Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-36

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-38: కన్వలేరియా (Convallaria majalis)

ఇది రష్యాలో లిల్లీగా పిలవబడేది. నాష్‌ దీని ఔషధ గుణాలు రాబట్టినారు.

స్థానాలు:

దీనికి గుండెపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

వ్యాధులు:

గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు ఇది ఉపయోగపడుతుంది.

ఉద్రేకం:

వీరికి వెచ్చని గదిలో, వేడి గాలుల వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి బహిరంగమైన గాలిలో నడిచిన ఉపశమనం ఉంటుంది.

కారణాలు:

సిగరెట్స్ కాల్చడం వచ్చే గుండె జబ్బులు.

కాలపరిమితి:

2-3 వారాలు ఉంటుంది.

మోతాదు:

30 పొటెన్సీలో వాడవచ్చు. గర్భాశయ రోగాలున్నప్పుడు ఉపయోగపడుతుంది.

మానసిక లక్షణాలు:

వీరు ఎప్పుడూ విచారంగా, విసుగుగా ఉండడం వల్ల బుద్ధి మందంగా ఉంటుంది. ఈ మందుని వీరికీ, ఆలోచన శక్తి తక్కువగా ఉన్నవారికీ ఇచ్చినచో ఉపయోగం ఉంటుంది. వీరికి హిస్టీరియా అపస్మారక లక్షణాలున్న తగ్గిస్తుంది.

శారీరిక లక్షణాలు:

తల:

వీరికి తలదిమ్ము మెట్లెక్కిన, దిగిన ఎక్కువవుతుంది.

ముక్కు:

ముక్కు నుండి తరచూ రక్తం స్రవిస్తుంది. ముఖం పెదవుల మీద చిన్న చిన్న తెల్లని పొక్కులు రావడం వల్ల చర్మం గరుకుగా నొప్పిగా ఉంటుంది.

నాలుక:

నాలుక వెడల్పుగా, దళసరిగా ఉండి, పూతతో, ఎర్రబడి, చీల్చుచున్నట్లు బాధగా ఉండడం వల్ల నీళ్ళు కూడా చేదుగా ఉంటాయి.

గొంతు:

ఊపిరి తీసికొనినప్ప్పుడు గొంతుకలో మంటగా, నొప్పిగా వెచ్చగా ఉంటుంది. ఊపిరితిత్తుల వాపు వల్ల నడకలో ఆయాసం ఎక్కువుగా వస్తుంది.

గుండె:

సిగరెట్స్ కాల్చుటవల్ల కొద్ది శ్రమవల్ల కూడా గుండెదడ రావడం, గుండె ఒక్కోసారి ఆగిపోయి, తిరిగి కొట్టుకోవడం ఉంటుంది. నాడి వేగంగా, వక్రంగా కొట్టుకుంటుంది. గుండె వ్యాధి లక్షణాలు పడుకున్న తర్వాత ఉపశమిస్తాయి. పాదాలకు నీరు పట్టి, మూత్రం తక్కువగా ఉంటుంది. హృదయంలో పొడుస్తున్నట్లు బాధ, దడ ఉంటుంది.

జీర్ణకోశ లక్షణాలు:

బాగా ఊపిరి తీసుకొన్నప్ప్పుడు పొత్తి కడుపులో గుడగుడలాడుచుండుట వల్ల కట్టుకున్న దుస్తులు బరువుగా ఉన్నట్లు తోచుట. విపరీతమైన బాధగా ఉండే శూల త్వరగా వచ్చి నెమ్మదిగా పోతుంది. వేవిళ్ళకిది మంచి మందు.

ఆసనం ఎక్కువ తీపుగా ఉండుట, మలాశయం గాలితో నిండినట్లు బాధగా ఉండినను, వాయువు వెడలిన తర్వాత కూడా బాధ ఉపశమింపదు. మూత్రకోశం వాచి, పెద్దదగుట వల్ల దుర్వాసనతో కూడిన మూత్రం కొద్దికొద్దిగా తరచుగా పోతుంది. మూత్రద్వారం చివర మర్మావయవ ద్వారమందు దురదగా ఉంటుంది.

నడుంలో పోటుగా, బాధగా, తరచూ గుచ్చుతున్నట్లు నొప్పిగా ఉంటుంది. బొటన వ్రేలిలో, చీల మండలంలో, గుత్తులలో, కాళ్ళలో నొప్ప్పులు వస్తాయి. చేతులు వణకడం ఉంటుంది. చితకకొట్టినట్లు నడుంలో నొప్పిగా ఉంటుంది.

జ్వరం:

చలిగా ఉన్నప్ప్పుడు తలనొప్పి, దాహం ఉంటుంది. నడుంలో వెన్నముకలో చలి వస్తుంది. ఊపిరాడుట కష్టంగా ఉంటుంది.

చర్మం:

దోమలు కుట్టినట్లు దద్దుర్లు రావడం, దురదవల్ల ఎక్కువగా గోకుతుండడాన్ని ఇది మాన్పుతుంది.

స్త్రీ అవయవాలు:

గర్భాశయం వద్ద ఎక్కువ నొప్పి, బాధ ఉంటుంది, గుండెదడ ఉంటుంది. గర్భాశయం వాచి ఎక్కువ నొప్పి ఉంటుంది. గర్భాశయ లక్షణాలు, గుండె లక్షణాలు ద్వంద్వంగా ఉంటాయి.

ఊపిరితిత్తులు:

ఊపిరితిత్తుల వాపు వల్ల నడిచినా ఆయాసం రావడం ఊపిరి పీల్చినప్పుడు గొంతులో వేడిగా ఉన్నట్టుంటుంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version