[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-55. కాల్మియా (Kalmia)
దీన్ని మౌటెన్ లారెల్‌గా పిలవబడే వృక్షజాతికి చెందిన చెట్టు పువ్వుల నుండి తయారు చేస్తారు. హెరింగ్ దీని ఔషధగుణాల్ని రాబట్టడమైనది.
స్థానాలు:
ఈ మందుకి గుండె, నరాలపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది గుండెవ్యాధులు, నరాల వ్యాధులకు ఉపయోగపడుతుంది.
తత్వం:
వీరిది మేహవాత తత్వం.
పోలికలు:
దీనిని పల్సటిల్లా, స్పైజీలియా, లెడం, రూస్టాక్స్ మందులతో పోల్చవచ్చు.
విరుగుళ్ళు:
ఎకోనైట్, బెల్లడోనా దీనికి విరుగుళ్ళు.
సహచరులు:
ఆసిడ్ బెంజాయిక్. నక్స్, స్పైజీలియా, థైరాయిడినం పిమ్మట ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఎడమవైపు పనిచేయు మందు.
మోతాదు:
3-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాలపరిమితి:
3-4 వారాలు ఉంటుంది.
ఉద్రేకం:
వీరికి ముందుకు వంగుట వల్ల, క్రింది వైపుకు చూచుట వల్ల, కదలిక వల్ల, బహిరంగమైన గాలి వల్ల రోగ లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి చల్లదనం వల్ల ఉపశమనం ఉంటుంది.
కారణాలు:
పొగాకు, చలి, వేడి వల్ల వ్యాధులు ఏర్పడతాయి.
మానసిక లక్షణాలు:
వీరికి కోపం, చిరాకుతో, ఆత్రుతగా, గుండెదడగా ఉంటుంది. విసుగుదల ఉండి ఏ పని చేయాలనిపించదు.
శారీరక లక్షణాలు:
తల:
వీరికి తలనొప్పితో వికారం, విసుగు, దృష్టి మందగించడం ఉంటుంది. ఇది ప్రతి సాయంత్రం, రాత్రి ఎడమవైపు వచ్చే పార్శ్వపు నొప్పికి మంచి మందు. తలదిమ్ముతో నుదుటిలో, నడినెత్తిన భారంగా ఉంటుంది. ముఖం కంది వుంటుంది.
కండ్లు:
కండ్లను కదల్చినపుడు కొయ్యబారినట్లు, లాగుచున్నట్లు బాధగా ఉంటుంది.
చెవి:
కుడి చెవిలో, చెవి వెనుక వైపున కుట్టుచున్నట్లు నొప్పి ఉంటుంది.
ముక్కు:
ముక్కు నుండి నీరు కారుతుంది.
నోరు:
దౌడలు వేసవిలో గరుకుదేరి ఉంటాయి, పెదవులు పగిలి ఉంటాయి.
జీర్ణకోశం:
జీర్ణకోశంలో పైత్యదోషాల వల్ల నోరు చేదుగా ఉండి, భోజనం చేసిన పిమ్మట వికారం ఉపశమిస్తుంది. భోజనానంతరం లాలాజల గ్రంధులలో జిల పుడుతుంది. వాంతి అగుచున్నట్లవుతుంది. పొత్తి కడుపులో వాయువు చేరి బాధ కల్గుతుంది. కాలేయం వద్ద నొప్పి ఉంటుంది.
తరచూ పల్చగా మలవిసర్జన జరగడం వల్ల ఆసనం నొక్కుకుపోయినట్లు బాధ కల్గుతుంది. నడుం నొప్పితో పాటు మూత్రం విసర్జన తరచు చేయాలనిపించడం, మూత్రంలో ఆల్బుమిన్ పోవడం ఉంటుంది.
పురుషులందు సంభోగ కోరిక లేకున్న తరచు అంగస్తంభన కల్గుతుంది. ఉదయాన కుడి వృషణమందు, మధ్యాహ్నం ఎడమ వృషణంనందు బాధగా ఉంటుంది.
స్త్రీలలో బహిష్టులు త్వరగా కడుపునొప్పితో, శరీరమంతటా నొప్ప్పులు వస్తుంటాయి. తెల్లమైల బహిష్టుకు ఒక వారం తర్వాత కన్పిస్తుంది. బహిష్టులు అణిచి పెట్టడం వల్ల వచ్చే నరాల వ్యాధులకిది మంచి మందు.
గొంతు నొప్పి వల్ల ఊపిరి పీల్చుట కష్టంగా ఉంటుంది. వీరిలో దుర్వాసనగా, బూడిద రంగులో, ఉప్పగా ఉండే కఫం వస్తుంది. గుండెదడ ముందుకు వంగినచో ఎక్కువవుతుంది. వడిగా, ఆతురతో ఊపిరి పీలుస్తారు. గొంతు నొక్కినట్టుగా నొప్పి ఉంటుంది.
శరీరం క్రింది అవయవాలు మొద్దుబారి పక్షవాతం వచ్చునట్టు ఉంటుంది. నరాల బాధలు దిగువ వైపుకు వ్యాపించడం వల్ల వుంటుంది. దీనివల్ల కాళ్ళు చేతుల్లో బాధలుంటాయి.
చర్మం ఎండిపోయినట్లు, బిగపట్టినట్లుండే చర్మవ్యాధులుంటాయి. చర్మం ఎర్రగా వాచి చాలా బాధగా ఉండడం వల్ల తెల్లవారుజామునే మెలుకువ వచ్చి నిద్ర పట్టదు.
జ్వరాలు:
రోజూ విడవకుండా జ్వరంతో పాటు పొట్ట ఉబ్బరం ఉంటుంది. నడుంలోకి చలి ప్రాకినట్లుండి, చల్లని చెమటలు పడతాయి. శరీరం వెచ్చగా, మంటలుగా ఉంటుంది. ఇలాంటి వారికి ఇది మేలైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
