Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-59

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-63. నక్సుమోస్కేటా (Nux moschata)

ఇది నట్‌మెగ్ జాజికాయ నుండి తయారు చేయబడ్డ మందు. వెస్టిండీస్‌లో పెరిగే ఈ మొక్క నుండి ఔషధ గుణాలని హెల్‌బిగ్ తయారు చేశాడు.

స్థానాలు:

ఈ మందు మెదడు, నర్వస్ సిస్టమ్, చర్మం, జీర్ణకోశం, శ్వాసావయవాలు, యూటస్ర్, నరాలు, మనస్సుపై ప్రభావం చూపుతుంది.

కారణాలు:

చలి వాతావరణం, చల్లని పానీయాలు, అధికంగా భోజనం చేయడం, భయం, మెంటల్ ఎగ్జర్షన్, ఆల్కహాల్, పొక్కులు అణగారిపోవడం వల్ల అనేక వ్యాధులొస్తాయి.

వ్యాధులు:

ఇది స్త్రీలు, పిల్లల్లో వచ్చే జీర్ణావయవ, జననేంద్రియ వ్యాధులు, నరాల వ్యాధులకు ఉపయోగపడుతుంది.

మోతాదు:

1-30 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.

కాల పరిమితి:

6-8 రోజులు ఉంటుంది.

పోలికలు:

ఇది పిల్లలకు, వృద్ధులకు ఉపయోగపడే మందు.

విరుగుళ్ళు:

కాంఫర్, జెల్సీమియం, నక్స్, లారోసిరాసస్ విరుగుళ్ళుగా పనిచేస్తాయి.

ఉద్రేకం:

వీరికి తేమగాలిలో తిరిగినా, చల్లని ఆహారం వల్ల, ముఖాన్ని చన్నీటితో కడగడం వల్ల, బాధగా ఉన్నవైపు పడుకున్నప్పుడు, బహిష్టు, స్నానం, తేమ, గాలి, మంచు, బండిలో ప్రయాణం చేసేటప్పుడు వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి వెచ్చదనం వల్ల, వెచ్చని గది, పొడిగాలి వల్ల ఉపశమనం ఉంటుంది.

తత్త్వం:

వీరిది హైడ్రోజినాయిడ్ తత్త్వం, చలికి తట్టుకోలేరు.

స్వభావం:

వీరు వీక్‌గా ఉండి పొడి చర్మం కల్గి, సెన్సిటివ్‌గా, సున్నితంగా నాడీమండల ప్రేరణతో ఉంటారు.

మయాజమ్:

వీరు సోరా, సైకోసిస్ మయాజమ్ కలిగి ఉండి. నర్వస్‌గా ఉంటారు. వీరిది హిస్టీరికల్ టెంపర్‌మెంట్.

మానసిక లక్షణాలు:

వీరు చదువుచున్నప్పుడు, వ్రాయుచున్నప్పుడు, అసలు విషయాల్ని మరచిపోవడం జరుగుతుంది. జ్ఞాపకశక్తి తక్కువగా ఉండడం వల్ల త్రాగినవాని వలె ఏమి చేయుటకు తోచక మందంగా ఉండడం. మూడ్స్ తరచు మారడం వల్ల, నవ్వడం వెంటనే ఏడ్వడం వుంటుంది.

శారీరిక లక్షణాలు:

కొద్దిగా ఆహారం ఎక్కువగా తీసుకున్నా, తలనొప్పి ఉంటుంది. ఆరుబైట గాలిలో నడిచినపుడు వికారంగా, తల బరువుగా ఉంటుంది. తల పెద్దదైనట్లుండడం, నిద్రమత్తుగా ఉంటుంది. తలనొప్పి గట్టిగా నొక్కడం వల్ల ఉపశమనం ఉంటుంది.

దగ్గర వస్తువులు దూరంగా, పెద్దవిగా కన్పించడం వంటి దృష్టి లోపాలుంటాయి. కండ్లు మంటగా, దురదగా ఉండి నీళ్ళు కారడం ఉంటుంది.

చెవులు దిబ్బడ వేయడం ఉంటుంది. దూరపు మాటలు బాగా వినబడతాయి.

ముక్కు నుండి నల్లని రక్త స్రావం కారడం, నోరు ఆర్చుకొనిపోయినట్టుండి, దాహంగా ఉండక పోవడం. నోరు దుర్వాసనగా ఉండి నాలుకపై తెల్లని పూత ఉంటుంది. పక్షవాతంలో వలె గుటక వేయటానికి ఇబ్బందిగా ఉంటుంది.

