Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-61

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-65. పైసోస్టిగ్మా (Physostigma)

కలబర్ బీన్ అనే లెగ్యూమినసీ ఫ్యామిలీకి చెందిన వృక్షజాతికి చెందిన దీన్ని క్రిస్టిసన్, సింప్సన్, డౌగ్లస్ మొదలైనవారు ఔషధంగా నిరూపించడమైనది. దీని విత్తనాలు విషపూరితమైనవి.

స్థానాలు:

ఈ మందు కండ్లు, జీర్ణకోశం, శ్వాసకోశాలపై ప్రభావం చూపుతుంది.

వ్యాధులు:

ఇది కంటి వ్యాధులు, స్త్రీల వ్యాధులు, ఎడమవైపు కలిగే పక్షవాతంకి మంచిమందు.

మోతాదు:

3-200 పొటెన్సీలో దీన్ని వాడుకోవచ్చు.

కాల పరిమితి:

2-3 వారాలుంటుంది.

పోలికలు:

జెల్సీమియం, కోనియం, లధిరస్, ఫాస్పరస్ మందులతో దీన్ని పోల్చవచ్చు.

కారణాలు:

గాయాలు, స్నానం చేయడం, ఎమోషన్స్, బాధ ఉన్నవారికిది ఉపయోగపడుతుంది. ఇది కుడివైపు పనిచేయుమందు.

ఉద్రేకం:

వీరు ఎడమవైపు పడుకున్నా, 4 p.m., రాత్రి పూట, చల్ల నీరు త్రాగినా, నిద్రలేచినా, కదలినా, నడిచినా, ప్రెషర్ క్రిందికి దిగడం వల్ల ఉద్రేకం కల్గుతుంది.

ఉపశమనం:

వీరు వెల్లకిలా పడుకున్నా, కుడివైపు పడుకున్నా, ఆరుబైట చల్లగాలికి కళ్ళు మూసుకున్నా, నిద్రపోయినా, పాదాలు వెచ్చదనం వల్ల ఉపశమనం ఉంటుంది.

మానసిక లక్షణాలు:

వీరిలో చిరాకు, నర్వస్‌నెస్ ఉండడం వల్ల, ఆలోచించడం కష్టంగా ఉంటుంది. దీని వల్ల ఏకాగ్రత వుండదు. ఏ పని చేయలేరు. పిచ్చి పనులు చేస్తుంటారు.

శారీరక లక్షణాలు:

తల:

నడిచేటప్పుడు వికారంగా ఉండి, తలతిరుగుతుంది. ఉదయాన తల బరువుగా ఉండి ముక్కుకారుతుంది. మగతగా ఉండి, తల పట్టేసినట్లుంటుంది. మైగ్రేన్ తలనొప్పి వల్ల కళ్ళు తెరవలేరు. నుదురు, కణతల్లో పొడిచినట్లుండి పడుకున్నప్పుడు నరాలు అదిరినట్లుంటాయి. నడినెత్తిన బరువుగా ఉండి, వెనక్కి లాగినట్లుంటుంది. వీరు తలనొప్పి వల్ల ఆలోచించలేరు.

కండ్లు:

కండ్ల కలక ఉంటుంది. కండ్లు పొడిబారి, మంటగా, ఎర్రగా ఉండి చదివేటప్పుడు లాగినట్లు ఇబ్బందిగా ఉంటుంది. మొదట కుడి, తర్వాత ఎడమ కంటిలో వచ్చే బాధలు చల్ల గాలులవల్ల కదిలిన ఎక్కువవుతాయి. కనురెప్పలు బరువుగా ఉండి, వికారంగా చదివేటప్పుడు వుంటుంది.

కంటి కండరాలు, కనుపాపలు సంకోచించడం వల్ల కనురెప్పలు నొప్పితో పైకి ఎత్తలేరు. చూపు మందగిస్తుంది. ఆప్టిక్ నర్వ్ డిజనరేషన్ ఉంటుంది. బెల్స్‌పాల్సీకి కండరాలు అదురుతుంటాయి. వణుకు, ఎడమవైపు కల్గు పక్షవాతంకు, నిస్త్రాణకు ఇది మంచి మందు. కుడివైపు కంటిలో నొప్పి ఉండి చదివినా ఉదయాన ఎక్కువవుతుంది. చూపు మసకగా ఉంటుంది.

