Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-48

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-51: హయాస్యామస్ (Hyoscyamus)

హెన్‌బేన్ అని పిలవబడే వృక్షజాతికి చెందిన మొక్కనుండి ఔషధ గుణాలు రాబట్టినవారు డా॥ హానిమన్, హెరింగ్. దీన్నే తెలుగులో కురాసానివాము అంటారు.

స్థానాలు:

ఈ మందుకి నరాలు, మనస్సు, కండరాలు, రక్తం (ముఖం, పండ్లు) పై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఈ మందు అపస్మారకం, హిస్టీరియా, చిన్నపిల్లల్లో క్రిమిదోషాలు, నరాల వ్యాధులకు మంచి మందు.

ఉద్రేకం:

వీరికి బహిష్టులో, మానసిక శ్రమ వల్ల, భోజనానంతరం, పడుకున్నప్ప్పుడు, రాత్రి, స్పర్శ, నిద్ర, శీతలం, భయం, అసూయ వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి వంగుట వల్ల, కూర్చుండుట వల్ల ఉపశమనం ఉంటుంది.

పోలికలు:

బెల్లడోనా, కాలిఫాస్, స్ట్రమోనియం మందుల్ని దీనితో పోల్చవచ్చు.

విరుగుళ్ళు:

బెల్లడోనా, కాంఫర్, చైనా, ఓపియం ఈ మందుకి విరుగుళ్ళు.

కారణాలు:

భయం, ఈర్ష్య, చిరాకు, క్రిమిదోషాలు, ప్రేమభంగం వల్ల కలిగే దుష్ఫలితాలకు ఇది మంచి మందు.

మోతాదు:

3-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు. మూర్ఛ, పక్షవాతం, నీళ్ళ విరోచనాలున్నప్పుడు పెద్ద మోతాదులో వాడవచ్చు.

కాల పరిమితి:

4-8 వారాలు ఉంటుంది.

పర్సనాలిటీ:

వీరు ఆశాపూరితంగా, సంతోషంగా, చెలాకీగా, చిరచిరలతో ఉంటారు. నాడీమండలోద్రేకంతో, హిస్టీరియా తత్వం కలవారు.

మయాజమ్:

వీరిది సోరా తత్త్వం.

మానసిక లక్షణాలు:

ఎక్కువ అనుమానంతో ఉండి తెలివి తక్కువగా మాట్లాడుతుంటారు. శృంగార సంబందమైన చిత్త భ్రమలతో సిగ్గు విడిచి ఎక్కువగా మాట్లాడుతారు. సంభోగేచ్ఛతో కూడిన ఉన్మాదం వల్ల శరీరం మీద బట్టల్ని విప్పివేయుట, బూతుపాటలు పాడుతూ ప్రక్కలో దిగంబరంగా పడుకొని మాటలాడుతూ వెంటనే మగత చెందడం, గొణగడం, ప్రతి విషయం నందు ఎక్కువగా నవ్వుచు, కులాసాగా ఉండి పారిపోవాలనుకుంటారు. చిరాకు, భయం, దురదృష్టంగా పరిగణించు ప్రేమ వల్ల కలిగే చెడు ఫలితాల వల్ల తీవ్రకోపంతో, అసూయతో, అస్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి విషయానికి నవ్వురావడం, తదనంతరం తరచూ మూర్ఛ కల్గుతుంది. ఊహాప్రపంచంలో ఉన్న వాటిని గూర్చి మాట్లాడుతారు. ఏ కోరికలుండవు. ఏవి చెప్పరు. కొన్ని గంటలైనను ఒక్క మాటైన మాట్లాడడు. ఒక్కోసారి పిరికిగా ఉంటే మరొకసారి ఉన్మాదంగా ఉంటారు. వీరు ఒక్కొక్కసారి కొట్లాడడం రక్కడం చేస్తారు.

