[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-72. సెనీగా (Senega)
సెనీగా స్నేక్ రూట్ అని పిలవబడే వృక్షజాతికి చెందిన ఎండిన వేరుని పొడి చేసి మదర్ టించర్ రూపంలో డా॥ జాన్ టన్నెట్ ఔషధ గుణాల్ని రాబట్టినాడు. దీన్ని ఉత్తర అమెరికాలోని రెడ్ ఇండియన్స్ పాము కాటుకు విరుగుడుగా వాడుతారు.
స్థానాలు:
ఈ మందు జిగురు పొరలు, శ్వాసావయవాలు, కళ్ళు, మూత్రాశయంపై ప్రభావం చూపుతుంది.
వ్యాధులు:
ఇది ఆస్తమా, బ్రాంకైటిస్, ఫ్లూరసీ, న్యూమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులకు; పాము, విషజంతువులు కొరికినపుడు కలిగే దుష్ఫలితాలకు, కంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది.
స్వభావం:
ఇది సన్నగా, నాజూకుగా బక్క పల్చగా పెరిగే మృదుకండరాలతో ఉండేవారికి, లావుగా బొద్దుగా ఉండే పిల్లలు, వృద్ధులకు ఉపయోగపడుతుందని డా॥ టెస్టీ సూచించడమైనది.
తత్త్వం:
వీరిది హైడ్రాజినాయిడ్ తత్త్వం.
మయాజమ్:
ఇది సైకోటిక్ మయాజమ్ గల మందు.
ఉద్రేకం:
వీరికి ఆరుబైట గాలిలో, విశ్రాంతి వల్ల, నడుచుట వల్ల, మెట్లెక్కడం వల్ల, రాత్రి పూట తల ముందుకు వంచడం వల్ల, ఒత్తిడి వల్ల, వెచ్చని గదిలో కూర్చోవడం వల్ల, స్పర్శ వల్ల, రుద్దడం వల్ల లక్షణాలు ఉద్రేకం చెందుతాయి.
ఉపశమనం:
వీరికి చెమట పట్టడం వల్ల, తలను వెనకకు వంచడం వల్ల, చల్లగాలిలో నడవడం వల్ల ఉపశమనం ఉంటుంది.
పోలికలు:
దీన్ని కాష్టికం, ఫాస్పరస్, స్పాంజియా, కాలీబైక్ మందులతో పోల్చవచ్చు.
సహచరులు:
కాల్కేరియా, లైకోపోడియం, సల్ఫర్, ఫాస్ఫరస్ మందులు దీని సహచరులు.
విరుగుళ్ళు:
దీనికి బ్రయోనియా, బెల్, ఆర్నికా, కాంఫర్ విరుగుళ్ళు.
కారణాలు:
జంతువులు కొరికినపుడు, పాము కాట్ల వల్ల, బెణుకు నొప్పుల వల్ల వ్యాధి లక్షణాలు ఏర్పడుతాయి. ఇది ఎడమవైపు పని చేయు మందు.
మోతాదు:
దీన్ని డా॥ నాష్ మదర్ టించర్లో, పియర్స్ మూడవ పొటెన్సీలో, డా॥ క్లార్క్ 30 పొటెన్సీలో వాడడమైనది.
కాలపరిమితి:
2-4 వారాలు ఉంటుంది.
మానసిక లక్షణాలు:
వీరికి చిరాకు, ఆందోళనతో ఇతరులతో దెబ్బలాడవలయునని ఉంటుంది. వీరు హైపోకాండ్రియక్ పేషెంట్.
శారీరక లక్షణాలు:
తల:
తల భారంతో నుదుటిలో బ్రద్దలగునట్లు నొప్పి ఉండి, నొప్పి కణతల నుండి ముఖంలోకి వ్యాపిస్తుంది. తల త్రిప్పడం ఉండి, చెవుల్లో శబ్దాలు రావడం జరుగుతుంది. తలలో దురదలు, పొక్కులు రావడం వుంటుంది.
