[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-69. రానన్‌క్యూలస్ బల్బోసా (Ranunculus bulbosus)
యూరప్, అమెరికాలయందుండే బట్టర్‌కప్ అనే వృక్ష తరగతికి చెందిన ఈ మొక్కని డా॥ ఫ్రాంజ్ హోమియో మందుగా తయారుచేశాడు.
స్థానాలు:
ఈ మందుకి చర్మం, కండరాలు, వెన్నెముక, నరాలు, లంగ్స్, ఫ్లూరా జిగురుపొరలపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది త్రాగుడు అలవాటున్న వారిలో వచ్చే నరాల వ్యాధులు, హెర్పిస్ వంటి చర్మవ్యాధులు, కండరాల వ్యాధులు, న్యూరాల్జియా, మయాల్జియా, ఇంటర్‌కాష్టల్ రుమాటిజమ్ వంటి అనేక వ్యాధులకు ఉపయోగపడే మందు.
పోలికలు:
దీనిని ఆర్నికా, మెజీరియం, బ్రయోనియా, ఎకోనైట్ మందులతో పోల్చవచ్చు. దీనికి ముందు వెనుక సల్ఫర్, స్టాఫిశాగ్రియాని వాడరాదు.
విరుగుళ్ళు:
దీనికి కేమెమిల్లా, నక్స్‌వామికా, కొలోసింధ్. బ్రయోనియ, రూస్టాక్స్ పల్సటిల్లా, కాంఫర్ మందులను విరుగుళ్ళుగా వాడవచ్చు.
ఉద్రేకం:
వీరికి తాకినా, కదలిక వల్ల, తేమ వల్ల, సాయంకాలం పూట, వాతావరణ మార్పుల వల్ల, ఆరుబైట గాలిలో తిరగడం వల్ల, తుఫాన్‌ల వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి నడుచుచున్నప్పుడు, నిలబడినప్పుడు వ్యాధి లక్షణాలు ఉపశమిస్తాయి.
కారణాలు:
ఆల్కహాల్ అలవాటు, భయం, విసుగుదల వంటి మానసిక వ్యాధులు – కారణభూతాలవుతాయి.
మోతాదు:
3-30 పొటెన్సీలో వాడుకోవచ్చు.
కాలపరిమితి:
ఈ మందు కాల పరిమితి 4 – 6 వారాలుంటుంది. ఇది ఎడమవైపు పనిచేయు మందు.
మయాజమ్:
సోరా మయాజమ్.
స్వభావం:
వీరిది కోపిష్టి, గొడవపడే స్వభావం.
తత్వం:
వీరిది మేహవాత తత్వం. చలికి తట్టుకోలేరు.
మానసిక లక్షణాలు:
డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం. కలలో దయ్యాలు రావడంతో భయపడడం ఉంటుంది. అయోమయం, చిరాకుగా ఉంటారు, కోపంతో చిన్నదానికి ఇతరులతో గొడవపడడం. సాయంత్రం ఒంటరిగా ఉండుటకు భయపడతారు. ఆల్కహాల్ ఎక్కువగా త్రాగుటచే కల్గు మానసిక చాంచల్యానికిది మంచి మందు.
శారీరక లక్షణాలు:
నడి నెత్తిన పురుగులు ప్రాకినట్లు చిరాకుగా వుండి, నుదుటి భాగంలో నొక్కుచున్నట్లు బాధగా ఉంటుంది. వాతావరణం మారడం వల్ల, చలిగాలి తగులుట వల్ల తలదిమ్ము అధికమవుతుంది.
కండ్ల నుండి నీళ్ళు కారడం ఉంటుంది. కండ్లు బరువుగా, మంటగా ఉండి వెలుతుర్ని చూడలేరు. పగలు కండ్లు కన్పించక పోవడమే కాకుండా, కంటి ముందర పొగవలె ఉండడం జరుగుతుంది. కంటి నొప్పి నడుచుచున్నప్పుడు, నిలబడినప్పుడు తగ్గడం విశేషం.
వీరికి చెవినొప్పి సాయంకాలం పూట వస్తుంది.
