[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘ప్రమాదాలు పాము పడగలు..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రమాదాలు పాము పడగలు..!
ఈ జీవితాలు నీటి బుడగలు..!
ఓ బిడ్డా..! మేలుకో మృత్యువు
నిన్ను ముద్దాడక ముందే తెలుసుకో
ప్రమాదాలు పాము పడగలని..
ఈ జీవితాలు నీటి బుడగలని..
బైక్ ఎక్కే ముందు..
కిక్ తొక్కే ముందు..
ఒక్కసారి గుర్తుంచుకో
వేగం వెర్రితనమని..
అతివేగం ప్రమాదకరమని..
అది ప్రాణాలకు ముప్పని..
అది నీ బంగారు భవిష్యత్తుకు
అంటుకునే నివురు కప్పిన నిప్పని..
అది ఒక యమపాశమని..
రెప్పపాటున మీ కుటుంబం
కుప్పకూలిపోతుందని.. ఆపై
మీ జీవితనావ అంతులేని విషాద
సాగరాన మునిగి ముక్కలైపోతుందని..
ఓ బిడ్డా..! ఒక్క మాట
బైక్ ఎక్కి గాలిలో తేలిపోకు..
గాలిలో కలిసిపోకు..
ఎండుటాకులా రాలిపోకు..
మృత్యుగృహంలో దూరిపోకు..
బంగారు భవిష్యత్తును బుగ్గిచేసుకోకు..
ఓ బిడ్డా..! ఒక్క మాట
కర్ణకఠోరపు శబ్దాలతో
వీధుల్లో వింత జైత్రయాత్ర లేల?
మితిమీరిన క్షణకాలపు వేగం వెనుక
మరణయాతన దాగిఉందని మరచిపోకు..
అకాలమరణానికి ఆహ్వానం పలకకు..?
రెక్కలొచ్చిన పక్షి ఎక్కడికో ఎగిరిపోతే
రెక్కలు విరిగిన వృద్ధపక్షులకు కడకు
మిగిలేది కన్నీరే కడుపుకోతే కదా బిడ్డా..
తప్పు ఒక్కరిది..శిక్ష ముగ్గురికి..!
డివైడర్ను ఢీ కొట్టినవానికి సమాధి శిక్ష
కన్నవారి కమ్మని కలలకు కన్నీటి శిక్ష
మరో కుటుంబానికి చిమ్మ చీకటే శిక్ష…
ఓ బిడ్డా.. ఒక్క మాట
ముచ్చటపడ్డావని బర్త్ డేకు బైక్ ను
బహుమతిగా కొనిస్తే.. దాన్నే రేపు
మృత్యుశకటముగా మార్చుకొని
మరో బర్త్ డేకు నీవుండకపోతే ఎలా బిడ్డా?
ఓ బిడ్డా.. ఒక్క మాట
బైక్ ఎక్కే ముందు కిక్ కొట్టే ముందు..
యాక్సిలేటర్ రైజ్ చేసే ముందు..
ఒక్కసారి ఈ ముగ్గురిని
నీ మదిలో యాదిచేసుకో బిడ్డా..
నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను..
నీకు ప్రాణాలూదిన ఆ పరమాత్మను..
ముసుగేసి నీముందున్న ఆ మృత్యువును.
ఓ బిడ్డా.. గుర్తుంచుకో ఒక్క మాట
బైకెక్కి బాణంలా దూసుకెళ్లి
చేతికందొచ్చిన చెట్టంత
బిడ్డ కళ్ళ ముందే కన్నుమూస్తే
ఆ కుటుంబానికి.. నిత్యం నరకమే
ఆత్మీయులకు మిగిలేది గుర్తొస్తే
గుండెల్ని పిండేసే మానసిక క్షోభే..
అందుకే ఓ బిడ్డా..
గుర్తుంచుకో ఒక్కమాట
నీ హెల్మెట్ నీకు రక్షణ కవచమని..
నీ ఇంటిల్లిపాదికి అది శ్రీరామరక్షని..
శ్రీ పోలయ్య కూకట్లపల్లి హైదరాబాద్ వాస్తవ్యులు. ‘కవి రత్న’, ‘సాహిత్య ధీర’, ‘సహస్ర కవి భూషణ్’ బిరుదాంకితులు.
