[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-40. చైనా లేదా సింకోనా (China or Cinchona)
కాలిసయా బార్క్, పెరూవియన్ బార్క్ (పట్ట), చైనా విర్క్‌గా పిలవబడే దీన్ని హోమియో పొటెన్సీగా ప్రవేశపెట్టినవారు డా॥ హానిమన్. పెరూ దేశపు వైస్రాయి భార్య అసంసికాన్ గౌరవార్థం ఈ మూలికకు సింకోనా అని పేరుపెట్టారు. దీన్ని చైనా శక్తిదాయని అంటారు. ఈ చెట్టు వేరు బెరడు నుండి హోమియో మందుని తయారు చేయడమైనది. ఇది ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆసియా వంటి ట్రోపికల్ క్లైమేట్‌లో పెరిగే మొక్క.
స్థానాలు:
ఈ మందుకి అన్నకోశం, మూత్రావయవాలు, తల, రక్తం, నరాలపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది జీర్ణకోశ వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, చర్మ వ్యాధులు, రక్తనాళాల వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పర్సనాలిటీ:
వీరు లావుగా ఉండే, నల్లని శరీర ఛాయగల వ్యక్తులు. నిస్త్రాణ చెందే స్రావాల వల్ల నీరసించే వీరికి ముఖం పాలిపోయి ముడుచుకొనిపోయి కన్నులు గుంటలు పడి, చుట్టూ నల్లని వలయాలు ఉండి, పెదవులు నల్లగా ఎండి, పగిలి ఉంటుంది. ఇది స్త్రీలకు, ముసలివారికి ఉపయోగపడుతుంది.
కారణాలు:
ఆల్కహాల్, టీ, పాదరసం, ఫ్రూట్స్ వల్ల, హస్తప్రయోగం వల్ల, చెమట, జలుబు, మలేరియా జ్వరాలు అణగారినా, కోపం, చలి, శీతలగాలి వల్ల, జీవ ప్రధాన ద్రవాలు (రక్తం, చీము, శుక్రం, విరేచనాలు, పాలు, చెమటలు) పోవడం వల్ల, క్యాబేజి, పాలు, చేపలు, పాడైన మాంసం తినుట వల్ల కల్గు వ్యాధులకుపయోగపడుతుంది.
సహచరులు:
ఆర్స్, ఫెర్రం మెట్, కాల్కేరియాఫాస్, ఆర్నికా, కార్బోవెజ్, కాలీకార్బ్ మందులు దీనికి సహచరులు.
విరుగుళ్ళు:
ఆర్నికా, ఆర్స్, నక్స్, ఇపికాక్, కార్బోవెజ్, పల్సటిల్లా, సెపియా, సల్ఫర్, ఎపిస్, బెల్లడోనా, విరేట్రం ఆల్బమ్ దీనికి విరుగుళ్ళు.
ఉద్రేకం:
వీరికి ఎక్కువగా చలిగాలి తగులుట వల్ల, స్రావాల వల్ల, భోజనానంతరం, రాత్రి యందు చెమట పట్టిన పిమ్మట, పంఢ్లు ఫలాలు తినుట వల్ల, మాట్లాడుట వల్ల, నడుచుట వల్ల, మానసికోద్రేకం వల్ల, బాధగా ఉన్నవైపు పడుకున్నా, రతి అనంతరం ఎక్కువవుతుంది.
కాలపరిమితి:
10-20 రోజులుంటుంది.
మోతాదు:
1-200 పొటెన్సీలో వాడవచ్చు. కామెర్లకి 6వ పొటెన్సీ, ప్లీవ వ్యాధుల్లో 200 పొటెన్సీలో, మలేరియా జ్వరాలలో 3, 6, 12 పొటెన్సీలో దీన్ని వాడుకున్నచో సత్ఫలితాలనిస్తుంది.
ఉపశమనం:
వీరికి మాలిష్ వల్ల, బైటగాలిలో పరుండుట వల్ల, వెచ్చదనం వల్ల, ముందుకు వంగుట, నొక్కుట, ఒత్తిడి వల్ల, శరీరం వంచుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.
మయాజమ్:
వీరిది సోరా మయాజమ్.