వీరికి కండ్లు, ముక్కు, అంగిలి మండడం; ముక్కు దిబ్బడ, ముక్కు దురదలు, తుమ్ములు రావడం జరుగుతుంది. ముక్కు నుండి రక్తం, పడిశం కారుతుంది. ముక్కులో ఏదియో ప్రాకినట్లుంటుంది.
వాతావరణం మారినప్పుడెల్లా ఛాతీలో చితకకొట్టినట్లు, పుండువలె నొప్పితో పచ్చిగా ఉన్నట్లుంటుంది.
రొమ్మెముకలో, ప్రక్క ఎముకలో, ఎముకల మధ్య నొక్కుచున్నట్లుండి కదలిక వల్ల, శరీరం త్రిప్పడం వల్ల, తేమ గల తుఫాన్ వాతావరణం నందు నొప్పి రావడం ఉంటుంది.
ఛాతీలో, భుజాల మధ్య కుట్టుచున్నట్లు బాధగా ఉండే ఫ్లూరసీ, బ్రాంకో న్యూమోనియాకుపయోగ పడుతుంది.
ఇది వేడి వల్ల, చలికాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధులకుపయోగపడుతుంది. సాయంకాలం ఆయాసంగా ఉండి ఊపిరాడదు. రొమ్ము నందు బరువుగా నొక్కి వేయడంతో పాటు నీటి పొక్కులేర్పడతాయి. డయాఫ్రం వాచి, నొప్పిగా ఉంటుంది. హెర్పిస్ పొక్కులు మంటతో చురుక్కుమనే పోట్లతో నరాల పొడవున బాధ వుంటుంది.
త్రాగుబోతుల్లో ఎక్కిళ్ళు రావడం, సంధి లక్షణాలు రావడం, పొత్తికడుపు నొక్కిన బాధగా ఉంటుంది. ఇది కదలినా, ఊపిరి పీల్చిన, ఎక్కువవుతుంది. వీరి కడుపులో శూల, మంట ఉండి, అపానవాయువులు విరేచనాలు అవుతాయి. ఇది నడుం పై భాగం నందలి అవయవాల మీద బాగా పనిచేస్తుంది. అధిక నిస్త్రాణ వల్ల ఆకస్మికంగా శోష కల్గి శోషిల్లడం వుంటుంది. మూర్ఛపోయి, దేహకంపాల కిది మంచి మందు.
వీరికి నుదుటన, అరిచేతుల్లో దురదలు, మంటలు ఉంటాయి. ఆనెలు అరచేతుల్లో, కాళ్ళల్లో ఉండి చురుకు పెడుతుంటాయి.
వీరి శరీరంపై హెర్పిస్ నీటి పొక్కులు ఊదా రంగులో ఏర్పడతాయి. వాటిని తాకిన ఎక్కువవుతాయి. వీరి చర్మం దళసరెక్కి గట్టి పడిన ప్రదేశాలందు, తాకిన బాధగా, మంటగా ఉంటాయి. శరీరంపై ఏర్పడ్డ పుండ్లు చదునుగా ఉంటాయి. చల్లగాలి, తేమగాలి యందు అధికమవుతాయి. శరీరమంతా పచ్చి పుండు వలె నొప్పిగా ఉండడం వల్ల తాకిన బాధలుద్రేకిస్తాయి.
వీరి కాళ్ళు, చేతులు, వేళ్ళన్ని నొప్పిగా ఉండి సూదితో పొడుస్తున్నట్లుంటుంది. సయాటికా పాదాల్లో నొప్పిగా బాధని కల్గించే ఆనెలుంటాయి.
భుజాల్లో కండరాల్లో సూదితో గ్రుచ్చినట్లు, పొడిచినట్లు నొప్పులుంటాయి. వాతావరణం మారినప్పుడల్లా, పియానో వాయించినా, టైప్ వర్క్, కుట్టుపని చేసినప్పుడు అధికమవుతుంది.
ఇది ఎక్కువగా వ్రాసేవారికి, (రైటర్స్ క్రాంప్స్), న్యూరోసిన్‌తో బాధపడే వారికి మంచి మందు. కూర్చొని పనిచేయు స్త్రీలలో రెక్కగూళ్ళ అంచుల ప్రాంతంలో కండర నొప్పులు, మంటగా ఉంటాయి. ఇలాంటివారికిది సూచించదగ్గ మేలైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
