Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-49

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-52. హెల్లిబోరస్ (Helleborus)

క్రిష్టమస్ రోజ్ అని పిలవబడే వృక్షజాతికి చెందిన ఎండబెట్టిన వేరు నుండి ఔషధగుణాల్ని రాబట్టినవారు డా॥ హానిమన్. ఇది విషపూరితమైనది అయినప్పటికి, పొటైంటైజేషన్ పద్ధతి వల్ల దీన్ని అమృతతుల్యమైన మందుగా రూపొందించడమైనది.

స్థానాలు:

ఈ మందుకి చర్మం, కండరాలు, మెదడు, మూత్రపిండాలు, నరాలపై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఇది చర్మవ్యాధులు, కండరాల బలహీనత, మెదడు, యూరినరీ సిస్టమ్స్ వ్యాధులకు ఉపయోగపడుతుంది.

విరుగుళ్ళు:

చైనా, కాంఫర్ దీనికి విరుగుడు మందులు.

పోలికలు:

ఎపిస్, బెల్, బ్రయోనియా, జింకమ్, లేకసిస్, డిజిటలిస్, ఆర్స్ లతో దీనిని పోల్చవచ్చు.

ఉద్రేకం:

వీరికి సాయంకాలం 4 నుండి రాత్రి 8 వరకు, శీతలగాలి, వ్యాయామం వల్ల ఉద్రేకం ఎక్కువవుతుంది.

ఉపశమనం:

వీరికి మానసిక శ్రమ వల్ల ఉపశమనం ఉంటుంది.

కారణాలు:

రజస్వలవయస్సు, పండ్లు వచ్చు కాలం, వేసవి, ప్రెగ్నెన్సీ, చర్మవ్యాధులు అణిచిపెట్టడం, అతి దుఃఖం, కోపం వల్ల కలిగే వ్యాధులకు మంచి మందు. ఇది నీరసంగా, సున్నితంగా ఉండే చిన్నపిల్లలకు ఉపయోగపడే మందు.

మయాజమ్:

ఇది సోరా మయాజమ్ కల మందు. వీరు చలికి తట్టుకోలేరు. వీరిది ఇరిటబుల్, టెంపర్‌మెంట్.

పర్సనాలిటీ:

నిస్త్రాణగా, చిక్కిపోయి, చర్మరోగాలతో బాధపడే పిల్లలు. వీరిలో ఇంద్రియ జ్ఞానం బహు తక్కువగా ఉంటుంది.

మోతాదు:

3 – 30 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.

కాల పరిమితి:

3-5 వారాలు ఉంటుంది.

మానసిక లక్షణాలు:

వీరు మానసికంగా కంగారుగా, నిరాశగా, అస్థిమితంగా, విచారంగా ఉండడం వల్ల ఇతరులు తన్ని పలుకరించిన అయిష్టతతో, నెమ్మదిగా, సమాధానం చెప్పడం, చీటిమాటికి ఒట్టు పెట్టుకోవడం జరుగుతుంది. మతి భ్రమ చెందుతుంది. వీరు క్రుంగిపోయి భయంతో నిత్యం కీడుని తలంచుట, అతి దుఃఖం, నిస్పృహతో నిశ్శబ్దంగా పెదవుల్ని, గుడ్డల్ని పిచ్చి వానివలె గిల్లుచుంటారు. తీవ్ర మానసిక శారీరక బాధ ఉంటుంది. వీరు ముక్కోపంతో ఉండి, ఓదార్చినచో, మానసిక లక్షణాలు అధికమవుతాయి. తనను పలకరింపగోరరు. మానసిక జడత్వం వల్ల ప్రశ్నించినపుడు మెల్లగా సమాధానం చెప్పడం జరుగుతుంది.

శారీరిక లక్షణాలు:

తల:

మత్తును కలగచేయు తలనొప్పి వల్ల తలను నొక్కుకొనుచు తలగడలోనికి తలను దూర్చుతారు. తలను అటు ఇటు త్రిప్పుతుంటారు. వాంతి అనంతరం తల నొప్పి తగ్గుతుంది. తలకు నీరు పడుతుంది, ఎడమవైపు వచ్చే పార్శ్వపు నొప్పిని తట్టుకోలేక చేతులతో తలబాదుకోవడం, అటుఇటు దొర్లడం చేస్తారు. ఇది హైడ్రోసెఫలస్‌కి (క్షయవ్యాధి, స్కార్లటినా అనంతరం వచ్చే) మంచి మందు.

కళ్ళు:

రాత్రిళ్ళు దృష్టి ఆనకపోవడం, కనుపాపలు పెద్దవైపోవడం జరుగుతుంది, వీరి కండ్లు లోతునకు పోతాయి. మెల్లకన్నుతో శూన్యంగా ఆలోచన రహితమైన విడిచూపు ఉంటుంది. ఒక్కోసారి కన్నులు బాగా తెరుచుకొని ఉంటారు.

చెవులు:

చెవులలో పొడుచుచున్నట్లు బాధ, హోరు ఉంటుంది.

ముక్కు:

ముక్కు ఆర్చుకుపోయి నలుపుతుంటారు. వాసన సరిగా తెలియదు. ముక్కు రంధ్రాలలో వేళ్ళు పెట్టి తిప్పుతుంటారు. ముక్కు రంధ్రాలు మురికిగా, ఉంటాయి.

