Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-55

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-58. లెడం పాల్ (Ledum Pal)

మార్ష్ టీగా పిలవబడే వృక్షజాతికి చెందిన మొక్కనుండి ఔషధ గుణాల్ని రాబట్టిన వారు డా॥ హానిమన్.

స్థానాలు:

ఈ మందుకి చర్మం, జాయింట్స్, జిగురుపొరలపై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఇది చర్మవ్యాధులు, కీళ్ళ నొప్ప్పులకు ఉపయోగపడుతుంది.

పోలికలు:

రూటా, హెమమెల్లిస్, బెల్లిస్, ఆర్నికా, హైపరికం, ఎఖినేషియా, నేట్రం మూర్ మందులతో దీనిని పోల్చవచ్చు.

విరుగుళ్ళు:

కాంఫర్ దీనికి విరుగుడుగా పనిచేస్తుంది. చైనా, ఆల్కహాల్, తేనెటీగలు కుట్టుట వల్ల కలిగే దోషాలకిది విరుగుడు.

కారణాలు:

విషజాతి పురుగులు, జంతువులు కరిచిన, దోమలు కుట్టిన, మేకులు, కత్తి వల్ల కలిగే గాయాల వల్ల వ్యాధులు వస్తాయి.

ఉద్రేకం:

వీరికి రాత్రి, పడక వేడిమి వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి చల్లదనం వల్ల, చల్లని నీటిలో కాళ్ళు ఉంచుట వల్ల ఉపశమనం ఉంటుంది.

మయాజమ్:

సిఫిలిస్ మయాజమ్ కలిగిన మందు. రుమాటిక్ డయాథిసిస్.

మోతాదు:

3-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.

కాలపరిమితి:

3-4 వారాలుంటుంది.

మానసిక లక్షణాలు:

అతికోపం, తోటివారి మీద అసహ్యత చెందడం, ఒంటరిగా ఉండాలనుకోవడం వంటి మానసిక లక్షణాలున్నవారికిది మంచి మందు.

శారీరిక లక్షణాలు:

తల:

నడుస్తున్నప్ప్పుడు వికారంగా ఉండి, ఒకవైపుకు తూలిపోతున్నట్లు ఉంటుంది.

ముక్కు:

ముక్కునుండి రక్తం స్రవిస్తుంది.

కండ్లు:

కంటిగాయాలవల్ల దుర్వాసనతో కూడిన రసి కారుతుంది. కాటరాక్ట్‌కిది మంచి మందు.

ముఖం:

నుదురు మీద, మెడల మీద ఎర్రని పొక్కులు, మొటిమలుండి ముట్టుకొన్న ఎడల ముండ్లు గ్రుచ్చుకొనినట్లు బాధగా ఉంటుంది.

జీర్ణకోశం:

అతి కొంచెం భోజనం చేసినా, జీర్ణకోశంలో బరువుగా ఉండి విపరీతమైన బాధగా ఉంటుంది. కడుపునొప్పితో జిగట విరేచనాలు, మలబద్దకం ఉండి మంటతో కూడిన మొలలుంటాయి. ఆసనంలో పుండ్లు పడతాయి. తరచు అపానవాయువులు రావడం వుంటుంది.

ఉదయాన, రాత్రి విడిచి విడిచి వచ్చు దగ్గు వల్ల ఊపిరాడకపోవుట. కోరింత దగ్గు దగ్గినప్ప్పుడు రక్తజీరతో ఉండే కఫం పడుతుంది.

పాదాలలో, కాళ్ళ పొడవునా కీళ్ళ సంధులలో, భుజాలలో నొక్కుచున్నట్లుండే నొప్పి. చీలమండల వాపు, అరికాళ్ళలో మంటలు, చీలమండలో తరచూ బెణుకు, పాదాలనుండి మోకాళ్ళ వరకు వాపులుంటాయి. పాదాలలో కాలిపొడవునా నొప్పులుంటాయి.

తలమీద, చర్మం మీద, ముఖం మీద, పొక్కులు. పాదాలు, చీలమండలు దురదగా ఉండి గోకిన ఎడల బాధ ఎక్కువవుతుంది. గాయాలు తగిలిన ప్రదేశాలు నల్లబడి వుంటాయి.

శరీరం చల్లగా, చల్లని నీరు చల్లినట్లుండుట. ముఖం మాత్రం వెచ్చగా ఉంటుంది.

ఇలాంటివారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version