[శ్రీ మారుతీ పౌరోహితం రచించిన ‘ప్రణయ హంపీ’ అనే నవలని సమీక్షిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ఇటీవలి కాలంలో విమర్శకుల ప్రశంసలు పొందిన చారిత్రిక కాల్పనిక నవల, మారుతి పౌరోహితం రచించిన ‘ప్రణయ హంపీ’ నవల.
‘శిధిలమైన సామాన్యుని బ్రతుకు చిత్రం’ అని కొందరు పొగడితే, ‘హంపీలోని శిల్పకళ, నగర వైభవాన్ని అక్షరరూపంలో ఆవిష్కరించినట్లుగా, చారిత్రక అంశాలతో కూడిన కాల్పనిక కథ’ అని ఇంకొందరు పొగిడారు. ‘యుద్ధ కాలంలో యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమ మరియు ఆనాటి సామాన్యుల జీవితాల ప్రతిబింబం’ అని మెచ్చుకుంటే, ‘క్రిందపెట్టనీయకుండా ఉత్కంఠతో చదివించగల నవల’ అని కొందరు ప్రశంసించారు. గొప్ప ప్రేమకథ అని ముక్త కంఠంతో ప్రశంసలందుకోవటమే కాదు, సినిమాగా తీస్తే కే అసిఫ్, లేకపోతే, సంజయ్ లీలా భన్సాలీ మాత్రమే తీయగలరన్న కితాబు అందుకుందీ నవల. ఈ ప్రశంసలు, అందుకున్న అవార్డులు చూసి ఈ పుస్తకం చదవకపోతే, ఎంతో కోల్పోతామన్న భయంతో పుస్తకం చదవటం ఆరంభించిన వారు అలవికాని ఆశాభంగం పొందుతారు.
రచనా పరంగా, చారిత్రిక సత్యాల పరంగా, సామాజిక పరిస్థితుల చిత్రణ పరంగా కూడా తీవ్రమైన ఆశాభంగాన్ని కలిగించిందీ నవల. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక రచనను సరిగా చదివి విశ్లేషించే విమర్శక వ్యవస్థ లేని లోటును మరోసారి ఎత్తిచూపించిందీ నవల, అది అందుకున్న పొగడ్తలు, పొందిన అవార్డులూనూ.
చారిత్రిక కాల్పనిక నవలల్లో రచయితకు పాత్రలను సృష్టించటంలో అపరిమితమైన స్వేచ్చ ఉంటుంది. ఆ పాత్రల చుట్టూ కథను అల్లటం, సన్నివేశాలు సృష్టించటంలోనూ ఎంతో స్వేచ్చ ఉన్నా, ఇవన్నీ ఎంతో కొంత నిరూపితమైన సత్యాలు, నిర్ధారితమయిన ఆధారాలను అనుసరించక తప్పదు.ఔచిత్యాన్ని పాటించాల్సివుంటుంది. ఎంతగా ఊహలు ఆకాశంలో విహరించినా, కాళ్ళు భూమిపైనే వుండాల్సివుంటుంది. చరిత్ర అధారంగా సృజనాత్మక రచనను సృజించేవాడే తప్ప, కాల్పనిక రచయిత చరిత్రను కల్పించకూడదు. రచయిత సజీవంగా గత చరిత్రను పాఠకులముందు నిలిపేవాడే తప్ప స్వయంగా చరిత్ర రచయిత కాడు. ఈ విచక్షణను పాటించకపోతే రచన అభాసుపాలు అవుతుంది.
తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇలాంటి మౌలిక సూత్రాలను విస్మరించిన రచనలకు అవార్డులు లభించటంతో ఎలాంటి ఆధారాలు లేకుండా రచయిత మనసులో ఎలాంటి ఊహలు కలిగితే, ఆ ఊహలను చరిత్రకు , చారిత్రిక పాత్రలకు ఆపాదించి రాసేయటం, ఆ ఊహలు సాహిత్య పెద్దలు మెచ్చే భావజాలాన్ని సమర్ధిస్తే చాలన్నట్టు ఇతర రచయితలు భావించి అలాంటి రచనలు చేయటంలో ఆశ్చర్యం లేదు. అలాంటి రచనలు పొగడ్తలందుకోవటంలోనూ ఆశ్చర్యం లేదు. ‘ప్రణయ హంపీ’ నవల ఈ కోవకు చెందిన నవల అనిపించటంలో చదువరి తప్పులేదు.
‘ప్రణయ హంపీ’ నవల కథను గనుక సరిగ్గా ఆవిష్కరించి ఉంటే, ఇదొక అద్భుతమైన రచన అయిఉండేది. Immense possibilities ఉన్న కథ ఇది.
సంబజ్ఞగౌడ, ముద్దుకుప్పాయి అనే యువతీయువకుల ప్రేమ కథ, ఈ నవలకు కేంద్ర బిందువు. ఈ కథకు నేపథ్యం, విజయనగరానికీ, సుల్తానులకు జరిగిన నిర్ణయాత్మకమైన యుద్ధం. అది విజయనగరం సామ్రాజ్యంగా ప్రపంచపటం నుంచి అదృశ్యమవటానికి కారణమయిన యుద్ధం. హంపీ శిధిలమై, గతవైభవానికి చిహ్నంగా మిగిలిపోవటానికి దారితీసిన అంతిమ యుద్ధం.
ప్రేమ కథలు సాధారణంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక అది చరిత్ర నేపథ్యంగా కల రచన అయితే, అదీ అత్యంత ప్రాధాన్యం కల తళ్ళికోట యుద్ధ నేపథ్యం అయితే ఇంకా అద్భుతం. విజయనగర సామ్రాజ్య పతనానికి దారి తీసిన కారణాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అహంకారాలు, ఆనాటి వైభవం, అత్యున్నత వ్యక్తిత్వాలు, సాహిత్యం.. దెబ్బతిన్న ఆత్మాభిమానాలు, విశ్వాసాలు, అతి విశ్వాసాలు, ఒకటేమిటి ఎన్నెన్నో విషయాలు… అన్నీ అత్యద్భుతంగా ప్రదర్శించవచ్చు.
