Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-53

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-56. లైకోపోడియం (Lycopodium)

ఈ మూలిక ప్రపంచమంతటా విరివిగా దొరుకుతుంది. దీని లేత కొమ్మలు తోడేలు పాదాన్ని పోలి ఉండడంతో గ్రీక్ భాషలో దీన్ని లైకోపోడియం అని, క్లబ్‌మోస్ అని అంటారు. డా॥ హానిమన్ దీని ఆకుల గుజ్జు నుండి హోమియో మందు తయారుచేశారు.

స్థానాలు:

ఈ మందుకి శ్వాసావయవాలు, జననేంద్రియాలు, కాలేయం, మూత్రాశయంపై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఇది జీర్ణకోశవ్యాధులు, కిడ్నీ రాళ్ళు, మానసిక వ్యాధులకు ఉపయోగపడుతుంది.

పర్సనాలిటీ:

వీరి శరీరం బూడిద పూసినట్లు నల్లగా అనారోగ్యంగా వుండి, పాలిపోయి నుదుటిమీద ముడతలుండి వయస్సు మించిన వానివలె వుంటారు. బుగ్గలు ఎర్రగా, కళ్ళ చుట్టూ నీలి వలయాలుండి, పోషకాహారలోపంతో చిక్కిపోయి ఉంటారు. శరీరం పైభాగాలు శుష్కించి కండరాలు నీరసంగా ఉండి, దిగువ భాగాలందు నీరు పట్టు స్వభావం ఉంటుంది. ఇది పిల్లలు, ముసలివారికుపయోగపడే మందు.

కారణాలు:

అనేకమంది పిల్లల్ని కనుట వల్ల, కోపం, అమిత భయం వల్ల, బరువులెత్తినా, ఇష్టపడేవారు చనిపోయినా, మానసికోద్రేకం వల్ల; త్రాగడం, జ్వరాలు, ప్రయాణాలు చేసినా, హస్తప్రయోగం వల్ల, పొగాకు, నీరుల్లి, వైన్, మద్యపానం వల్ల వచ్చే వ్యాధులకు ఇది మంచి మందు.

సహచరులు:

అయోడియం, కాలీఅయోడ్, చిలిడోనియం, కాల్కేరియా అయోడ్, లేకసిస్, పల్స్, గ్రాఫైటిస్, అనాకార్డియం మందులు దీనికి సహచరులు.

విరుగుళ్ళు:

కాంఫర్, పల్సటిల్లా, కాఫీ, కాష్టికం, ఎకొనైట్, కామొమిల్లా, గ్రాఫైటిస్, నక్స్‌వామికా, చైనా, కాంఫర్, కాఫీకి లైకో విరుగుడు. కార్బోవెజ్, లేకసిస్, కాల్కేరియా, సల్ఫర్‌ల తర్వాత లైకోపోడియం బాగా పనిచేస్తుంది.

ఉద్రేకం:

వీరికి సాయంత్రం 4 – 8 గంటల వరకు, భోంచేసిన తర్వాత, వెచ్చని గది, చల్లని పానీయాలు, నిద్ర లేచిన తర్వాత, తలపై కప్పుకొనకపోవుట, మధ్యాహ్నం, బహిష్టుకు ముందు రోగ లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి కదలిక, బహిరంగమైన గాలి, వెచ్చని ఆహార పానీయాలు, వెల్లకిలా పడుకున్నా, దుస్తులు వదులు చేసుకున్నా, తేన్పులు, ఆపానవాయువులు పోయినపుడు ఉపశమనం కలుగుతుంది.

తత్వం:

సోరా, సిఫిలిస్, సైకోసిస్ మయాజమ్స్ కలిగిన మందు.

కాల పరిమితి:

30 రోజులు. ఇది కుడివైపు పని చేయు మందు, కుడి నుండి ఎడమవైపుకు, పైనుండి క్రిందికి లక్షణాలు వ్యాపిస్తాయి.

మోతాదు:

3-1M పొటెన్సీలో వాడవచ్చు. ఇది పెద్ద పొటెన్సీలో బాగా పనిచేస్తుంది.