శారీరిక లక్షణాలు:

తల:

చల్లని గాలి వల్ల జలుబు, తలభారం రావడం ఉంటుంది. మెదడు బలహీనత వల్ల, మెదడు కదులుచున్నట్లుండి వికారం, మత్తుగా ఉండడం, తల నీరు పట్టడం ఉంటుంది.

కండ్లు:

కనుపాపలు పెద్దవై దృష్టి మసకగా ఉండడం వల్ల, కన్నులు పనిచేయవు. కండ్లు నిప్పువలె ఎర్రగా మండుతూ పెద్దవిగా ఉండడం, ఒక్కోసారి చిన్నవిగా ఉండి పట్టి పట్టి చూడడం ఉంటుంది. చిన్న వస్తువులు చాలా పెద్దవిగా ఉన్నట్లనిపిస్తుంది.

చెవులు:

వీరి చెవులలో పొడుచుచున్నట్లు బాధ ఉంటుంది. వింతధ్వనులు వినపడి, మాట సరిగా వినపడకపోవడం ఉంటుంది.

ముక్కు:

వాసన సరిగా తెలియకపోవడం, నాసికారంధ్రాలు పొడిబారినట్లుండి రక్తం స్రవించడం జరుగుతుంది.

ముఖం:

వీరి ముఖం ఒకసారి ఎర్రగా కంది వుంటే మరొకసారి చల్లగా పాలిపోయి ఉంటుంది. దౌడలు దగ్గరికి వస్తాయి.

నోరు:

నాలుకకు పక్షవాతం వచ్చుటచే మాట సరిగా రాకుండుట. నాలుక చాపుట, వెనకకు తీయుట చాలా కష్టంగా ఉండి, నోటి వద్ద నురగలు వస్తాయి.

గొంతు:

గొంతు ఆర్చుకొనిపోయి ముడుచుకుపోయి పానీయాలు త్రాగుట కష్టంగా, కొండ నాలుక పొడవై కుట్టుచున్నట్లుండుట ఉంటుంది.

జీర్ణాశయం:

ఆహార పానీయాల్ని రక్తంను వాంతి చేసుకొనుట. అతి దాహం వల్ల నీళ్ళను కొద్దికొద్దిగా త్రాగుతారు. పొత్తి కడుపు ఉబ్బరం వల్ల వ్రేలాడినట్లుండి నొప్పిగా ఉంటుంది.

~

మలబద్దకంతో నుండు అపస్మారకం ఉంటుంది, మలాశయం, ఆసనంలోని కండరాలకు పక్షవాతం వస్తుంది. దీనివల్ల తరచు విరేచనానుమానంతో రాత్రి సమయంలో, మూత్రవిసర్జనలో అప్రయత్నంగా బాధతో కూడిన నీళ్ళ విరేచనాలవుతాయి. మొలలనుండి అధిక రక్తస్రావం అవుతుంది.

మూత్రకోశంకు పక్షవాతం రావడం వల్ల మూత్రం రాకపోవడం వల్ల, ప్రసవానంతరం వచ్చినా కొద్దిగా, కష్టంగా, అప్రయత్నంగా మూత్రం వెళుతుంది. స్త్రీకి మూత్రవిసర్జన కోరిక ఉండదు.

పురుషులందు సంభోగేచ్ఛ ఉండి, శృంగారం నందు ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల సిగ్గు విడిచి ప్రవర్తించి, కట్టుకున్న బట్టల్ని విప్పి వేస్తుంటారు. వీరిలో నపుంసకత్వం ఉంటుంది

స్త్రీలలో గర్భస్రావమైన పిమ్మట కల్గు స్రావం ప్రసవానంతరం స్రావం అణిచిపెట్టడం వల్ల కలిగే అపస్మారం వల్ల, వికారం ఎక్కువగా చెమటలు పోయడం, గట్టిగా నవ్వడం, కాళ్ళు చేతులు కంపించడం ఉంటుంది.

