[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-43. క్రోటన్ టిగ్ (Croton Tig)
దీనిని జిల్లేడు మొక్కనుండి తయారయ్యే క్రోటన్ ఆయిల్ (నేపాళం గింజలు) విత్తనాల నుండి హెంకీ హోమియో మందుగా తయారుచేశారు.
స్థానాలు:
ఈ మందుకి చర్మం, జీర్ణకోశం, జిగురుపొరలు, గర్భాశయం, కండ్లు, ప్రేగులపై ప్రభావం ఎక్కువ.
ఉద్రేకం:
వీరికి ఎండ వలన, తాకడం వల్ల, కడుగుచున్న, ఉదయం లేచిన వెంటనే, ఆహారపానీయాలు, పండ్లు, తీపి పదార్థాలు తిన్న, త్రాగిన, వేసవి వల్ల, కదలినప్పుడల్లా, విరేచనాల వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి నిద్ర పట్టిన తర్వాత, స్తన్యం త్రాగునపుడు రిలీఫ్ ఉంటుంది.
విరుగుడు:
ఆంటిమ్ టార్ట్ దీనికి విరుగుడు.
పోలికలు:
కాలీఫాస్‌తో దీన్ని పోల్చవచ్చు.
మోతాదు:
6-30 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాల పరిమితి:
6-14 రోజులు ఉంటుంది.
వ్యాధులు:
ఇది చర్మవ్యాధులు, మలాశయవ్యాధులు, జననేంద్రియ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
మయాజమ్:
వీరిది సోరా, సైకోసిస్ మయాజమ్.
శరీర తత్వం:
వీరి ముఖం పాలిపోయి తెల్లగా ఉండడం, చర్మం వెచ్చగా సున్నితంగా ఉంటుంది.
మానసిక లక్షణాలు:
మానసిక శరీరశ్రమ చేయలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, వీధులయందు తిరగడం తప్ప ఏ పని చేయుటకు అయిష్టంగా ఉంటుంది.
శారీరక లక్షణాలు:
తలత్రిప్పుట, నుదిటిలో నొప్పితో త్రాగినవానివలె తల దిమ్ముగా ఉంటుంది. కనురెప్పలు దళసరిగా ఉండడం, కండ్లు నీళ్ళు కారుతుండడం వల్ల చూపు సరిగా ఉండకపోవడం ఉంటుంది.
ఇది, నోటిలో పుండ్లు ఉండి, మంటగా ఉండడం వల్ల లాలాజలం ఎక్కువగా రావడాన్ని, దవడలు మండటాన్ని నివారిస్తుంది. వీరి పొట్ట ఉబ్బరించి బాధగా ఉండి, నొక్కితే నొప్పిగా ఉండడం వల్ల వికారం, వాంతులవుతాయి. కాఫీ త్రాగినా వాంతి అవుతుంది. ప్లీహం దగ్గర నొప్పి, పొడుచుచున్నట్లు ఉంటుంది. బొడ్డు దగ్గర తరచూ నొప్పి సాయంకాలం రావడం ఉంటుంది. బొడ్డు క్రింద పొత్తి కడుపు ఉబ్బరించి ఉండడం, ఎక్కిళ్ళు రావడం, మలవిసర్జనకు ముందు, తర్వాత విడవనటువంటి విరేచనానుమానం ఉంటుంది. ప్రేవుల్లో గుడగుడ శబ్దాలు రావడం, ఏమి తిన్నా, త్రాగిన, వెంటనే జిగురుతో, ఆకుపచ్చని, దుర్వాసన గల నీళ్ళ విరేచనాలు స్పీడ్‌గా వెళ్ళడం, అపాన వాయువులెక్కువగా పోవడం వల్ల ఎప్ప్పుడూ నీరసంగా ఉంటారు. కడుపులో ఖాళీగా ఉన్నట్లు, కడుపు నిండుగా, బాధగా ఉండి, ముట్టుకొన్న ఎడల నొప్పిగా ఉంటుంది.
పండ్లు తిన్నప్ప్పుడు, వేసవిలో పిల్లలకు వచ్చే అజీర్ణ, మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే విరేచనాలకు మంచి మందు. వీరు ఎప్పుడూ చర్మవ్యాధులు, విరేచనాలతో తరచు బాధపడడం జరుగుతుంది.
చర్మం:
శరీరం తీవ్రమైన దురదగా ఉండడం వల్ల, గోక్కోవడానికి వీలు లేనంత సున్నితంగా చర్మం ఉంటుంది. ముఖం, జననేంద్రియాల్లో ఎక్కువ మంట, దురదతో గజ్జి పొక్కులు ఉండడం వల్ల, గోకిన ఎడల బాధగా ఉండడం రసితో కూడిన పొక్కులేర్పడతాయి. పొక్కులు మాడినతర్వాత చర్మం ఎర్రగా, గరుకుగా ఉంటుంది. మెల్లగా రుద్దిన రిలీఫ్ ఉంటుంది. పొక్కుల్లో కుట్టుచున్నట్లు బాధగా ఉండడం వలన తాకనీయరు.
ఉబ్బసం దగ్గు వల్ల శ్వాస కష్టంగా ఉంటుంది. రాత్రిళ్ళు పడుకోగానే పొరపోయినట్లు దగ్గు రావడంతో లేచి కూర్చోవాల్సి ఉంటుంది.
జననేంద్రియాలు:
బీజాలమీద చిన్న చిన్న ఎర్రని పొక్కులు రావడం, అంగం చివర ఎర్రగా ఉండి, దురదగా ఉండడం, అంగస్థంభనాలు తరచుగా కల్గడం ఉంటుంది. మూత్రనాళంలో నొప్పి, చంటి పిల్లలు పాలు త్రాగినపుడు నొప్పి వెనుకకు దారంతో లాగినట్లుంటుంది. స్తనాల్లో నొప్పి వీపు, ఛాతీలోనికి కుట్టుచున్నట్లు బాధ, జననేంద్రియాల దురద ఉంటుంది. బహిష్టులు అణిచిపెట్టబడి, పడుకున్నచో ఆయాసంగా, గుండెదడగా ఉంటుంది. స్తనాగ్రం చాలా పుండువలె ఉంటుంది. రాత్రి యందు మూత్రము నురగతో నారింజ రంగులో ఉంటే, పగటి యందు తెల్లని మడ్డితో, పాలిపోయి ఉంటుంది. కుడి భుజంలో, మోకాళ్ళలో త్రవ్వినట్లు, చీల్చినట్టు నొప్పులతో నిస్త్రాణగా ఉంటారు. ఇలాంటి వారికి సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
