Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రాంతీయ దర్శనం -22: కోసలీ – నేడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా కోసలీ సినిమా ‘ఆదిమ్ విచార్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

‘కదిలించే ఆదిమ న్యాయం’

‘ఆదిమ్ విచార్’

కోసలీ నుంచి మొదటి సినిమా – గతవారం విశ్లేషించుకున్న ‘భూకా’ 1989లో వచ్చాక, రెండో సినిమా రావడానికి రెండు దశాబ్దాలు పట్టింది. అ తర్వాత మూడోది మూడేళ్ళు పట్టాక, 2011 నుంచీ ఏడాదికొకటి చొప్పున 2016 వరకూ వచ్చాయి. ఇంకా తర్వాత లేవు. 2014లో భూకా దర్శకుడు సవ్యసాచి మహాపాత్ర మరో గిరిజన సినిమా ‘ఆదిమ్ విచార్’ తీశాడు. దీనికి ఒడిశా ప్రభుత్వపు, కేంద్ర ప్రభుత్వపు అవార్డులు లభించాయి. గిరిజన జీవితాలని పరిశీలించి వాళ్ళ సంస్కృతీ సాంప్రదాయాల్ని ప్రపంచ దృష్టికి తెస్తున్న మహాపాత్ర, ‘భూకా’ ద్వారా గిరిజన సంగీత వారసత్వాన్ని తెలియజేశాడు. ‘ఆదిమ్ విచార్’ లో నాగరిక ప్రపంచానికి అందని ఆదిమ కాలపు న్యాయ సూత్రాల్ని పాటిస్తున్న గిరిజనులు, ఎంత స్ఫూర్తిమంతంగా వున్నారో చిత్రించాడు.

‘భూకా’లో లాగే ఇదికూడా ఓ గిరిజన పాటతో ప్రారంభమవుతుంది. వేరే గూడేనికి చెందిన కాంధా తెగ గిరిజనులు డప్పులు వాయించుకుంటూ నృత్యాలతో ఇంకో గూడెం మీదికి దండెత్తి వచ్చేస్తూంటారు. చేతుల్లో బరిసెలు, బల్లేలు కూడా నర్తిస్తూంటాయి – ‘మీ గూడేనికి వచ్చేశాం, సారా తాగి వచ్చేశాం – దమ్మున్నోళ్ళు రండ్రోయ్ – కంధా తెగ వాళ్ళం, పులులం, సింహాలం మేము – మీసాలున్న మొనగాళ్ళం – మీసాల్లేనోళ్ళు వెనక్కెళ్ళి పొండ్రోయ్ – అమ్మవారి ఆశీస్సులతో మా బలమెంతో మీకు తెలీదు – పులులై చంపేస్తాం, సింహాలై మింగేస్తాం – చంపండ్రోయ్ – ఒక్కొక్కళ్ళనీ పట్టుకు చంపండి’ అని పాట హోరెత్తిస్తూ వచ్చేస్తూంటారు.

గూడెం పెద్ద సుక్రు ఈ మందని చూస్తూ ‘యేసేయండ్రా’ అని అరుస్తాడు. కర్రలు తీసుకుని ఇవతలి గూడెం వాళ్ళు అవతలి గూడెం వాళ్ళని కొట్టడం మొదలెడతారు. అదంతా తమాషైన ఆటగా మారి పోతుంది. ఉత్తుత్తి దెబ్బలకి దండెత్తివచ్చిన గుంపు ఉత్తుత్తిగానే పడిపోయి పండగ సంబరం అయిందనిపిస్తారు. బెల్లం నీరు తాగుతారు, సారాయి తాగుతారు. భోజనాలు చేస్తారు. రాత్రయ్యాక డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తారు. తెల్లారి గూడెం లోని ఆడవాళ్లు ధాన్యాలు అందించి అవతలి గూడెం వాళ్ళని సాగనంపుతారు.

కేవలం వాళ్ళ ఆచారం తెలియజేయడం కోసమే ఈ ప్రారంభం. కథతో సంబంధం లేదు. కథ వచ్చేసి, గూడెం పెద్ద సుక్రు 84 ఏళ్ల వృద్ధుడు. ప్రేమ, మానవత్వం, ధర్మం అతడి సద్గుణాలు. అతడికి ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు. కుటుంబంతో తనకున్న అరెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూంటాడు. చుట్టు పక్కల గూడేల్లో ప్రభుత్వ వైద్య సౌకర్యాల్లేక బాధపడుతూంటారు గిరిజనులు. ఇది గమనించిన ఒక ఆయుర్వేద వైద్యుడు సుక్రూ గూడెంలో వైద్యశాల తెరుస్తాడు. అయితే వైద్యం పేరుతో మకాం వేసి ఇతను చేయాలనుకుంటున్న పనులు వేరు. గిరిజనుల్ని భూవావిదాల్లోకి లాగి, తానే పరిష్కరించి భూములు కొట్టేయడం అతడి అసలు వృత్తి.