ఊపిరితిత్తులకు పక్షవాతం వల్ల ఉబ్బసం, ఆయాసంగా ఉంటుంది. నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుండడం, ఆహారం తిన్నా, తినకపోయినా కడుపులో ఎప్పుడు రాయి పెట్టినట్లు బరువుగా ఉంటుంది.

గుండె యందలి ధాతువులు క్రొవ్వుగా మారడం, గుండె దడ ఉంటుంది.

స్త్రీలలో గర్భకోశం ఇన్ఫెక్షన్ వల్ల తెల్లమైల ఎక్కువగా కావడం, కుడి తొడలో విపరీతమైన నొప్పి ఉంటుంది. బహిష్టులు ఇరెగ్యులర్‌గా, నెలకు రెండు సార్లు నడుం నొప్పి, గుండెదడతో కంటి కండరాల వాపుతో ఊపిరాడనట్లుంటుంది.

చెవులు:

పొడిచినట్లు ఎడమ నుండి కుడివైపు చెవిలో నొప్పి వస్తుంది. శబ్దాల్ని భరించలేరు. చెవుల్లో బుసకొట్టినట్లు, మారుమ్రోగినట్లు శబ్దాల వల్ల చెవుడు వస్తుంది. గుబిలి వల్ల చెవిలో అనీజీగా ఉండి, వ్రేలు పెట్టి త్రిప్పుతుంటారు.

ముక్కు:

ముక్కునుండి నీళ్ళు కారడం ఉండి, తుమ్ములు వస్తాయి. ముక్కులో దురద, మంట, ఇరిటేషన్ ఉంటుంది. ముక్కు పుటాలదిరినట్లుంటాయి. రాత్రి తల, ముక్కు మొదటి భాగంలో బరువుగా ఉండి, ముక్కు నుండి రక్తం కారుతుంది. ముక్కులో గుల్లలుంటాయి.

ముఖం:

ముఖంలో వేడి ఆవిర్లు రావడం, కుడి వైపు న్యూరాల్జియా పెయిన్స్ ఉంటాయి. క్రాంప్స్ ఎడమవైపు కండరాల్లో స్పాజమ్స్ వల్ల వస్తాయి. పెదవులతో సహా తిమ్మిరిగా వుంటుంది.

పిల్లల్లో దంతాలు వచ్చే సమయంలో, ఆహారం తీసుకునేటప్పుడు మొదట పంటి నొప్పితో కడుపునొప్పి ఉండి, తగ్గిపోతుంది.

నోరు:

టాన్సిల్స్, వాపు వల్ల, గొంతునొప్పి వల్ల మ్రింగడం కష్టంగా ఉంటుంది. మ్రింగేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎడమ చెవిలోకి నొప్పి వ్యాపిస్తుంది. గొంతులో అడ్డుపడినట్లుండి, పట్టేసినట్లుంటుంది, ఎంగిలి కూడా మ్రింగలేరు. నోటిలో చిక్కటి లాలాజలం వల్ల మాట్లాడడం కష్టంగా ఉంటుంది.

జీర్ణకోశ లక్షణాలు:

ఆకలి ఉండదు, ఆహారం సహించదు. ముఖ్యంగా పొగాకు, కాఫీ, చల్లని పానీయాలు తీసుకున్నప్పుడు కడుపులో మంటతో వికారం, వాంతులు ఉంటాయి. విపరీతమైన ఎక్కిళ్ళు రావడంతో నర్వస్‌నెస్ ఉంటుంది. ఆహారం అరగకపోవడం వల్ల కడుపులో బరువుగా ఉంటుంది. బొడ్డు దగ్గర నొప్పి, పొడిచినట్లు నొప్పిగా ఉండి, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. పొత్తి కడుపు, గజ్జల్లో నొప్పి వల్ల తరచు విరేచనానుమానం ఉంటుంది. ఆసనంలో నొప్పి, తీపుతో నల్లని తారులాంటి నీళ్ళ విరేచనాలు, మొలలు ఉంటాయి.

