[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-33: కాక్టస్ గ్రాండి ఫ్లోరస్ (Cactus grandiflorus)
నైట్ – బ్లూమింగ్ సెరెయస్ అనే కాక్టాసియ వృక్ష తరగతికి చెందిన మొక్క నుండి హోమియో మందును తయారు చేయడమైనది.
స్థానాలు:
ఈ మందుకి తల, కళ్ళు, ముక్కు, ముఖం, నోరు, గుండె, అన్నకోశం, మలాశయం, మూత్రాశయంపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పర్సనాలిటీ:
రక్తాధిక్యతచే మెదడు రక్తనాళాల్లో రక్తస్రావాలు వల్ల కలిగే పక్షవాతంకి ఇది మంచి మందు.
పోలికలు:
దీన్ని ఎకోనైట్, డిజిటాలిస్, జెల్సిమియం, కాల్మియా, లేకసిస్, టబాకంతో పోల్చవచ్చు.
విరుగుళ్ళు:
కాంఫర్, ఎకోనైట్, చైనా, యుపటోరియం దినికి విరుగుళ్ళు.
ఉద్రేకం:
వీరికి మెట్లెక్కడం, మధ్యాహ్నం, నడుచుట వల్ల, ఎడమవైపు పడుకోవడం, పగలు రాత్రి 11 గంటల వేళయందు వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి విశ్రాంతి, బైటగాలిలో నిద్ర వల్ల రిలీఫ్ ఉంటుంది.
కారణాలు:
ప్రేమభంగం, తేమ, సూర్యరశ్మి, పొగాకు వల్ల వ్యాధులొస్తాయి.
మోతాదు:
Q 30 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాలపరిమితి:
1-2 వారాలు ఉంటుంది.
మానసిక లక్షణాలు:
వీరు కంగారుగా, విచారగ్రస్తంగా, ఆత్రుతతో, భయంగా ఉంటారు. ఒంటరిగా ఉండుటకు ఇష్టపడతారు. బాధ తట్టుకోలేక అరుస్తుంటారు. మరణ భయంతో వ్యాధి తగ్గదేమోనని భావిస్తారు.
శారీరక లక్షణాలు:
తల:
వీరికి మాట్లాడుట వల్ల, ధ్వనుల వల్ల, వెలుతురు వల్ల తలనొప్పి ఎక్కువై తల బ్రద్దలగునట్లు బాధగా ఉంటుంది. కుడివైపు టైమ్ ప్రకారం వచ్చే నరాల బాధకిది మంచి మందు. నడి నెత్తిన బరువుగా ఉండి, నొక్కినట్లుంటుంది. తలను మిషన్‌లో పెట్టి బిగించి నొక్కు చున్నట్లు బాధగా ఉంటుంది. ముట్లాగిపోయేటప్ప్పుడు వచ్చే తలనొప్పికిది మంచి మందు.
కళ్ళు:
వీరి దృష్టి సన్నగిల్లి దూరం వస్తువులు సరిగా కనపడకపోవుట ఉంటుంది.
ముక్కు:
వీరికి ముక్కునుండి తరచుగా రక్తం కారుట ఉంటుంది. నీళ్ళవంటి స్రావం కారుతుంది.
ముఖం:
ముఖం ఎర్రని వాపుతో ఉండి, ఒక్కోసారి పాలిపోవుట, చల్లని చెమట శరీరమంతా పట్టుట ఉంటుంది.
నోరు:
పండ్లు గారపట్టి నోటి నుండి దుర్వాసన వస్తుంది. నాలుక ఉదారంగుగా ఉంటుంది. గొంతు దగ్గర నొక్కుచున్నట్లు ఉంటుంది.
జీర్ణకోశంలో మంట, అజీర్ణం మూలంగా తల త్రిప్పడం ఉదయాన్నే ప్రారంభమై రోజంతా ఉండడం, రక్తం వాంతులుండి, పులి త్రేన్పులు, కడుపులో మంట, బొడ్డు చుట్టు బాధ ఉంటుంది.