రాత్రిళ్ళు విడిచి విడిచి వచ్చే పొడిదగ్గువల్ల పడుకోలేక, లేచి కూర్చున్నప్పుడు రిలీఫ్ ఉంటుంది. శ్వాసావయవాల నుండి రక్తం రావడం, ఛాతీలో కుడివైపున బాధగా ఉంటుంది.

ఛాతినొప్పి రాత్రిళ్ళు, భోజనానంతరం, త్రాగిన తర్వాత, మాట్లాడిన పిమ్మట, పాడిన తర్వాత అధికమవుతుంది. వీరి నాడి చురుకుగా, నిండుగా, నీరసంగా, వక్రంగా ఉంటుంది.

వీరి చర్మం మీద కురుపులు తరచుగా పెద్ద పెద్ద పొక్కులతో వచ్చి, చట్టల నుండి మోకాళ్ళ వరకు అలుముకున్నట్లు వస్తాయి.

కాళ్ళు చేతులు తరచుగా కదల్చుతుండడం వల్ల పిక్కలు లాగడం ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా బొటన వ్రేళ్ళు రెండూ ముడుచుకొని పోతాయి. అవయవాలు కంపిస్తాయి. ఫిట్స్‌తో వచ్చే రోగాలకిది మంచి మందు. వృత్తి వ్యాపారం ఊహా ప్రపంచంలోని చిక్కులవల్ల, ఉద్రేకం చెందే వ్యక్తులలో నిద్ర పట్టదు.

భయం వల్ల ఉలిక్కిపడి లేస్తుంటారు. ఒంటరిగా ఉండుటకు విషం పెట్టుదురని, కొట్టుదురని, తనని అమ్మివేయదురని, ఆహారపానీయాలు తీసుకొనుటకు, ఇచ్చినదాన్ని పుచ్చుకొనుటకు ఏదియో కుట్ర జరుగుచున్నదని అనుమానం ఉంటుంది. చలి కాళ్ళలో ప్రారంభించి, పైకి ఎగబ్రాకుతుంది. నిద్రలో నిస్త్రాణ కల్గించే చెమటలు చల్లగా, పుల్లని వాసనతో పడతాయి. న్యూమోనియా, స్కార్లటినా, టైఫాయిడ్ జ్వరాలలో మెదడు, మేఘావృతమైనటువంటి, కనులు విడవడినట్లుండి, పక్కబట్టల్ని గిల్లడం, పంఢ్లు పాచితో నిండి పండ్లు కొరకడం ఉంటుంది. నాలుక పొడిగా ఉండి, కదుపుట కష్టం. మలముత్రాలు తెలియకుండా కావడం, వేరు వేరు కండరాలకు కల్గు ఈడ్పులకు ఇది మంచి మందు. అస్థిమితంలో వచ్చే సంధి వల్ల ప్రక్కనుండి దుమికి తప్పించుకొనిపోవడానికి ప్రయత్నిస్తారు. తాను తప్పు ప్రదేశంలో ఉన్నట్లు తలుస్తారు.

చిన్నపిల్లల్లో ఆకస్మికంగా భయంచే, ప్రేగుల్లో క్రిములుండడం వల్ల, ప్రసవ సమయమందు, పురటిలో, భోజనానంతరం పిల్లవాడు వాంతి చేసుకొని, ఆకస్మికంగా కేకవేసి, స్పృహ తప్ప్పుతారు. చుట్టు వుండు వస్తువుల్ని నిరంతరం తేరిపారి చూస్తూ తనను తానే మర్చిపోతారు. శారీరక మానసిక నిస్త్రాణతో ఉంటారు. పిచ్చికోపంతో బట్టలు చింపివేయడం, తిట్టడం, ఒట్టు పెట్టుకొనడం, కొట్టడం, గదిచుట్టు పరిగెడుతారు. సంఘం నందు కలవరు, వెలుతురుకు విముఖత ఉంటుంది. నిద్రలో భయంతో ఉలిక్కి పడతారు. మూర్ఛలతో కూడిన గాఢ నిద్రకిది మంచి మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version