[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-45. సైక్లమిన్ యూరోపియం
సోబ్రెడ్‌గా పేరొందిన ఈ వృక్షజాలం దక్షిణ యూరప్‌లో పెరుగుతుంది. పూర్వం దీని వేరును అబార్షన్ కావడానికి, కాన్పు కావడానికి, కాన్పునొప్పులు త్వరగా రావడానికి స్త్రీల పొట్టమీద రుద్దేవారు. వసంత కాలంలో ఈ చెట్టు వేరునుంచి రసాన్ని తీసి వాడేవారు. డా॥ హానిమన్ పొటెన్సీ రూపంలో కూడా స్త్రీల వ్యాధులకు ఉపయోగపడే మందుగా ప్రవేశపెట్టాడు.
స్థానాలు:
ఈ మందుకి స్త్రీల జననేంద్రియ వ్యాధులు, జీర్ణకోశంపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది జననేంద్రియాలు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పర్సనాలిటీ:
వీరు బొద్దుగా ఉండి, నీలి కళ్ళతో, గోధుమ వర్ణ శరీరచ్ఛాయతో జడంగా మందకొడిగా ఉంటారు. అవయవాలు, ఇంద్రియాలు నీరసంగా ఉంటాయి.
కారణాలు:
దుఃఖం అణుచుకోవడం వల్ల, అమితభయం, చేయవలసిన పని చేయలేకపోయినా రోగ లక్షణాలు కలిగేవారికి ఇది మంచి మందు.
తత్వం:
వీరిది ల్యూకో ప్లెగామాటిక్ తత్వం.
మోతాదు:
3 X -200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాల పరిమితి:
1-2 వారాలు ఉంటుంది.
పోలికలు:
చైనా, ఫెర్రం, కోకస్‌కాక్టి, రూస్టాక్స్, తూజా మందులతో దీన్ని పోల్చవచ్చు.
సహచరులు:
సోరినం దీనికి సహచరి.
విరుగుళ్ళు:
కాంఫర్, కాఫీ, పల్సటిల్లా దీనికి విరుగుళ్ళు.
ఉద్రేకం:
వీరు చన్నీళ్ళు తాకినా, రాత్రివేళ పడుకున్నప్ప్పుడు ఆరుబైట చల్లని గాలికి, కూర్చున్నప్ప్పుడు కదిలినా, అదిమినా, తాకినా, చదివినా, భోజనం తరువాత, రెస్ట్ తర్వాత ఉద్రేకం ఎక్కువవుతుంది.
ఉపశమనం:
వీరికి వెచ్చని గదిలో కూర్చున్నా, ఇంటిలో ఉన్నా, మెల్లగా కదిలినా, నడిచినా ఉపశమనం కలుగుతుంది. బహిష్టు తర్వాత రిలీఫ్ ఉంటుంది.
మానసిక లక్షణాలు:
వీరు చేయవలసిన పనిని చేయక చాలా విచారంతో ఉంటారు. ఏ పనిలో ఆసక్తి ఉండదు. డ్యూటీ సరిగా చేయరు. ఒంటరిగా ఉండి, బాధపడు తుంటారు. తనను దిక్కులేని దాన్ని చేసినట్లు భావిస్తారు. దుఃఖించడం వల్ల రోగి బాధలుపశమిస్తాయి. ప్రతి దానిలో విముఖత్వం, స్క్రీజోఫ్రేనియా, మానియాతో, ఒంటరిగా ఉండి, పిచ్చివారిలాగా స్పృహలో లేకపోవడం ఉంటుంది. బహిష్టు అయిన తర్వాత మానసిక లక్షణాలు తగ్గుతాయి. ముట్లుడిగే కాలంలో కల్గు మానసిక వ్యాధులకిది మంచి మందు.
ముక్కోపంతో ఎప్ప్పుడూ మండిపడుతుంటారు. మూడ్స్ తరచుగా మారుతుంటాయి. ఒకసారి పదిమందిలో ఉంటే మరుక్షణం ఒంటరితనాన్ని కోరుకుంటారు. కష్టాలు వస్తాయని ఊహించి విచారిస్తుంటారు. వీరికి చంచలత్వం ఎక్కువ. నిబ్బరం ఉండదు. ఆమెను ఎవరైనా నిరుత్సాహపరిస్తే దుఃఖిస్తుంది. మంచం మీద తనకు ఇరువైపులా ఎవరో పడుకొని తనపైన పడుతున్నట్లు భ్రాంతికి లోనవుతుంటారు.