మలం నల్లగా, గట్టిగా విసర్జనమవుతుంది. మొలలు వాచి బాధగా ఉండడం, మలాశయం నుండి రక్తస్రావం కావడం వల్ల, భగందరం బాధగా ఉండడం వల్ల గుండె దడగా ఉంటుంది.
మూత్రం మంటగా, చుక్కలు చుక్కలుగా పోవడం, రాత్రిళ్ళు మూత్రానుమానం వల్ల మూత్రం ఎక్కువగా పోతుంది.
స్త్రీల వ్యాధులకిది మంచి మందు. బహిష్టులు త్వరితంగా, స్రావం తక్కువగా, నల్లగా తారులాగా రావడం ఉండి, నిద్రలో స్రావం ఆగిపోవుట ఉంటుంది.
గుండె:
గుండె ఎడమవైపు పడుకోవడం కష్టమవుతుంది. నాడి విడిచి కొట్టుకోవడం, గుండె దడ ఎక్కువగా ఉండడం వల్ల వికారంగా ఉండి స్మతి తప్పటం ఉంటుంది. ఊపిరాడకపోవుట ఉంటుంది, ఇది నడుచుట వల్ల, రాత్రిళ్ళు, బహిష్టుకు ముందర, శ్రమ వల్ల, ఎడమవైపు పడుకున్నప్పుడు కల్గుతుంది. ఇనుపచేతిలో గుండెను గట్టిగా పట్టి, వదులుతున్నట్లుండి గుండె కొట్టుకోవడానికి కూడా స్థలం లేనట్లుంటుంది. ఛాతీ అడుగు భాగంన సన్నని తీగె లేదా దారంతో గట్గిగా బిగించినట్లుంటుంది.
శ్వాసకోశ లక్షణాలు:
ఛాతీపై పెద్ద బరువు పెట్టినట్లుండి, దగ్గరకు నొక్కినట్లుంటుంది. పొగాకు వాడే వారు మెట్లెక్కుచున్నప్ప్పుడు ఊపిరాడుట కష్టంగా ఉండుట, ఛాతీలో కఫం వల్ల ఊపిరాడక పోవుటచే మూర్ఛిల్లుట, ఊపిరి పీల్చుట కష్టమై నుదుట చెమట పట్టి, పడుకున్న గుండె బరువుగా ఉంటుంది. ప్రేమ భంగం వల్ల వచ్చే గుండెదడకిది మంచి మందు. గాఢమైన ఆలోచనల వల్ల, గట్టిగా ఊపిరి పీల్చుట వల్ల, స్వల్ప పరిశ్రమ వల్ల గుండెదడ వస్తుంది. హృదయం వాస్తుంది.
రుమాటిక్ లక్షణాలు:
నడుం భాగం, చేతులు మంచులా చల్లగా ఉండి, కదలినపుడు నడుం వంగకపోవడం, కాళ్ళు చేతులు ఉబ్బడం, ఎడమ చేయి, పాదం, కాలుకు నీరు పట్టడం, ఎడమచెయ్యి మొద్దుబారడం, భుజాల్లో మేహవాత నొప్ప్పులుంటాయి. ప్రతి చోట నొప్ప్పులు మెరుపు తీగవలె కల్గుచు గట్టిగా బిగించినట్లుండి మరల మరల కల్గుతాయి. కీళ్ళన్నింటికి కల్గు వాతం చేతులందు ప్రారంభమగును.
జ్వరం పీరియాడికల్‌గా ప్రతిరోజూ ఒకే సమయంలో (11 గంటలకు) రావడం, నడుం చేతులు చల్లగా ఉండి, రక్త స్రావాలు కారడం; ఆయాసం, స్పహ తప్పడం, తీరని దాహం ఉంటుంది. మలేరియా జ్వరంలో చలి మధ్యాహ్నం పూట ఉంటుంది. వీరిలో అతివేదన, మంటతో కూడిన వేడి, ఆయాసం ఉంటుంది.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