కానీ, రచయిత ఇవేవీ ఎంచుకోలేదు. విజయనగర సామ్రాజ్యంలో ఊహాత్మకమైన శిథిలమైన సామాన్యుల బ్రతుకులను చూపించాలని నిశ్చయించుకున్నాడు. ఆధారాలు లేని చరిత్రను స్వయంగా సృష్టించాలని ప్రయత్నించాడు. ఆ ఊహాత్మక శిథిల బ్రతుకులు కూడా ఏదో ఒక చరిత్ర ఆధారంతో రచించలేదు. అదంతా స్వకపోల కల్పితమే! అంతేకాదు, చరిత్రలో నిర్ధారితమయిన ఆధారాలను విస్మరించి అందుకు పూర్తిగా భిన్నమైన చరిత్రను ప్రదర్శించాడు. ఇది చరిత్ర వక్రీకరణ అవుతుంది.
చారిత్రిక అంశాల గురించి ప్రస్తావించే ముందు, ఇతర విషయాల గురించి ప్రస్తావించుకోవాల్సివుంటుంది.
ఈ పుస్తకానికి ‘చరిత్ర చెప్పని కథ’ అనే ముందుమాటలో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, ముందు జాగ్రత్తగా “దీని చారిత్రక నిర్దుష్టతను గురించి నేను మాట్లాడబోవటంలేదు” అన్నారు. కానీ, మరోచోట “చరిత్ర పెద్దగా తెలియని ఆధునిక పాఠకునికి ఇది క్లుప్తంగానైనా సరే సమగ్రమైన పరిజ్ఞ్నానాన్ని ఇస్తుంది” అన్నారు. ఇంకోచోట తనకున్న చరిత్ర పరిజ్ఞానం ఎక్కువ కాదనీ అన్నారు. రచయిత ప్రేమకథకు నేపథ్యంగా ప్రదర్శించిన యుద్ధం, దానికి సంబంధించిన విషయాలను వీరలక్ష్మీదేవి గారు నిజమని నమ్మారన్న భావన “ఇది యుధ్ధం గురించి నాకు కొత్త కోణం అనిపించి ఈ అంశం నన్ను నిశ్చేష్టురాలిని చేసింది. ఈ అమానుషత్వం గురించి నేను ఇదే వినడం” అన్నారు. అంటే, చరిత్ర గురించి పెద్దగా తెలియకున్నా ఈ నవలలో రచయిత చూపించిన అమానుషత్వం మాత్రం నిజమని ఆవిడ నమ్మారని ఈ వ్యాఖ్య స్పష్టం చేస్తుంది. ఇది చరిత్ర ఆధారిత కాల్పనిక రచయితల బాధ్యతను ఎత్తి చూపిస్తుంది. అంతేకాదు, ఎందుకని తెలుగు చరిత్ర పండితులు కాల్పనిక రచయితలు చరిత్ర ఆధారంగా నవలలు రచించటాన్ని విమర్శిస్తారో ఇలాంటి రచనలు చదివితే అర్ధమవుతుంది.
నవల ఆరంభంలో, దసరా సంబరాల వర్ణనలు అవీ, ఇవీ విదేశీయాత్రికుల వర్ణనలను, రాయవాచకం, వర్ణనలను ఆధారం చేసుకున్నవి.అయితే నాయిక కూచిపూడి నృత్యం చేయటం రచయిత కల్పన. ఎందుకంటే, ఆ కాలంలో కూచిపూడి నృత్యం పురుషులే చేసేవారు. 1900 శతాబ్దారంభంలో వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు విప్లవాత్మకమైన మార్పు తెచ్చేవరకూ కూచిపూడి పురుషుల సామ్రాజ్యం! చరిత్ర ఆధారిత రచనల్లో ఇలాంటివి రచనపై విముఖత, రచయితపై చులకన భావం కలిగిస్తాయి.
ఈ నవలను ప్రేమ కథ అన్నారు కానీ, ప్రేమ కథల్లో వుండాల్సిన చమత్కారం, సున్నితమైన శృంగారం, మృదువైన భావనలు, సన్నివేశాలు ఏమీలేవు. ప్రేమ అభివృద్ధి అవటం కూడా ఒక పద్ధతి ప్రకారం చెప్పటంలేదు.
“ఉత్సవాలలో కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించటానికి వచ్చిన ముద్దుకుప్పాయి ధీరుడైన సంబజ్జగౌడనే చూస్తూండిపోయింది..తెలియని దగ్గరితనమేదో ఆమె మొహంలో వ్యక్తమయింది”(పేజీ నం. 25).
“సంబజ్జగౌడ తన్మయత్వంతో ఆమె శిల్పసదృశమైన దేహ భంగిమలు, హస్తాలు, కళ్ళ్తో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలను పరవశత్వంతో మైమరచి చూస్తున్నాడు”(పేజీ నం. 27).
తరువాత పేరాలో ముద్దుకుప్పాయి కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయని చెప్పి” ఆ విషయాన్ని సంబజ్జగౌడ గ్రహించాడు. కానీ తనకోసమేనన్న విషయాన్ని ఊహించలేకపోయాడు(పేజీ నం. 27), అన్నాడు రచయిత.
తరువాత అధ్యాయంలో ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. వారిపరిచయంలో ధనిక, పేదల మధ్య, ఉన్నత, దిగువ కులాల మధ్య అంతరం గురించి చర్చ వస్తుంది. ఈ అంతరాన్ని రాగి ధాన్యం, తెల్ల బియ్యం లతో పోలుస్తారు. ఆ కాలంలో లేని అంతరాల స్పృహను ఈకాలంనుంచి తీసుకెళ్ళి అక్కడ గుప్పిస్తాడు రచయిత. వారి మాటల్లోనే సంబజ్జగౌడకు రాజధాని నుండి పిలుపు వస్తుంది. ఆ తరువాత ఆరుమాసాల తరువాత ఇద్దరూ కలుస్తారు. అతడికోసం ఆమె ‘సిరిమానుసేవ’ చేస్తుంది.
