Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-40

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-42. క్రోకస్‌ సటైవ (Crocus sativa)

దీన్ని కుంకుమ పువ్వు (సాప్రాన్‌) నుండి తయారు చేస్తారు.

స్థానాలు:

ఈ మందుకి నరాలు, కండరాలు, కండ్లు, మనస్సు, రక్తంపై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఇది రక్తస్రావాలు, హిస్టీరియా, కొరియాకు మంచి మందు.

పర్సనాలిటీ:

వీరు తెల్లని శరీర ఛాయతో, బిగిలేని కండరాలతో నీరసించి ఉంటారు.

కారణాలు:

వేడి, భయం, స్రావాలు అణిచివేయడం వల్ల వచ్చే వ్యాధులు.

పోలికలు:

దీన్ని నక్స్‌, పల్స్‌, సల్ఫర్‌, యుస్టిలాగో మందులతో పోల్చవచ్చు.

విరుగుళ్ళు:

ఓపియం, బెల్లడోనా, ఎకోనైట్‌ దీనికి విరుగుళ్ళు.

ఉద్రేకం:

వీరికి ఉపవాసం, వేసవి, వెచ్చని గదిలో పడుకున్న ఎడల, ఉదయం, ఎక్కవుగా చూచుట వల్ల, కదలుటచే, యవ్వనం వలన, గర్భం వలన, చదువుచున్నా, వేడిచే ఉద్రేకం కలుగుతుంది.

ఉపశమనం:

వీరికి బహిరంగమైన గాలిలో, ఆవలింతలు వల్ల ఉపశమనం లభిస్తుంది.

మయాజమ్‌:

వీరిది సోరా, సైకోసిస్‌ మయాజమ్.

మోతాదు:

3-200 పొటెన్సీలో వాడవచ్చు.

కాల పరిమితి:

8 రోజులుంటుంది.

మానసిక లక్షణాలు:

మానసికంగా రోగి ఆడుచు, పాడుచు, కులాసాగా నవ్వడం, వెంటనే కోపం తెచ్చుకోవడం. విషయాలు అతి త్వరగా జ్ఞాపకం రావడం, ఒక్కోసారి సంతోషంగా మరొకసారి విచారంగా ఉంటారు. ప్రేమాస్పదంగా ఉండి, ప్రతివారిని ముద్దు పెట్టుకోవాలనుకోవడం, తనలో తాను నవ్వుకోవడం, కోపం వల్ల దౌర్జన్యపు పనులు చేసి, తర్వాత పశ్చాత్తాపపడడం జరుగుతుంది, పొట్టలో ఏదో కదులుచున్నట్లుండి గంతులు వేయుచున్నట్లు భావన ఉండేవారికిది మంచి మందు.

శారీరక లక్షణాలు:

తల:

బహిష్టుకు ముందు, బహిష్టు కాలంలో, తర్వాత ముట్లాగిపోయేటప్పుడు దడదడ కొట్టుకున్నట్లు తలనొప్పి ఉంటుంది. తలను ఎత్తినచో తల తిరుగుతుంది. తలలో దడ దడ కొట్టుకున్నట్లుంటుంది.

కళ్ళు:

చదివేటప్పుడు, వేడి వల్ల కళ్ళు నీళ్ళు కారడం ఉంటుంది. కండ్లలో గదంత పొగతో గరుగ్గా ఉన్నట్లు తోచుట వల్ల, కండ్లు నలుపుకోవడం, బాధగా ఏడ్చినట్లుండడం ఉంటుంది. కనురెప్పలు బరువుగా ఉండి, కండ్ల ఎదురుగా మబ్బుగా ఉన్నట్లు, లేదా మిక్కిలి చల్లగాలి వీస్తున్నట్లుండడంతో కనురెప్పల్ని గట్టిగా మూసుకున్నప్పుడు ఉపశమనం కల్గుతుంది. నరాలలో పోట్లు వల్ల కండ్లలో, తలలో నొప్పిగా ఉంటుంది.

ముక్కు:

ముక్కునుండి నల్లగా, జిగురుగా, తీగె వలె సాగేడి రక్తస్రావం ముద్దలు ముద్దలుగా అవుతుంది. తరచుగా తుమ్ములు రావడం, నుదుటి మీద చల్లని చెమటలు పెద్ద చుక్కలుగా ఏర్పడడం ఉంటుంది. ఇది టీనేజ్‌ పిల్లలల్లో ఎక్కువగా కన్పిస్తుంది.