కళ్ళు:
కనురెప్పలు, కంటిలోపల, వెలుపల మంటతో కూడిన వాపుండి, తలను వెనక్కి వంచిన తగ్గుతుంది. కంటి బాధలు తదేక దృష్టితో చూచిన అధికమవుతాయి. వీరి కనుగ్రుడ్లు పెద్దవైనట్లుండడం, ఆర్చుకొనిపోవడం. కళ్ళల్లో సబ్బు పడినట్లుండడం వల్ల చూపు మసకగా ఉంటుంది. ఒక వస్తువు రెండుగా ఉంటుంది, కండ్లు నీడలో ఉన్నట్లు ఉంటుంది. రెండు కన్నులు సమస్థాయిలో ఉండక చూపు హెచ్చు తగ్గులుగా ఉంటుంది. కళ్ళు ఒకటి క్రిందికి, రెండవది పైకి ఉంటుంది. కనురెప్పల్లో గుల్లలుండి వాపులు రావడం వుంటుంది.
ముక్కు:
ముక్కు లోపల మిరియాల పొడి చల్లినట్లు మంటగా ఉండి ఆర్చుకొని పోవడం జరుగుతుంది. ముక్కు నుండి నీళ్ళ వంటి స్రావం వస్తుంది, తుమ్ములు వస్తాయి. ముక్కుపుటాలు మంటగా ఉంటాయి.
ముఖం:
ఎడమవైపు పక్షవాతం ఉండి ముఖం వెచ్చగా ఉంటుంది. మంటతో కూడిన పొక్కులు పై పెదవి దగ్గర, పెదవి చివర్ల దగ్గర రావడం జరుగుతుంది.
చెవులు:
ఆహారం నమిలేటప్పుడు చెవి నొప్పి వస్తుంది, చెవులు సరిగా వినిపించక పోవడం ఉంటుంది, ఎడమ చెవి దగ్గర చల్లగా ఉన్నట్లుండడం ఉంటుంది.
దంతాలు:
చల్లగాలిలో, ఊపిరి తీసుకున్నప్పుడు పంటినొప్పి ఉంటుంది.
నోరు:
ఉదయం పూట నోరు ఎండిపోయినట్లుంటుంది. నాలుకపై పసుపు పచ్చని పూత ఉండి లాలాజలం ఎక్కువగా ఊరుతూంటుంది.
గొంతు:
గొంతులో మంటగా, గరుకుగా ఉంటుంది. జలుబువల్ల గొంతు బొంగురుపోవడం జరుగుతుంది. గొంతులో కఫం అడ్డుపడినట్లుండి తెగి రాకపోవడం ఉంటుంది. గొంతు వాపుండి పట్టేసినట్లుంటుంది. గొంతులో తేమ లేక మాట్లాడుటకు కూడా కష్టంగా ఉంటుంది.
శ్వాసకోశాలు:
ఛాతీలో గురగురలతో ఉబ్బసం, దగ్గు ఉంటాయి. ఛాతీ కఫంతో నిండుగా ఉన్నట్లుండి, దగ్గినప్పుడు పసుపు పచ్చని కఫం రావడం ఉంటుంది. ఛాతీ నొప్పి, ఎడమవైపు పడుకున్నా, రాత్రిళ్ళు ఎక్కువవడం ఉంటుంది. పొడి దగ్గు వల్ల, స్వరపేటికలో ఇరిటేషన్ వల్ల ఊపిరాడక పోవడం వల్ల లంగ్స్ వెనక్కి వెన్నెముక వైపుకు లాగినట్లుండడం. ఛాతీ చిన్నదైనట్లుండడం జరుగుతుంది. గట్టిగా చదివేటప్పుడు, చల్లగాలిలో ఉన్నట్టుండి గొంతు బొంగురుపోవడం జరుగుతుంది. ఈ మందు క్షయ, కోరింత దగ్గు, ఫ్లూరసీ, న్యుమోనియాకు ఉపయోగపడుతుంది. మెట్లెక్కినపుడు ఛాతీ పట్టేసినట్లుంటుంది. దగ్గినపుడు, ఊపిరి పీల్చడం వల్ల ఛాతీలో పొడిచినట్లుంటుంది. పొడి దగ్గు చల్లగాలి లోనికి పీల్చుట వల్ల, నడుచుట వల్ల అధికమై, తుమ్ములు వచ్చిన, ముక్కు నుండి నీరు కారిన తగ్గుతుంది. బొద్దుగా ఉండే పిల్లల్లో కోరింత దగ్గు వచ్చినప్పుడు సాయంత్రం దగ్గు ఎక్కువైనపుడు, గళ్ళ కోడిగ్రుడ్డు సొన వలె తీగలాగా ఉంటుంది. ఊపిరితిత్తులు, శ్వాసనాళం కఫంతో నిండడం వల్ల దగ్గు, గురక, పిల్లికూతలు ఉండి చిక్కని కోడిగ్రుడ్డు సొనవలె తెల్లగా కఫం వస్తుంది. గళ్ళ తెగుట చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ కష్టం మీద కఫం తెగినా, ఏ దగ్గో కలిగి రోగి తిరిగి మింగివేయును. దగ్గు రోగిని ఊపివేయును. ముసలివారిలో కఫం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. రొమ్ము పడిశం వల్ల ఛాతీలో నొప్పిగా ఉంటుంది.
