[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-47: డ్రోసిరా (Drosera)
సన్‌డ్యూగా పిలవబడే మొక్కనుండి హోమియో ఔషధ గుణాల్ని రాబట్టినవారు హానిమన్.
స్థానాలు:
ఈ మందుకి శ్వాసావయవాలపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
శ్వాసకోశ వ్యాధులు, చర్మ రోగాలు, క్షయ వ్యాధికిది ఉపయోగపడుతుంది.
సహచరులు:
నక్స్‌వామికా దీనికి సహచరి మందు.
విరుగుళ్ళు:
దీనికి కాంఫర్ విరుగుడుగా పనిచేస్తుంది.
ఉద్రేకం:
వీరికి అర్ధరాత్రి తర్వాత, పొగ త్రాగుటవల్ల, పాడుటవల్ల, వేడిగదిలో పడక వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి ముందరకు వంగుట వల్ల, చేతుల మీద తల వంచుకొని విశ్రమించుట వల్ల ఉపశమనం ఉంటుంది.
మోతాదు:
1-30 పొటెన్సీలో వాడుకోవచ్చు. కోరింతదగ్గులో 1,2,3 పొటెన్సీలో వాడుతూ మధ్య మధ్య సల్ఫర్ గాని, విరేట్రం ఆల్బంని ఇంటర్ కరెంట్‌గా వాడవచ్చని డా. బట్జ్ చెప్పారు.
కాల పరిమితి:
2-3 వారాలుంటుంది.
మానసిక లక్షణాలు:
వీరికి మానసికంగా విచారం ఉండి, ఆత్రుతగా ఉండి, చేయుచున్న పని మీద దృష్టి లేక, వేరే దాని గురించి ఆలోచించుట. చదువుపై ఏకాగ్రత లేకపోవడం ఉంటుంది. చదువుచున్నప్ప్పుడు దృష్టి కంగారుగా ఉండి అక్షరాలు గజిబిజిగా ఉంటాయి. కనుపాపలు చిన్నవగుట వంటి లక్షణాలుంటాయి.
శారీరిక లక్షణాలు:
చెవులలో వింత శబ్దాలు కల్గుతాయి. ఎక్కువగా బాగా వాయించుచున్నట్టు వినబడుతుంది.
ముక్కు ఆర్చుకొనిపోయి తుమ్ములు, పడిశం పడుతుంది.
సాయంకాలం, ముక్కు చీదినపుడు రక్తం కారుతుంది. ముఖం ఎర్రగా, వెచ్చగా, పొంగరించి ఉండి, చేతులు చల్లగా ఉంటుంది.
పెదవులు ఆర్చుకొనిపోయి బీటలు బారి ఉంటాయి. పల్చని లాలాజలం ఊరటం, నాలుక మధ్య వాపు ఉన్నప్పుడు వస్తుంది.
నాలుక గరుకుగా, పొడిగా ఉండి, దగ్గు కల్గుతుంది. పుల్లని ఆహారం తినినచో కడుపులో పోట్లు, తరచూ ఎక్కిళ్ళు వస్తాయి.
క్రొవ్వు పదార్థాలు తిన్న అర్థరాత్రి నుండి ఉదయం వరకు వికారం వస్తుంది. పసరు వాంతులు అవుతాయి. పైత్యరసాన్ని వాంతు చేసుకుంటారు.
మలమూత్రాలు తెల్లగా, పల్చగా, ఆమ్లంతో కూడి ఉంటాయి. విరేచనమైన పిమ్మట మళ్ళీ విరేచనానుమానం కల్గుతుంది. మూత్రం కొద్దికొద్దిగా తరచుగా పోతుంది.
స్త్రీలలో బహిష్టులు అణిచిపెట్టడం వల్ల, బాధతో తెల్లమైల అవుతుంది. ప్రసవ వేదనలాగా బాధగా ఉంటుంది.