ముద్దుకుప్పాయికి సంబజ్జగౌడ పై ఉన్న ప్రేమను ప్రదర్శించేందుకు ఉత్తరాంధ్ర విజయనగరంలో (Vizianagaram) పైడితల్లి దేవత (గ్రామ దేవత)కు ఏటా విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారం జరిగే సిరిమాను సేవను విజయనగరం ( ఇది హంపి విజయనగరం, Vijayanagaram)కు తీసుకుపోయి ప్రతిష్ఠించాడు రచయిత.
1756 లో బొబ్బిలి యుద్ధం తరువాత కోట సమీపంలో ఈ దేవత వెలిసింది. అత్యంత ప్రసిద్ధి పొందిన ఈ సేవను పూజారి మాత్రమే చేస్తాడు. పూజారి కూడా సిరిమానుపై కూర్చుంటాడు, కొక్కేనికి వ్రేళ్ళాడడు. ఈ సేవ చేసే పూజారి పురుషుడు. స్త్రీ కాదు. ఈ సేవలో స్త్రీలు పాల్గొనరు. ఈ జాతరలో భాగమైన రథంలో కూడా స్త్రీ దుస్తులు ధరించిన పురుషులు కూర్చుంటారు. స్త్రీలు పూజలు చేస్తారు. అంజలి ఘటిస్తారు. అంతే!
ఇది చరిత్ర ఆధారిత కథనం కాదు. విజయనగరంలో ఇలాంటి ఆచారాలు ఉన్నట్టు ఆధారాలు లేవు.ఒకవేళ ఆ కాలంలో ఇలాంటి పూజలున్నాయన్న ఆధారం రచయిత చూపితే, అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు.
( ఈ సమీక్ష చదివిన శ్రీ మోదుగుల రవికృష్ణ, ఇలాంటి ఒక ఆచారం విజయనగర కాలంలో ఉండేదనీ, తెనాలి రామలింగడి ‘పాండురంగ మాహాత్మ్యం’ లో “గాలంపు కొక్కేల” అని ఒక పద్య మధ్యంలో వస్తుందనీ, కానీ ఆ మొక్కు పేరు ‘సిరిమాను’ కాదనీ చెప్పారు. కానీ, పాండురంగ మాహాత్మ్యంలో అలాంటివేవీ లభించలేదు. ఒక్క’ నెట్టికసీల’ అన్న పదం తప్ప కొక్కేలు, వ్రేలాడదీయటాలు ఏమీలేవు. ఒకవేళ ఎవరికయినా ఈ రెఫెరెంస్ దొరికితే తెలప ప్రార్ధన. ఒకవేళ సిరినాను లాంటి మొక్కు చెల్లింపులు ఆ కాలంలో ఉన్నా, నాయిక అలాంటి మొక్కు తీర్చుకునేంత అనుబంధం ఆ పాత్రలనడుమ నెలకొన్నట్టు చూపటంలో నవల విఫలమవటంలో ఎలాంటి మార్పులేదు.)
ఇదీ నాయికా నాయకుల నడుమ ప్రేమ ఆరంభమై, వికసించి, తీవ్రమైన పద్ధతి ఈ నవలలో. ఈ పాత్రలపట్ల ఎలాంటి అనుబంధం కలగదు. వారి ప్రేమ తీవ్రత కానీ, అనురాగపు లోతుకానీ పాఠకుడు అనుభవించడు.
ఇక్కడితో ప్రేమ కథ వెనుకబడి, విజయనగర రాజులకు, సుల్తానులకూ నడుమ యుద్ధం వైపుకు కథ మళ్ళుతుంది.
ఇక్కడ రచయితకు ఆనాటి రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాల గురించి, అప్పటి మనస్తత్వాల గురించి పాఠకుడికి పరిచయం చేసే వీలుంది. కానీ, రచయిత చరిత్ర విషయాలను పైపైనే చెప్తాడు. అంతేకాదు, ఆదిల్ షాహ, రామరాయలు నడుమ సంబంధాన్ని , ఈనాటి లౌకికవాద దృష్టితో చూపించాడు. చరిత్రను వక్రీకరించాడు.
ఈ పుస్తకం ప్రకారం, ఆదిల్ షాహ అయిష్టంగా, ఇతర తురక సుల్తానుల ప్రోద్బలంతో విజయనగరంతో పోరాడే సమష్టి తురకల సైన్యంలో భాగమవుతాడు.
“నరపతి నన్ను కుమారా!అని పిలిచే హోదాను ఇచ్చాడు(???) కాబట్టి ఆయనకు ఏ హానీ చేయలేను. ఆయన నాకు పితృసమానుడు. (పితృసమానుడు కుమారా అని పిలిచే హోదా ఇవ్వటం ఏమిటి?) ఆయనకు నేను ఎదురు వెళ్ళటం ధర్మం కాదు” (పేజీ నం. 55-56), అంటాడు ఆదిల్ షాహ. మతం విద్వేషం పెంచేందుకు ఉపయోగపడలేదని నిరాశ పడతారు, ఇతర సుల్తానులు.
చివరికి ఈ పుస్తకం ప్రకారం, మిగతా వారు “నీవొక ముసల్మాను పాదుషావు. నీ రాజ్యాన్ని అవిశ్వాసి అయిన నరపతి రాజ్యంలో కలపడం సరికాదు” (పేజీ నం. 58) అంటూ నయానా భయానా ఒప్పిస్తారు. అంటే, ఆదిల్ షాహ విజయనగరానికి వ్యతిరేకంగా పోరాడటం అతనికి ఇష్టం లేకున్నా, మతం ఆధారంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాడన్నమాట.
కానీ, చివరలో, ఇదే రచయిత,ఈ పుస్తకంలోనే, “మీరు చేసిన యుద్ధానికి కారణం మతం కాదు. అది ఒక సాకు మాత్రమే!” (పేజీ నం. 113) అని సల్మా అహ్మద్ ఫరూఖీ అనే పాత్రతో అనిపిస్తాడు.
ఈ సందర్భక్రమంలోనే, అదే పాత్ర, “మనిషే తన స్వార్ధపు కోరికలకు మతాన్ని వాడుకొంటున్నాడు” అంటుంది.