శారీరక లక్షణాలు:
తల:
దేనిమీదనైనా జారిపడినప్ప్పుడు, మెదడు కదులుతున్నట్లు, వస్తువులు గుండ్రంగా తిరుగుతున్నట్లు తన చుట్టు ఉన్నవి తిరుగుతున్నట్లుంటుంది. ముందుకు వెనుకకు కదులుచున్నట్లుంటుంది. తలనొప్పితో చూపు మసకగా ఉండి, టైమ్ ప్రకారం కదలికవల్ల, ఎడమ కణతలో పార్శ్యపు నొప్పి విపరీతంగా వస్తుంది. తలనొప్పి ఋతు సమయమందు అధికమవుతుంది. తల తిరుగటం చల్లగాలిలో ఉపశమించి ఇంటి యందు అధికమవుతుంది. చన్నీటివల్ల గదిలో కదలకుండా కూర్చున్న తగ్గుతుంది.
కళ్ళు:
తలనొప్పితో చూపు మసకగా ఉండి, కండ్ల ముందర వణుకుచున్నట్లు, అటుఇటు ఊగుచున్నట్లు అనేక రంగులు, మచ్చలు కన్పిస్తాయి, వస్తువులు రెండుగా కన్పిస్తాయి. పై కనురెప్పలు ఉబ్బుతాయి. దీపం చుట్టూ చక్రమున్నట్లుంటుంది. పొగమంచు లాగా వీరి చూపు మసకగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచినప్ప్పుడు దృష్టి మసకగా ఉంటుంది. ఆరుబైట గాలిలో నడిచినప్ప్పుడు దృష్టిలోపం ఎక్కువగా ఉండి, గదిలో కూర్చున్నప్ప్పుడు తగ్గుతుంది. వీరికి చత్వారం, మెల్ల ఉంటుంది. కంటి కండరాలు బలహీనంగా ఉండి, కంటి జబ్బులు వస్తాయి. కన్నుల ముందు మిణుకు మిణుకుమన్నట్టుగా, నిప్పు కణాలున్నట్లుండి, వివిధ రంగుల వలె, మెరిసే సూదులున్నట్లు ఉంటుంది.
ముక్కు:
రొంపతో, దగ్గు, తుమ్ములుండి, చల్లగాలి వల్ల కొంత ఉపశమన మున్నప్పటికీ, చల్లగాలిని భరించలేరు.
నోరు:
నోరు చాలా ఎర్రగా ఉండి, లాలాజలం చిక్కగా, జిగురులాగా, ఉప్పగా ఉండడం వల్ల, ప్రతి రుచి ఉప్పగా ఉంటుంది.
జీర్ణకోశ లక్షణాలు:
వీరికి బలవర్థకమైన ఆహారం తీసుకుంటే జీర్ణశక్తి లోపం వల్ల అనేక బాధలు కల్గుతాయి. జీర్ణకోశవ్యాధులు, జననేంద్రియ వ్యాధుల వల్ల రోగి రక్తహీనతతో పాలిపోయి ఉంటారు.
కొద్దిగా ఆహారం తిన్నా, కడుపు నిండిపోతుంది. వికారం ఉదయాన్నే ఉండి, వాంతులవుతాయి. కడుపులో గుడగుడ శబ్దాలెక్కువుగా ఉంటాయి. తిన్న తర్వాత పుల్లని త్రేన్పులు ఉండి, ఎక్కువుగా ఎక్కిళ్ళు, కడుపులో పొట్లు ఉంటాయి. ఆపానవాయువు వెళ్ళే వరకూ ఉండి, నడిస్తే ఉపశమనంగా ఉంటుంది. ఎంత తిన్నా అజీర్తి చేస్తుంది. అన్నం తినగానే నిద్రమత్తు ఉంటుంది. ఆహారం, పంది మాంసం పడదు. రొట్టె, వెన్న వాటిమీద హితవుండదు. దాహముండే రోగికి పుల్లని పానీయాలంటే ఇష్టముంటుంది.
