[బాలబాలికల కోసం ‘ప్రమాదకరమైన రోగాలకు వ్యాక్సిన్‌లను కనుగొన్న లూయీ పాశ్చర్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ప్రియమైన నేస్తాలూ! మూడు నెలల వయసులో పోలియో, డి.పి.టి, బి.సి.జి. వంటి వ్యాక్సిన్లను (టీకాలు) వ్యాధులు రాకుండా నిరోధించేందుకు పిల్లలకు ఇస్తారు. ఈ విషయం మీక్కూడా తెలుసు. అవునా! ఎలాగంటే మరి మీక్కూడా చిన్నప్పుడు ఇచ్చే ఉంటారు కాబట్టి. ఒకప్పుడు ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించిన ప్లేగు, స్మాల్ ఫాక్స్ వంటివి ఈనాడు కంటికి కనబడకుండా పోవడానికి కారణం ఈ వ్యాక్సిన్ లే. ఇదేకాక కలరా, టైఫాయిడ్, రేబీస్, హెపటైటిస్ వంటి ఎన్నో వ్యాధులకు వ్యాక్సిన్ లొచ్చేశాయి నేడు. మరి ఇటువంటి ప్రమాదకరమైన రోగాల నుండి మానవాళిని రక్షిస్తున్న వ్యాక్సిన్‌లను ఎవరు కనుగొన్నారో తెలుసుకుందాం.
పాశ్చర్ 1822వ సంవత్సరం డిసెంబరు 27వ తేదీన ఫ్రాన్సులోని డోల్ అనే గ్రామంలో జన్మించారు. ఇతని తండ్రి నెపోలియన్ సైన్యంలో సార్జెంట్ గా పనిచేసేవాడు. సామాన్యమైన కుటుంబంలో జన్మించటం వలన పాఠశాలకు వెళ్లలేకపోయినప్పటికీ స్వంతంగా కొంత చదువు నేర్చుకున్నారు. చిన్నతనంలో ఎక్కువగా డ్రాయింగ్ వేస్తూ గడిపేవారు. ఈయన వేసిన చిత్రాలు ‘పాశ్చర్ మ్యూజియం’లో నేటికీ భద్రంగా ఉన్నాయి. పదహారేళ్ల వయసులో పాశ్చర్ చదువుకోవడానికి పారిస్ వెళ్ళారు. భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలంటే పాశ్చర్‌కు ఎంతో ఇష్టం. ఆయన ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనుకున్నా ప్రపంచం యావత్తు గర్వించే సైంటిస్ట్ గా వేనోళ్ల పొగడబడ్డారు.
1848వ సంవత్సరంలో ‘స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయం’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కుమార్తె అయిన మేరీ లారెంటును ప్రేమించి 1849వ సంవత్సరం మే 29న పెళ్లి చేసుకున్నాడు. పాశ్చర్ పరిశోధనలకు ప్రోత్సాహం ఆయన భార్య లారెంటే. వీరికున్న ఐదుగురు పిల్లల్లో ఇద్దరు టైఫాయిడ్ కారణంగా, మరొకరు మశూచి కారణంగా మరణించారు. దీంతో ఈ రోగాలకు మూలకారణమేంటో కనుగొనాలని నిశ్చయించుకున్నారు.
మొదట పాశ్చర్ ‘స్టీరియో కెమిస్ట్రీ’ అనే నూతన రసాయన శాస్త్రాన్ని రూపొందించారు. తర్వాత ‘ఫెర్మెంటేషన్’ పై పరిశోధనలు చేశారు. ఇంకా ద్రాక్షసారా వల్ల వచ్చే వ్యాధులు, ద్రాక్షసారా నిల్వచేసే పద్ధతులు, వెనిగర్ తయారీ మొదలైన అంశాలపై చక్కని పరిశోధన చేశారు. మనం త్రాగే డైరీ పాలల్లోంచి హానికర సూక్ష్మజీవుల్ని వేరుచేసే ప్రక్రియను కూడా కనుగొన్నారు. ఆ ప్రక్రియకు ‘పాశ్చరైజేషన్’ అని పాశ్చర్ పేరు వచ్చేలా పెట్టారు. సూక్ష్మక్రిములపై అనేక ప్రయోగాలు చేసి క్రొత్త సిద్ధాంతాలను సృష్టించారు. కంటికి కనిపించని జీవులంటూ ఒకటుంటాయని 17వ శతాబ్దంలోనే లీవెల్ హాక్ కనిపెట్టినప్పటికీ, ఆ సూక్ష్మజీవులే ఈ భయంకర రోగాలకు కారణమని 19వ శతాబ్దంలో లూయీ పాశ్చర్ కనుగొనేదాకా ఎవరికీ తెలియదు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