యుద్ధానికి మతం కారణం కాకపోతే, హంపిని ఆరునెలలపాటూ ధ్వంసం చేసేంత కసి ఎక్కడినుంచి వచ్చింది? దేవాలయాలను అంతగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? నగరాన్ని నేలమట్టం ఎందుకు చేయాలని ఎడతెగకుండా ఆరునెలలు పాటుపడ్డారు?
ఈ ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానం దొరకదు. యుద్ధానికి మతం కారణం కాదని అనిపించటం, అదీ ఒక ముసల్మానుతో అనిపించటం తెలుగు సాహిత్య ప్రపంచంలో పెద్దలుగా గుర్తింపుపొంది అవార్డులిప్పించేలౌకిక మేధావులందరినీ సంతృప్తి పరుస్తుంది.
ఇప్పుడు, చరిత్ర పరిశోధకులు నిర్ధారించిన నిజాలను పరిశీలిస్తే, రచయిత చరిత్రను వక్రీకరించాడని తెలుస్తుంది.
‘ప్రణయ హంపీ’ నవలలో రామరాజు పుట్టుపూర్వోత్తరాలు గానీ, అతని వ్యక్తిత్వం ప్రస్తావన గానీ ఎక్కడా లేదు.
రామరాజు ఆరవీటి వంశానికి చెందినవాడు. అనంతపురం మండలం, తాడిపత్రి తాలూకా, యెల్లనూరు వద్ద చిత్రావతీ తీరాన ఉన్న పాడుపడిన పల్లె అప్పటి ఆరవీడు. రామరాజు పూర్వీకులు ఆరవీటిని పాలించారు. అందుకని అతడు ఆరవీటి రామరాజయ్యాడు. కృష్ణదేవరాయలు అల్లుడు కాబట్టి అళియ రామరాయలయ్యాడు.
ఆరంభంలో రామరాజు గోల్కొండ నవాబు సైన్యంలో ఉద్యోగిగా ఉన్నాడు. నవాబు విజయనగర పొలిమేరల ప్రాంతాన్ని ఆక్రమించి దానికి ఇతడిని అధిపతిగా నియమించాడు. ఈ ప్రాంతాన్ని రామరాజు ఓడించటంతో మళ్ళీ నవాబును ఆశ్రయించాడు రామరాజు. నవాబు రామరాజును పిరికివాడని అవమానించాడు. దాంతో రామరాజు విజయనగరం వచ్చి కృష్ణదేవరాయల శరణు వేడాడు. కృష్ణదేవరాయలను మెప్పించాడు. అతడి కూతురు తిరుమలాంబను వివాహమాడేడు.
రామరాజు తురుష్కుల నడుమ ఉన్నాడు. అతడికి వారి మనస్తత్వం తెలుసు. వారు మతపరంగా ఒకటయినా వారి నడుమ విద్వేషాలు ఇతనికి తెలుసు. అందుకే, ఒక సుల్తాన్ తో చేతులు కలిపి ఇతరులను ఓడించాడు. వారిలోవారికి కలహాలు పెట్టి, మధ్యలో దూరి లబ్ధి పొందేవాడు. సుల్తానులంతా ఒక్కటవనంతవరకూ అతని పథకాలు పనిచేశాయి. కానీ, వారంతా ఒక్కటయ్యే సరికి దెబ్బ తిన్నాడు.
రామరాయలకు తురకలంటే గౌరవం లేదు. వారి పద్ధతులంటే చిన్నచూపు. ప్రతి యుధ్దంలో గెలుస్తూండటం అతని ఆత్మవిశ్వాసాన్ని అహంకారం స్థాయిని దాటి దురహంకారం స్థాయికి పెంచింది. ఆ దురహంకారం ఫలితం విజయనగరం అనుభవించింది. ఇదంతా ఈ రచనలో రాలేదు. చరిత్ర అంశాలు ఒక రిపోర్ట్ లాగా ఉన్నాయి తప్పించి కథలోభాగం కాలేదు. దాంతో ఏ పాత్రతోనూ పాఠకుడు తాదాత్మ్యం చెందే వీలుపోయింది.
ఇక ఆదిల్ షాహ విషయానికి వస్తే.. అహ్మద్ నగర్ సుల్తాన్, గొల్కొండ సుల్తాన్ లతో కలసి 1543లో బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహ్ తో యుద్ధం చేశారు. ఇందరు తనతో యుద్ధానికి వచ్చేసరికి బెదిరిన ఆదిల్ షాహ సంధి చేసుకున్నాడు. శోలాపూర్ ను అప్పగించాడు.
రామరాజు దగ్గరికి తురుష్క రాజ్యాలనుంచి పారిపోయివచ్చిన ముసల్మానులకు ఆశ్రయమివ్వటమే కాదు, వారికోసం ఒక వీధి కట్టించి దానికి ‘తురక్ మొహల్లా’ అని పేరుపెట్టాడు. ఇలా వారికి ఆశ్రయమిచ్చినందుకు తరువాత కీలకమైన సమయంలో వీరంతా ‘స్వమతం’ వారివైపు మొగ్గటంతో రామరాజేకాదు, విజయనగరం మొత్తం ధ్వంసమయింది. భావి తరాలకు చక్కని గుణపాఠంగా నిలుస్తుందీ ద్రోహం. శత్రువు బయటనుంచి దాడి చేస్తే, అంతర్గత శత్రువు లోపలనుంచి తొలుస్తాడు. బాహ్య శత్రువును ఎదుర్కోవచ్చు. ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు.
“Rama Raya also began to admit large numbers of Muslims into the army, a practice that had, indeed, been started in a small way by Devaraya-1. No important offices at that time had been entrusted to them, but Rama Raya departed from this prudent policy by employing Muslims in places which gave them an intimate knowledge of the internal affairs of the state. Further, he made it a point to avail himself of every opportunity of interfering in the relations between the Muslim states of Deccan and playing them off one against another, hoping thus to keep them weak and to increase his own power. The Muslim rulers, needless to say, saw clearly what was happening and closed their ranks; and Rama Raya paid heavily for his miscalculations. His policy opened the direct road to the disaster of Rakshasi-Tangdi(TalikoTa)
-(A History of South India, K.A. Nilakanta Sastri, page no. 278)
ఈమధ్యలో ఆదిల్ షాహ్ తో యుద్ధాలు జరిగాయి. ఆ యుధ్ధాలలో రాయచూరు యుద్ధంలో చిన్న తిమ్మరాజు అద్వితీయ సాహసం చూపించాడు. అతడు రాయచూరుకు అధిపతి అయ్యాడు. ఈ విషయం ‘రామరాజీయము’ లో ఉంది.
