[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-66. రూమెక్స్ (Rumex crispus)
కర్లోడ్ డాక్, ఎల్లో డాక్, హాఫ్‌టిన్ గర్నస్‌గా పిలవబడే వృక్ష తరగతికి చెందిన ఈ చెట్టు వేరునుండి జోస్‌లిన్ ‘రూమెక్స్’గా తయారు చేశాడు. ఈ మొక్క నార్త్ అమెరికా పొలాల్లో, రోడ్ల ప్రక్క విస్తారంగా పెరుగుతుంది.
స్థానాలు:
ఈ మందు గొంతు, స్వరపేటికలోని జిగురు పొరలు, నరాలు, చర్మం, గుండె ఎడమ భాగం, చీలమండలు (ankles), మలకోశం, ప్రేవులపై ప్రభావం చూపుతుంది.
వ్యాధులు:
ఇది క్షయ, బ్రాంకైటిస్, ఫారింజైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు, మద్యం తాగేవారిలో వచ్చే కామెర్ల వ్యాధి, లారింక్స్, ట్రాకియా, బ్రాంకై, చర్మం, ప్రేవుల వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పోలికలు:
కాష్టికం, డ్రోసిరా, ఫాస్పరస్, బెల్లడోనా మందులతో దీన్ని పోల్చవచ్చు.
విరుగుళ్ళు:
లేకసిస్, హయస్యామస్, కోనియం, బెల్లడోనా, కాంఫర్ దీనికి విరుగుళ్ళుగా పనిచేస్తాయి.
మోతాదు:
3-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాలపరిమితి:
3-4 వారాలు ఉంటుంది.
ఉద్రేకం:
వీరికి సాయంకాలం, చల్లగాలి పీల్చడం వల్ల, ఛాతీకి ఎడమవైపు తాకినా, ఒత్తిడి, వేడి నుంచి చలి, చలి నుండి వేడి వాతావరణంలోకి వెళ్ళినా, రాత్రి ఆరుబైట గాలిలో, కప్పుకొనక పోవడం, పడుకోవడం వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి శరీరాన్ని కప్పుకోవడం వల్ల, వెచ్చదనం వల్ల, కుడివైపు పడుకున్నా, మ్రింగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. వీరు చలికి తట్టుకోలేరు, కదలకుండా పడుకోవడం వల్ల లక్షణాలు ఉపశమనం చెందుతాయి.
తత్త్వం:
వీరు క్షయ తత్త్వం కలిగి ఉంటారు.
మయాజమ్:
ఇది సోరా మయాజమ్ గల మందు.
స్వభావం:
వీరు సన్నగా, బక్కపల్చగా ఉండి ఛాతీ చదరంగా ఉండే రోగులు. ముక్కు పొడారినట్లుండి, పొడి దగ్గు వల్ల నీళ్ళ వంటి స్రావంతోను, తీగవలె చిక్కటి స్రావంతో వస్తుంది. ముక్కుదిబ్బడ ఉండి, తరచుగా తుమ్ములు వస్తాయి. జలుబు చేసినపుడు ఉదయాన విరేచనాలు కావడం వుంటుంది.
గొంతు, స్వరపేటికలో గరుకుగా, బాధగా ఉండి ఇరిటేషన్ ఉంటుంది. పొడి దగ్గు చల్లగాలికి, మాట్లాడినా, గాలి తీసుకున్నప్పుడు, సాయంత్రం పూట ఎక్కువవుతుంది. దగ్గినపుడు మూత్రం అప్రయత్నంగా వెడలడం జరుగుతుంది, రాత్రిళ్ళు ఎడమవైపు పడుకున్నప్పుడు దగ్గు ఎక్కువవుతుంది. గొంతు బొంగురుపోతుంది. నాలుకపై పూత ఉండి, నాలుక చివర నొప్పిగా ఉంటుంది. కడుపు, ఛాతీలో నొప్పి గొంతులోనికి రావడం వల్ల మాట్లాడినా, కదలినా ఎక్కువవుతుంది. ఆల్కహాల్ త్రాగేవారిలో వచ్చే కామెర్ల వ్యాధికిది మంచి మందు. నులిపురుగుల వల్ల ఆసనంలో దురదలుంటాయి. మొలలు వల్ల పల్చగా నీళ్ళవలె గోధుమ రంగులో, దగ్గుతో విరేచనాలవుతుంటాయి. నిద్రలేవగానే, ఉదయంపూట 5-10సార్లు కడుపునొప్పితో ఆకస్మికంగా వచ్చి, విస్తారమైన విరేచనాలు, దుర్వాసనతో, బాధరహితంగా అవుతాయి.