గొంతు ఆర్చుకొనిపోయి ఇరిటేషన్‌గా ఉండడం, ఎదురు గాలిలో నడిచినప్పుడు గొంతు బొంగురుపోవడం ఉంటుంది. ఉక్క, వేడి వలన వచ్చే దగ్గు వల్ల ఊపిరాడకపోవడం. హిస్టీరియాతో ఉండే ఉబ్బరానికి ఇది మంచి మందు.

గ్యాస్ వల్ల పొట్ట ఉబ్బరించి ఏమి తిన్నా, త్రాగినా, ఎక్కువ అవుతుంది. ఎక్కిళ్ళు వస్తుంటాయి. తిన్న తర్వాత పుల్లని త్రేన్పులు రావడం ఉండి, అయినప్పటికీ అజీర్ణం చేయు వంటలంటే ఇష్టం ఉంటుంది.

మలబద్దకం ఉండి, విరేచనానంతరం స్పృహ తప్పి పడిపోవడం ఉంటుంది. పురుషుల్లో సంభోగ శక్తి తక్కువగా ఉండడం. ప్రోస్టేట్ గ్రంధి వాపు ఉంటుంది.

స్త్రీలలో బహిష్టులు ఇర్రెగ్యులర్‌గా అవుతాయి. బహిష్టు స్రావం చాలా రోజులు వరకు చిక్కని ముదురు రంగులో వెలుతుంది. బహిష్టులు అణిచిపెట్టబడడం వల్ల నిద్రమత్తుగా ఉండి, తరచు సొమ్మసిల్లి పోతుంటారు. బహిష్టుకు బదులు తెల్లమైల అవుతుంది. బహిష్టు బహిష్టుకు మధ్య రక్తస్రావం అవుతుంది. విరేచనమయేటప్పుడు రక్తంతో కూడిన తెల్లమైల స్రవించడం ఈ మందు ప్రత్యేకత. గర్భిణీల్లో శరీరం కొయ్యబారడం, హిస్టీరియా ఉంటుంది. ప్రయాణాలలో వికారం, గర్భస్రావం కావడం వుంటుంది. పొత్తికడుపు ఉబ్బరం ఉంటుంది. ఛాతీలో నొక్కిచున్నట్లుండి ఊపిరాడదు. గర్భిణీలలో వచ్చే పండ్ల సలుపుని మాన్పుతుంది.

గుండెలో నొక్కినట్లు ఉంటుంది. భయం, విచారం వల్ల గుండెలో వణుకు, గుండె దడ వుంటుంది.

ఎడమచేతిలో వణుకు, నడుంనొప్పి ఉంటాయి. తేమగాలి వల్ల అవయవాల్లో లాగుచున్నట్లు నొప్పిగా ఉంటుంది. వెచ్చదనం కల్గించే దుస్తులు వేసుకున్నప్పుడు నొప్పులు రిలీఫ్‌గా ఉంటాయి.

కుడిచట్టలో నుండి మోకాలిలోనికి నొప్పి కదిలిన, మెట్లెక్కిన ప్రయాణం చేసిన ఎక్కువవుతుంది.

వ్యాధుల వల్ల మగతగా, నిద్రమత్తుగా ఉంటుంది.

ఇతర లక్షణాలు:

టైఫాయిడ్ జ్వరంలో మగత, స్మృతి లేకపోవడం, సమాధానం చెప్పక కండ్లు మూతలు పడి మూసుకొనిపోయి ఉంటాయి. నాలుక, నోరు, కంఠం సాయంత్రమయ్యేసరికి ఆర్చుకొనిపోయి అంగిటికి అంటుకుపోవును గాని దాహముండదు. కడుపు నిండుగా ఉండి ప్రేగుల్లో గుడగుడలాడుతూ దుర్వాసనతో కూడిన విరేచనాలుంటాయి.

నిద్ర:

గుండెదడతో సొమ్మసిల్లి నిద్రపోవడం ఉంటుంది. వ్యాధి లక్షణాలతో మగత నిద్ర, మత్తు, ఉండి బాధలు నిద్రమత్తును కల్గచేస్తాయి. కొంచెం వ్యాయామం చేసినా నీరసంతో పడుకోవడం ఉంటుంది.

ఇలాంటి వారికి ఇది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version