Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-32

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-34: కాప్సికం (Capsicum)

ఇది వృక్ష తరగతికి చెందినది. కయెనె పెప్పరు లేదా రెడ్ పెప్పర్ (మిరపకాయ) అని పిలవబడే దీన్ని హోమియో పొటెన్సీగా మలచినవారు డా॥ హానిమన్. దీన్నే స్పానిష్ పెప్పర్ అని అంటారు.

స్థానాలు:

ఈ మందు గొంతు, చెవి, ఎముకలు, మూత్రపిండాలు, నోరు, నాలుక, రెక్టమ్, ఛాతీ, చర్మంపై ప్రభావం చూపుతుంది.

వ్యాధులు:

ఇది మూర్ఛ వ్యాధులు, చలిజ్వరంకు ఉపయోగపడుతుంది.

పర్సనాలిటీ:

వీరు నల్లగా, మొద్దుగా ఉండి రక్తాధిక్యతతో నాడీమండలోద్రేకత గల్గి లావుగా ఉంటారు. వీరు లేతవర్ణం గల కేశాలు, నీలి కన్నులు కల్గి, ముక్కు చివర ఎర్రబుగ్గలు కల్గి ఉంటారు. వీరు సంతోషంగా ఉండే స్వభావం గలవారు. కాని స్వల్ప విషయాలకే కోపం తెచ్చుకుంటారు. జీవప్రతీకారశక్తి లేదు.

చిన్నపిల్లలు  మొండిగా,  లావుగా  అపరిశుభ్రంగా  ఉండి,  మడ్డిగా  మొద్దుగా  ఉంటారు. వీరు పనిచేయుటకు, ఆలోచించుటకు ఇష్టపడరు. ఎప్పుడూ చలితో ఉంటారు. ఆరుబైట గాలి అనిన భయం, ఎర్రని బుగ్గలతో, నిద్రలేమితో ఇంటి మీద ధ్యాసతో ఒంటరిగా ఉండి, నిద్రమత్తులో తూలుతుంటారు.

తత్త్వం:

వీరిది ప్లెగ్మాటిక్, శ్లేష్మతత్వం. ఇది ఎడమవైపు పనిచేయు మందు.

మయాజమ్:

ఇది సోరా మయాజం గల మందు.

కారణాలు:

వీరు చలిని తట్టుకోలేరు, మిరపకాయలు, కాఫీ, మద్యం, నీరు ఎక్కువగా త్రాగడం వల్ల, (ఊరగాయలు, కారం తినడంవల్ల), క్వయినా ఎక్కువగా ఉపయోగించడం వల్ల వ్యాధులు వస్తాయి.

పోలికలు:

ఏపిస్, బెల్లడోనా, బ్రయోనియా, కెలేడియమ్, పల్సటిల్లా మందులతో దీన్ని పోల్చవచ్చు.

చలి జ్వరం నందు దీని అనంతరం సినాబాగా పనిచేస్తుంది.

మోతాదు:

దీన్ని 30 – 200 Q పొటెన్సీలో వాడవచ్చు.

కాలపరిమితి:

4 – 8 దినాలుంటుంది.

ఉద్రేకం:

వీరికి విశ్రాంతి, మోకాలు ముడిచినప్ప్పుడు, చల్లని నీరు త్రాగినా, గాలి, తేమ, స్నానం చేసినా, ఊరికే గుటక వేయుట, త్రాగుటచే. తినుట వల్ల ఎక్కువ అవుతుంది, త్రాగుబోతులకు మంచి మందు.

ఉపశమనం:

వీరికి కదలిక, వేడి వల్ల; తినేటప్ప్పుడు రిలీఫ్ ఉంటుంది.

మానసిక లక్షణాలు:

జీవోష్ణం తక్కువగా ఉండడం వల్ల తేలికగా నిస్త్రాణ చెందుతారు. ఒంటరిగా ఉండాలనుకోవడం, మిరపకాయ తిన్నవారి వలె, ఎప్ప్పుడూ చిరాకుగా ఉండడం, చిన్నదానికి కోపగించుకోవడం ఉంటుంది. ఆలోచనలయందు, శ్రమయందు, చల్లదనం నందు ఆసహ్యత కల్గుట, మత్తుగా ఉండుట. రోగి మానసికంగా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఉంటుంది, హోమ్‌ సిక్‌నెస్ ఉంటుంది. శరీరం యొక్క చల్లదనం అధికమైన కొద్దీ రోగికి కోపం కూడా అధికమవుతుంది. మొండిపట్టు ఉండి, ఒకరు ఔనన్నది తాను కాదను స్వభావం కలిగి ఉంటారు. వీరిలో సులభంగా కోపం చెందడం, ఇంద్రియ జ్ఞానమెక్కువగా ఉంటుంది.

శారీరక లక్షణాలు:

తల:

వీరికి దగ్గినప్ప్పుడు, తల కదల్చినప్ప్పుడు బ్రద్దలగునట్టి తలనొప్పి ఉండి ఎక్కువవుతుంది. తల పొడిచినట్లు నొప్పిగా ఉండి, విశ్రాంతి వల్ల ఉద్రేకించి కూర్చున్నప్ప్పుడు, కదలిక వల్ల ఉపశమిస్తుంది. ఈ నొప్పికి తాళలేక రెండు చేతులతో గట్టిగా పట్టుకొంటారు.

చెవి:

చెవి బాధ ఎక్కువవడం వల్ల, పడుకుంటారు. తల క్రింద ఎత్తు పెట్టుకొని పడుకోవడం వల్ల రిలీఫ్ వుంటుంది. చెవినుండి చీము కారడం, పోటు, మంట, చెవుల వెనుక వైపు (మష్టాయిడ్) వాచి బాధగా  పొడిచినట్లు  ఉంటుంది.  తాకినా పుండువలె  బాధగా  ఉంటుంది. దగ్గినా ఎక్కువవుతుంది.