తత్వం:
వీరిది ల్యూకోఫ్లెగ్మాటిక్ తత్త్వం.
మానసిక లక్షణాలు:
వీరికి మానసిక స్తబ్ధత, అలక్ష్యత ఉండి, మితంగా మాట్లాడే స్వభావం, నిరాశ, జీవితంపై విరక్తి ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యముండదు. అవిధేయత, శ్రమ యందు అయిష్టత, దురదష్టవంతుడనుకొనుట ఉంటాయి. ఎక్కువ ఆత్రుతగా ఉంటారు. కుక్కలంటే భయం. తనవైపు ఇతరులు చూచుటకిష్టముండదు.
శారీరక లక్షణాలు:
తల:
ఎక్కువగా స్రావం వెడలిన తర్వాత వచ్చు తలనొప్ప్పులు, సంభోగానంతరం. తల వెనుకభాగంన ఎక్కువ నొప్పి రావడం, శిరస్సు బ్రద్దలగునట్లు నొప్పి ఉంటుంది, మెదడు తిమ్మిరిగా ఉంటుంది. చల్లని గాలి తగిలిన పార్శ్వపు నొప్పి అధికమవుతుంది.
కళ్ళు:
పసుపు వర్ణంగా, రెప్పల మధ్య నొక్కుచున్నట్లు, వెచ్చగా ఎర్రగా, మంటగా ఉండి, చదువుచున్నప్ప్పుడు అక్షరాలు గజిబిజిగా కనపడతాయి. చల్లగాలికి తలనొప్పితో చూపు ఆనదు.
చెవులు:
గుడగుడమనే శబ్దాలు రావడం, చెవులు వినిపించవు. తాకిన ఎడల నొప్పిగా ఉంటుంది.
ముక్కు:
నీళ్ళ వంటి స్రావంతో తుమ్ములుండి, ముక్కు నుండి తరచు రక్తం కారుతుంది.
పండ్లు:
పిల్లలకి పాలిచ్చేటప్పుడు తల్లికి పంటినొప్పి. లాలాజలం అధికంగా స్రవించడం ఉంటుంది. పండ్లను గట్టిగా నొక్కి పట్టినా, వెచ్చదనం వల్ల పంటి నొప్పి ఉపశమిస్తుంది.
జీర్ణకోశ లక్షణాలు:
నాలుక పసుపు పచ్చగా, తెల్లగా, మురికివలె పూత ఉంటుంది. భోజనం చేసిన వెంటనే ఆకలైనట్లుండడం, నీరుతో సహా అన్ని చేదుగా ఉంటాయి. అజీర్తి, గ్యాస్ ట్రబుల్, త్రేన్పుల వల్ల తగ్గకపోవడం, దుర్వాసనతో కూడిన అపాన వాయువులు, తిన్నవి తిన్నట్లుగా విరేచనంలో వెళ్ళిపోవడం, వేసవిలో పండ్లు ఎక్కువగా తిన్న రాత్రిళ్ళు విరేచనాలు కావడం, లివర్, స్ల్పీన్ పెరిగి పొట్ట తాకనివ్వరు. గాల్‌స్టోన్స్ వల్ల పొట్ట ఉబ్బరం నడిచినా ఉపశమిస్తుంది. ప్రతిరోజు ఒకే వేళకు నొప్పి రావడం ఉంటుంది.
అలవాట్లు:
వీరికి స్వీట్స్, చెర్రీస్, పుల్లటి పంఢ్లు, కాఫీ, వైన్, సారాయి. చల్లని రొట్టె, మాంసం, సీజనల్ ఆహారం, వేయించిన కాఫీ గింజలు ఇష్టం. వీరికి కొవ్వు, రొట్టె, మాంసం, బీరు, పండ్లు, వేడి వస్తువులు అయిష్టం. పుల్లని వస్తువులు, కేబేజి, పాలు, పాడైన మాంసం, చేపలు పడవు. పువ్వులు, పొగాకు వాసన, వండుచున్న ఆహార పదార్థాల వాసన సహించలేరు.
