[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-44. కోల్చికం ఆటంనేలు (Colchicum Autumnale)
దీనిని మిడోసాఫ్రాన్‌గా పిలవబడే వృక్షజాతికి చెందిన మొక్క నుండి తయారుచేస్తారు.
స్థానాలు:
ఈ మందుకి జీర్ణకోశంపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది జ్వరాలు, జననేంద్రియ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పర్సనాలిటీ:
వీరు వయస్సు మళ్ళినవారు, మంచి దృఢముగా, మోటుగా ఉండేవారు.
కారణాలు:
ఎక్కువగా మేల్కొనుట వల్ల, చదువుట, చెమట అణిచి పెట్టడం వల్ల, దుఃఖం వల్ల, ఇతరుల చెడుపనుల వల్ల మనసు మీద పని చేయు బాహ్యకారణాలు, వెలుగు, శబ్దం, ఘాటైన వాసనలు, స్పర్శ వల్ల ఎక్కువవుతాయి.
తత్వం:
వీరిది కీళ్ళవాతం, రక్తవాత (గౌటు) తత్వం.
పోలికలు:
బ్రయోనియాతో దీన్ని పోల్చవచ్చు. వంటికి నీరు పట్టినపుడు ఎపిస్, ఆర్సెనిక్ పనిచేయునపుడు తరచు ఇది నివారణ కల్గిస్తుంది.
విరుగుళ్ళు:
కాంఫర్, కాక్యులస్, నక్స్, పల్సటిల్లా దీనికి విరుగుళ్ళు.
మోతాదు:
3-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాల పరిమితి:
3-4 వారాలు ఉంటుంది.
ఉద్రేకం:
వీరికి రాత్రి సమయంలో, కదలిక వల్ల, నిద్రలేమివల్ల, సాయంకాలం పూట, ఆహారం వాసన తగులుట వల్ల, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్న, కష్టపడి చదివిన తర్వాత లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి ముందరకు వంగుట వల్ల, విశ్రాంతి వల్ల, బహిరంగమైన గాలిలో తిరగడం వల్ల, నొక్కుట వల్ల, ఎడమ నుండి కుడివైపు వెళ్ళే బాధలు ఉపశమిస్తాయి.
మానసిక లక్షణాలు:
వీరికి ఏ విషయంలోను తప్తి లేకపోవుట. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండుట ఉంటుంది. విశ్రాంతి కావాలనుకోవడం, మానసిక శ్రమ తట్టుకోలేకపోవడం, పరధ్యానంగా ఉండడం వంటి మానసిక లక్షణాలుంటాయి.
శారీరక లక్షణాలు:
తల:
కొంత దూరం నడిచి కూర్చున్నప్ప్పుడు తల దిమ్ముగా ఉంటుంది. తలనొప్పి రాత్రి భోజనానంతరం, వెచ్చదనం వల్ల స్థిమితంగా పరుపు మీద పడుకున్న తగ్గుతుంది. నుదుటియందు నొప్పి మధ్యాహ్నమందు, సాయంకాలం నందు ఇది ఎక్కువవుతుంది.
కళ్ళు:
బహిరంగమైన గాలిలో కండ్లనుండి నీరు కారి బాధగా ఉంటుంది. ఇది కండ్లలో శుక్లాల్ని అరికడుతుంది.
చెవులు:
చెవుల్లో దురదగా ఉండి, ఆర్చుకొనిపోవుట, హోరుమనే శబ్దాలు రావడం జరుగుతుంది. చెవి రంధ్రాల్లో బాధగా ఉండి, చీము కారుతుంది.
ముక్కు:
వీరికి ఎముకల్లో నొప్పిగా ఉండి, సాయంకాలం తరచుగా ముక్కు నుండి రక్తం స్రవిస్తుంది.
ముఖం:
వీరి ముఖం జబ్బు చేసిన వారి వలె, విచారగ్రస్తంగా పాలిపోయినట్లు, బాధపడినట్లుండి, బాధ వల్ల చిరాకుగా ఉంటుంది.
నోరు:
నోరు వెచ్చగా ఆర్చుకుపోయి నాలుక మీద తెల్లని పూత కల్గుతుంది. నాలుక గొంతు ఆర్చుకొనిపోయి, చురుక్కుమనే నొప్పిగా ఉంటుంది. చిగుళ్ళలో బాధ, పంటిపోట్లు ఉంటాయి. గొంతు బొంగురుపోవడం, గొంతులో, నోటిలో ఆకుపచ్చని ఆమ్లం చేరడం ఉంటుంది.
