Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-27

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-29: బొవిష్టా (Bovista)

బొవిష్టా పఫ్‌బాల్‌, లైకో పెర్టాన్‌ బొవిష్టా అని వ్యవహరించే కుక్కగొడుగు జాతి లోనిది. ఇటలీ దేశంలో విస్తారంగా పెరిగే లైకోపెర్డన్‌ బొవిష్టా అని పిలవబడే ఈ ఫంగస్‌ని ఆహారంగా తీసుకుంటారు. డా॥ హానిమన్‌, హార్ట్‌ ల్యాబ్‌, ఎమ్‌.ఎల్‌ సిర్కరే, డబ్లూ.ఎస్‌. గీలు – పొటెన్సీ రూపంలో ఔషధ గుణాల్ని రాబట్టారు.

స్థానాలు:

ఈ మందుకి చర్మం, నోరు, తలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వ్యాధులు:

ఇది స్త్రీ జననేంద్రియ వ్యాధులు (బహిష్టు లోపాలు), రక్తప్రసరణ వ్యాధులు, చర్మవ్యాధులు, నోటి వ్యాధులకు ఉపయోగపడుతుంది.

విరుగుళ్ళు:

కాంఫర్‌ దీనికి విరుగుడు.

సహచరులు:

సెపియా, రూస్టాక్స్‌, కాలీకార్బ్‌, ఎల్యూమినా మందులు దీనికి సహచరులు.

మయాజమ్‌:

వీరిది సోరా, సైకోటిక్‌ మయాజమ్.

టెంపర్‌మెంట్‌:

వీరు నర్వస్‌ టెంపర్‌మెంట్‌ కలిగి ఉంటారు.

మోతాదు:

3-30 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.

కాలపరిమితి:

3-10 రోజులు ఉంటుంది.

పర్సనాలిటీ:

వీరు చర్మవ్యాధులతో బాధపడే (గజ్జి, తామర, హెర్పిస్‌) వ్యక్తులు. ఇది గుండె దడతో బాధపడే అవివాహితులు, స్త్రీలు, నత్తితో మాట్లాడే పిల్లలకు ఉపయోగపడుతుంది.

ఉద్రేకం:

వీరిలో తెల్లవారుజామున, ఉదయం, చల్లని ఆహారం, పౌర్ణమి, కాఫీ, వైన్‌‌కి లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి భోజనం చేసినా, ముందుకు వంగినా, వేడి ఆహారం తీసుకున్నా, నిటారుగా కూర్చోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.

కారణాలు:

తారు, పొగ, విషవాయువుల వల్ల ఊపిరాడక పోవడం వల్ల; కాఫీ, ద్రాక్ష, సారాల వల్ల వ్యాధులు వస్తాయి.

మానసిక లక్షణాలు:

వీరిలో మెదడు పెద్దదైనట్లు తలవడం, తరుచుగా వస్తువులు చేజార్చడం, దిగులు, డిప్రెషన్‌తో ఒంటరిగా ఉండాలనుకోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు ఉంటాయి. సెన్సిటివ్‌నెస్‌ ఎక్కువగా ఉంటుంది.

శారీరక లక్షణాలు:

వేడివల్ల తల  దురద  ఎక్కువగా  ఉండడం,  రాత్రిళ్ళు,  ఉదయం నిద్రలేవగానే తలనొప్పి, తల పెద్దదైనట్లుండి కళ్ళు తిరగడం, తల పైకి ఎత్తలేరు. జుట్టు రాలడం, తాగిన వారిలాగే మైకంతో మబ్బులు కమ్మినట్లుంటుంది. తలనొప్పి మెదడులో నుండి వచ్చినట్లుంటుంది. నొప్పి పుట్టేవరకు రోగి తలను గోకుతూనే ఉంటాడు.

కళ్ళు:

రాత్రిళ్ళు కళ్లు రసితో అంటుకొని ఉండడం వల్ల ఉదయాన చూపు ఏ మాత్రం కన్పించదు.

చెవులు:

వీరిలో చెవుడు ఉండి దురద, నొప్పి, రసి కారడం వుంటుంది.

ముక్కు:

ముక్కు తమ్మెలు పగిలినట్లుండి పొట్టు లేస్తుంది. ముక్కు రంధ్రాలు మూసుకొనిపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఉదయాన్నే ముక్కు నుండి రక్తం కారుతుంది. చిక్కటి చీమిడి కారుతుంది.

ముఖం:

బుగ్గలు వేడిగా ఉండి పగిలిపోయేటట్లు ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే బుగ్గలు పాలిపోయినట్లుంటాయి. పెదవులు చీలి చివర్లు పగిలి ఉంటాయి. పైపెదవి ఉబ్బి పొడిచినట్లుంటుంది. ముఖం మీద మొటిమలు వేసవిలో ఎక్కువ అవుతాయి. పెదవులు, దవడలు వాచి ఉంటాయి.

నోరు:

చిగుళ్ళ నుండి చిక్కని రక్తం కారడం జరుగుతుంది. చిగుళ్ళు ఉబ్బి, నొప్పి వేయడం వుంటుంది. పంటినొప్పి ఉంటుంది. అధిక రక్తస్రావం పండ్లు పీకేటప్పుడు ఎక్కువవుతుంది.