యూరినరీ:

కిడ్నీ ప్రాంతంలో నొప్పి వల్ల మూత్రాశయం నిండుగా ఉన్నట్లు ఉంటుంది. తరచు మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది. మూత్రం పసుపు పచ్చగా ఉండి అధికంగా దుర్వాసనతో అవుతుంది.

జననేంద్రియ లక్షణాలు:

జననేంద్రియాల్లో దుర్వాసన గల చెమటలుండి, కోరిక లేకుండానే సంభోగేచ్ఛ వుంటుంది.

స్త్రీలు:

తెల్లమైల సాయంత్రం 4 గంటలకు ఎక్కువవుతుంది. బహిష్టులు ఇరెగ్యులర్‌గా, రెండు వారాలకొకసారి వస్తాయి. గుండె దడతో నడుంనొప్పి ఉంటుంది. గర్భసంచి మొద్దుబారినట్లుంటుంది.

శ్వాసకోశం:

దగ్గుతో, గొంతులో ఇరిటేషన్‌గా ఉండి, ఊపిరాడనట్లుంటుంది. ఛాతీలో పొడిచినట్లు, బరువుగా ఉంటుంది. ఊపిరి వదిలినపుడు, వీపు వెనుక భాగంలో సూదితో పొడిచినట్లు నొప్పి ఉంటుంది. ఛాతీలో బరువుగా ఉంటుంది.

గుండె దడ వల్ల శరీరమంతట అదిరినట్లుంటుంది. ముఖ్యంగా ఎడమవైపు పడుకున్నప్పుడు. వెల్లకిల్లా పడుకున్నప్పుడు రిలీఫ్ ఉంటుంది.

రుమాటిజమ్:

నిద్ర లేవగానే మెడ, కుడివైపు తల పట్టేసినట్లు ఉంటుంది. వెన్నెముక నీరసంగా ఉండడం వల్ల సరిగా నిలబడలేరు. సాయంత్రం 7 గంటలకి వెన్నులో చలి పారాడినట్లుంటుంది. నడుంనొప్పి వల్ల రాత్రంతా అస్థిమితంగా ఉండి, మూత్ర విసర్జన చేసిన రిలీఫ్ ఉంటుంది.

నడిచినా, బరువులెత్తడం వల్ల వచ్చే నడుం నొప్పికిది మంచి మందు. చలి, నిస్సత్తువతో, శరీరం మొద్దు బారినట్లు, చచ్చుగా ఉండే కాళ్ళునొప్పులుంటాయి. కాళ్లలో న్యూరాల్జిక్ నొప్పులుంటాయి. కీళ్ళలో బిగదీసునట్లుండే నొప్పులతో రోగి తూలినట్లు నడుస్తుంటారు. మణికట్టు, ఎడమ భుజంలో పొడిచినట్లు నొప్పితో, ఎడమచేయి మొద్దుబారి ఉంటుంది. అరచేతులు దురదగా, మంటగా ఉండడమే కాకుండా చల్లగా ఉండి, తర్వాత ఎర్రబారి వేడిగా ఉంటుంది.

ఎడమ తుంటి, తొడ వరకు పట్టేసినట్లు నొప్పిగా ఉండడం వల్ల సరిగా నడవలేరు. మోకాళ్ళనొప్పులు వల్ల ఎడమపాదం మొద్దుబారి ఉంటుంది.

కండరాలదరడం, పట్టేసినట్లుండడం వల్ల, నిద్రలేచి పాదాల్ని నేలకు ఆన్చినపుడు శరీరమంతా అదిరినట్లు, శరీరం తేలిపోతున్నట్లు ఉంటుంది. శరీరం ఎడమవైపు చచ్చుగా ఉంటుంది.

ఎప్పుడూ కునికిపాట్లు పడుతూ, ఆవలిస్తూంటారు. అస్థిమితంతో కూడిన కలలతో నిద్రలేమి ఉంటుంది, శరీరమంతట చల్లని చెమటలు పడతాయి. జననేంద్రియాల్లో దుర్వాసన గల చెమటలతో తల ముఖం వేడిగా వుండి ఆవిర్లు చిమ్మినట్లుంటుంది. ఇలాంటివారికిది సూచించదగ్గ మేలైన మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version