నారదవింటె చిత్రమిది నారకవాసులు గాక దేవతా
వారిజగంధులం గలిసివత్తురు నంగొలువ ధేనుసం’
హారులు మ్లేచ్ఛులన్న వినుమా సురవల్లభయాజిభూమి రా
చూరిపురీశు తిమ్మవిభునుగ్రకరాసిని మ్రగ్గగాజుమా
ఈ సమయంలో రాజ్యం కోల్పోయిన బీజాపూర్ నవాబు రామరాయలు శరణు జొచ్చాడు. అతడి కొడుకుఅలీ ఆదిల్ షాహ్, తనని పుత్రునిగా ప్రేమించమని, రామరాజు తనకు పిత్రతుల్యుడని ప్రకటిస్తాడు.
బీజాపూర్ సాధించగానే, ఆదిల్ షాహ్ , అహ్మదాబాద్ సుల్తాన్ వశంలో ఉన్న కల్యాణి, షోలాపూర్ దుర్గాలను అప్పగించమని డిమాండ్ చేస్తాడు. దానికి అహ్మద్ నగర్ సుల్తాన్ కఠినమైన సమాధానం ఇస్తాడు. అప్పుడు రామరాజు ఆదిల్ షాహ్ తరఫున యుద్ధం చేసి అహ్మద్ నగర్ సుల్తాన్ నిజామ్ షాహ ను ఓడిస్తాడు. ఆ సమయంలో తురుష్క స్త్రీలను అవమానిస్తాడు. మసీదులను కూలగొడతాడు. ఖురాన్ గ్రంథాన్ని చించివేయిస్తాడు. ఇది సుల్తానులందరూ ఒకటయి విజయనగరాన్ని కసితీరా నాశనం చేసేందుకు దారి తీసిన ప్రధాన కారణం.
రామరాయల ఆవేశపూరిత ప్రవర్తనను ‘నరపతివిజయం’ ప్రదర్శిస్తుంది.
తరువాత ఆదిల్ షాహ, రామరాయలు కలసి గోల్కొండ నవాబు, అహ్మద్ నగర్ సుల్తానులతో పోరాడతారు. ఇప్పుడు కూడా రామరాజు సేనలు మహమ్మదీయులను అనేక విధాల అవమానించాయి.
అతడు నృపమాత్రుడై యరయగ సపాద
కుతుపసాహి నిజామాది కుతలపతుల
జెండె దోర్గర్వఖర్వితాఖండలుండు
రణజయవిహారి-తిరుమలరాయశౌరి.
‘నరపతి విజయము’ ఈ విజయాన్ని ప్రదర్శించింది.
ఇలా వరుస విజయాలు రామరాయలు అహంకారాన్ని పెంచాయి. దాంతో విచక్షణమరచి, నిర్లక్ష్యం పెరిగి రాయబారులను అవమానించాడు. తురుష్క రాజ్యాలన్నిటినీ విజయనగరంలో కలిపేసుకోవాలని ఆలోచించాడు. దాంతో నవాబులంతా ఒకటై రామరాయలను అణచకపోతే మొదటికే ముప్పు వస్తుందని గ్రహించారు.
మొట్టమొదటగా నవాబులంతా ఒకటవ్వాలన్న ప్రతిపాదన చేసింది ఆదిల్ షాహ్. నవల ప్రకారం ఆదిల్ షాహ్ అయిష్టంగా మిగతా వారితో చేతులు కలిపాడు. తన తండ్రిలాంటివాడని యుద్ధంలో పాల్గొనేందుకు నిరాకరించాడు. కానీ, నిజం ఏమిటంటే, రామరాయలును అణచివేసేందుకు అందరూ ఒకటి కావాలన్నది ఆదిల్ షాహ.
“మొట్టమొదట నవాబుల యైకమత్యమును కాంక్షించినవాడు విజాపుర సుల్తానగు నాదిల్ శాహ. తాను స్వయముగ రామరాజు నెదిరింప దలచెను గాని, యది తన చేత గానిపనియని తెలిసి, తోడి నవాబుల సాయమును గోరుట లెస్సయని నిశ్చయించెను. నిశ్చయించుటయే తడవుగా, నాతడొక రాయబారిని గోల్కొండ నవాబగు కుతుబ్ శాహయొద్దకు పంపి, యాతనికి దన యభిప్రాయమును దెలిపెను. కుతుబ్ శాహ అందులకు సమ్మతించి, యహమ్మద్ నగర నవాబైన నిజాం శాహకును, నాదిల్ శాహకును మైత్రి సలుప దాను మధ్యవర్తియై, నిజామ్ శాహ కడకు దత్కార్యార్ధమై ముస్తఫ ఖానును రాయబారిగా పంపెను. అంత నా రాయబారి యహమ్మద్ నగరనవాబుకడకరిగి, చెప్పవలసిన మాటలత్యంత నైపుణి వెలయ నుడివెను. నిజాం శాహ యా పలుకులయందలి సత్యమును గ్రహించి, యమాత్యులతో మంతనములాడి, యాదిల్ శాహతో తనకు గల వైరము మాని, యాతనితో మైత్రి సలుప సమ్మతించెను. సమ్మతించుటయే కాక, విజయనగర సామ్రాజ్య విధ్వంసమునకై తోడ్పడ బద్ధకంకణుడయ్యెను. అంతియకాక, తన ముద్దులపట్టియగు చాందుబీబీని నాదిల్ శాహకొసగి పరిణయముగావించి షోలాపురమును గాన్కగానొసగెను. అందులకు బ్రతి ఫలముగా నాదిల్ శాహ తన సోదరియగు ఫాలాబీబీని నిజాం శాహ పెద్ద కొమారుడయిన మూర్తిజా కొసగి వివాహము గావించెను.ఇట్లుభయులకు సంబంధ బాంధవ్యములు సహిత మేర్పడినవి.
