Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-33

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-35: చిలిడోనియం మేజిస్ (Chelidonium majus)

సెలండైన్ అనే వృక్షజాతికి చెందిన ఈ మొక్కనుండి ఔషధ గుణాలు రాబట్టినవారు డా॥ హానిమన్.

స్థానాలు:

ఈ మందుకి లివర్, జననేంద్రియాలు, మోకాళ్ళు, ప్రేవులు, మూత్రపిండాలపై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఇది కామెర్లు, గాల్ స్టోన్స్, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది.

పర్సనాలిటీ్:

వీరు సన్నగా, బక్కపల్చగా ఉండే లేతవర్ణం గల (తెల్లగా లేదా పాలిపోయిన) వ్యక్తులు. కాలేయం, జీర్ణకోశ వ్యాధులతో బాధపడే కోపిష్టి స్వభావం గలవారు. ఇది అన్ని వయస్కుల వారికి స్త్రీ, పురుషులిరువురికి ఉపయోగపడుతుంది.

కారణాలు:

కాలేయ రోగాలు, వాతావరణ మార్పులు.

పోలికలు:

ఎకోనైట్, బ్రయోనియా, లైకో, మెర్క్‌సాల్, నక్స్ సెపియా, సల్ఫర్, శాంగ్వినేరియా మందులతో దీన్ని పోల్చవచ్చు. చిలిడోనియం తర్వాత ఆర్స్, లైకో, సల్ఫర్ వాడుకోవాలి.

మోతాదు:

30-200 పొటెన్సీ, మదర్ టించర్ రూపంలో వాడుకోవచ్చు.

కాల పరిమితి:

ఈ మందు ప్రభావం 14 రోజుల వరకు ఉంటుంది.

విరుగుళ్లు:

ఎకోనైట్, కాంఫర్, కాఫీ, కామెమిల్లా దీనికి విరుగుళ్ళు. బ్రయోనియాకిది విరుగుడు.

ఉద్రేకం:

వీరికి కదలిక వల్ల, తెల్లవారు జామున, కుడివైపు, అవయవాలు నొక్కుట వల్ల; దగ్గినా, ముట్టుకొన్నా, గాలి మార్పు కలిగినా, ఉదయం, సాయంత్రం 4 గంటలకు వ్యాధి లక్షణాలు ఉద్రేకించబడతాయి.

ఉపశమనం:

వీరికి భోజనానంతరం, పాదాలు నొక్కుట వల్ల; పాలు, వెచ్చని భోజనం భుజించుట వల్ల, వేడిస్నానం చేసినా, వెనకకు వంగినా ఉపశమనం ఉంటుంది.

తత్వం:

వీరిది పైత్యతత్వం. ఇది కుడివైపు పనిచేయు మందు.

మానసిక లక్షణాలు:

వీరికి మానసికంగా స్థిమితం లేకపోవడం వల్ల, విచారగ్రస్తంగా ఉంటారు, ఎక్కువ మతిమరుపు, ఆలోచనావేగం సన్నగిల్లడం ఉంటుంది.

శారీరక లక్షణాలు:

తల:

ఇది కుడివైపు వచ్చే పార్శ్వపు నొప్పికి మంచి మందు. నొప్పి చెవుల వెనుకకు, వీపు వరకు వ్యాపిస్తుంది.

కళ్ళు:

వీరి కళ్ళు పసుపు రంగులో ఉండడం, కుడివైపు కంటిలో నరాల బాధ, నొప్పి ఉండి కన్నీరు అధికంగా కారుతుంది.

ముఖం:

వీరి ముఖం పసుపు పచ్చగా ఉంటుంది. వీరి ముక్కు, దౌడలు ఎక్కువ పచ్చగా ఉంటాయి. నోటి నుండి దుర్వాసన రావడం ఉంటుంది. వీరి చర్మం, అరిచేతులు పచ్చబడడం ఉంటుంది.