గొంతు:

అంగిలి, గొంతు, నాసికా రంధ్రాలు, ఛాతీయందు, రెక్టమ్, మూత్రకోశమందు దగ్గరకు నొక్కివేస్తున్నట్లు ఉంటుంది. గుటక గుటకకు మధ్య గుటక వేయుటకు ముందు, వెనక చల్లినట్లు మంటగా బాధగా ఉండి, దగ్గినపుడు ఎక్కువవుతుంది. త్రాగుబోతుల్లో, పొగ త్రాగేవారిలో గొంతులో గురగురగా నొప్పిగా  ఉండడం, కొండ నాలుక వాచి పొడవగుట, మాననటువంటి బొంగురు గొంతుకి ఈ మందు బాగా పనిచేస్తుంది. గొంతులో పొడారినట్లుండి నొప్పి చెవిలోకి వ్యాపించడం, కsఠం, ఇతర భాగాలందు కారం చల్లినట్లు మంట, బాధ ఉండి వేడిచే ఉపశమించదు. వీరిలో టాన్సిల్స్ వాచి ముదురు ఎరుపు రంగులో ఉబ్బి పుండు వలె తీవ్రమైన బాధతో ఉంటాయి.

దగ్గినపుడు మూత్రకోశం, మోకాళ్ళు, కాళ్ళు, చెవుల్లో నొప్పి కల్గుతుంది. ఛాతీలో నొక్కుచున్నట్లుండే బాధలుండి, ఊపిరాడకపోవడం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద అరుపుతో కూడి వచ్చే దగ్గు సాయంత్రం, రాత్రి ఎక్కువవుతుంది. నాడీ మండల సంబంధమైన పొర్లుగా వచ్చు దగ్గుతో, తల ముక్కలై పోవుచున్నట్లుంటుంది. దగ్గినపుడు దుర్వాసన గల గాలి రోగి నుండి వస్తుంది. దగ్గినపుడు వాసన తీవ్రంగా కాకుండా ఛాతి, గొంతు భాగాలందు నొప్పి ఉంటుంది.

గుటక గుటకకు మధ్య ఇతర బాధలు అధికమవుతాయి. గొంతుమండి ఘాటైన వేడిగాలి వచ్చినట్లుంటుంది.

జీర్ణకోశ బాధలు:

నోరు దుర్వాసనగా ఉండి, నోటిలో మంటతో కూడిన నీటి పొక్కులుంటాయి. కాలేయం, ప్లీహం వాపు, బాధ ఉంటుంది. జీర్ణకోశంలో మంట, వికారం ఉండి, ఆహారం జీర్ణం కాక గుండెలో మంట, పొట్ట ఉబ్బరం ఉంటుంది. వేడి పదార్థాలందు కోర్కె ఎక్కువగా ఉండి, దాహమున్న పానీయాల్ని త్రాగిన వెంటనే కంపం వస్తుంది. పొట్ట వ్రేలాడుచున్నట్లుంటుంది. వీరికి ఉద్రేకాన్నిచ్చే పదార్థాలందు కోర్కె ఉంటుంది.

మలాశయం నుండి రక్తంతో కూడిన మలం, మంటగా, తీపుతో పోవడం ఉండి, నడుం నొప్పి ఉంటుంది. జిగట విరేచనాలుండి, విరేచనానంతరం దాహం వేయడం, మంచి నీరు త్రాగినపుడెల్లా, అనంతరం ఉధృతమైన చలి, వణుకు వస్తుంది. ఆసనంలో బాధ, దురద, మంట ఉండి రక్త స్రావంతో కూడిన మొలలు వెలుపలికి ఉబ్బి ఉంటాయి. ఆసనంలో (మిరియాలు) కారం చల్లినట్లు మంటగా ఉంటుంది.

జననేంద్రియ లక్షణాలు:

పురుషుల్లో: అంగం, బీజాలు చల్లగా ఉండడం, నపుంసకత్వం. ప్రోస్టేట్ గ్రంథిలో బాధ, మూత్రనాళంలో బాధ, వాపు ఉండి గనేరియా ఆఖరి దశలో ఉండేవారికిది మంచి మందు.

స్త్రీలలో  ముట్లాగిపోయే  ముందు  వచ్చే  స్రావాలకిది మంచి మందు.  ఇది  వికారంతో  కూడి  ఉండడం, అండాశయం వద్ద బాధగా ఉంటుంది.

మూత్రద్వారం వద్ద ఎక్కువ మంటగా ఉండి, మూత్రం చుక్కలుగా వచ్చిన తర్వాత ధారగా గొట్టంలో నుండి వచ్చినట్లు విసర్జించబడుతుంది. ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. మూత్ర విసర్జన ముందు, రెక్టమ్ నందు నొక్కినట్లుంటుంది.

వేసవిలో దాహంతో రోజూ విడిచి రోజూ జ్వరం రావడం. పానీయాలు త్రాగిన వెంటనే కప్పుకోవడం, వెంటనే వణుకు వస్తుంది. చలి నడుంలో లేదా భుజాల మధ్య ప్రారంభమైన, వెచ్చదనం వల్ల కప్ప్పుకోవడం వల్ల ఉపశమించడం, చలికి ముందు దాహంగా ఉంటుంది. వీరు శబ్దాల్ని భరించలేరు. జ్వరం, చెమట పట్టేటప్ప్పుడు దాహం  ఉండదు.

ఇలాంటివారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version