ఇవ్విధమున విజయనగర సామ్రాజ్యవినాశనమునకై తురుష్క ప్రభువులగు నిజాం శాహ, ఆదిల్ శాహ, కుతుబ్ శాహ, బరీదు శాహయు నేకీభవించి రణారంభమునకు గారణమారయుచుండిరి.” (విజయనగరచరిత్రము, నూతలపాటి పేరరాజు, పేజీ నం. 232-233).
“రామరాజుతో మొదట గయ్యమునకు దిగినవా డాదిల్ శాహ. తన రాజ్యమునుంది కైకొనిన భాగములను దనకిచ్చివేయవలయునని యాదిల్ శాహ రామరాజునకొక రాయబారితో సందేశమంపెను”. (233)
ఇందుకు భిన్నంగా వుంటుంది ప్రణయ హంపీ కథనం. ఆదిల్ శాహ చివరివరకూ రామరాయలును గౌరవించాడనీ, తప్పనిసరి పరిస్థితులలో ఇతర సుల్తానులతో కలశాడని రాయటం ద్వారా, రామరాయలపట్ల ఎలాంటి అభిమానం లేని ఆదిల్ శాహ పట్ల సానుభూతి సాధించాలని ప్రయత్నించినట్టనిపిస్తుంది. అంతే తప్ప, ఆదిల్ శాహ కృతఘ్నతను, బంధం కన్నా, మతానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఉన్నదున్నట్టు చూపించే ప్రయత్నాలు చేయలేదు. ఇది చరిత్రను వక్రీకరించటమంటే.
విజయనగర రాజులు హిందు-ముస్లీముల నడుమ సయోధ్య సాధించాలని ప్రయతిస్తూనే ఉన్నారు. కానీ, సుల్తానులు ఎన్నడూ సయోధ్యకోసం ప్రయత్నించలేదు. వారు అణగిఉన్నా అవకాశం కోసం ఎదురుచూడటంకోసమే తప్ప సయోధ్య, సహజీవనం అన్న ఆలోచన సుల్తానులకు ఎన్నడూ లేదు.
“From the time when poor Baha-ud-din took shelter under the Raja of Kampili till the dismal days of the battle of Rakshasa-Tangidi , the Hindus endeavoured to sow the seeds of mutual good will and respect , which, however, save in one or two notable instances , proved barren in the annals of the two peoples.(The Social and Political Life in the Vijayanagara Empire, Dr. B.A.Saletorewe, VoL II page no. 395)
చరిత్ర రచయితలందరూ, విజయనగర రాజుల పరమతసహనాన్నీ, హిందూ ముస్లీముల నడుమ సమైక్యతను సాధించాలన్న వారి ప్రయత్నాలనూ ప్రస్తావించారు. అదే సమయానికి అవకాశం దొరికితే దెబ్బ తీయాలన్న సుల్తానుల ప్రయత్నాలనూ ప్రకటించారు. కానీ, మన తెలుగు రచయితలు మాత్రం, ముస్లిం పాత్రలతో యుద్ధాలు మత సంబంధి కాదని, శాంతి వచనాలు వల్లె వేయిస్తున్నారు.
“మంచి అనేది అన్ని మతాలలో ఉంది. ఏ మతం కూడా మనిషికి హాని చేయమని చెప్పదు. మనిషే తన స్వార్ధపు కోరికలకు మతాన్ని వాడుకుంటున్నాడు. అంతెందుకు? మా పాదుషా ఆలీ అదిల్షాకు విజయనగర నరపతి అంటే పంచప్రాణాలు. అహ్మద్ నగర్ సుల్తాన్ మా పాదుషా మనసులో విషపు బీజాలు నాటి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టాడు” ( పేజీ నం. 115). కానీ, నిరూపితమైన చరిత్ర మరో రకంగా చెప్తున్నది.
ఇలా ప్రస్తావిస్తూ పోతే, నవల కన్నా పెద్ద వ్యాఖ్య అవుతుంది. కాబట్టి, మరొక్క తప్పనిసరిగా ప్రస్తావించాల్సిన విషయాన్ని ప్రస్తావించి ఈ విమర్శను ముగించాల్సి వుంటుంది.
ఈ నవలలో దేవదాసిలు, వేశ్యల ప్రస్తావన ఉంది. దానితో పాటుగా, యుధ్దం సమయంలో సైనికులతో పాటుగా యుద్ధభూమికి వేశ్యలు వెళ్ళటం ఉంది. నిజానికి, ఈ విషయం ఆధారంగానే ఈ నవల చాలామంది ప్రశంసలను అందుకున్నది.
వలంది అనే పాత్ర ద్వారా రచయిత ఆనాటి వేశ్యల పరిస్థితులను ప్రదర్శించాడు. పేదరికంలో ఉన్న వేశ్యల పరిస్థితి ఆమె ద్వారా చెప్పించాడు. చూపించాడు.
రచయిత పాత్ర ద్వారా చెప్పించిన వివరాల ప్రకారం, యుద్ధ సమయాలలో రాత్రులపూట సైనికులకు శారీరక సుఖం ఇచ్చేందుకు వేశ్యలను యుద్ధ భూమికి తీసుకువెళ్తారు. సైనికులకు యుద్ధ శిబిరాలలో తిండి, మధువు, స్త్రీ అన్నీ దొరుకుతాయి. సైనికులు తాగి స్త్రీలను గాయపరుస్తారు.
యుద్ధంలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో సైనికులుంటారు. వేశ్యల సంఖ్య వేలల్లో ఉంటుంది. అంటే, ఒక వేశ్య ఎంతమంది సైనికులకు సేవలందిస్తుంది? ఇది రచయిత ప్రదర్శించిన సామాన్యుల పరిస్థితి. రచయిత ఆవేదన. ఈ సందర్భంలో వర్ణన ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
“వేశ్యలు ఉన్న గుడారాల వద్ద సైనికులు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, తోసుకుంటూ నేను ముందుగా వెళతానంటే నేను ముందని దొమ్మీ చేస్తున్నారు.కొంతమంది మల్ల యుద్ధానికి తలపడుతున్నారు” (పేజీ నం. 80).