అన్నకోశంలో, పొత్తి కడుపులో చల్లగా ఉంటుంది. పిల్లల్లో దీర్ఘకాలం విరేచనాలు కావడం, చిరుతిళ్ళు తినుటచే కల్గు అజీర్ణ లక్షణాలకు ఇది మంచి మందు. తలలో నీరు చేరడం, కోపం ఎక్కువగా ఉండి, నిస్సత్తువగా ఉంటారు. నోరు చేదుగా ఉంటుంది. జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. వేసవిలో భోజనానంతరం, పాలు పండ్లు, బీరు త్రాగుట వల్ల నురగతో, పసుపు పచ్చగా బాధలేకుండా, విరేచనాలు వెడలుతాయి.
జననేంద్రియ లక్షణాలు:
పురుషుల్లో – స్వప్న స్ఖలనాల వల్ల, హస్త ప్రయోగం వల్ల కల్గు నిస్త్రాణకిది మంచి మందు. వీరి బీజాలు వాచి బాధగా ఉంటాయి. స్త్రీలలో గర్భకోశం బరువుగా ఉండి, నొక్కి వేసినట్లుంటుంది. స్రావం మామూలుకన్న త్వరగా, బాధతో, నల్లని ముద్దలుగా పోతుంది. సంభోగ వాంఛ ఎక్కువగా ఉంటుంది. రక్తం జీరలతో తెల్లమైల అవడం వల్ల, తొడల్లో నొప్పిగా, బాధగా ఉంటుంది. ఇది దుర్వాసనతో, ముద్దవలె చీముతో కూడిన రక్త స్రావాలు ప్రసవానికి ముందు, తర్వాత కావడం. మావి వెడలుకుండా రక్త స్రావమవుతున్న చైనా ఉపయోగపడుతుంది.
మూత్రం ముదురు రంగులో కొద్దికొద్దిగా తరచుగా పోవడం, ఒక్కోసారి ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, యిటుక పొడి రంగుతో, మట్టితో పోతుంది. మూత్రము కొద్ది సేపు నిల్వ ఉండిన ఎడల పాలవలె తెల్లగా అవుతుంది.
శ్వాసకోశ లక్షణాలు:
భోజనానంతరం విపరీతమైన దగ్గు వస్తుంది, ఛాతీలో పిల్లికూతలు, ఛాతీలో బరువు ఉండి, శ్వాస గట్టిగా పీల్చుట కష్టంగా ఉంటుంది. రాత్రిళ్ళు, తేమగాలికి ఆయాసం, దగ్గు ఎక్కువగుట. రక్త హీనత, గుండెదడ, నిస్త్రాణ ఉంటాయి.
రుమాటిక్ లక్షణాలు:
చాలాసేపు వంగుట వల్ల, బరువు వల్ల, సూదులు గ్రుచ్చినట్లుండి, నడుంనొప్పితో ఒక చెయ్యి చల్లగా, మరొకటి వెచ్చగా ఉంటుంది. కుడి మోకాలు వాచి, వెచ్చగా, బాధగా ఉంటుంది. పాదాలు ఉబ్బుతాయి. మేహవాత నొప్ప్పులు అధికంగా ఉంటాయి. చర్మం అధిక చెమటలతో చల్లగా ఉంటుంది. చర్మం ఎర్రగా వాచి, మంటగా ఉంటుంది. తరచు కురుపులు రావడాన్ని అరికడుతుంది.
ఎప్పుడూ నిద్రమత్తుగా ఉంటుంది. భయంకరమైన కలల వల్ల కంగారు, భయం ఉండి, మెలకువ వచ్చిన మానకుండుట ఉంటుంది.
చలి జ్వరాలకిది మంచి మందు. చలి రాబోయే ముందు గుండెదడ, ఆందోళన, విపరీతమైన ఆకలి ఉండి, తలనొప్పి ఉంటుంది. చలిగా ఉన్నప్ప్పుడు దాహముండదు. తగ్గిన తర్వాత దాహముంటుంది. రోజూ విడిచి రోజు జ్వరం రావడం. నరాలు లాగడం, ముఖం ఎర్రబడుతుంది. చలిజ్వరం తర్వాత నీరసం ఆకలి ఉండదు. అవయవాల్లో నొప్పులుండి ఛాతిలో కుట్టినట్టుండి దగ్గు రావడం జరుగుతుంది. బాధగా ఉండే పైత్య జ్వరాలకిది మంచి మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