జీర్ణకోశ లక్షణాలు:

ఉదయాన్నే వికారం, నీళ్ళ వంటి మ్యూకస్‌ వాంతి అవుతుంది. టిఫిన్‌ తిన్న తర్వాత వికారం తగ్గుతుంది. రోగికి చల్లని పానీయాలంటే ఇష్టముంటుంది.

భోజనానికి ముందు, తరువాత ఎక్కిళ్ళు వస్తాయి. కడుపులో చల్లని ఐస్‌ ముక్క ఉన్నట్లుంటుంది. వికారంతో పాటు చలి మధ్యాహ్నం వరకుంటుంది. కడుపులో పోట్లు, శూల, ముందుకు వంగితే తగ్గతుంది. అలాగే ఆహారం తీసుకున్నా తగ్గుతుంది. మూత్రమెర్రగా ఉంటుంది. కడుపులో పోట్లతో కత్తితో పొడిచినట్లు బొడ్డు దగ్గర నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముసలి వారిలో కల్గు విరేచనాలు ఉదయం, రాత్రి ఎక్కువగా ఉంటాయి. నడుం చుట్టు ఉన్న బట్టలు బిగుతుగా ఉండడాన్ని సహించలేరు. కాఫీ, ద్రాక్ష సారాయి వల్ల రోగి బాధలధికమవుతాయి.

యూరినరీ లక్షణాలు:

డయాబెటిస్‌ రోగుల్లో మూత్రం పసుపు పచ్చగా లేదా సున్నం నీటివలె వుండి తరచు మూత్రానుమానం వుంటుంది. నడుం చుట్టూ బిగుతుగా ఉన్నా సహించలేరు.

స్త్రీల వ్యాధులు:

గర్భాశయానికి రక్త ప్రసరణ అధికంగా ఉండడం వల్ల బహిష్టులు త్వరగా వచ్చి స్రావమెక్కువగా అవుతుంది. బహిష్టు బహిష్టుకు మధ్య బ్లీడింగ్‌ అవుతుంది. పగలు సాధారణంగా ఏదో ఒక పని చేస్తుండటం వల్ల బ్లీడింగ్‌ అంతగా కాదు. వీరికి బ్లీడింగ్‌ రాత్రిపూట కావడం ముఖ్య లక్షణం. బహిష్టుకు ముందు, బహిష్టులో నీళ్ళ విరేచనాలవుతాయి. విరేచనానంతరం కడుపునొప్పి ఉంటుంది, ఆసనంలో మంట ఉంటుంది.

బహిష్టు తర్వాత చిక్కని ఆకుపచ్చని తెల్లమైల రాత్రుళ్ళు ఎక్కువై బట్టలకు అంటుకుంటుంది. బహిష్టు సమయంలో గజ్జలు, తొడలు ఒరుసుకొని పోతాయి. అండాశయంలో కలిగే కంతుల్ని ఇది నివారిస్తుంది. స్త్రీ గర్భాశయంలో తప్ప ఇతర అవయవాలలో రక్తప్రసరణ మెల్లగా ఉండడం వల్ల శరీరానికి నీరు పడుతుంది.

చర్మవ్యాధులు:

వేడి  వల్ల  శరీరం దురదగా  ఉంటుంది.  దద్దుర్లు,  పులిపిర్లు  ఉంటాయి. చీము పొక్కుల నుండి రసికారుతూ పొక్కులు కట్టి ఉంటాయి. గోరుచుట్టుకి ఇది మంచి మందు.

శరీరమంతా ఉబ్బరించి ఉండడం వల్ల రిస్టువాచీ, మేజోళ్ళు, బూట్లు మొదలైనవి ధరించే చోట, మొద్దుగా ఉండే పనిముట్లను, కత్తెర, చాకుని ఉపయోగించడం వల్ల వాటి ఒత్తిడిచే శరీరమంతా లోతుగా ఆనవాళ్ళు పడతాయి. ఆనెలు, చర్మంపై చిన్న నీటి పొక్కులుంటాయి. చంకలో చెమట నీరుల్లి వాసన వేస్తుంది. ముడ్డిపూస చివర భాగం పచ్చిగా, పుండువలె అయ్యేంతవరకు దురదకు గోకుతుంటారు. ఇది దీర్ఘకాలం నుండి ఉండే దురదతో కూడిన దద్దుర్లకుపయోగపడుతుంది.

కీళ్ళ నొప్పులు:

నాడీమండలోద్రేకం వల్ల కీళ్ళలో అధికమైన నీరసం వల్ల వస్తువుల్ని జారవిడవడం ఉంటుంది. దెబ్బలు తగిలిన చోట కీళ్ళ సంధుల్లో నీరు పడుతుంది. కాళ్ళు, చేతులు అలసటగా ఉంటాయి. వెన్నెముక చివర భరించలేనంత దురద ఉండి ఆ భాగం పచ్చి పుండులాగా అయ్యేంత వరకూ గోకుతుంటారు. జాయింట్‌ పెయిన్స్‌ ఎక్కువగా ఉండి ఏ వస్తువును పట్టుకోలేక జారవిడుస్తుంటారు. పనిచేస్తే కాళ్ళూ చేతులు చచ్చుగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత ఉదయాన్నే మత్తుగా ఉంటుంది.

ఇలాంటి వారికి ఇది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version