మానసిక లక్షణాలు:

భయం, కోపం, అవమానం వల్ల కల్గు దుర్గుణాలకిది మంచి మందు. వీరిలో పిసినారితనం ఉంటుంది, నడవడి మోటుగా వుంటుంది. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే తత్త్వం ఉంటుంది. త్వరగా కోపం రావడం, ఎదురు చెప్పిన భరించలేరు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. ఉదయాన్నే లేచుటతోనే పేచీ పెట్టడం, దెబ్బలాడు స్వభావం ఉంటుంది. మనుష్యులనిన భయం. కాని ఒంటరిగా వుండలేరు. సున్నితత్వం ఎక్కువ. అభినందించినపుడు కూడా ఏడ్వడం, అసంతృప్తి ఉంటుంది. మగవాళ్ళని చూసి ఆడవారు భయం చెందడం ఉంటుంది.

శారీరక లక్షణాలు:

తల:

సాయంత్రం పూట తలనొప్పి ఎక్కువగా ఉండి, ఆకలిగా ఉంటుంది. తలలో కురుపులుంటాయి. టైఫాయిడ్, డెలివరీ తర్వాత మెదడు వ్యాధులు వచ్చిన తర్వాత తలవెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది. తెల్ల వెంట్రుకలు చిన్న వయస్సులో వస్తాయి.

కన్ను:

రేచీకటి, కంటి కొనల దగ్గర కురుపులుంటాయి. వస్తువులు సగం మాత్రమే కన్పించడం జరుగుతుంది. వెలుతుర్ని చూడలేరు.

చెవులు:

జ్వరాల తర్వాత వచ్చే చెవుడు, చెవిలో చీము కారడం, రక్తస్రావం కారడం, ధ్వనులు రావడం, ప్రతిధ్వనులు రావడం వుంటుంది.

ముక్కు:

ముక్కు దిబ్బడ వేయడం, నీళ్ళవంటి స్రావం, ముక్కు నుండి ఒరుపు కల్గించే స్రావం కారడం వుంటుంది. నాసికా రంధ్రాలు పుండ్లవుతాయి. ముక్కులోపల పొడారి పక్కులు కట్టడం వల్ల ఊపిరాడక నోటి ద్వారా ఊపిరి పీల్చడం ఉంటుంది.

నోరు:

పంటి సలుపుతో దౌడ వాపు కాపడం వల్ల తగ్గడం, దాహం లేకపోవడం వల్ల నాలుక, నోరు ఆర్చుకొని పోవడం, నోటి నుండి దుర్వాసన రావడం వుంటుంది.

గొంతు:

నిద్రానంతరం, అతి చల్లని పానీయాల వల్ల డిఫ్తీరియా, టాన్సిల్స్ వాపు ఉండి, ఎక్కువై కుడి నుండి ఎడమవైపుకు వ్యాపిస్తుంది. క్షయ సంబంధమైన పుండ్లు, చీముతో కూడిన పుండ్లుంటాయి. గొంతు ఆర్చుకొనిపోవడం వల్ల ఆహారం తీసుకున్నప్పుడు ఉక్కిరిబిక్కిరై ముక్కునుండి రావడం వుంటుంది.

జీర్ణకోశ లక్షణాలు:

ప్రతీది పుల్లగా ఉండడం వల్ల, కొద్దిగా తినగానే కడుపు నిండినట్లుంటుంది. పొత్తికడుపులో బిగ్గరగా గుడగుడ శబ్దాలు రావడం ఉండి, పుల్లటి త్రేన్పులు వచ్చినా తగ్గదు. అజీర్తి, గుండెలో మంటతో, విపరీతమైన ఆకలి ఉంటుది. అజీర్ణదోషం వల్ల మలబద్దకం ఉండి, కడుపులో నొప్పి, తలనొప్పి, గుండెదడ, ఎక్కిళ్ళుంటాయి. కాలేయ వ్యాధులు, మలబద్దకం, బాలింతల్లో, గర్భిణీల్లో, బహిష్టు సమయంలో, ప్రయాణాలు చేసినపుడు, వేరే ప్రాంతాలకెళ్ళినపుడు ఉంటుంది. మొలలుండి మలవిసర్జన చేసినపుడు రక్తస్రావం వుంటుంది. బీరు త్రాగడం వల్ల సాయంకాలం దుర్వాసన గల విరేచనాలవుతాయి.