స్త్రీల లక్షణాలు:
బహిష్టులు సరిగా రావు. బ్లీడింగ్ నల్లగా కుదపలుగా విస్తారంగా త్వరితంగా అవుతుంది. బహిష్టు సమయంలో నడుంనొప్పి, పొత్తికడుపు చుట్టూ ప్రసవ నొప్ప్పులు వంటి నొప్ప్పులు వస్తాయి. ఋతుదోషాలతో అంధ్యత్వం, నడిచేటప్ప్పుడు బ్లీడింగ్ తక్కువగా ఉండి, రాత్రిళ్ళు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. బహిష్టు సమయంలో చలి ఎక్కువగా ఉండి, తలనొప్పితో చూపు మసకగా ఉంటుంది. బహిష్టు వల్ల బాధలుపశమిస్తాయి. బహిష్టు తర్వాత రొమ్ములలో పాల వంటి ద్రవముంటుంది. గర్భవతిగా ఉన్నప్ప్పుడు ఎక్కిళ్ళు ఎక్కువుగా వస్తాయి. గర్భిణీలు కాని వారిలో కూడా పాలుంటాయి. బహిష్టు తర్వాత స్తనాల వాపు ఉంటుంది. రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉంటుంది. ఎప్ప్పుడు నీరసంగా, మత్తుగా, బద్దకంతో ఉంటారు. మానసికంగా పనిచేయుట, నడుచుట ఇష్టముండదు.
ప్రసవానంతరం పొత్తికడుపులో పొట్లు దిగజారుతున్నట్లుండి, రక్తస్రావం కలిగితే తగ్గుతాయి. బ్లీడింగ్ తక్కువగా అయ్యేవారిలో రోగి పాలిపోయి ఎప్ప్పుడూ నీరసంగా మత్తుగా బద్ధకంగా ఉంటారు. మానసికంగా ఏ పనిచేయడానికి, నడవడానికి కూడా ఇష్టముండదు.
శ్వాసకోశ లక్షణాలు:
ఛాతీలో సజీవమైనదేదో కదలినట్టుండి, వణుకు వచ్చినట్లుగా ఉంటుంది. ఛాతీలో బరువుగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా నీరసంగా ఉంటుంది. రోగి మెలకువ రాకుండా నిద్రలోనే దగ్గుతుంటారు. ఛాతీలో, గుండెలో సూదితో గ్రుచ్చినట్లు నొప్పి ఉంటుంది. రోగలక్షణాలు వెచ్చని గదియందు, బాధగా ఉన్న భాగాల్ని మర్దనా చేయుట వల్ల అటుఇటు తిరుగుట వల్ల తగ్గుతాయి. గుండెదడతో, వీపు, తుంటిలో నొప్పులుండి, ఊపిరి బలంగా తీసుకుంటే నొప్పి ఎక్కువవుతుంది. మూత్ర పిండాల్లో, మూత్రనాళంలో కుట్టినట్లుండి, ఎర్రని మూత్రం మూత్ర విసర్జన సమయంలో పోవడం జరుగుతుంది.
కీళ్ళ వ్యాధులు:
చూపుడు వేలు, బొటన వేలు ముడుచుకున్నట్లు లాక్కుపోతాయి. కాళ్ళు చేతులు గట్టిగా బిగుసుకొనిపోయి ఉంటాయి. ఎముకలలో పోట్లు ఉండి, తాకినా, కదిలించినా, అదిమినా నొప్పి ఎక్కువవుతుంది. చేతి వేళ్ల కణుపులలో ఎర్రటి పొక్కులు దురదతో కూడిఉండి, గోకితే, దురదలు తగ్గుతాయి. కీళ్ళు బెణికినట్లు నొప్పి చేస్తాయి. కూర్చున్నప్ప్పుడు, నిలబడినప్ప్పుడు నడుస్తునప్పుడు మడమలలో, వేళ్ళలో చెమట పట్టి ఎక్కువవుతాయి. కాలి వేళ్లు, కళ్లు పచ్చి పుండులాగా గుంజినట్లు నొప్పి ఉంటుంది. కాళ్ళు చేతులు లాగుతున్నట్లు నొప్పులు ఎక్కువగా ఉండి, నీరసంతో కదలలేరు. శరీరం చచ్చుగా ఉంటుంది. అరికాళ్ళు నొప్పిగా ఉండి, మండుతుంటాయి.
చర్మవ్యాధులలో దురద రాత్రిళ్ళు ఎక్కువై గోకిన తర్వాత తగ్గి, తిమ్మిరిగా ఉంటుంది. ముఖం మీద మొటిమలుంటాయి. ఇలాంటివారికి ఇది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
