[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-68. పోడోఫైలం (Podophyllum)
దీన్ని వెజటబుల్ మెర్కురీ, వైల్డ్ లెమన్, మే ఆపిల్‌గా పిలుస్తారు. ఈ చెట్టు ఆకుల్ని హోమియో మందుగా మలచినవారు జీన్స్ (Jeanes). ఈ చెట్టు వేరు నుండి తీసిన రసాన్ని కడుపులోని పురుగులు, చెవుడు నయం చేయడానికి ఉపయోగిస్తారు.
స్థానాలు:
ఈ మందుకి కాలేయం, జీర్ణకోశం, ఆసనంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధులు:
ఇది విరేచనాలు, నరాలు, కాలేయ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
విరుగుళ్ళు:
నక్స్, కోలోసింధ్, లాక్టిక్ ఆసిడ్, లెప్టాండ్రా దీనికి విరుగుళ్ళుగా పనిచేస్తాయి.
సహచరులు:
ఉప్పు దీనికి సహచరి.
మోతాదు:
3-1M పొటెన్సీలో వాడవచ్చు. పెద్ద పొటెన్సీలో కలరాకిది మంచి మందు.
కాలపరిమితి:
1-2 వారాలుంటుంది.
ఉద్రేకం:
వీరికి ఉదయం లేచిన వెంటనే, వేసవి కాలంలో లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి సాయంకాలం ఉపశమనం ఉంటుంది.
ఇది కుడివైపు పనిచేయు మందు. వీరిది పైత్య తత్యం.
మయాజమ్:
సోరా, సిఫిలిస్ మయాజమ్ గల మందు.
మానసిక లక్షణాలు:
ఎప్పుడూ విచారంగా ఉండి జీవితం మీద విసుగు చెందడం వల్ల, అతి వాగుడు ఉంటుంది.
శారీరక లక్షణాలు:
వీరికి పైత్య దోషాలతో కుడివైపున వచ్చే తలనొప్పికిది మంచి మందు. వీరికి ఉదయాన తల భారం ఉండి, తల త్రిప్పుచే ముందరకు పడిపోయినట్లుంటుంది. పిల్లలకు తలలో చెమటలెక్కువగా పడుతాయి.
కండ్లు:
ఇది కండ్ల కలక వల్ల వచ్చే బాధ. ఉదయాన ఎక్కువుగా ఉంటుంది.
ముక్కు:
ముక్కుపై చిన్న చిన్న పొక్కులు బయలుదేరి నొప్పిగా ఉంటాయి.
ముఖం:
వీరి ముఖం వెచ్చగా ఉండి, బుగ్గలు ఉబ్బి ఉంటాయి.
పండ్లు:
పిల్లల్లో పండ్లు వచ్చే కాలంలో కల్గే విరేచనాలకిది మంచి మందు. రాత్రిళ్ళు పళ్ళు కొరకడం ఉంటుంది. నాలుక కొరుక్కొని ఏడవడం జరుగుతుంది. నాలుకపై తెల్లని చిక్కని పూత ఉంటుంది.
నోటి నుండి దుర్వాసన వస్తుంది. గొంతు పొడిగా ఉండి గుటక మ్రింగుట కూడా కష్టంగా ఉంటుంది. గొంతులో కఫం ఎక్కువగా చేరి గురగురలాడడం ఉంటుంది.
వీరికి రుచి తెలియదు. తీసుకొన్న ఆహారం పులిసి పుల్లని త్రేన్పులు రావడం జరుగుతుంది. వీరికి వికారంతో వాంతులు రావడంతో పాటు, తల బాధగా ఉంటుంది. కడుపు వెచ్చగా, ఉబ్బరంగా ఉండి ప్రేగులు గుడగుడలాడుతుంటాయి. కాలేయం ప్రాంతంలో బాధగా ఉండి, గాల్ స్టోన్స్ వల్ల వచ్చే శూలకిది మంచి మందు.
మలం ఆకుపచ్చగా నీళ్ళవలె ఎక్కువ దుర్వాసనతో గొట్టంలో నుండి వచ్చినట్లు వేగంగా విసర్జితమవుతుంది. మలం వెడలేటప్పుడు మలాశయం వెలుపలికి రావడం ఉంటుంది. ఉదయాన మాననటువంటి నీళ్ళ విరేచనాలు ఎక్కువగా అవుతాయి.
వేసవిలో పుల్లని పండ్లు తినడం వల్ల కల్గే మలబద్దకం, మొలలకిది మంచిమందు. డయాబెటిస్ రోగుల్లో తరచుగా రాత్రులందు మూత్రం అప్రయత్నంగా పోవడం ఉంటుంది. ఒక్కోసారి మూత్రం బంధింపబడుతుంది.
పురుషులలో వృషణాల వాపు ఉంటుంది. కళ్ళు ఎర్రబడి బాధగా ఉంటాయి.
స్త్రీలలో బరువులనెత్తడం వల్ల, శారీరక శ్రమ వల్ల, గర్భిణీ స్త్రీలలో, ప్రసవానంతరం గర్భాశయం వెలుపలికి వస్తుంది. గర్భాశయంలో, కుడి అండాశయంలో బాధగా ఉండి ఆంత్రాలలో శబ్దాలు రావడం ఉంటుంది. చిక్కని తెల్లమైల, జననేంద్రియాల దురదతో వస్తుంది. అజీర్ణం, మలబద్దకంతో కోరింత దగ్గు, పొడి దగ్గు ఉండి ఊపిరి తీసుకొనుట కష్టంగా ఉంటుంది. వీరికి గుండె దడగా, గొంతులో మంటగా ఉంటుంది.
కుడి గజ్జలో కాని, నడుంలో కాని నొప్పిగా ఉండి, భుజాల మధ్య వరకూ వ్యాపిస్తుంది. ఎడమవైపు పక్షవాతం వచ్చినట్లుంటుంది.
వీరి చర్మం గరుకుగా, పొక్కులతో ఉండి కామెర్ల రోగంతో పసుపు పచ్చగా ఉంటుంది.
గాఢ నిద్ర నుండి లేచేసరికి అలసటగా ఉండి భోజనానంతరం మగత నిద్ర పడుతుంది.
రోజూ ఉదయాన్నే జ్వరం రావడం జరుగుతుంది. కడుపులో, మోకాళ్ళల్లో, చీలమండలంలో బాధతో వచ్చే చలితో అధిక చెమటలు పడతాయి.
ఇలాంటివారికిది సూచించదగ్గ మేలైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