ఏమిటిది? అసలీ ఊహ ఎలా వచ్చింది? ఎంత నీచ నికృష్టమైన ఊహ?
ఈ నవలను గమనిస్తే, ఒక విషయంపై ఫోకస్ కనబడదు. ప్రేమ కథగా ఆరంభమవుతుంది. వేశ్యల వైపు మళ్ళుతుంది. తరువాత యుద్ధంవైపు మళ్ళుతుంది. చివరికి సినిమాటిక్‌గా పూర్తవుతుంది.
ఈమధ్యలో రచయిత ఆధార రహిత అంశాలను ప్రస్తావిస్తాడు. ఇప్పటి సమాజాన్ని అప్పటి సమాజంపై ఆరోపించి, ఆ సమాజాన్ని ఇప్పటి స్థాయికి దిగజారుస్తాడు. ఆ కాలంలో విజయనగర సైన్యంతో వేశ్యలు వెళ్ళటం లైంగికంగా సైనికులను సంతృప్తి పరచేందుకు కాదు. అప్పటి వేశ్య పదానికి ఇప్పటి వేశ్య పదానికీ అర్ధంలో చాల తేడాఉంది.
ముందుగా “వేశ్యలందరూ దేవదాసీలు కారు కానీ, దేవదాసీలందరూ వేశ్యలే” (పేజీ నం. 61) అంటుంది ఒక పాత్ర.
ఈ వ్యాఖ్య “దేవదాసీలందరూ వేశ్యలయినా, వేశ్యలందరూ దేవదాసీలు కారు” అన్న ‘రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం’ (రచన; డా. యం. ఆదినారాయణ శాస్త్రి, పేజీ నం. 160) వ్యాఖ్యకు ప్రతిధ్వని. అయితే, రచయిత ఈ వ్యాఖ్యను ప్రస్తుత పరిస్థితుల దృష్టిలోంచి చూసి అర్థం చేసుకున్నాడు తప్ప, ఆ కాలంనాటి పరిస్థితుల ఆధారంగా అర్ధం చేసుకోలేదు. ఎందుకంటే,ఈ వాక్యం తరువాతే, “వేశ్య అన్న పదం వాడకాన్ని వివరిస్తూ”దేవాలయ దానాల్లో వేశ్య అన్న మాట వస్తే, దాన్ని దేవదాసిగా అర్థం చేసుకోవచ్చు. వేరే చోట ఈ పదం వస్తే వేశ్యగానే లెక్కింపబడాలి”, అని వ్యాఖ్యానిస్తాడు రచయిత. అంటే, దేవదాసిని వేశ్య అనటంలోనూ, ఇతరులను వేశ్య అనటంలోనూ ఎంతో తేడా వున్నదన్నమాట. ‘ప్రణయ హంపీ’ రచయిత ఈ విషయాన్ని గమనించలేదు.
వేశ్య అన్న పదం ఆధునిక కాలంలో ఇచ్చే అర్థం వేరు. విజయనగర కాలంలో ఆ పదానికి అర్థం వేరు.
వేశ్య అంటే, ప్రస్తుతం ధనంకోసం లైంగిక సుఖాన్ని ఆందించేది అన్న అర్థం వస్తుంది. కానీ, ఒకప్పుడు వేశ్య అంటే, విద్యావంతురాలయిన నృత్య కారిణి, సభికురాలు వంటి అర్ధం వచ్చేది. దేవదాసీలందరూ వేశ్యలు అన్న వ్యాఖ్య వెనుక ఉన్న ఆలోచన ఇది. అందుకే, ‘రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం’ పుస్తకంలో దేవదాసి అంటే, “దేవాలయాల్లో జరిగే గీత నృత్యాల ద్వారా దేవునికి యథాశక్తి సేవచేసి జీవితం గడిపే ఒక పరిచారిక. దేవాలయ వ్యవస్థలో చేసే అనేక పూజా పునస్కారాల్లో, ఉపచారాల్లో గానం, నృత్యం కూడా ఉన్నాయి”, (పేజీ నం. 159).
దేవదాసీల గురించి రాస్తూ ఆదినారాయణ శాస్త్రి గారు, “దేవాలయ వ్యవస్థలో దేవదాసీ పాత్ర నిజంగా మరువలేనిది. దేవునికి భోగ వస్తువుగా, దేవాలయానికి అలంకారంగా, రంగమంటపానికి సజీవమూర్తిగా, రాజులచే, ప్రజలచే, దేవాలయ నిర్వాహకులచే అంకితం చేయబడిన కళాజ్యోతి ఈ దేవదాసి. భరతముని నాట్యశాస్త్రానికి సజీవ కళారూపాలుగా నిలిచి, నటరాజమూర్తికి నిరంతర నివాళులర్పించే దేవదాసీలు నిజంగా ధన్య మూర్తులు”( పేజీ నం. 161) అంటారు. ఇప్పుడు “దేవదాసీలందరూ వేశ్యలే” అని ఆదినారాయణమూర్తిగారనటానికీ, ‘ప్రణయ హంపీ’లో దేవదాసీలందరూ వేశ్యలే అనటానికీ హస్తి మశకాంతరం వుంది అని అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే, రచయిత విషయసేకరణ ఎంత బాగా చేసినా, సేకరించిన విషయాలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే, రచయిత శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. రచయిత అవగాహనపట్ల చులకన భావన కలుగుతుంది.
నవలలో దేవదాసీ వ్యవస్థను ఆధునిక వేశ్యస్థాయికి దింపాలన్న రచయిత ఆలోచన రచయితను అభాసుపాలు చేసింది.