ఇలాటి ఇతను సుక్రు ఆరెకరాల మీద కన్నేస్తాడు. అప్పటికే ఆ భూమిని తన ముగ్గురు కొడుకులకి పంచి వుంటాడు సుక్రూ. పెద్ద కొడుకుని రెచ్చగొడతాడు వైద్యుడు. పెద్ద కొడుక్కి ఎకరమిచ్చి, ఇద్దరు చిన్న కొడుకులకి రెండెకరాలు చొప్పున ఇవ్వడమేమిటని, దీని మీద తండ్రితో గొడవ పడమని ఎగదోస్తాడు వైద్యుడు.

దీంతో సుక్రు కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. పెద్ద కొడుకు విడిపోతాడు. వైద్యుడు కోర్టు కేసు వేయమంటాడు. పెద్ద కొడుకు పట్టణంలో కోర్టు కేసు పెడతాడు. ఇక తండ్రి, కుటుంబం అందరూ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది…

బోనులో నిలబడ్డ సుక్రుకి న్యాయమూర్తి కేసు వివరిస్తాడు. వివరించి, నీ పెద్ద కొడుక్కి ఎందుకు ఎకరం తక్కువిచ్చావని ప్రశ్నిస్తాడు.

అప్పుడు సుక్రు ఎంతో వినయంగా, ‘అయ్యా మీరు పెద్దలు, మీకు దండాలు. మీ అమ్మగార్ని నేను పెళ్ళాడాననుకోండి…’ అనగానే హాహాకారాలు లేస్తాయి కోర్టులో. ప్రాసిక్యూటర్ తీవ్రంగా మందలిస్తాడు, ‘జడ్జి గారితో ఏం మాట్లాడుతున్నావ్?’ అని.

‘అతనేదో వివరించబోతున్నాడు. దానికి ఉదాహరణగా తీసుకున్నాడు… చెప్పనివ్వండి’ అంటాడు న్యాయమూర్తి.

అప్పుడు సుక్రు అంటాడు, ‘మీ అమ్మగార్ని నేను పెళ్ళాడాననుకోండి, అప్పుడు మీరు కూడా వెంట వస్తారు… అప్పుడు మీరు నాకేమవుతారు?’

‘అంటే నువ్వు పెళ్ళాడేనాటికే నీ భార్య బిడ్డ తల్లా?’ అని తేరుకుని అంటాడు న్యాయమూర్తి. తలూపుతాడు సుక్రు. ‘అలాంటప్పుడు నీ పెద్ద కొడుకు నువ్వు కన్నకొడుకు కాదు, ఆస్తిలో వాటా రాదు…’ అంటాడు న్యాయమూర్తి.

     

అప్పుడు సుక్రు కన్న తండ్రి ప్రేమని వెల్లడించుకుంటాడు. నెలల పసిగుడ్డుగా వాణ్ణి తన చేతుల్లో పెంచాననీ, ఎలా కన్న కొడుకు కాకుండా పోతాడనీ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదంతా వింటున్న పెద్ద కొడుక్కి తన జన్మ రహస్యం తెలిసి కరిగిపోతాడు. కేసు వేసినందుకు సిగ్గుపడి పోతాడు. సుక్రు భార్య కూడా ఏడుస్తుంది.

అసలు పంపకాలెలా జరిపావో చెప్పమంటాడు న్యాయమూర్తి. పెద్ద కొడుక్కి ఒక ఎకర మిచ్చి, ఇంకో ఎకరం తనుంచుకున్నానంటాడు. తను చనిపోయాక తన ఎకరం పెద్దకొడుక్కే చెందుతుందంటాడు. అప్పుడు ముగ్గురు కొడుకులకీ సమాన వాటాలుంటాయంటాడు. న్యాయమూర్తి కదిలిపోతాడు ఈ గిరిజన న్యాయానికి. ఇది తరాలుగా వస్తున్న తమ గిరిజన న్యాయమంటాడు సుక్రు. ఆధునిక న్యాయం బయలాజికల్ సంతానం కాదన్న పేరుతో వారసత్వాన్ని నిరాకరిస్తే, ఆదిమ గిరిజన న్యాయం మానవత్వంతో ఆ సంతానం కూడా కన్న సంతానమేనని నీతిని చెబుతోంది. ఇది న్యాయమూర్తిని బాగా ఆలోచింపజేస్తుంది. చట్టాల్లో ఇలాటి ప్రేమకీ మానవత్వానికీ చోటు కల్పించాలని సుక్రుని అభినందిస్తాడు.

ఈ కోర్టు రూమ్ డ్రామా సున్నిత భావోద్వేగాలతో కట్టి పడేస్తుంది. ఇందులో సుక్రుగా అటల్ బిహారీ పాండా నటించాడు. తపస్వినీ గురు అతడి భార్యగా నటించింది. వైద్యుడుగా పురుషోత్తం మిశ్రా, సుక్రు పెద్ద కొడుకుగా శంకర్ బెహరా నటించారు. సుక్రు పెద్ద కోడలిగా లోచనీ బాగ్ నటించింది.

ఐదు పాటలున్నాయి. సంగీతం ఘాసీరాం మిశ్రా, పంకజ్ జల్. కెమెరా కుమార్ దేవ్ మహాపాత్ర.

Exit mobile version