క్షయ రోగుల్లో ఎడమవైపు లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. విడిచి పెట్టని అలసట కల్గించే దగ్గు వల్ల గొంతులో ఉండ పెట్టినట్లుండి, మ్రింగినప్పుడు తగ్గి మరల వస్తుంది. మెట్లెక్కినప్పుడు, తిన్న తర్వాత గుండె దడ వస్తుంది. ఉన్నట్టుండి ఊపిరాడనట్లుండి ఎడమ చేయి నొప్పి వస్తుంది. ఛాతీనొప్పితో తలనొప్పి, త్రేన్పులు వస్తాయి. పని చేసేటప్పుడు, డెస్క్ వర్క్ చేసేటప్పుడు, ఎడమవైపు ఛాతీలో 3-4 గంటలకు మంట, పొడిచినట్లుంటుంది.
శ్వాసకోశ లక్షణాలు:
దగ్గినపుడు స్వరపేటికలందు, శ్వాసనాళమందు పొడిగా, ఇరిటేషన్‌గా, పచ్చిగా ఉన్నట్లుండి కఫం తక్కువగా ఉంటుంది. అతి శీతల గాలిని ఎంత స్వల్పంగా పీల్చినా, పీల్చు గాలి యొక్క వెచ్చదనం అధికమగుటకు తలను దుప్పటితో కప్పుకొని పడుకుంటారు. దగ్గినపుడు మూత్రం అప్రయత్నంగా పోతుంది. ఎడతెగని అలసట కల్గించే పొడి దగ్గు ఉంటుంది. ఎడమవైపు పడుకున్న దగ్గు ఎక్కువవుతుంది.
గొంతులో ఇరిటేషన్ కల్గించే దగ్గు ఉండి, రాత్రి పూట ఒత్తిడికి, మాట్లాడిన ఎక్కువవుతుంది. సాయంకాలం పడుకున్న తర్వాత, తినేటప్పుడు, చల్లదనం వల్ల ఉన్నట్టుండి గొంతు బొంగురు పోతుంది. స్వరం నిలకడ ఉండదు. కంఠంలో అడ్డుపడినట్లుండి, గుటక వేయుటచే గొంతులోకి దిగి వెంటనే తిరిగి కల్గుతుంది. తరచు ఖాండ్రించడం చేస్తారు. దగ్గేటప్పుడు చేతులు చల్లబడతాయి. పీరియాడికల్‌గా దగ్గు రావడం వల్ల ఊపిరాడదు.
చర్మవ్యాధి లక్షణాలు:
దుస్తుల్ని వదులు చేసినపుడు, కప్పుకొనక పోవుటచేత చల్లగాలి సోకుటచే వివిధ భాగాల్లో దురదలుండి చల్లదనంచే అధికమై, వెచ్చదనంచే ముఖ్యంగా ప్రక్క యొక్క వెచ్చదనంతో కాళ్ళపై పొక్కులెక్కువగా వచ్చి చలికి గుచ్చినట్లు దురదలుంటాయి. దీన్నే ఆర్మీ ఇచ్ అంటారు. దద్దుర్లు చలిగాలికెక్కువవుతాయి. పీరియాడికల్‌గా దురదలు కల్గుతాయి.
జీర్ణకోశం:
తిన్న తర్వాత పొట్ట ఉబ్బరించడం వల్ల పొట్ట బరువుగా, గుడ గుడ శబ్దాలతో ఉండి ఊపిరి తీసుకున్న ఎక్కువవుతుంది. బొడ్డు దగ్గర నొప్పి అపాన వాయువు వెడలిన తర్వాత తగ్గుతుంది. ఆకలి ఒక్కోసారి ఎక్కువగా ఉండి, మరొకసారి తగ్గుతుంది. వికారంగా ఉండి, ఎక్కిళ్ళు రావడం, అజీర్తి ఉంటాయి. నిద్ర లేవగానే కడుపునొప్పి ఉంటుంది.
మలబద్దకం దీర్ఘకాలికంగా ఉండి ఆసనంలో దురదగా, వేడిగా ఉండి అడ్డు వున్నట్లుండి నడిచేటప్పుడు పుల్లతో పొడిచినట్లుంటుంది.
మూత్ర విసర్జనానుమానం వల్ల తరుచుగా పోవడం, మూత్రంలో ఇటుక పొడి పోవడం వుంటుంది.
మెడ చుట్టు త్రాడుతో బిగించినట్లుంటుంది. నొప్పి మెడ నుండి వీపు మధ్య భాగంలోకి వ్యాపించడం ఉంటుంది. బరువులెత్తడం వల్ల తుంటినొప్పి, నీరసం ఉండి, భుజాల్లో నొప్పి చేతుల్లోకి వ్యాపించడం వల్ల నలగకొట్టినట్లు నొప్పులుంటుంటాయి. పాదాల్లో అనెలుండడం వల్ల నొప్పిగా, సెన్సిటివ్‌గా ఉంటారు. నిలబడిన మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులుండడం వల్ల కుంటుతూ నడుస్తారు. కాళ్ళపై ఎర్రటి మొటిమలుంటాయి.
ఇలాంటివారికిది సూచించదగ్గ మేలైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
