[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-3: ఏలియం సెటైవా (Allium Sativa)
ఇది వృక్షజాతికి చెందిన వెల్లుల్లి (గార్లిక్) నుండి రాబట్టిన ఔషధం దీనిని టెస్టే అనే శాస్త్రవేత్త రూపొందించారు.
స్థానాలు:
మలాశయం, అన్నకోశం, శ్వాసావయవాలు, కాలేయం, జిగురు పొదలపై అధిక ప్రభావం చూపుతాయి.
వ్యాధులు:
బట్టతల, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులు, రుమాటిజమ్, స్త్రీల వ్యాధులలో ఎక్కువగా ఉపయోగపడుతుంది.
కారణాలు:
కలుషిత నీరు త్రాగడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం.
పోలికలు:
ఆర్సెనికం ఆల్బ్, కాలీనైట్రికమ్ కేప్పికమ్ సెనేగా, నక్స్, లైకోపోడియం మందులతో పోలిక చెప్పవచ్చు.
సహచరి: ఆర్స్ ఆల్బ్స్ మందును దీని తర్వాత వాడవచ్చు.
విరుగుడు:
లైకోపోడియం.
దీని పిమ్మట వాడరానివి: ఎలోస్, ఏలియం సేపా, సికిల్లా
ఉద్రేకం:
నడుచుట, చదువుట వల్ల, సాయంకాలం బయటి గాలిలో తిరిగిన, బహిష్టు తర్వాత కదలిక, రాత్రి అధిక భోజనం చేసినా – తర్వాత వ్యాధి లక్షణాలు అధికమవుతాయి.
ఉపశమనం:
వంగొని కూర్చోవడం, ఒత్తిడి వల్ల ఉపశమనం ఉంటుంది.
స్వభావం:
వీరు నల్లగా, కండర బిగువు కలిగి శరీర శ్రమ లేనివారు.
మయాజమ్: సోరా
ఇది స్థూలకాయులైన ముసలివారికి ఉపయోగ పడుతుంది. వ్యాధి లక్షణాలు క్రమంగా ఎక్కువై తగ్గుతాయి.
మానసిక లక్షణాలు:
నిరాశ, నిద్రలో ఏడ్వడం, ఏ మందు తన రోగం తగ్గించదని మందులు తీసుకోకపోవడం, వాటి వల్ల ప్రాణాపాయం కల్గుతుందని అనవసర భయాందోళనలు ఉండి సెన్సిటివ్‌గా ఉంటారు, తనకు ఇతరులు విషం పెడతారని తలచడం, అశాంతి ఉంటుంది.
శారీరక లక్షణాలు:
తల: జీర్ణకోశ బాధలతో బహిష్టు సమయం నందు తలనొప్పి ఉంటుంది. తల బరువుగా ఉండి, కన్నులు కూడా తెరవలేరు. కూర్చొని లేచేటప్పుడు తలదిమ్ము, వెల్లకిలా పడుకున్నప్పుడు తల వెనుక భాగంలో నొప్పి ఉంటుంది.
కంటి కలక. చదివినప్పుడు కంటి నొప్పి, నీరు కారడం, ఇరిటేషన్ ఉంటుంది.
చెవిలో గుబిలి, స్రావాల వల్ల చెవుడు ఉంటుంది. ముక్కు మొదలులో పొడారినట్లుండి నొప్పి, రాత్రిళ్ళు ముక్కు నుండి రక్తం కారడం ఉంటుంది. గొంతంలో కఫం రావడం ఉంటుంది.
నాలుక మీద తలవెంట్రుక ఉన్నట్లుండడం, చదివినప్పుడు ఎక్కువవుతుంది. లాలాజలం తీయగా, తిన్న తర్వాత రాత్రి ఎక్కువగా కావడం ఉంటుంది. నాలుక చిన్న చిన్న ఎర్రని పొక్కు లతో కూడి పాలిపోయినట్లుంటుంది.
జీర్ణకోశంలో బాధ, విపరీతమైన ఆకలి ఉండి మంటతో కూడిన తేన్పులు వస్తాయి. తీసుకునే ఆహారంలో ఏ మాత్రం మార్పు వచ్చినా బాధ కల్గుతుంది. నులినొప్పితో కూడిన మలబద్ధకం ఉంటుంది. తిన్న తర్వాత కడుపులో రాయి పెట్టినట్లు బరువు ఉండడం వల్ల ముందుకు వంగి కూర్చొని కడుపుని చేతులతో అదిమి పట్టుకున్న ఉపశమనం ఉంటుంది. వీరికి వెన్న అంటే ఇష్టం. తిన్న తర్వాత మంటలో, తేన్పులు, జీర్ణశక్తి తగ్గడం వల్ల నిద్రలేమి, మొలలు, కడుపులో పురుగులు, విరేచనం వల్ల ఆసనం వెలుపలికి రావడం ఉంటుంది.