జీర్ణకోశ లక్షణాలు:
చేపలు, కోడిగ్రుడ్డు, కొవ్వుగల మాంసం పట్ల అయిష్టం. వాటి వాసన కూడా గిట్టదు. కదలిక వల్ల ఆహారం, పైత్యరసం, ఆమం వాంతి చేసుకొంటారు. తినుటకు చాలా వస్తువుల్ని కోరినా, వాటి వాసన తగిలిన ఎడల వికారం, వాంతులు కడుపులో మంటగా ఉంటుంది. ఒక్కోసారి మంచువలె చల్లగా ఉండి, నడిచినా చాలు, వాంతులవుతాయి. ఆహారమనిన అయిష్టంగా ఉంటుంది. ఆహారం కంటికి అగుపడినా, వాసన వల్ల అసహ్యం కల్గుతుంది.
పొత్తి కడుపులో గాలి చేరుట వల్ల బాగా ఉబ్బరించి ఉంటుంది. కడుపులో బాధగా ఉండే శూలని వెంటనే నివారిస్తుంది. వీరిలో తరచుగా విరేచనాలు ఎక్కువ బాధగా, జిగటతో వెడలుతాయి. మలాశయం వెలుపలికి వస్తుంది. మలబద్దకం ఉంటుంది.
వర్షాకాలమందు కలిగే గ్రహిణి, ప్రేగుల నుండి తెల్లని ఆమం లేదా తెల్లని పీలికల వంటి పదార్ధం అధికంగా పోతుంటుంది.
శ్వాసకోస లక్షణాలు:
శ్వాసనాళంలో నసతో కూడిన పొడిదగ్గు వస్తుంది. రాత్రుళ్ళు దగ్గినప్పుడు అప్రయత్నంగా మూత్రం పోవడం, ఉదయం గొంతు బొంగురుపోవడం ఉంటుంది. ఊపిరి ఆడడం కష్టంగా ఉంటుంది. నరాల ఉద్రేకం వల్ల నిద్రలేమి ఉండి, భయంతో తరచూ మేల్కొంటారు. గుండె పై పొరల్లో వాపు, బాధతో నొక్కుతున్నట్లు ఉండడంతో ఆత్రుతతో ఊపిరాడదు.
మూత్రకోశ లక్షణాలు:
మూత్రం నల్లగా, లేదా గోధుమ వర్ణం, రక్తంతో కలసి సిరా వలె, లేదా తెల్లగా పోతుంటుంది. మూత్రం తక్కువగా లేదా అణగారి ఉంటుంది. మూత్రంలో ఆల్బుమిన్, చక్కెర, క్రుళ్ళిన, పాడైన రక్తం కుదపలుంటాయి.
స్త్రీ జననేంద్రియం వాచి దురదగా ఉండడం, బహిష్టు తర్వాత తొడలు చల్లగా ఉన్నట్లు అనిపించడం ఉండేవారికిది మంచి మందు.
రుమాటిక్ లక్షణాలు:
మెడ, నడుం కండరాల్లో నొప్పులుండడం; వేళ్ళు, చీలమండలం, మోకాళ్ళు, మోచేతులు, కీళ్ళ సంధుల్లో నొప్ప్పులుగా ఉండడం, నొప్పులు ఒక అవయవం నుండి మరొక అవయవంలోనికి మారడం జరుగుతుంది. ఇది వేసవి కాలంలో ఎక్కువవుతుంది. శీతాకాలంలో బాధలు రాత్రియందు ఎక్కువవుతుంది. కాళ్ళు పాదాలుబ్బి నల్లగా ఉండి, నీరు పట్టడం ఉంటుంది. కీళ్ళయందు కీళ్ళ వాత నొప్పులుండి, కీలుని తాకినగాని, కాలి వ్రేలికి మెత్తనిదానితో కొట్టినప్ప్పుడు రోగి నొప్పితో కేకలు పెట్టడం జరుగుతుంది. వ్యాధిగ్రస్త భాగాలు స్పర్శను, కదలికను ఏమాత్రం సహింపజాలవు.
ముఖం, చర్మం మీద మచ్చలు, దద్దుర్లు రావడం మరియు వీపు, ఛాతీ, పొట్టమీద ఎర్రని మచ్చలు కల్గుతాయి.
జ్వరంతో, చేతుల్లో, కాళ్ళల్లో, వీపులో చలి ప్రాకుచున్నట్లుండుట. చెమట ఎక్కువగా ఉండుట, ఒక్కోసారి వెచ్చదనం ఉంటుంది. ఇలాంటి లక్షణాలున్నవారికిది మంచి మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