ఇక యుధ్దంలో లక్షలమంది సైనికులు వేలమంది వేశ్యలతో వంతులవారీగా లైంగిక చర్యలో పాల్గొంటారనీ, అందుకోసం వారు క్యూలో నుంచుని నేనుముందు అంటే, నేను ముందు అని కొట్టుకుంటారనీ ఊహించటమే ఎంతో అప్రియంగా అనిపిస్తుంది. అసలు ఇలాంటి ఊహ వచ్చిందంటేనే రచయిత ఆ కాలంనాటి పరిస్థితులను పరిగణనలొకి తీసుకోకుండా, ఇప్పటి కుళ్ళు ఆలోచనలను ఆ కాలంలో వారికి ఆపాదించారని అర్థమవుతుంది. నిజానికి, ఇలాంటి అమ్మాయిల పొందు కోసం యుద్ధాలు తురకల సైన్యంలో జరిగేవి.
చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేయటంలో ఒక సూత్రం ఉంది. ఎలాంటి కల్పన చేసినా దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేని కల్పన అనర్థదాయకం. కేవలం గత కాలాన్ని స్త్రీల అణచివేతల కాలంగా చూపించి, చరిత్రలో వినిపించని స్వరాలను వినిపిస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం కోసమే ఇలాంటి ఆధార రహిత కల్పన చేశారనిపిస్తుంది. ఈ నవలలో ముందుమాట నుంచి, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ప్రస్తావించి నవలను పొగిడారు. ఇది తీసేస్తే నవల మామూలు రచనలకన్నా తక్కువ స్థాయి నవలగా మిగిలిపోతుంది.
విజయనగర కాలంలో వేశ్యల స్థితిగతులు, వారికున్న గౌరవం, వారి పాండిత్యం, వారు అనుభవించిన ఉన్నత స్థానం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి కల్పన చేయరు.
మన దేశంలో కొందరు సైనికులను తక్కువ చేసి మాట్లాడతారు. వారు చేసే త్యాగాన్ని గుర్తించకుండా వారు జీతగాళ్ళని, రేపిస్టులని, యుద్ధోన్మాదులని విమర్శిస్తారు. ఆ సైనికులను చూస్తే, వీళ్ళ దేశభక్తి పాలు విరిగినట్టు విరిగిపోతుంది. సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దులను కాపలాకాయకపోతే, వీళ్ళు ఇళ్లల్లో భద్రంగా కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లడే స్వేచ్చ ఉండదన్న నిజాన్ని గ్రహించలేరు. ఇలా సైనికులను చులకన చేసి చెడుగా చూపించటం సైనికులను తక్కువ చేసి నీచంగా చూపటంలో భాగమే.మనం గొప్ప అని గర్వించదగ్గ ప్రతి దాన్నీ నీచంగా చూపి, న్యూనత భావాన్ని కలిగించటం కూడా ఇలాంటివాళ్ళ ప్రణాళిక. ఒక పద్ధతి ప్రకారం మనం గొప్పగా భావించిన పరతీదాన్నీ నీచంగా ప్రచారం చేస్తారు. ఆ ప్రచారానికి ప్రామాణికత సాధిస్తారు. అబద్ధాన్ని నిజం చేస్తారు.
నిజానికి ఆ కాలంలో వేశ్యలు ధర్మ భక్తులు, దైవ భక్తులు, రాజ భక్తులు. యుద్ధ భూమికి రమ్మని ప్రత్యేకంగా వారిని నిర్భంధించనవసరంలేదు. వేశ్య అనగానే లైంగిక చర్య మాత్రమే అన్నది ఇప్పటి ఆలోచన. అప్పుడు, వేశ్యలు యుద్ధంలో సైనికులకు నీళ్ళందించేవారు. గాయపడినవారిని చికిత్సకు తీసుకెళ్ళేవారు. అలసి సొలసి కొన ఊపిరితో ఉన్న సైనికులకు ధైర్యం చెప్పేవారు. నృత్య గానాలతో వారికి సాంత్వననిచ్చేవారు. ఆ నృత్యగానాలు కూడా వీర గాధలు తప్ప లైంగిక గీతాలు, నృత్యాలు కాదు. పైగా, వేశ్యలు గొప్ప పండితులు. ధూర్జటిలాంటి పండితులతో వాదించగల దిట్టలు. చమత్కారాలతో అలరించగలరు. విదేశీయాత్రికులు కూడా వేశ్యలగురించి గొప్పగా రాశారు. మనమే ఇలాంటి నీచతా స్థాయి కల్పనలు చేసుకుని మనల్ని మనం దిగజార్చుకుంటున్నాం. సైనికులు వేశ్యల టెంట్ల ముందు నిలబడి తమ వంతుకోసం పోరాడటం అన్నది, విజయనగర చరిత్ర గురించి రాసిన ఏ ఒక్క పుస్తకంలోనూ లేదు. ఈ కల్పనకు ఏదైనా ఆధారం ఉంటే, రచయిత దాని రిఫెరెన్స్ ఇవ్వాలని మనవి. లేకపోతే ఇది మన పూర్వ సమాజాన్ని నీచంగా చూపించేందుకు రచయిత చేసిన స్వకపోల కల్పనగా, కుట్రగా భావించాల్సివుంటుంది.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఇలాంటి నవలకు ప్రశంసలు, అవార్డులు లభించటం తెలుగు సాహిత్య ప్రపంచం దుస్థితికి దర్పణం పడుతుంది . ‘ప్రణయ హంపీ’ నవలలో ప్రణయం లేదు. హంపీ లేదు. చారిత్రిక కాల్పనిక నవలగా చెప్పుకున్న ఈ నవలలో కల్పన తప్ప, అపరిపక్వత తప్ప చరిత్ర కూడా సరిగ్గా లేదు. అయినా ఇది గొప్ప నవల అని ప్రచారం చేస్తూ రివ్యూలు రాస్తూ, ఇంటర్వ్యూలు చేస్తూన్న వారిని చూస్తూంటే, తెలుగు పాఠకులపైన జాలి కలుగుతుంది. తెలుగు సాహిత్యంపట్ల నిస్పృహ కలుగుతుంది.
***
రచన: మారుతి పౌరోహితం
ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్
పేజీలు: 134
వెల: ₹ 150.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Pranaya-Hampi-Historical-MARUTHI-POWROHITHAM/dp/B0D7J2TZZY
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