శ్వాసావయవాలు, ముక్కు రంధ్రాలు, మూత్ర కోశాలలో కారం చల్లినట్లు మంటగా వుంటాయి. హృదయభాగంలో సూదితో సన్నగా పొడిచినట్లుండి కదలిక వల్ల అధికమవుతుంది. ఊపిరి తీసుకున్నప్పుడు గుండె వ్యాధుల వల్ల, మూత్రంలో ప్రోటీన్స్ పోవడం వల్ల శరీరం నీరు పడుతుంది. గుండెలో బరువుగా ఉండి, ఛాతీ నొప్పి ఎడమవైపు చంకలోకి లాగినట్లుంటుంది.
అదిరినట్లుండే గుండె దడ ఉంటుంది. ఉబ్బసం వల్ల ఎక్కువగా రోగి ఊపిరాడక ప్రక్కలో లేచి కూర్చుంటాడు. తగిన ప్రాణవాయువు ఊపిరితిత్తుల కందక ముఖం, కాళ్ళు చేతులు నీలిగా ఉంటాయి.
కాళ్ళు చేతులు:
చచ్చుగా ఉన్నట్లుండి, వణకడం, నీరసంగా ఉండడం, మణికట్టు, చేతి వ్రేళ్ళు బెణికినట్లుండడం జరుగుతుంది. అరచేతుల్లో గ్రుచ్చినట్టు, పారాడినట్లుంటుంది. భుజాల నొప్పి, నడుంనొప్పి ఉంటాయి. దగ్గినప్పుడు, ఊపిరి తీసుకున్నప్పుడు ఎక్కువవుతాయి.
మూత్రావయవాలు:
యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల యూరెత్రాలో అడ్డుపడినట్లుంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు, ముందు తర్వాత యూరెత్రాలో మంట ఉండి, పొడిచినట్లుంటుంది. మూత్రం కొద్దిగా, ఎర్రగా, మ్యూకస్తో రావడం, మూత్రమందు తెల్లని చీము వంటి పదార్థాలు పిల్లల్లో రాత్రిళ్ళు మూత్ర విసర్జన చేసినపుడు రావడం జరుగుతుంది. మూత్రకోశ బాధలు పడుకున్నప్పుడు, రాత్రులందు అధికంగా ఉంటాయి.
జీర్ణకోశ లక్షణాలు:
నోటిలో లోహం లేదా మూత్రం రుచి ఉన్నట్లుండడం విశేషం. విపరీతమైన మంటతో కూడిన దాహం ఉండి, కడుపులో మంటతో ఖాళీగా ఉన్నట్లుంటుంది. తరచూ కడుపు నొప్పి వస్తుంది. త్రేన్పినపుడు నోటిలోకి మ్యూకస్ రావడం జరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ వల్ల ఏదో ఉండలాగా అడ్డుపడినట్లుంటుంది. వికారం, వాంతులు, నీళ్ళ విరేచనాల వల్ల ఆసనంలో బరువుగా ఉంటుంది.
జ్వరం:
శ్వాసకోశ వ్యాధులతో చలిగా ఉన్నట్లుంటుంది. వణకు ఉండి, కాళ్ళు చేతులు చచ్చుగా నీరసంగా ఉంటాయి. శరీరం వేడి ఆవిర్లు రావడం ఉంటుంది. ఆయాసం, అధిక చెమటలు, ఎడమవైపు ముఖం వెచ్చగా ఉన్నట్లుంటుంది. ఆయాసం, దగ్గు వల్ల నిద్రలేమి ఉండి ఉదయాన నిద్ర మత్తుగా ఉంటుంది.
కడుపులో క్రాంప్స్ వంటి నొప్పులుంటాయి. ఈ మందు ఎడమవైపు అధికంగా పనిచేస్తుంది. రోగి బాధలన్ని చెమట పట్టుటచే ఉపశమిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలున్న వారికిది మేలైన మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