మూత్రంలో ఎర్రని ఇసుక రావడం, కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో రక్తం, ఆల్బుమిన్ పోవడం ఉంటుంది. నడుం నొప్పితో, మూత్రకోశం వాపు ఉండి, మూత్రం పోవడం ఉంటుంది. మూత్ర విసర్జనకు ముందు నొప్పి ఎక్కువగా ఉండి, తర్వాత తగ్గుతుంది. కుడివైపు కిడ్నీలో నొప్పి ఎక్కువవుతుంది.

జననేంద్రియ లక్షణాలు:

పురుషుల్లో:

అతి శీఘ్రస్కలనం, నపుంసకత్వం ఉంటుంది. శరీరంలో ఎడమ భాగంలో చలి వుండి చెమట, దాహం వుంటుంది. ప్రోస్టేట్ గ్రంధి వాపు, సెక్సు కోరికలెక్కువగా ముసలివారిలో ఉంటాయి. యుక్తవయస్కుల్లో హస్త ప్రయోగం, అధిక సంభోగం వల్ల వచ్చే నపుంసకత్వం ఉండేవారికిది మంచి మందు.

స్త్రీలలో:

జననేంద్రియం పొడారినట్లుండడం వల్ల సంభోగ మందు, తర్వాత మంట ఉంటుంది. మలవిసర్జన సమయంలో జననేంద్రియం నుండి రక్తం రావడం ఉంటుంది. తెల్లమైల రక్తంతో కూడి ఉంటుంది. గర్భవతుల్లో పిండం మొగ్గలు వేయుచున్నట్లుంటుంది.

శ్వాసకోశ లక్షణాలు:

న్యూమోనియా, క్షయ, బ్రాంకైటిస్ వల్ల కుడివైపు ఊపిరితిత్తి ఎఫెక్ట్ అవుతుంది. పొడి దగ్గు వల్ల గొంతులో ఇరిటేషన్ ఉంటుంది. కఫం చిక్కగా, పసుపు పచ్చగా, చీము వలె, రక్తం జీరలతో, ఉదయాన ఉప్పగా ఎక్కువగా పోతుంది. నిబ్బరంగా కూర్చోవడం వల్ల, ముందుకు లేక వెనక్కి పడుకోవడం వల్ల దగ్గు ఎక్కువవుతుంది.

గుండెదడ, వణుకు, గుండె వాపు వల్ల రక్త ప్రసరణ ఆగిపోయినట్లుంటుంది.

రుమాటిక్ లక్షణాలు:

ఒక పాదం వెచ్చగా, రెండవది చల్లగా ఉండడం, పాదాలకి చెమట పట్టడం, భుజాల రెండింటి మధ్య విపరీతమైన మంటగా ఉండి, మోచేతులలో చీల్చుచున్నట్లు బాధగా ఉంటుంది. గౌట్ వల్ల కాలి బొటన వ్రేలిలో, పిక్కలలో రాత్రి పడుకున్న తర్వాత గుచ్చినట్లు బాధగా ఉంటుంది. బాధగా ఉన్నవైపు పడుకోలేకపోవడం ఉంటుంది.

చలి జ్వరం వచ్చిన వారిలో శరీరం మంచువలె చల్లగా ఉండి, మంచు మీద పడుకున్నట్లుగా ఉంటుంది. సాయంత్రం చలి వచ్చిన తర్వాత చెమట పట్టడం, చలి తగ్గిన తర్వాత మరల చలి రావడం, చెమట నీరుల్లి వాసన రావడం, బుగ్గలు ఎర్రబడడం, వెచ్చదనం సహించ లేకపోవడం వంటి లక్షణాలుంటాయి.

జీర్ణకోశ, మూత్రకోశ వ్యాధులతో బాధపడేవారిలో పొక్కులు ఉండి రక్తం దుర్వాసన గల స్రావాలతో కూడిన చర్మ రోగాల్ని ఈ మందు నివారిస్తుంది. పగలు నిద్రమత్తుగా ఉండి, రాత్రుళ్ళు ప్రమాదాల గూర్చి కలలు కనడం, నిద్రలో నవ్వడం, నిద్రలో ఏడవడం ఉండేవారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version