[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-70. రొడోడెండ్రాన్ (Rhododendron)
సైబీరియా పర్వత ప్రాంతాల్లో వృక్ష తరగతికి చెందిన స్నో రోజ్ ఇది. డా॥ సైడెల్, క్లార్క్ దీన్ని హోమియో మందుగా తయారు చేశారు.
స్థానం:
ఈ మందుకి మోచేయి, చేతులు, చిన్నవేళ్ళు, క్రిందికాలు, ఎముకల ధాతువులపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది కీళ్ళనొప్పులు, వర్షాకాలం, చలికాలం, వాతావరణ మార్పుల వల్ల కలిగే జలుబు, జ్వరాలు, నరాలు; కండరాల వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఫైబ్రస్ టిష్యూలు, జాయింట్స్, వెన్నెముక ఛాతీ ప్రభావం ఎక్కువ.
పోలికలు:
దీన్ని కాష్టికం, రూస్టాక్స్ లతో పోల్చవచ్చు.
ఉద్రేకం:
వీరిలో గాలి వానకు ముందు, తేమగాలికి, గాలి మార్పుల వల్ల, రాత్రి వేసవికి విశ్రాంతి వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి కదలిక వల్ల, వేడికి, తలకు గుడ్డకట్టడం వల్ల, తినడం వల్ల ఉపశమనం ఉంటుంది.
మయాజమ్:
వీరిది సోరా మయాజమ్. చలికి తట్టుకోలేరు.
మోతాదు:
6-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాలపరిమితి:
4-6 వారాలు ఉంటుంది.
స్వభావం:
వీరు నర్వస్ రోగులు, వ్యాధి లక్షణాలు కుడివైపు రావడం జరుగుతుంది.
మానసిక లక్షణాలు:
జ్ఞాపకశక్తి తగ్గడం వల్ల మాట్లాడుతూనే విషయాల్ని మరచిపోవడం జరుగుతుంది. తుపాన్, ఉరుములు మెరుపులన్నా భయం, ఆందోళన ఉంటుంది. తలత్రిప్పుతో చెవులందు హోరుమనే శబ్దాలుంటాయి.
శారీరిక లక్షణాలు:
ఇది వేసవిలో వచ్చే కీళ్ళనొప్పులకు మంచి మందు. తుఫాన్, వర్షం వచ్చే ముందు వచ్చే కండరాల అదుర్లు, న్యూరాల్జియా, పక్షవాతం, కీళ్ళ వాతంకు మంచి మందు.
ఒక కీలు నుండి మరొక కీలుకు నొప్పులు మారడం ఉండి రాత్రిళ్ళు ఎక్కువవడం ఉంటుంది. కాళ్ళు పీకడం, కుడి వైపు విశ్రాంతి ఉన్నప్పుడు ఎక్కువవుతుంది. గౌట్ వ్యాధి, భుజం, మెడ, నడుంనొప్పికిది మంచి మందు.
గనేరియా అణిచి పెట్టడంవల్ల వచ్చే హైడ్రోసీల్‌కిది మంచి మందు. వృషణాల వాపుతో కదలలేరు. పిల్లలలో వచ్చే హైడ్రోసిల్‍కి ఇది మంచి మందు.
అండాశయాలు వాచి చితకకొట్టినట్లు నొప్పిగా ఉండి కదలలేరు.
చలిగాలికి పంటినొప్పి వచ్చి కణతల నుండి క్రింది దౌడ వైపుకు లాగినట్లు ఉంటుంది.
గ్రంథులు వాచి చితక కొట్టినట్లు నొప్పులుంటాయి. ఇలాంటివారికిది సూచించదగ్గ మేలైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