జీర్ణకోశ లక్షణాలు:

వీరి నాలుక పసుపుపచ్చగా ఉండి అంచులు ఎర్రగా పండ్ల అనవాలుతో ఉంటాయి. జీర్ణకోశంలో బాధ ఉండి, నాలుకపై మందమైన పచ్చని పూత ఉంటుంది. వెచ్చని ఆహార పానీయాలందు మిక్కిలి యిష్టంగా ఉండి. ఆకలి లేమి ఉంటుంది. వీరిలో ఎక్కిళ్ళు, తరచు త్రేన్పులు వస్తాయి. భోజనం చేసిన ఉపశమనంగా ఉంటుంది.

పొత్తికడుపులో, కాలేయంలో, ప్లీహంలో బాధలు. బొడ్డు దగ్గర శూల ఉంటుంది. వీరికి కామెర్ల రోగం ఉండడం వల్ల, కడుపు ముందరకు వ్రేలాడినట్లుంటుంది. కాలేయం వాచి పెద్దదై పుండులా బాధగా ఉండి, నొప్పి కాలేయం నుండి వెన్నెముకలోకి వ్యాపిస్తుంది. కుడి రెక్క అడుగున కంటిన్యూవస్ నొప్పి గాల్‌స్టోన్స్ వల్ల కల్గుతుంది. ఇది జీర్ణకోశంలోనికి, గుండెలోకి వ్యాపిస్తుంది.

వీరిలో మలబద్దకం, విరేచనాలు తారుమారవుతుంటాయి. వీరిలో మలం గట్టిగా, గుండ్రని ఉండల వలె ఉండి మేక పెంటికల వలె పసుపు పచ్చగా, జిగటగా, మట్టిరంగులో పోతుంది.

విరేచనాలు రాత్రి సమయంలో అవుతాయి. తెల్లగా, లేదా గోధుమ వర్ణంలో, నీటివలె, ఉడికించిన పిండి వలె ఉండి జిగురుగా, అప్రయత్నంగా పోతుంటాయి.

జననేంద్రియ లక్షణాలు:

స్త్రీలలో బహిష్టులు ఆలస్యంగా వచ్చి, స్రావమెక్కువగా, చాలా రోజుల వరకుంటుంది.

మూత్రం ఎక్కువ నురగతో పసుపు పచ్చరంగులో పోతుంది. కుడివైపు, కుడి తుంటి, కుడి కాలు, కుడి పాదం మంచులాగా చల్లగా ఉంటే, ఎడమది మామూలుగా ఉంటుంది. కాళ్లు చేతులు తొడల్లో మేహవాత నొప్ప్పులుంటాయి. వ్రేళ్ళ చివర మంచు వలె చల్లగా ఉండి, మొద్దుబారుతుంది. వీరిలో కామెర్లు ఉంటాయి. కాలేయవ్యాధుల్లో కుడి భుజం నొప్పి ఉంటుంది.

శ్వాసకోశ లక్షణాలు:

వీరిలో పొర్లు పొర్లుగా దగ్గు వస్తుంది. దగ్గేటప్ప్పుడు నోటినుండి చిన్న చిన్న ముద్దలుగా కఫం వస్తుంది. కాలేయ వ్యాధులతో వచ్చే న్యూమోనియా, కోరింత దగ్గుకిది మంచి మందు. గట్టిగా ఊపిరి పీల్చినపుడు నొప్పిగా ఉండి ఊపిరాడక పోవడం ఉంటుంది. చర్మం దురదగా, పసుపుపచ్చగా ఉండి ఎర్రని మొటిమలు, పొక్కులతో వేడిగా ఉంటుంది. కాళ్ళు చేతులు, తొడలు, జాయింట్స్‌లో నొప్పులు ఉంటాయి. వ్రేళ్ళ చివర మంచువలె చల్లగా ఉంటుంది. ఇలాంటివారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version