనియా అనగా గ్రీకు భాషలో ‘ఉబ్బుట’ అని అర్థం. దీని వేరు ఊరు తుండడంతో దీనికాపేరు వచ్చింది. దీని పూలు తెల్లగా ఉండడంతో ‘ఆల్బ’ అంటారు. లాటిన్‌ భాషలో ఆల్బ అంటే ‘తెలుపు’ అని అర్థం. యూరోప్‌లో విరివిగా పెరిగే ఈ మూలిక వేరు యొక్క రసంతో డా॥ హానిమన్‌ హోమియో మందు తయారు చేశాడు. దీన్ని వైట్‌ బ్రయోనియా, వైల్డ్‌ హాప్స్‌, విటిస్‌ ఆల్బ అని అంటారు.

స్థానాలు:

ఈ మందుకి కీళ్ళు, శ్వాసావయవాలు, రక్తం, జీర్ణకోశం, జననేంద్రియాలపై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఇది కీళ్ళ వ్యాధులు, నరాల వ్యాధులు, కండర వ్యాధులకు ఉపయోగపడుతుంది.

పర్సనాలిటీ:

వీరు సన్నగా, పొడవుగా ఉండి కండర పుష్టితో, నల్లని కేశాలు, నల్లని శరీర ఛాయ కల్గి, కోపిష్టులై వుంటారు. వీరి ముఖం ఉబ్బరించి ఎర్రని మచ్చలతో రోగి మత్తెక్కినట్లు అయోమయంగా ఉంటాడు.

కారణాలు:

ఇది స్రావాల్ని, చర్మంపై పొక్కుల్ని, దద్దుర్లను అణిచిపెట్టడం వల్ల, అతిగా తినుట వల్ల, చలిగాలి దోషాల వల్ల, పులిసిన పదార్థాలు తీసికొనుట వల్ల, వేడి చేయుట వల్ల, కోపం, భయం వంటి మానసిక లక్షణాల వల్ల, మద్యం సేవించుట వల్ల, దెబ్బలు తగలడం వల్ల వచ్చే వ్యాధులకుపయోగపడుతుంది.

సహచరులు:

దీనికి అల్యూమినా, ఎకోనైట్‌, కాలీకార్బ్‌, రూస్టాక్స్‌, లైకో, నేట్రంమూర్‌ సహచరులైన మందులు.

ఉద్రేకం:

వీరికి వేడి వల్ల, కదలిక వల్ల, భోజనానంతరం, శ్రమ, వెచ్చని గది, వెచ్చదనం, ఇస్త్రీ చేయడం, నడక, ఎండాకాలం, సాయంత్రం 9 గం॥ దగ్గిన, ఊపిరి పీల్చిన, పులుపు, వేడి ఆహారం తిన్నా, ఆలోచించినా ఉద్రేకం ఎక్కువ అవుతుంది.

ఉపశమనం:

వీరికి వేడి కాపడం పెట్టాలి. త్రేన్పులు, అపానవాయువులు పోతున్నా బాధగా వున్న వైపు పడుకున్నా, విశ్రాంతి తీసుకున్నా, చీకటిలో మెట్లు దిగుట వల్ల, కూర్చున్న, చల్లని పదార్థాల వల్ల, ఎత్తుట వల్ల ఉపశమనం ఉంటుంది.

మయాజమ్‌:

వీరు సోరా, సైకోటిక్‌ మయాజం కలవారు.

తత్త్వం:

వీరిది మేహవాత, పైత్య తత్త్వం.

ఉపయోగకారి:

ఇది కుడివైపు పని చేయు మందు.

కాల పరిమితి:

7 రోజులు ఉంటుంది.

మోతాదు:

30 – 1M పొటెన్సీ. దీనిని వంగని మెడకు, కీళ్ళ నొప్పులు, వాపులు, నడుం నొప్పికి, కండరాల నొప్పులు, ఛాతీలోని వాపు బాధలకి పై పూతగా మర్దనా చేయవచ్చు.

మానసిక లక్షణాలు:

వీరు ఎవ్వరితో మాట్లాడకుండా పడుకుంటారు. బద్దకం, అభద్రతా భావం, ఇంటి విషయాలపై, వ్యాపారంపై, భవిష్యత్తుపై బెంగ, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడూ చిరచిరలాడుతూ కోపంగా వుంటారు. సంధిలో ఇంటికి దూరంగా వున్నట్లు ఊహించుకొని ఇంటికి పోవాలనుకొని లేవడం, వ్యాపారం గురించే మాట్లాడడం వుంటుంది. మానసికంగా విసుగు, అధిక కోపం, బ్రతుకు భారంగా తోచడం, కోరిన వస్తువులు తెచ్చి యిచ్చిన కూడా వాటిని తిరస్కరించడం వుంటుంది.