స్త్రీ జననేంద్రియం, తొడలు పుండులాగా ఉంటాయి బహిష్టు స్రావం అధికంగా అవుతుంది. బహిష్టు ఆగిన తర్వాత తలపొడి వస్తుంది, జనవేంద్రియం, స్తనాల మీద ఎర్రని పొక్కులు రావడం, దురదలు, స్తనాల వాపు వల్ల బాధగా ఉంటుంది, పిల్లలకు పాలు మాచ్చిన తర్వాత స్తనాల వాపుండి, కుడి వైపు స్తనంలో సూదితో పొడిచినట్లు ఉంటుంది.
మూత్రం తెల్లగా, విస్తారంగా ఉంటుంది. మూత్రానమానం డయాబెటిస్ రోగుల్లో ఉండడం, గోధుమ రంగు మడ్డితో మూత్రం తక్కువగా కావడం ఉంటుంది.
పీరియాడిక్ ఆస్మా ఉండి దగ్గినప్పుడు స్వరపేటికలో ఇరిటేషన్, ఉదయం దగ్గుతో చిక్కగా, తీగవలె కఫం ఉండి తెగి రాకపోవడం, ఛాతీలో గురగుర శబ్దం రావడం, తరుచు జలుబు చేయడం, కఫం వల్ల దగ్గినపుడు నోటి నుండి దుర్వాసన రావడం, స్మోకింగ్ చేయడం వల్ల పొడి దగ్గు తెరలు తెరలుగా రావడం, ఛాతిలో పొడిచినట్లు బాధగా ఉండడం వల్ల నిద్ర పట్టక పోవడం, దగ్గు తల వంచిన, తిన్న తర్వాత, చల్లగాలిలో ఎక్కువవుతుంది.
చర్మం పొడిగా, వదులుగా ఉండి, ముడతలు పడి సెన్సిటివ్‌గా ఉంటుంది. దురద, మంట, వాపుతో కూడిన, ఎర్రటి మచ్చలు, పొక్కులు ఎక్కువుగా చేతులు, ఛాతీ మీద వస్తాయి. బట్టతల, తామర, చర్మవ్యాధులతో చేతులు పొట్లూడిపోవడం ఉంటుంది.
వెన్నెముక చివరి భాగంలో ఉదయాన కోయుచున్నట్లు నొప్పి. వీపు, రెండు భుజాల మధ్య ఎర్రటి మచ్చలతో కూడిన తామర ఉంటుంది. తుంటి నొప్పి, నడుం నొప్పి కదలిక వల్ల ఎక్కువవుతుంది. కాళ్ళు నిస్త్రాణతో, తొడలు నొప్పితో బరువు పెట్టినట్లుంది. మడమలు, మణికట్టులూ బెణికినట్లు నొప్పులు, అరచేతులు, అరికాళ్ళు మంటతో, పొడిచినట్లుండడం అరిచేతుల్లో చెమటలు పట్టడం, చేతి వేళ్ళు, కాలి వ్రేళ్ళల్లో పట్టేసినట్లు, పచ్చిపుండు లాగా నొప్పులుంటాయి. వాతావరణం మార్పులకు చిన్న కీళ్లు, వాటిపైనున్న చర్మం పట్టేసినట్లుంటుంది.
జ్వరంలో చలి, వణుకు, మధ్యాహ్నం, సాయంత్రం శరీరంలో ఒక ప్రక్కనే రావడం, జ్వరం వచ్చినపుడు వాంతులు కావడం, మధ్యాహ్నం చెమట దుర్వాసనతో.. దురద ఉంటుంది.
తిన్న తర్వాత నిద్రమత్తు, నిద్రలో కండరాల అదరడం, ఛాతీలో నొప్పి, కడుపులో బరువైపెట్టినట్లు చల్లగా ఉంటుంది. దప్పిక వల్ల, కలల వల్ల తరుచు మెలకువ రావడం వల్ల నిద్రాభంగం, ఆందోళన ఉంటుంది.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
