[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-32: కార్బోవెజ్ (Carbo Veg)
దీన్ని వెజిటబుల్ చార్కోల్, కర్రబొగ్గు అంటారు. ఇది ప్రాణ రక్షణ మందు. వృక్ష సంబంధమైన (రెడ్ బీబ్) బొగ్గును పొటెన్సీలుగా మార్చిన వారు డా. హానిమన్.
స్థానాలు:
ఈ మందుకి రక్తం, చర్మం, జీర్ణావయవాలపై ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది.
వ్యాధులు:
ఇది దీర్ఘవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది
పర్సనాలిటీ:
ఇది సోమరులుగా వుండే స్థూల శరీరుల దీర్ఘవ్యాధులకు ఉపయోగ పడుతుంది. వీరి ముఖం పాలిపోయి కాంతిహీనంగా ఉంటుంది. శ్వాస చల్లగా ఉండి శరీరం చల్లబడి నీలిరంగులో వుంటుంది. వీరు మందకొడిగా ఉంటారు.
కారణాలు:
నిస్త్రాణ చెందే తరుణ వ్యాధులనంతరం. అమితంగా భుజించడం వల్ల, ఉప్పు, క్రుళ్ళిన కొవ్వు, మాంసం, చేపలు తినడం వల్ల, వ్యభిచారం, హస్త ప్రయోగం వల్ల, అమిత జననేంద్రియ లోలత వల్ల, జీవ ప్రధాన స్రావాలు పోవుట వల్ల, అమిత వేడి చేయడం, క్వినైన్ పాదరసం దుర్వినియోగ పర్చడం వల్ల వ్యాధి సోకుతుంది.
పోలికలు:
దీన్ని గ్రాఫైటిస్, కాష్టికం, లేకసిస్, రూమెక్స్, యుపటోరియంతో పోల్చవచ్చు.
సహచరులు:
కాలీకార్బ్, డ్రోసిరా, చైనా ఈ మందు యొక్క సహచరులని చెప్పాలి.
విరుగుళ్ళు:
ఆర్స్ ఆల్బ్, కాంఫర్, కాఫీ, లేకసిస్, ఫెర్రంమెట్ దీనికి విరుగుళ్ళు.
మయాజమ్:
ఇది సోరా, సిఫిలిస్, సైకోసిస్ మయాజమ్స్ గల మందు.
కాలపరిమితి:
40 రోజులుంటుంది.
మోతాదు:
6-200 పొటెన్సీలో మదర్ టించర్ రూపంలో వాడవచ్చు.
ఉద్రేకం:
వీరు సాయంత్రం పూట, ఉదయం, పడుకోవడానికి ముందు, గట్టిగా చదువుట వల్ల, పాడుట వల్ల, వెచ్చని గదిలో ఉన్నా, క్రొవ్వు పదార్థాల్ని తినడం వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి తేపులు, చల్లని గాలి వల్ల, విసురుట వల్ల, చల్లని ప్రదేశం వల్ల, విసర్జన వల్ల రిలీఫ్ ఉంటుంది.
మానసిక లక్షణాలు:
వీరికి మానసికాందోళన, అస్థిమితం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనలు సన్నగిల్లడం, నిర్లక్ష్య స్వభావంఉంటుంది. దయ్యాలు, భూతాల గూర్చి భయంతో చీకటిలో ఉండలేరు. ఎప్ప్పుడూ జోగుతుంటారు. సంతోషంగా, బాధగా ఉంటారు. మరొకసారి భార్యా బిడ్డలపై మనస్సేమీ చలించక బద్దకంగా ఉంటారు. ఒంటరిగా ఉండలేరు. వీరికి కోపం, చిరాకు ఎక్కువగా ఉంటుంది.
శారీరక లక్షణాలు:
తల:
వీరికి తల బరువుగా ఉండడం వల్ల తల త్రిప్పటం ఉంటుంది, నుదటిపై నొక్కుచున్నట్లు నొప్పిగా ఉంటుంది. తల వెంట్రుకలు ఊడిపోవడం వుంటుంది. తలను బద్దీతో బిగించినట్లు నొప్పి ఉండి, తల సీసంలాగా బరువుగా ఉండి తలను పైకెత్తలేరు. కదలినా, తల వెనుక భాగంలో నొప్పి ఉంటుంది.
కళ్ళు:
వీరి కండ్లు బరువుగా ఉండుట వల్ల, అధిక శ్రమ వల్ల దూరదష్టి ఆనకపోతుంది. కండ్ల ఎదుట నల్లని మచ్చలు కనిపించడం, దష్టి మాంద్యం ఉంటుంది.
చెవుడు:
చెవులలో గింగురుమనుచున్నట్లుండే ధ్వనులు ఉండి, ఆర్చుకొని పోయి చెవుడు వస్తుంది. చెవినుండి దుర్వాసన గల చీము కారుతుంది.
