Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-63

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-67. పైటోలక్కా (Phytolacca)

పోక్ రూట్‌గా పిలవబడే మొక్క నుండి ఈ మందుని తయారు చేయడమైనది. దీన్ని వెజిటబుల్ మెర్కురీగా వ్యవహరిస్తారు. డా॥ హెరింగ్ దీని నుంచి ఔషధ గుణాల్ని రాబట్టారు.

స్ధానాలు:

ఈ మందుకి స్తనాలు, గొంతు, గ్రంథులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వ్యాధులు:

ఇది లింఫ్ గ్రంధుల వాపులు, పుండ్లకు ఉపయోగపడుతుంది.

విరుగుళ్ళు:

బెల్లడోనా, మెజీరియం, ఇగ్నేషియా, పాలు, ఉప్పు దీనికి విరుగుళ్ళు. దీనికి ముందుగాని వెనుక గాని మెర్కూరియస్‌ని వాడరాదు.

మోతాదు:

3-200 పొటెన్సీలో వాడవచ్చు. దీన్ని మదర్ టించర్ రూపంలో గ్రంథుల వాపుకి వాడవచ్చు.

కాలపరిమితి:

2-3 వారాలు ఉంటుంది.

ఉద్రేకం:

వీరికి ఉదయం, వర్షాకాలం, రాత్రి, కుడివైపు, కదలికల వల్ల ఉద్రేకం కల్గుతుంది.

ఉపశమనం:

వీరికి వెచ్చదనం, పొడిగాలి, విశ్రాంతి వల్ల ఉపశమనం కలుగుతుంది.

పర్సనాలిటీ:

వీరికి శరీరంలో క్రొవ్వు కరిగి రక్తహీనత కల్గి దేహం శుష్కించి పోతుంది. వీరెప్పుడూ నీరసంతో ఉంటారు. బ్రయోనియా, పైటోలక్కా, రూస్టాక్స్ ఈ మÖడూ త్రయం చాలా కేసుల్లో పని చేస్తాయి.

మయాజమ్:

వీరిది సిఫిలిస్, సైకోసిస్ మయాజమ్.

వీరు చలికి తట్టుకోలేరు. వీరిది రూమాటిక్ గౌట్ డయాథిసిస్.

కారణాలు:

మెర్కురీ, సిఫిలిస్ రోగాలు. చెడు ఫలితాలకుపయోగపడుతుంది.

మానసిక లక్షణాలు:

వీరికి జీవితం నందు విరక్తిగా ఉండి,  చనిపోవుదునని నిశ్చయం చేసికొని కంగారుగా ఉండడం జరుగుతుంది.

శారీరిక లక్షణాలు:

తల:

పార్శ్యపు నొప్పులు ఉండి, వర్షం కురియుచున్నప్పుడు ఎక్కువవుతాయి. లేచుటతోనే వికారం రావడం, వికారం వల్ల చూపు మందగిస్తుంది.

కండ్లు:

మంటగా ఉండి, వెచ్చని నీరు కళ్ళ నుండి జారుతుంది. కనురెప్పలలో ఇసుక పోసినట్లు బాధగా ఉంటుంది.

చెవులు:

చెవుల్లో ధ్వని వినబడకుండా ఏదో అడ్డుపడినట్లు ఉంటుంది. గుటక వేయునపుడు పొడుచుచున్నట్లు నొప్పిగా ఉంటుంది.

ముక్కు:

ఒక వైపు నుండి రక్తస్రావం వస్తే, రెండవ వైపు ముక్కుదిబ్బడ వేసినట్లుంటుంది. ఒరుపును కల్గించే స్రావం ముక్కునుండి వస్తుంది.

ముఖం:

ముఖం నీలిరంగుగా బాధపడుచున్నట్లు లేదా పసుపు పచ్చగా పాలిపోయినట్లు కళాహీనంగా కనిపిస్తుంది.

పిల్లల్లో పండ్లు సకాలంలో రావు. పండ్లు కొరకవలెనని వుంటుంది.

నాలుక చివర నిప్పువలె ఎర్రగా ఉండి, నోరార్చుకు పోతుంది. లాలాజలం ఎక్కువగా ఉంటుంది.

కొండనాలుక వాపు వల్ల గొంతు నొప్పిగా ఉండి, ఏదో వున్నట్లు ఉంటుంది. బాధ నాలుక మొదటి నుండి చెవిలోకి వ్యాపిస్తుంది.

టాన్సిల్స్ వాచి, పెద్దవై నీలి రంగుగా ఉండి, గొంతులోని లింఫ్ గ్రంధుల వాపుతో ఉంటాయి.

జీర్ణకోశంలో బొడ్డు వద్ద శూల వుంటుంది. వీరిలో చిక్కని రక్తంను, ఆమంను వాంతి చేసుకోవడం ఉంటుంది.

ఉదయాన్నే నీళ్ళ విరేచనలవల్ల ఆసనంలో పుండ్లు పడి బాధగా ఉంటుంది.

మూత్రంలో సుద్ద ఆల్బుమిన్ చేరడం వల్ల, మూత్రం ఎక్కువగా లేదా తక్కువగా ముదురు రంగుగా పోవడం ఉంటుంది.

పురుషుల్లో బీజాలు వాచి బాధగా ఉండి, పుండ్లు పడడం, సెగవ్యాధి ఉంటుంది.

స్త్రీలలో స్తనాలు వాచి గట్టిగా బాధగా ఉంటాయి. స్తనాల్లో కంతులు, కేన్సర్ రావడం జరుగుతుంది. బిడ్డపాలు త్రాగునపుడు బాధ చన్మొనల నుండి శరీరమంతా వ్యాపిస్తుంది. చన్మొనలు పగిలి చిన్న పుండ్లుగా ఏర్పడడం జరుగుతుంది. దీనివల్ల చంకల్లో లింఫ్ గ్రంధుల వాపు ఉంటుంది.

బహిష్టు స్రావం తరుచుగా, ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనివల్ల కుడి అండాశయంలో లాగుచున్నట్లు బాధగా ఉంటుంది.

శ్వాస తీయడం కష్టంగా ఉండి, పొడి దగ్గు రాత్రిళ్ళు ఎక్కువగా ఉండి, చిక్కని స్రావం రావడం జరుగుతుంది.

మెడలో కుడివైపు మాంస గ్రంధులు గట్టిపడడం వల్ల మెడ కొయ్యబారుతుంది.

ఉదయాన నడుం నొప్పి వల్ల నడుం కొయ్యబారుతుంది. పాదాలుబ్బి బొటన వ్రేళ్ళలో నరాలు బాధలు ఎక్కువగా ఉంటాయి.

చర్మం  మీద  కురుపులు,  రసికారే  పుండ్లు,  పొక్కులుంటాయి. పులిపిర్లు దురదగా ఉండడం జరుగుతుంది. లింఫ్ గ్రంధులు వాచి గట్టి పడతాయి.

తరచు ఆవలింతలు రావడం వల్ల, నిద్రపోవుటకు ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. ఎప్పుడూ మగతగా ఉంటుంది. జ్వరంతో శరీరం ఒక్కోసారి వేడిగా ఉండే మరొక్కసారి చలిగా నిస్త్రాణగా ఉంటుంది.

ఇలాంటివారికిది సూచించదగ్గ మేలైన మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version