[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-30: కెన్నబిస్ సటైవా (Cannabis Sativa)
హెంపు లేదా గంజాయి (అమెరికన్, యురోపియన్) అని పిలువబడే వృక్షజాతికి చెందిన ఈ మొక్కను డా॥ హానిమన్ మొదట హోమియోలో ప్రవేశపెట్టినాడు.
స్థానాలు:
ఈ మందుకి నరాలు, జననేంద్రియాలు, శ్వాసకోశాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధులు:
ఇది గనేరియా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వ్యాధులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
పర్సనాలిటీ:
వీరి ముక్కు రాగివలె ఎర్రగా వాచి ఉంటుంది.
కారణాలు:
మద్యం, పొగాకు, గనేరియా, నరాల దోషాల వల్ల వ్యాధులు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది.
పోలికలు:
కాప్సికం, జెల్సీమియం, కాంథరిస్, పెట్రోసెలీనం మందులతో పోల్చవచ్చు.
విరుగుళ్ళు:
కాంఫర్, మెర్క్‌సాల్, నిమ్మరసం.
మయాజమ్:
సైనోటిక్, సిఫిలిటిక్ మయాజమ్స్ ఉన్నవారికి మంచిది.
ఉద్రేకం:
వీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు, పడుకున్నప్పుడు ఉద్రేకం ఎక్కువవుతుంది.
ఉపశమనం:
వీరు నిలబడినపుడు రిలీఫ్ ఉంటుంది.
కాల పరిమితి:
ఈ మందుకి 2 – 3 వారాలు కాలపరిమితి ఉంటుంది.
మోతాదు:
30-200 పొటెన్సీలు వాడవచ్చు.
మానసిక లక్షణాలు:
వీరికి మతిస్థిమితం లేకపోవుట; తల, ఆసనం, జీర్ణకోశం, గుండెల నుండి నీటి చుక్కలు పడుతున్నట్లుంటుంది. నిలకడలేమి ఉంటుంది. కలగా ఉన్నట్లు తోచడం, మనస్సు – త్రాగినవానివలె ఉంటుంది.
శారీరక లక్షణాలు:
తల:
త్రాగినవాని వలె తల త్రిప్పడం. తల మీద ఏదో ప్రాకినట్లు, చల్లని నీరు జారి పడుతున్నట్లుంటుంది.
కళ్ళు:
గనేరియా వల్ల కళ్ళు ఎర్రగా ఉండి వాయడం జరుగుతుంది, కండ్ల కలకలుంటాయి.
ముక్కు:
ముక్కు నుండి రక్తం కారడం జరుగుతుంది.
జీర్ణకోశం:
పొట్టయందు ఏదో బరువుగా ఉన్నట్లుంటుంది. పొట్ట ఉబ్బరం ఉంటుంది. పైత్యరసం, పసరుని వాంతి చేసుకోవడం వుంటుంది. నొప్పులతో కూడిన నీళ్ళ విరేచనాలు లేదా మలబద్దకం ఉండి మలం గట్టిగా ముక్కుతూ విసర్జించడం ఉంటుంది. గుటక వేసేటప్పుడు గొంతు నొక్కివేయబడినట్లుండి పొలమారుతుంది. ఆసనం నొక్కివేయడం వల్ల మొండిరకం మలబద్దకం ఏర్పడి మూత్రం బంధింపబడుతుంది.
జననేంద్రియ లక్షణాలు:
పురుషుల్లో:
గనేరియా (సెగ) వ్యాధి ప్రథమావస్థలో వాపు, మంట, బాధ ఉండి, రెండవ దశలో మూత్రం విడుస్తున్నప్పుడు మంట, నొప్పి ఉంటాయి. పసుపు పచ్చని చిక్కని స్రావం రావడం, నడుస్తున్నప్పుడు అంగంలో మంట, ఎర్రని వాపు ఉంటుంది. ప్రొస్టేట్ గ్రంథి వాయడం, లేపనమెక్కువగా ఉండి బిగపట్టినట్లు బాధ ఉంటుంది. ఒక్కోసారి సంభోగమందు అసహ్యం, ఒక్కోసారి అధికమైన కోరిక వుంటుంది.
స్త్రీలలో:
గనేరియా వల్ల కలిగే వంధ్యత్వం, ఋతుస్రావం ఎక్కువగా అయ్యేవారికిది మంచి మందు. ఫిట్స్‌తో గర్భస్రావం కావడం జరుగుతుంది. తరచూ సంభోగం వల్ల, సెగ రోగం వల్ల గర్భస్రావం కలుగుతుంది. అమిత సంభోగేచ్ఛ పిల్లలు లేని వారిలో ఉంటుంది.
యూరినరీ లక్షణాలు:
మూత్రకోశానికి పక్షవాతం వచ్చినట్లు మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. మూత్రనాళం ఆమ్లం వల్ల, చీము వల్ల కప్పబడి ఉండడంచే మూత్రం సరిగా వెళ్ళదు. మూత్రం తెల్లగా లేదా రక్తంతో, చీముతో కలిసి పోతుంది. మూత్రం చుక్కలుగా పోతుంది. మూత్ర విసర్జనకు ముందు, తర్వాత మూత్రనాళంలో మంట ఉంటుంది. మూత్రనాళం వాపు వల్ల మంట, కుట్టుచున్నట్టు బాధ ఉంటుంది. దీనివల్ల నడుంనొప్పి వుంటుంది. గనేరియాలో నీళ్ళ వలె పసుపు పచ్చని స్రావంతో మూత్రనాళం ద్వారా సన్నని రాళ్ళు పోవడం వుంటుంది. మూత్రనాళం పొడగున ఏమాత్రం ఒత్తిడి తగిలిన చాలా బాధగా ఉండడం వల్ల రోగి కాళ్ళు దూరంగా ఉంచి నడవడానికి కష్టపడతారు. మూత్రం అతి తొందరగా విడవాలనే ఉంటుంది. హృదయమండలమందుగాని, చుట్టుపట్ల గాని ఏదియో జారిపోవుచున్నట్లుంటుంది.
శ్వాసకోశ లక్షణాలు:
ఉబ్బసమున్న వారిలో ఊపిరాడక రోగి నిల్చుని శ్వాస పీల్చవలసి ఉంటుంది. ఛాతీలో బరువు. గురగురలాడడం, ఊపిరి తీయడం కష్టంగా ఉంటుంది. రక్తజీర, ఆకుపచ్చని ఆమ్లంతో కూడిన దగ్గుని వెంటనే తగ్గిస్తుంది. నిద్రలో భయంకరమైన కలల వల్ల నిద్రరాక, లేచిన వెంటనే ఎక్కువ అలసట చెందినట్లుంటుంది. పగలు నిద్ర మత్తుగా ఉంటుంది.
మెట్లు ఎక్కుతున్నప్పుడు పాదాల నొప్పి, మోకాలి చిప్ప జారిపోయి గుచ్చుతున్నట్లు బాధ ఉంటుంది.
కాళ్ళు, పాదాల్లో చీల్చుచున్నట్టు బాధలుండేవారికిది సూచించచగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
