[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-64. ఓపియం (Opium)
దీన్ని నల్లమందు, పోపి అని అంటారు. డా॥ హానిమన్ దీన్ని మొదట ప్రవేశపెట్టాడు. ఓపియం అనేది లాటిన్ పదం. ఇది పాపవెర్ సోప్నిఫెరమ్ నుండి వచ్చింది.
స్థానాలు:
ఈ మందు నరాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది.
వ్యాధులు:
ఇది ఫిట్స్, నరాల వ్యాధులకు ఉపయోగపడుతుంది.
కారణాలు:
ఇది భయం, కోపం, అవమానం, అధిక సంతోషం, ఆల్కహాల్, వేడి, లెడ్, చార్‌కోల్ వాయువులు పీల్చడం వల్ల వచ్చే వ్యాధులకు ఉపయోగపడుతుంది.
విరుగుళ్ళు:
దీనికి బెల్లడోనా, ఇపెకాక్, నక్స్, ప్యాసిఫ్లోరా, కాఫీ, కాంఫర్ విరుగుడుగా పనిచేస్తాయి.
ఉద్రేకం:
వీరికి నిద్ర లేచిన తర్వాత, చెమట వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి నడుచుట వల్ల, బహిరంగమైన గాలి వల్ల వాంతి అయిన తర్వాత ఉపశమనం ఉంటుంది. నల్లమందు అలవాటును మాన్పుటకు అవైనా సటైవా, బెర్బెరిస్ వల్గారిస్‌ని వాడవచ్చు. ఇది ముసలి వారికి, పిల్లలకు వచ్చే రోగాలకు ఉపయోగపడుతుంది. జడత్వం గల పర్సనాలిటీ, నొప్పి ఉండదు. సున్నితంగా ఉండే జ్ఞానేంద్రియాలుంటాయి. ఇది ఇరిటబుల్ తత్వం గల వారికి ఉపయోగపడుతుంది.
మోతాదు:
6 – 1 M పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాల పరిమితి:
3 – 4 వారాలు ఉంటుంది.
మానసిక లక్షణాలు:
వీరికి భయం ఉండి, చనిపోవుదుననే భయంతో వెర్రివానివలె పరాకుగా మాటలాడుతారు. తనకేమీ జబ్బు లేదని చెప్పడం వంటి మానసిక లక్షణాలుంటాయి.
శారీరిక లక్షణాలు:
తల:
తల బరువుగా ఉండి, మందంగా, వికారంగా ఉండడం జరుగుతుంది. తలనొప్పి, తల దిమ్ము ఉంటాయి.
కండ్లు:
కనుగ్రుడ్లు గాజు కండ్ల వలె కదలకుండా ముందరకు చొచ్చుకొని వచ్చినట్లుంటాయి. కంఢ్లు ఎర్రగా, మంటగా ఆర్చుకుపోయి సగం మాత్రమే మూయబడి ఉంటాయి. కనుపాపలు చిన్నవిగా ఉంటాయి.
చెవులు:
చిన్న శబ్దాలకు కూడా నిద్ర పట్టదు.
ముఖం:
ముఖం పొంగరించి ఎర్రగా వాపుగా, వెచ్చగా, పాలిపోయి మట్టి రంగుగా ఉంటుంది. కండ్లు పీక్కుపోయినట్లుంటాయి.
నోరు:
లాలాజలం తక్కువగా ఉండడం వల్ల నోరు పొడారి ఉంటుంది. నాలుక ఉదారంగుగా లేదా నల్లగా, ఒక్కోసారి తెల్లగా, పసుపు పచ్చని పూతతో ఉంటుంది.
జీర్ణకోశం:
జీర్ణశక్తి తక్కువగా ఉండడం వల్ల అజీర్తిగా ఉండి, ఎక్కువ దాహంగా ఉంటుంది. వాంతులైన ఆకలి ఉండదు. పొత్తి కడుపులో నొప్పి ఉండి, ఆసనం ముడుచుకొని పోవడం వల్ల అపాన వాయువు కష్టం మీద పోతుంది. మగతలో నల్లగా, దుర్వాసనతో ఉండే విరేచనాలు అప్రయత్నంగా వెడలుతాయి. ముసలివారిలో వచ్చే మలబద్దకానికిది మంచి మందు. బొడ్డు వద్ద, గజ్జల్లో వచ్చే హెర్నియాకిది మంచి మందు. పిల్లల కలరా వ్యాధికిది మంచి మందు.
తిన్న ఆహారం మలం వాసనతో, వాంతి అవుతుంది.
మనసులో భయం వల్ల మూత్రం అప్రయత్నంగా వెడలడం లేదా అణిచి పెట్టబడడం జరుగుతుంది, మూత్రం కొద్దిగా ఎర్రగా ముదిరిన గోధుమ వర్ణంగా ఉంటుంది.
ఒక్కోసారి సంభోగేచ్ఛ తగ్గి నపుంసకత్వం వుంటే, మరొక్కసారి సంభోగేచ్ఛ ఎక్కువై తరుచు లేపనం కల్గుతుంది.
స్త్రీలలో భయం వల్ల మైల అణిచి పెట్టడం వల్ల గర్భస్రావ సూచనలు కల్గుతాయి. ప్రసవ నొప్ప్పులు అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల శరీరం కంపిస్తుంది. శరీరం మగతగా వుంటుంది.
వీరిలో నోరు తెరచి ఊపిరి పీల్చడం ఉంటుంది. దగ్గువల్ల శరీరమంతట చెమటలు పడతాయి.
ఊపిరితిత్తులకు పక్షవాతం వచ్చినట్లు విడిచి విడిచి ఊపిరి తీస్తారు. గుర్రుపెడుతూ ఊపిరి తీస్తారు.
కాళ్ళు చేతులు మొద్దుబారి కంపం చెందడం, చల్లబడి ఉంటుంది. బాధ లేనట్టి పక్షవాతం ఉండి, పుండ్లు పడతాయి (బెడ్ సోర్స్).
శరీరం వేడి వల్ల పరుపు ఎక్కువ వెచ్చగా ఉంటుంది. చెమటలు శరీరమంతటా పట్టినా, శరీరమంతట మంటగా ఉండడం వల్ల ఎర్రగా, మగతగా ముఖం కందినట్లు ఉంటుంది. నుదురు, తల మీద చల్లని చెమటలు పడతాయి. ఇది పై లక్షణాలున్న వారికి సూచించదగ్గ మేలైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
