[14 ఫిబ్రవరి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘ప్రణయ రాగం పల్లవించిన రోజు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చలి చెలి చెలరేగుతోన్న ఈ హేమంతంలో
మంచు ముత్యాలు జాలువారుతోన్నవేళ..
నిరంతరం నీ తలపులతో
కురుస్తూనే వుంది నీ వలపు వెన్నెల వాన!
నువ్వు నా ఎద లోయలలో ముద్రించిన
మధురానుభూతుల చిత్తరువులు
నీ రాత కోసం నిరీక్షిస్తున్నాయి చెలీ!
నా ఎదురు చూపుల వయసెంతో
నాకైతే తెలియదు గానీ..
నీ కాలి అందియల సవ్వడి వినాలని
ప్రకృతి కాంత పరవశంతో ఎదురు చూస్తోంది!
కౌముదీ కాంతుల పున్నమి రేయి
మల్లెల పాన్పును పరిచింది ఆహ్లాదంగా..
రేయి తెల్లవార్లు పల్లవించేందుకు
నా తపనల తనువు..
‘సై’ అంటూ రాగాలు పలుకుతోంది!
ఏడాది మొత్తం ఈ రోజు కోసమే
ఎదురు చూస్తూ వుంటాయి ప్రేమపక్షులన్నీ!
అపురూపమైన నీ సోయగాన్ని
కవితాక్షరాలతో ఆరాధిస్తూ..
ప్రతి రేయి నాకు జాగారమే అవుతోంది!
జాగు సేమకు ప్రేయసీ!
విరహాగ్నికి నా ప్రేమ హృదయం
ఆహుతి కాకముందే..
సుగంధాల మల్లెలను
నీ కొప్పులో తురుముకొని రా!
నక్షత్ర భామల సరసాల రేడు
చందమామ సాక్షిగా –
మన ప్రేమ వెన్నెల గాథను
సరసంగా చెప్పుకుందాం..
వేగిరం నా గుండె గుమ్మంలో అడుగు పెట్టు సఖీ!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.