శారీరక లక్షణాలు:

వీరి నుదుటి ద్వారా మెదడు పగిలిపోయినట్లుంటుంది. మలబద్దకంతో తల బ్రద్దలగునట్లు నొప్పిగా ఉండి తలకు గుడ్డ కట్టుకుంటారు. ఇస్త్రీ  చేయడం వల్ల, దగ్గడం వల్ల, ఎండ, వేడి, కదలిక వల్ల ఎక్కువై తల బరువుగా ఉంటుంది. తల త్రిప్పుతో వస్తువులన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్లు భ్రమ ఉంటుంది. ఉదయాన, కండ్లు తెరిచినా, ముందరకు వంగినా తలనొప్పిగా ఉండి సాయంకాలానికి ఎక్కువవుతుంది.

వీరి కండ్లు బిర్రబిగిసినట్లుంటాయి. కన్నుకు దెబ్బ తగిలినట్లు ధనారింపు, మంట ఉండి, బరువుగా ఉంటుంది.

వీరి చెవుల్లో విపరీతమైన ధ్వనులు కల్గడం, కుడి చెవి వాపు బాధగా ఉంటుంది. వీరి ముక్కు కొన వాచి కురుపులు రావడం, ముక్కు నుండి రక్తం కారడం వుంటుంది. వీరి ముఖం ఎర్రగా కంది పొంగరించి వుంటుంది.

పొగను పీల్చుటచే కల్గు పంటినొప్పికిది మంచి మందు. పంటి నొప్పి చన్నీటి వల్ల ఉపశమిస్తూ వెచ్చని పదార్థాల వల్ల ఉద్రేకించడం ఉంటుంది.

నోరు:

నాలుకపై గోధమ, పసుపు పచ్చని పూత ఉండి, నాలుక గరుకుగా, బీటలు బారి ఉంటుంది.  అంచులు  ఎర్రగా  ఉంటాయి.  పైపెదవి  ఎర్రగా  వాచి  నొప్పిగా  ఉండడం, నోరు ఆర్చుకొని పోయి మాట సరిగా రాకపోవడం, గుటక వేసిన బాధగా వుంటుంది. నోరు చేదుగా ఉంటుంది.

జీర్ణకోశ లక్షణాలు:

వీరిలో ఆకలి, దాహం ఎక్కువగా ఉండడం వల్ల అజీర్తి, కడుపులో రాయి పెట్టినట్లు బరువుగా ఉండి త్రేన్పువల్ల తగ్గుతుంది. వీరిలో తిన్న తర్వాత దగ్గు, తలనొప్పి, పొట్ట ఉబ్బరం, మలబద్దకం, విరేచనాలుంటాయి. ప్రక్కటెముకల్లో పోట్లు, ఎక్కిళ్ళు. రుచి తెలియదు. పొత్తికడుపులో బిగపెట్టినట్లు నొప్పిగా ఉండి గుడ గుడలుంటాయి. కాలేయ ప్రాంతంలో బరువుగా, బాధగా ఉండి ఎడమవైపుకి తిరిగిన లాగినట్లుండి, కుడివైపు పడుకున్న ఉపశమిస్తుంది. దీర్ఘకాలిక వ్యవధిలో అధిక పరిమాణం గల నీటిని, అధిక దాహంతో తాగుతారు. ఇది ఈ మందు ప్రత్యేకత.

అలవాట్లు:

వీరికి పుల్లని వస్తువులు, కాఫీ, బీరు, ఆల్కహాల్‌, తీపి, చల్లని పానీయాలు, కూల్‌డ్రిరక్స్‌ యిష్టం. వీరికి పాలు, క్రొవ్వు, నూనె వస్తువులు అయిష్టం. వీరికి కాయగూరలు, సలాడ్స్‌, చికెన్‌ సూప్స్‌, నత్తలు, కేరట్‌ పడవు. విరేచనాలు వేడిగాలి వీచేటప్పుడు, వేడి చేసినప్పుడు, చల్లని పానీయాల వల్ల, ఉదయం, కదలికవల్ల, కాలు, చేయి కదపినా మంట, ఒరుపుతో కావడం వల్ల ఆసనంలో పుండు ఏర్పడుతుంది, దాంతో, విరేచనాలు మురికినీటి వలె ఉండి మంటతో అవుతాయి.