ముఖం:

ముఖం ముడతలు పడి, పాలిపోయి తరచు చల్లని చెమటతో ఉంటుంది.

పళ్ళు:

దౌడలు నొప్పిగా ఉండి, నమలడం కష్టంగా ఉంటుంది. రాత్రిళ్ళు వచ్చే పంటి నొప్పి వెచ్చదనం, చల్లదనం వల్ల ఎక్కువవుతుంది. పళ్ళుకొరకడం, దౌడలు నిరంతరం నములుచుండడం ఉంటుంది. పండ్లు వచ్చేటప్పుడు కల్గు మెదడు లక్షణాలకిది మంచి మందు.

నాలుక మొద్దుబారి వాచి ఉదయాన ఆర్చుకొనిపోయి తెల్లని పూతతో దుర్వాసనగా ఉంటుంది. చల్లని నీటిని ఎక్కువగా ఆత్రుతతో త్రాగుతారు. పెదవుల్ని, దుస్తుల్ని నిరంతరం గిల్లుకోవడం వుంటుంది. నోటి మూలలు పుండువలె పగిలి ఉంటాయి.

ఆకలి ఉన్నా అన్నం సహించదు. రుచి ఉండదు. కడుపులో మంట, జీర్ణకోశంలో బాధ వల్ల పైత్యరసం వాంతి కావడం ఉంటుంది. పొత్తికడుపు నీటితో నింపబడినట్లు చప్పుడవుతూ, ఉబ్బరించి ముట్టుకున్న ఎక్కువ బాధగా ఉండి, కుడివైపు గజ్జలో పోట్లుగా ఉంటుంది. కడుపులో మంట ఉండి, నడిచినప్పుడు, దగ్గినప్పుడు బాధలెక్కువవుతాయి. కుడివైపు గజ్జలో హెర్నియా వల్ల పోట్లుగా ఉంటుంది.

హైడ్రోసెఫలస్ నందు, పండ్లు వచ్చేటప్పుడు గర్భవతులందు వచ్చే నీళ్ళ విరేచనాలకిది మంచి మందు. మలం జిగురుగా, తెల్లని ఆమం జల్లివలె అప్రయత్నంగా విసర్జించడం ఉంటుంది. విరేచనానంతరం ఆసనం వద్ద మంటగా, బాధగా ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పితో, వికారంతో కూడిన నీళ్ళ విరేచనాలుండి, నీటి గుంటలో ఆకుపచ్చగా తేలుచుండు తెట్టు వలె ఉండడం.

మూత్రం కొద్దిగా ముదురు రంగుగా, కాఫీ రంగులో పోవడం, పిల్లల్లో మూత్రం బంధించడం వుంటుంది. తరచూ మూత్రానుమానం కల్గుతుంది. మూత్రం అణిచిపెట్టడం వల్ల గుండె, మెదడు, కడుపుకు నీరు పడుతుంది. మూత్రంలో ఆల్బుమిన్ పోతుంది.

వీరిలో సంభోగేచ్ఛ తగ్గడం వల్ల, జననేంద్రియాలు బిగువు లేకుండా ఉంటాయి.

యుక్తవయస్కుల్లో భయం వల్ల, తేమలో నానుటవల్ల, శరీరం తడియుట వల్ల, బహిష్టులు అణిగిపోవడం, సరిగా రాకపోవడం జరుగుతుంది.

వీరిలో శ్వాస సరిగా ఉండక ఛాతీ ముడుచుకొని పోయినట్లుండి, రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా వస్తుంది.

అప్రయత్నంగా ఒక కాలు చేయి కదలడం, అవయవాలు బాధగా, బరువుగా ఉండి శరీరంనకు నీరు పట్టుట ఉంటుంది. చేతుల్లో, వ్రేళ్ళ యొక్క కీళ్ళ సంధులలో చీల్చుచున్నట్లు, గుచ్చినట్లు, తొడల్లో బిగపట్టినట్లు పోట్లుంటాయి. వెంట్రుకలు, గోళ్ళు ఊడిపోతాయి.

కాళ్ళు చేతులు, చల్లగా ఉండి కంపములు వస్తాయి. శరీరం అమిత చల్లదనంతో నుండు పొర్లతో, తలవెనుక భాగం వేడిగా ఉంటుంది.

రాత్రి పడుకున్న తర్వాత శరీరం నందు మంటలతో కూడిన వెచ్చదనం తలలో ఎక్కువగా ఉండి తెల్లవారుజామున చెమట పడుతుంది. కండ్లు సగం తెరిచి నిద్రపోవుట. కంగారుగా ఉండి, ఆత్రుతతో వచ్చే కలలవల్ల నిద్రపట్టక నీరసం వుంటుంది. కేకలతో, కెవ్వున అరుచుటతో ఉలికిపాట్లతో కూడిన నిద్రమత్తుతో ఉండు నిద్ర ఉంటుంది. చన్నీటిని ఆతురుతతో త్రాగడం. చెంచాని కొరకడం, స్పృహ లేకుండానే ఉంటారు. నిద్ర పట్టకపోవుట వల్ల ప్రక్కలో అటుఇటు దొర్లుతారు. ఇలాంటి వారికి ఇది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version