Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-29

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-31: కెన్నబిస్ ఇండికా (Cannabis Indica)

దీన్ని ఇండియన్ హెంపు లేదా గంజాయి నుండి తయారు చేస్తారు. ఇది హిమాలయాలందు, టిబెట్ పీఠభూమిలో పెరిగే దీని గుణాల్ని మొదట అమెరికన్ ప్రూవర్స్ యూనియన్ వారు నిరూపించారు. హోమియో మందుగా డా. పియర్స్ ఔషధ గుణాల్ని రాబట్టడమైనది.

స్థానాలు:

ఈ మందుకి నరాలు, తల, చెవులు, కళ్ళు, ముఖం, అన్నకోశం, మలాశయంపై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఇది నరాలు, మానసిక వ్యాధులు, జననేంద్రియ వ్యాధులకు ఉపయోగపడుతుంది.

పర్సనాలిటీ:

వీరు లేత శరీరచ్ఛాయ గల్గి ఉంటారు. వీరు స్క్రాపులార్ తత్వం కల్గి వుంటారు.

పోలికలు:

బెల్లడోనా, హయ్యస్యామస్, స్ట్రమోనియం మందులతో దీనిని పోల్చవచ్చు.

ఉద్రేకం:

వీరికి కాఫీ, టీ, పొగ త్రాగడం వల్ల, కుడివైపుకు తిరిగి నిద్రించుట వల్ల, బ్రాందీ, విస్కీ మొదలైన ఆల్కహాల్ పదార్థాలు, ఉదయాన, నడక, మెట్లెక్కినా వ్యాధి లక్షణాలు ఎక్కువవుతాయి.

ఉపశమనం:

వీరికి పరిశుభ్రమైన గాలిలో, చల్లని నీటిలో, విశ్రాంతి తీసుకున్నా, నిద్రించినా రిలీఫ్ ఉంటుంది.

మోతాదు:

30-200 పొటెన్సీలో తీసుకోవచ్చు.

కాలపరిమితి:

20-30 రోజులు ఉంటుంది.

మయాజమ్:

ఇది సైకోటిక్, సిఫిలిటిక్ మయాజమ్ గల మందు.

కారణాలు:

గనేరియా సుఖవ్యాధి వల్ల వ్యాధి లక్షణాలు కలిగే వారికిది మంచి మందు.

మానసిక లక్షణాలు:

చెప్పదల్చుకున్న విషయం చెప్ప్పుటకు వాక్యం మొదలుపెట్టి పూర్తి చేయలేక బాధపడడం, కోపంతో ఏడ్వడం వుంటుంది. చివరి మాటలు, భావాల్ని మర్చిపోవడం, నిత్యం ఊహించుకోవడం, ప్రతి అప్రధానమగు మాటకు మితం తప్పి నవ్వడం, హాస్యం, తుంటరితనంతో నిండి ఉండి తర్వాత మూల్గుతూ ఏడ్వడం ఉంటుంది. ఆలోచనలతో పిచ్చిఎక్కినట్లుండడం వల్ల, జ్ఞాపకశక్తి లేకపోవడం, నత్తి, వదరుబోతుతనం. ఒక్కోసారి కోపం, ఒక్కోసారి విచారం వుంటుంది. వీరికి మరణ భయం ఎక్కువ. అధిక త్రాగుడుచే కల్గు అధిక వాగుడు, కాలం చాలా మెల్లగా గడిచినట్లుంటుంది. కొద్ది క్షణాలు కొన్ని యుగాలున్నట్లుంటుంది. కొలది అడుగులు మైళ్ల వలె అగుపడతాయి. జ్ఞాపకశక్తి లేకపోవడం, ఒకసారి కోపం, ఒకసారి విచారం, మూడ్స్ తరుచూ మారుతుంటాయి. కపాలంపై భాగం తెరుచుకోవడం, మూసుకోవడం వంటి భావన ఉంటుంది.  తాను  ఉబ్బినట్లు  కాళ్ళు,  చేతులు  పెద్దవిగా  ఉన్నట్లు  భావించడం  ఉంటుంది.

ఆలోచనల వల్ల క్షణమైనను స్థిమితంగా ఉండదు. కన్నుల ముందు చనిపోయిన వారి స్వరూపాలు, చెవిలో ఎవరో మాట్లాచున్నట్లు, తాను కలలో ఉన్నట్లుగా, గాలిలో తేలుచున్నట్లు, ఇల్లు విరిగి మీద పడిపోవుచున్నట్లు భావిస్తారు. రోగి యొక్క మనస్సు అంతరాత్మకు లోబడి ఉన్నట్లు, తాననుకున్నది చాలా గొప్పవిగా భావించడం ఉంటుంది.

శారీరక లక్షణాలు:

తల:

తల త్రిప్ప్పుట వల్ల గాలిలో ఎగురుచున్నట్లు ఉంటుంది. కడుపులో గ్యాస్ ఎక్కువగా చేరుటవల్ల తలనొప్పి వస్తుంది. త్రేన్పుల వల్ల, అపానవాయువుల వల్ల తలనొప్పి వస్తుంది. తల వెనుకభాగాన బరువు, బాధ ఉంటుంది. కుడివైపు వచ్చు పార్శ్వపునొప్పికి ఇది మంచి మందు. అప్రయత్నంగా తరచు తల ఊపుతుండడం ఈ మందు ప్రత్యేకత. తలలో బాంబులు ప్రేలుచున్నట్లు పెద్ద ధ్వనులు వినిపించడం ఉంటుంది.