వేసవిలో వచ్చే అజీర్తి, నీళ్ళ విరేచనాలు, దుర్వాసనగా అవుతాయి. మలం ఎక్కువగా నల్లగా, పొడిగా, కాల్చబడినట్లుండి బహు కష్టం మీద పోవడం వుంటుంది. మల విసర్జన కోరికయే వుండక, సముద్రం వద్దకు వెళ్ళినపుడు మలబద్దకమేర్పడుతుంది.

మూత్రం గోధుమరంగులో ఉండి, ఎర్రగా, వెచ్చగా, బాధగా, మంటగా పోవడం వుంటుంది.

జననేంద్రియ లక్షణాలు:

పురుషుల్లో – బీజాల్లో పోటుగా ఉండి, సంభోగేచ్ఛ అధికంగా ఉంటుంది.

స్త్రీలలో – బహిష్టులు త్వరగా, విస్తారంగా, ముదురు రంగులో వస్తాయి. ఊపిరి పీల్చినపుడు అండాశయంలో బాధగా ఉంటుంది. బహిష్టులో కడుపునొప్పి, తలనొప్పి, స్తనాల నొప్పి ఉండి, బాలింతలో పాలు తక్కువగా పడడం, స్తనాల మీద కురుపులు రావడం వుంటుంది. స్తనాలు బరువుగా, రాయివలె గట్టిగా పాలిపోయినట్లు ఉండి, వేడిగా, నొప్పిగా ఉంటుంది.

పిల్లలు:

జబ్బు చేసినపుడు పిల్లలు విసుగుతో అది కావాలి, ఇది కావాలి అని సతాయిస్తారు. ఇచ్చిన తర్వాత విసిరికొడతారు. వీరిలో నోటిపూత ఉండి, నోరు  పొడిగా ఉండడం వల్ల పాలు త్రాగలేరు. వీరిలో పెదవులు గిల్లుకోవడం, పండ్లు కొరకడం ఉంటుంది. వీరిలో మలబద్దకం, నములుచున్నట్లు దౌడ ప్రక్కకు కదల్చడం, ఎడమ చేయి, కాలు కదల్చడం ఉండి, తిమ్మెర్లుంటాయి. పిల్లలకి తమని ఎత్తుకొనుటగాని, లేవనెత్తుట గాని యిష్టముండదు.

శ్వాసకోశ లక్షణాలు:

వీరికి భోజనానంతరం పానీయాలు త్రాగిన తర్వాత దగ్గు ఎక్కువవడం ఉంటుంది. రాత్రిళ్ళు పొడిదగ్గు వల్ల లేచి కూర్చోవడం, ఛాతీలో బాధలుంటాయి. జలుబు వల్ల వచ్చే న్యూమోనియాకి ఇది మంచి మందు. లారింజైటిస్‌ వల్ల ఊపిరి పీల్చుట కష్టంగా ఉంటుంది. దగ్గు పొడిగా, పొర్లు పొర్లుగా నోటిలో ఏదియో కుక్కినట్లు వాంతులతో తలనొప్పితో, ఛాతీలో సూదితో పొడిచిట్లుంటుంది. దగ్గు భోజనానంతరం ఎక్కువవుతుంది.

రుమాటిజమ్‌:

వీరిలో మెడ, నడుం కొయ్యబారినట్లు నొప్పిగా ఉంటుంది. పానీయాల వల్ల కాళ్ళు, చేతులు, పాదాలు వాచి ఉంటాయి. మోకాళ్ళు బిగపట్టి చీల్చుచున్నట్లు బాధగా నడవడం వల్ల ఎక్కువవుతాయి. కాళ్ళు, చేతులు లాగుతున్నట్లుండడంతో ఒళ్ళు విరుచుకోవడం వుంటుంది.

జ్వరాలు:

పొంగు, స్కార్లెటినా. మెదడువాపు, మలేరియా, టైఫాయిడ్‌, వేసవి జ్వరాలకి మంచి మందు. జ్వరంలో శరీరం పొడిగా, మంటగా, వెచ్చగా ఉంటుంది. ఒళ్ళు నొప్పులుంటాయి. తలనొప్పి, దగ్గు, విరేచనాలు, నోరు చేదుగా ఉంటుంది. చెమటలు విస్తారంగా పులిసిన వాసనగా, నూనె వలె జిడ్డుగా ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు లోపల రక్తం మరుగుతున్నట్టుగా ఉండేవారికి ఇది మేలైన మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version