శ్వాసకోశ లక్షణాలు:
ఊపిరి పీల్చునపుడు గొంతులో నొప్పితో బొంగురుగా ఉండి, దగ్గు విడవకుండా రావడం వల్ల ఊపిరి పీల్చుటకు కష్టంగా ఉంటుంది.
స్వరపేటికలో పురుగు ప్రాకుతున్నట్టుండి, రాత్రి పడుకున్న, సాయంకాలం, తెల్లవారి 2 గంటలకి దగ్గుతో మెలకువ వస్తుంది.
దగ్గేటప్ప్పుడు, ఊపిరి పీల్చేటప్ప్పుడు ఛాతీలోని కండరాలలో సూదులతో గుచ్చుతున్నట్లు బాధగా ఉండి, నిద్రలో మెలకువతో దగ్గు వచ్చి అర్ధరాత్రి తర్వాత వెచ్చని పానీయాల వల్ల, మాట్లాడుట వల్ల ఉద్రేకిస్తుంది. యుక్తవయస్కుల్లో క్షయవ్యాధి వచ్చినపుడు దగ్గులో రక్తం లేదా పసుపు పచ్చని స్రావం వస్తుంది. కోరింత దగ్గులో విడిచి విడిచి వచ్చే పొడి దగ్గు వల్ల వాంతి అవుతుంది. తలనొప్పి, దగ్గు విడిచి విడిచి వస్తాయి.
కాళ్ళు కొయ్యబారినట్లుండి కీళ్ళ సంధులలో నొప్పిగా ఉండి, కాళ్ళకు చల్లని చెమట పట్టిన, పగలు కదలిక వల్ల తగ్గుతాయి. రాత్రులు చేతిలోని ఎముకలలో నొప్పిగా ఉంటుంది. పరుపు ఎక్కువ గట్టిగా ఉన్నట్లుండడం, కీళ్ళ సందులో నొప్పితో అవయవాలన్నీ కుంటితనం కొట్టొచ్చినట్లు ఉంటుంది.
చర్మం దురదగా ఉండి, గట్టిగా గోకుట వల్ల చర్మం పైపొర వెంటనే ఊడిపోతుంది. పొంగు వ్యాధిలో వచ్చే చర్మరోగాలకిది మంచి మందు.
జ్వరంతో తలనొప్పి, దగ్గు విడిచి విడిచి రావడం, దాహం లేకపోవడం; ముఖం, శరీరం వెచ్చగా, చేతులు చల్లగా ఉండి లోపల చలిగా ఉండేవారికిది మంచి మందు
హోమియో మందులు-48: ఎరచిస్ హైపొగియి (Arachis hypogaea)
ఇది వేరుశెనగ నుండి తయారు చేయబడ్డ మందు నుండి ఔషధ గుణాల్ని తయారు చేసినవారు హానిమన్.
స్థానాలు:
జీర్ణకోశం, శ్వాసావయవాలు.
వ్యాధులు:
కఫ వ్యాదులు; ఎలర్జీ, రియాక్షన్స్‌కి ఉపయోగపడుతుంది.
మోతాదు:
12-30 పొటెన్సీలో వాడుకోవచ్చు.
కాల పరిమితి:
2-10 రోజులుంటుంది.
రోగి ఉదరంలో ఏర్పడిన వాయువును, మలబద్దకంను పొగొడుతుంది.
ఛాతిలో గట్టిగా పట్టేసినట్టుండం, లోబిపి, ఆయాసంగా ఉండి ఊపిరాడనట్లుగా ఉండడం, చెమటలు పట్టడం, తల తిరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలున్నవారికి మంచి మందు.
చర్మంపై దురదలు, దద్దుర్లుంటాయి. పొక్కులు వస్తాయి. గొంతునొప్పి, గొంతు బొంగురుపోవడం, కడుపులో అజీర్తి, పొట్ట ఉబ్బరం, కడుపునొప్పి, అజీర్తి విరేచనాలుంటాయి. ఆకలి సరిగా ఉండదు.
వేరుశనగ గింజలు పడని వారికిది మేలైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