నోరు:

నోటిలో పుండ్లు పడి, నీరు ఎక్కువగా ఊరడం, కొండనాలుక వాయడం వల్ల, గొంతు బొంగురు పోవడం, నాలుక తేమగా, తెల్లని పూతతో ఉండి, మొనదేలిన పొక్కులతో బాధిస్తాయి. పెదవులు పగిలిపోయి ఉంటాయి.

జీర్ణకోశ లక్షణాలు:

కొద్దిగా తిన్న, కడుపు నిండుగా ఉన్నట్లుండి, గుండెలో మంట, పొత్తి కడుపు బరువుగా తిన్న తర్వాత ఉంటుంది. ఉదయాన భోజనం చేయకపోయిన పులి త్రేన్పులు వస్తాయి. సాయంకాలం దాహమెక్కువుగా ఉండి, నీళ్ళు త్రాగిన తర్వాత, బాధగా ఉంటుంది. మలబద్దకం, వికారం ఉండి, శోషిల్లినట్లుంటుంది. జీర్ణకోశంలో, కడుపులో, గర్భకోశంలో, చేతులు లేదా శరీరం నందలి ఇతర భాగాల్లో సజీవమైన దేదియో కదులుచున్నట్లుంటుంది.

జననేంద్రియ లక్షణాలు:

స్త్రీలలో సంభోగేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. 3వ నెలలో నల్లని రక్తస్రావంతో కూడిన గర్భస్రావం అవుతుంది. బహిష్టుస్రావం ముదురు రంగుగా, జిగురుగా, తరచుగా, ఎక్కువగా, నల్లగా ఆమ్లం వంటి పదార్థంతో పోవడం ఉంటుంది. అమావాస్య, పౌర్ణమికి కొద్దిగా కదలిన రక్త స్రావమవుతుంది. ప్రసవానంతర రక్తస్రావం కావడం ఉంటుంది. ఎడమ రొమ్ములో నొప్పిగా ఉండి, కుడి రొమ్ములో ఏదో కదులుచున్నట్లుంటుంది.

శ్వాసకోశ లక్షణాలు:

ఊపిరాడనంత దగ్గు ఉండి, నురగ స్రావంతో శ్వాస పీల్చుట కష్టంగా ఉంటుంది. కఫం ముతకదారం ముక్కల వలె పోవడం వల్ల శ్వాస దుర్వాసనగా ఉంటుంది. అపస్మారక రోగుల్లో కొండనాలుక పెద్దదైనట్లుంటుంది.

రుమాటిక్‌ లక్షణాలు:

నడుంలో ఎక్కువ చల్లగా, బాధగా ఉండి, కండరాలు ముడుచుకొని పోతుంటాయి. కాళ్ళు చేతులు మంచు వలె చల్లబడడం, చట్టల్లో, మోకాళ్ళల్లో కలుక్కుమనడం ఉంటుంది. బొటన వ్రేళ్ళు ఒరియుట, పిక్కల్లో నొప్పులు, చీలమండలంలో అరికాళ్ళల్లో నొప్పులుంటాయి. చర్మం తిమ్మిరిగా, మంటగా ఉండి, పురుగులు ప్రాకినట్లుంటుంది. శరీరం ఎర్రగా ఉండి, మాననటువంటి పుండ్లలో బాధ, రసికారడాన్ని నివారిస్తుంది.

భయం లేదా సంతోషంగా ఉండే కలలతో నిద్రలో కలవరిస్తూ మేల్కోవడం, తరచుగా ఆవలింతలు రావడం ఉంటుంది. దిగువ అవయవాలకు మాత్రమే చెమట పట్టడం, చలి మధ్యాహ్నం ప్రారంభించి సాయంకాలం ఎక్కువవుతుంది. నాడిమెల్లగా కొట్టుకోవడం ఉంటుంది. చలితో, వెచ్చదనంతో దాహముండుట, నడుపు, కాళ్ళు చేతులపై చల్లని నీళ్ళు పోసినట్టు చల్లగా ఉంటుంది. ఇలాంటి వారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version