[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-57. లిలియం టిగ్ (Lilium Tig)
టైగర్ లిల్లీగా పిలవబడే ఈ విషపు మొక్క నుండి ఔషధ గుణాల్ని రాబట్టినవారు డా॥ టైలర్.
స్థానాలు:
ఈ మందు పెల్విక్ ఆర్గాన్స్, యూట్రస్, గుండెపై ప్రభావాన్ని చూపుతుంది.
వ్యాధులు:
ఇది జననేంద్రియ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పోలికలు:
కాక్టస్, సెపియా, ప్లాటినా, హెలోనియస్ మందులతో దీన్ని పోల్చవచ్చు.
విరుగుళ్ళు:
హెలోనియస్, నక్స్, పల్సటిల్లా మందులు దీనికి విరుగుళ్ళు.
ఉద్రేకం:
వీరికి సాయంకాలం, రాత్రిళ్ళు, వెచ్చనిగదిలో లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
స్వచ్ఛమైన గాలి వల్ల ఉపశమనం ఉంటుంది.
మయాజమ్:
ఇది సోరా మయాజమ్ గల మందు. వీరిది వేడి శరీర తత్వం.
మోతాదు:
6-200 పొటెన్సీలో దీన్ని వాడుకోవచ్చు.
కాల పరిమితి:
10-20 రోజులు ఉంటుంది.
పర్సనాలిటీ:
ఇది గర్భకోశ వ్యాధులతో బాధపడే అవివాహితులకు ఉపయోగపడుతుంది. ఇది ఎడమవైపు పని చేయుమందు.
ఇష్టాలు:
మాంసం అంటే ఇష్టం ఉంటుంది.
మానసిక లక్షణాలు:
మానసిక వ్యాధుల వల్ల భయం, ఎప్ప్పుడూ విచారంగా ఉండడం, ఇతరుల్ని తిట్టవలయునని, కొట్టవలయునని వుంటుంది. మాట్లాడునపుడు తడబడుతూ ఉండి పరాకుగా మాట్లాడడం ఉంటుంది.
శారీరిక లక్షణాలు:
తల బాధతో భారంగా వెచ్చగా, మందంగా ఉంటుంది. గర్భాశయ రోగాల వల్ల వచ్చు తలనొప్పికిది మంచి మందు.
కండ్లలో, రెప్పలలో వేడివల్ల దృష్టి చెదిరినట్లుండి వికారమైన చూపు, దృష్టి మాంద్యం ఉంటుంది.
జీర్ణకోశం ఉబ్బరింపుగా, వికారంగా, బరువుగా ఉండడం వల్ల పొత్తికడుపు బాధగా, వదులుగా వ్రేలాడినట్లు, వణుకుచున్నట్లు, దిగువకు, వెనుకకు లాగినట్లుంటుంది. ఆకలిగా ఉంటుంది.
జిగటతో రక్తంలో ఉండే విరేచనాల వల్ల ఆసనంలో తీపు తరచుగా ఆసనంలో నొక్కుచున్నట్లుండే బాధ వల్ల విరేచనానుమానం కల్గుతుంది.
శృంగార సంబంధమైన ఆలోచనలెక్కువగా ఉండడం వల్ల సంభోగం వల్ల ఎక్కువ నీరసంగా ఉంటుంది. పురుషులందు బీజాలు వాచి బాధగా ఉండి ఉదయాన నొప్పిగా, బరువుగా ఉంటుంది. వీరిలో తరచు మూత్రానుమానం ఉండి, మూత్రం కొద్దిగా, వెచ్చగా, పాలవలె పోతుంది.
స్త్రీలలో బహిష్టులు ముందరగా వస్తూ, స్రావం కొద్దిగా ముదురు రంగుతో, దుర్వాసనతో, నడుచునపుడు మాత్రమే అవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్ప్పుడు స్రావం వెడలకపోవడం విశేషం. గర్భాశయంలో రక్తమెక్కువగా చేరుట వల్ల బరువుగా ఉండి, గర్భాశయం వెలుపలకి వచ్చినట్లుండడం, జననేంద్రియాలలో దిగలాగినట్లు బాధగా ఉంటుంది. అండాశయంలో తొడలు దిగువ వరకు నొప్పిగా ఉండి, గోధుమ రంగుతో తెల్లమైల అవుతుంది. గర్భాశయం వద్ద ఉబ్బరించినట్లు ఉంటుంది.
సాయంకాలమందు పొడి దగ్గు ఎక్కువగా రావడం వల్ల ఊపిరి గాఢంగా తీసుకొనవలెనని ఉంటుంది. ఛాతీలో నొక్కుచున్నట్లు బాధగా ఉండడం, గుండెదడగా ఉంటుంది. బహిరంగమైన గాలిలో ఉపశమనం కల్గుతుంది. నాడి వక్రంగా, వేగంగా ఉంటుంది. మరలో పెట్టి నొక్కినట్టు, ఇనుపకడ్డీతో గట్టిగా చుట్టబెట్టినట్లు గుండె భాగంలో ఉంటుంది.
కుడి చేతిలో, చట్టలో, కాళ్ళలో చీలమండలంలో నొప్పివల్ల ఎత్తుపల్లంగా ఉండే ప్రదేశంలో నడుచుట కష్టంగా ఉంటుంది. అరిచేతులు, అరికాళ్ళలో మంటలు పుట్టి చర్మం దురదగా, మంటగా, తిమ్మిరిగా ఉంటుంది. విశ్రాంతినివ్వనటువంటి నిద్ర ఉంటుంది.
సాయంకాలం జ్వరం వల్ల శరీరం వెచ్చగా, ఆయాసంగా ఉంటుంది.
ఇలాంటివారికిది సరైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