ముక్కు:
ముక్కు నుండి రోజూ రక్తం కారడం, తరచూ తుమ్ములు రావడం జరుగుతుంది. రక్తహీనత కల్గి ముఖం పాలిపోతుంది. వీరికి అలసట ఎక్కువగా ఉంటుంది.
ముఖం:
ప్రేత కళతో ఉంటారు. రక్తస్రావం అనంతరం ముఖం పాలిపోయి ఉంటుంది. ముఖం పసుపు లేదా ఆకుపచ్చగా, అతి చల్లని చెమటలతో చల్లగా ఉంటుంది.
పండ్లు:
చిగుళ్ళ వాపు ఉండి రక్తం కారడం, కురుపులు రావడం, చిగుళ్ళనుండి దుర్వాసన గల స్రావం రావడం జరుగుతుంది. పళ్ళు వదులుగా ఉంటాయి.
గొంతు:
గొంతు బొంగురుపోవడం వల్ల గట్టిగా మాట్లాడినపుడు మాట సరిగా రాకపోవడం, ఊపిరాడకపోవడం జరుగుతుంది. స్వరపేటిక గరుకుగా ఉంటుంది, రక్తస్రావం అవుతుంది. వద్ధుల్లో ఉబ్బసం ఉండి దగ్గుని మాన్పుతుంది.
జీర్ణకోశ లక్షణాలు:
నాలుకపై తెల్లని లేదా గోధుమ రంగు పూత ఉండి లాలాజలం తీగ వలె సాగుతూ వుంటుంది.
అలవాట్లు:
వీరికి కాఫీ, పుల్లని పదార్థాలు, తీపి, ఉప్ప్పు పదార్థాలిష్టం. క్యాబేజీ, వెన్న, పాలు, చేపలు, మాంసం, బ్రాందీ, పాడైన ఆహారం, సారాయి, కాయగూరలు, క్రొవ్వు పదార్థాలు పడవు, సులభంగా జీర్ణమగు పదార్థాలందు రోగికి అయిష్టంగా ఉంటుంది. వీటి వల్ల ఎక్కువగా త్రేన్పులు, కడుపులో మంట, బరువుగా ఉండుట, శూల ఉంటుంది. భోజనమైన కొంతసేపటికి బాధగా ఉంటుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది.
మలం పచ్చని రంగుగా, మంటగా, దుర్వాసనగా, నీళ్ళవలె, రక్తంతో, తీపుతో, పసుపు పచ్చని మ్యూకస్‌తో, అప్రయత్నంగా వెళుతుంది. దుర్వాసన గల జిగట విరేచనాలుండి, విరేచనమయ్యేటప్ప్పుడు ప్రొస్టేట్ గ్రంధి స్రావం పోవడం వుంటుంది. పొట్ట ఉబ్బరం, త్రేన్పుల వల్ల గుండెలో మంట, వికారం, ఉదయాన అప్రయత్నంగా దుర్వాసన గల విరేచనాలవుతుంటాయి.
జననేంద్రియ లక్షణాలు:
స్త్రీలలో ముట్లుడిగే కాలంలో నడినెత్తిన మంట ఉంటుంది. బహిష్టులో అరికాళ్ళు, అరిచేతులు, ఎముకల్లో మంట, ఒరుపు కల్గించే ఆకు పచ్చని కుసుమ. బహిష్టుకు ముందు, బహిష్టు సమయంలో ఉదయం పూట కావడంతో రోగి కులాసాగా ఉంటారు. బాలింతల్లో, ముట్లుడిగే కాలంలో రక్త స్రావాలవుతాయి.
రుమాటిక్ లక్షణాలు:
కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు, నొప్ప్పులు ఉంటాయి. కీళ్ళు వంగకపోవడం, బరువెక్కి మొద్దుబారినట్లుంటాయి. పక్షవాతం వచ్చినట్లుండుట వల్ల, శరీరంలో ఏ భాగం కదపలేనంత నీరసంగా ఉన్నను తల మాత్రం అటు ఇటు కదుపుతుంటారు. శరీరం పైకి చల్లగా వున్నా అంతర్గతావయవాలందు మంటగా ఉంటుంది. వ్యాధిగ్రస్త భాగాలు నీలిగా ఉండి కాళ్ళు చేతులుబ్బి రక్త స్రావాలు కల్గుతాయి. ఎముకల్లో కూడా మంట ఉంటుంది. కొంచెం దూరం నడిస్తే శరీరం చల్లబడి పడుకుండిపోతారు. జీవ ప్రతీకార శక్తి క్షీణించడం వల్ల సిరలందు రక్త ప్రసరణ స్తంభించి వుంటుంది. కాళ్ళు, చేతుల్లో నొప్పులుంటాయి. టైఫాయిడ్, చలి, క్షయ జ్వరాల అనంతరం కల్గు అనారోగ్యాలకిది మంచి మందు. వెరికోజ్ వెయిన్స్‌కి ఇది మంచి మందు. ఇలాంటివారికిది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