కళ్ళు:

చదువుచున్నప్ప్పుడు అక్షరాలు కలుసుకున్నట్లుండడం వల్ల చికిలించి చూడడం ఉంటుంది. కన్నులు అదురుతుంటాయి.

చెవులు:

రెండు చెవుల్లో పోట్లు ఉండి, గింగురుమనుచున్నట్లు ఉంటుంది, నీళ్ళు సలసల కాగుతున్నట్లుంటుంది. పరాకుగా ఉన్నప్ప్పుడు పాడుచున్నట్లు ధ్వనులు వినపడడం, తెలివి వచ్చినప్ప్పుడివి మాయమవుతాయి.

నోరు:

నిద్రమత్తుగా ఉండి నిద్రలో పండ్లు పటపట కొరకడం, నత్తిగా మాట్లాడడం, గొంతు ఆర్చుకొని పోవడం, లాలాజలం తెల్లగా, చిక్కగా, నురగగా, జిగురుగా ఉంటుంది. గొంతు ఆర్చుకొని పోవడం వుంటుంది.

జీర్ణకోశ లక్షణాలు:

విపరీతమైన ఆకలి, కడుపుబ్బరం ఉండి, త్రేన్పులు వచ్చిన తర్వాత తగ్గుతుంది. పసుపు పచ్చని నీళ్ళ విరేచనాలు, కడుపు వాయుపూరితమై తలనొప్పి ఉండి, గ్యాస్ పైకి లేదా క్రిందికి వెడలిన తలనొప్పి తగ్గుతుంది.

ఎక్కువ బాధ  లేకుండా  విసర్జన  అవుతుంది.  ఆసనమందు  గుండ్రని  బంతి  ఉన్నట్లుండి బంతి మీద కూర్చున్నట్లుంటుంది.

జననేంద్రియ లక్షణాలు:

పురుషుల్లో:

సంభోగేచ్ఛ ఎక్కువగా ఉండి తెల్లని జిగురు వంటి పదార్థం అంగం నుండి పోవడం, నడుంనొప్పి ఉంటుంది. గనేరియా లేదా సెగ రోగంలో అంగం ముడుచుకొనిపోయి, పసుపు పచ్చని లేదా తెల్లని స్రావ మెక్కువగా పోతుంది.

స్త్రీలలో:

సంభోగేచ్ఛ ఎక్కువగా ఉండడం. 15 రోజులకే బహిష్టు రావడం ఉంటుంది. ఋతు స్రావం ఎక్కువగా బాధతో, ముదురు రంగుగా పోతుంది. జననేంద్రియంలో పొడుచుచున్నట్లు శూల అప్ప్పుడప్ప్పుడు రావడం, నిద్రపట్టక పోవడం, బహిష్టులో నడుంనొప్పి రావడం ఉండి, వంధ్యత్వంని నివారిస్తుంది. గనేరియా వల్ల అబార్షన్ కావడం, గర్భసంచిలో ఈడ్పులు, ప్రసవనొప్ప్పులు తెరలు తెరలుగా వస్తాయి.

మూత్రంలో జిగురు వంటి ఆమ్లం కలిసిపోవడం వల్ల మూత్రానుమానం ఎక్కువగా ఉన్నా, మూత్రం ఒక చుక్కయైన వెంటనే రాక కూర్చున్న కొంతసేపటికి బాధతో చుక్కలు చుక్కలుగా వస్తుంది. నవ్వితే మూత్రపిండాల్లో నొప్పి, మూత్రపిండాల్లో సలుపు ఉంటుంది. వాపు, గనేరియా వల్ల సెగస్రావం పచ్చగా వచ్చి మూత్రంలో చీము వంటి పదార్థం ఎక్కువగా వుంటుంది.

రుమాటిక్ లక్షణాలు:

కాళ్ళకు పక్షవాతం రావడం వల్ల, కొద్ది దూరం నడిచినా అతి నిస్త్రాణ చెందడం, పాదాల్లో, పిక్కల్లో నొప్ప్పులుగా ఉండడం, భుజాల్లో వెన్నెముకలో బాధవల్ల ముందుకు తిన్నగా నడవలేక వంగవలసి ఉంటుంది. మోకాళ్ళను పక్షి గోళ్ళతో పట్టినట్లుండి,తిమ్మిరిగా ఉంటుంది. నిద్రమత్తుగా ఉన్నప్పటికి నిద్రపట్టదు.

ఇతర లక్షణాలు:

నిద్రలో రకరకాల కలలతో నిద్రలేమి, శవాలు కన్పించడం, నిద్రలో చాలా భయంగా ఉంటుంది. నిద్రలో కాళ్ళు, చేతులు అదురుట, నిద్ర పట్టిన వెంటనే స్ఖలనమవడం, పగలు మాట్లాడుటకు కూడా కష్టంగా ఉండేంత నీరసం ఉండి, పడుకున్న వెంటనే గాఢనిద్ర పడుతుంది. కన్నులు మూయగానే ఊహా ప్రపంచంలోకి పోవడంతో, వీరికి సంగీతం, ఘంటానాదాలు వినిపిస్తాయి.

ఛాతీలో నొక్కినట్లుండి ఊపిరాడకపోవడం ఉంటుంది. గుండెదడతో నొక్కినట్లుండే నొప్పితో మెలకువ వస్తుంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version